రా.రా
రాసిన వారు: తమ్మినేని యదుకుల భూషణ్
*****************************
రా.రా. మీద రాయడానికి కూచుంటే బ్రాడ్ స్కీ మరణానంతరం మిలోష్[1] రాసిన వ్యాసంలో కొన్ని భాగాలుగుర్తుకొచ్చి బుద్ధి వెలిగిపోయింది. ఆ వ్యాసంలో మిలోష్ బ్రాడ్ స్కీ మీద ఎన్నో విలువైన విషయాలు చెబుతాడు.బ్రాడ్ స్కీ మాటల్లో ఒక అధికారం ,ప్రభుత ధ్వనించేవి.అది ఇతరులకు బలగర్వంగా కనిపించేది.అతని ధోరణి నిరంకుశం అనిపించేది.“భాష మహత్తరమైనది. అది తనకు కావలసిన వారిని తన సేవార్థం ఎంచుకొంటుంది.” అన్నది బ్రాడ్ స్కీ నిశ్చితాభిప్రాయం. మహత్తరమైన ఆంధ్రభాష తన సేవకై ఏరికోరి ఎంపిక చేసుకొన్న జోదు మన రాచమల్లు. ఆజన్మాంతం తన కర్తవ్యం విషయంలో మడమ తిప్పింది లేదు. అసత్యం పలికింది లేదు. పురుషాయుత జీవనాన్ని వదిలిందిలేదు. ‘నిండు మనంబు నవ్య నవనీత సమంబు పల్కు దారుణాఖండల శస్త్ర తుల్యంబు” అన్న నన్నయ్య వాక్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.
రా.రా. బ్రాడ్ స్కీ ల మధ్య స్వభావంలో ఎంతో సామ్యం ఉంది. ఇద్దరికి లక్ష్యశుద్ధి మెండు.కాలేజినుండి ఇద్దరూ వెలివేయ బడ్డారు.ప్రవాస జీవితం గడిపారు.స్వంతంగా కష్టపడి చదివి ఒక అభిరుచిని ఏర్పరచుకొన్నారు. రా.రా. చిత్రంగా బ్రాడ్ స్కీ జన్మభూమి రష్యాలో ఎన్నో రచనలను తెలుగు చేశాడు.[2]
ఆ చలిని యాంత్రిక జీవితాన్ని చవి చూశాడు.కమ్యూనిజం పేరిట ప్రజలపట్ల అక్కడి ప్రభుత్వాలు కొనసాగిస్తున్న అఘాయిత్యాలను చూసి అసహ్యించు కొన్నాడు[3]. ఆ కమ్యూనిస్టుల కారణంగానే బ్రాడ్ స్కీ వెలికి గురై అమెరికాలో నివసించ వలసి వచ్చింది.
అదలా ఉండగా ,రా. రా పదాఘాతం తిన్న ప్రతి ఒక్కరు రా.రాను నిరంకుశుడనే చాటుతారు.ఐనా,తన లక్ష్యశుద్ధిని ఎవరూ శంకించలేరు.లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు కనుకనే, రాసిన ప్రతివాక్యము గురితప్పదు.సౌష్ఠవమైన భాషకోసం ఎంతగా తపించింది,మనకుఅడుగడుగునా కనిపిస్తుంది.
తీక్ష్ణబుద్ధిలేని వాడు విమర్శకుడు కాలేడు.కానీ, కేవలం బుద్ధిబలం చేత గట్టెక్కలేడు విమర్శకుడు.వాక్యాన్ని బలిష్టంగా తయారు చేయాలి.ఆపై ,దానికి పదును పెట్టాలి; దానికి విశదీకరణ శక్తిని ప్రసాదించాలి.అలా తయారయిన వాక్యం,అప్పుడుగాని పెద్దన గారి జాగిలంలా “కంఠపాశంబు లింత డుస్సిన” – ఉరికి పడి సాహితీ కీకారణ్యంలో అయోమయాన్ని ప్రోది చేసే అనేక జంతువులను తరిమి కొట్టదు.ఈ విద్యను ఆమరణాంతం సాధన చేసినవాడు రా.రా; కావునే ఈ స్మృతి కిణాంకం.
సాహిత్య పత్రిక “సంవేదన” మొదలుపెట్టేనాటికి(1968) రా.రా కు సరిగ్గా ముప్పై ఆరేళ్ళు.రష్యా వెళ్ళేనాటికి (1969) వెలువడిన సంచికలు కేవలం ఏడు.అప్పటికే అవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రా.రా రష్యానుండి వచ్చివేసిన కొద్దికాలానికే (1975), ఈ వ్యాసాలే “సారస్వత వివేచన(విజయవాడ: విశాలాంధ్ర ,1989) ” పేరుతో పుస్తకరూపం(1976) దాల్చాయి.
ఈ పుస్తకం చదవకుండా ఎవరూ ఆధునిక సాహిత్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేరు.
గురజాడ గొప్పదనం ఎందులో ఉంది? కన్యాశుల్కం ఎందుకు గొప్ప నాటకం ? ఠాగోర్ కన్నా గురజాడ ఏరకంగా భిన్నం ??సాహిత్యంలో కవిగా గురజాడకు గల స్థానం ??( ఈ ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే తెలుగు సాహిత్యంలో ఓనమాలు తెలియనట్టే) .అదే బలంతో శ్రీ.శ్రీ కవిత్వం మీద ఎన్నో అపోహలను దుర్వ్యాఖ్యానాలను ఎడమచేత్తో తొలగించాడు.వీటికి కారణమైన,అద్దేపల్లిని చెప్పనలవిగాని తీరులో మిగుల దండించాడు.ఆ సంరంభంలో ఎన్నో విలువైన విషయాలు వెల్లడి చేశాడు. -“ఛందస్సు ,లయా ఒకటి కావు.లయకు ఛందస్సు ఒక సాధనం,ఒక పరికరం,ఒక పరిచారిక “.ధ్వని,రసం మీద వివరణ, కవితా ఓ కవితా ,దేశచరిత్రలకు సార్థక వ్యాఖ్యానం ఈ ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్న ఈ వ్యాసాల్లోనే చోటు చేసుకున్నాయి. తిలక్ కవిత్వం మీద ఈనాటికి సరైన అంచనా లేదు;అతని కవిత్వం,అతని భాషను చూసి మురిసిపోవడమే తప్ప లోనారసి చూసినవాళ్ళు లేరు. రా.రా తనదైన ముద్రతో ఆ లోటు తీర్చాడు.(బ్రాడ్ స్కీ ,రా.రా లది వ్యాస రచనలో ఒకటే పంథా.వారు రాశాక ఇతరులకు రాయడానికి ఏమీ ఉండదు.తమ బుద్ధి పారిన మేర సమగ్రంగా విమర్శిస్తారు.)
తిలక్ మీద రా.రా నిష్కర్ష :
“తిలక్ లో భిన్న ప్రవృత్తులున్నా ,మౌలికంగా అతను భావకవి అనేది మాత్రం నిజం.అప్పుడప్పుడు అతని ఊహలు యే అభ్యుదయ ఆకాశంలో విహరించినా, అతని భావాలు యే ప్రబంధ పాతాళంలో పల్టీలు కొట్టినా,అతని పాదాలు మాత్రం భావకవిత్వపు కాల్పనిక వాద భూమిమీదే స్థిరంగా ఉండటం నిజం”
దిగంబర కవులకు కొర్రు కాల్చి మరీ పెట్టిన వాత (1969)
“సమాజం కుళ్ళిపోయిన మాట నిజమే.సమాజం పతనమైన మాట నిజమే. విప్లవాగ్నిజ్వాలలలో తప్ప సంస్కరించడానికి సాధ్యం కానంతగా
పతనమైన మాట నిజమే.కానీ, యెంత పతనమైనా ఈ దిగంబరుల పైత్యాన్ని కవిత్వమనుకొనేటంతగా పతనమయిందా ?”
కథానికలు ,నవలల గూర్చి స్వయంగా కథకుడైన రా.రా అవగాహన అపారం.
-“కథానికకు ఒక పాయింటు ఉండాలి.అదే కథానికకు ఆత్మ.కథానికలోని పాత్రలు సన్నివేశాలు,మొదలయినవన్నీ ఆ పాయింటును వ్యక్తం చేయడానికి సాధనాలు మాత్రమే.”
-“శిల్పం అనేది ఒక సాధనం మాత్రమే.శిల్పం ద్వారా సాధించవలసింది కళ అంటే నేరుగా హృదయాన్ని తాకేది.”
మహీధర నవలల మీద రాసిన సమీక్షలో
“తీవ్రమైన హృదయక్షోభ పాత్రలకే యెక్కడా లేదు కనుక ,తీవ్రమైన అనుభూతులు పాఠకులకు కూడా కలుగవు.”
“నవలకు గానీ,ఏ సాహిత్య రూపానికి గానీ చరమ ప్రయోజనం ఒకటే- పాఠకునికి ఉత్తమ సంస్కారం కలిగించడం.ఇది పాఠకుని హృదయం మీద
గాఢమయిన అనుభూతుల ముద్రలు వేయడం ద్వారా జరుగుతుంది. కానీ, పాఠకుని వివేకాన్ని ప్రబోధించడం ద్వారా జరగదు. “
విమర్శ దాని పరిమితులు ,ప్రయోజనాల మీద రా.రా చింతన మిగుల సూక్ష్మం.
-“సాహిత్యం మేధా వ్యాపారం కాదు.అది సంపూర్ణంగా హృదయవ్యాపారం. విమర్శ మేధా వ్యాపారమే అనవచ్చు.కానీ,సాహిత్యాన్ని,ముందుగా హృదయంతో ఆస్వాదించి తరువాత మేధతో పరిశీలించేవాడే ఉత్తమ విమర్శకుడు “
-“నిజమైన విమర్శలు అరుదైన కాలంలో ,ముఖస్తుతులకు,పరస్పర భజనలకు అలవాటు పడిన దేశంలో ‘ వ్యక్తిగత విమర్శ ‘ అనే నిషేధక సూత్రం గొప్ప ధర్మంగా చలామణీ అవుతుంది.నిజంగా ఏ విమర్శా భరించలేని వాళ్ళే ‘ వ్యక్తిగత విమర్శ ‘ ను దుర్వారమయిన ఆయుధంగా ఝలిపిస్తారు.
ఒక రచనను పనికిమాలిన రచన అనవచ్చునట,అది రాసిన వాణ్నిపనికిమాలిన రచయిత అంటే మాత్రం వ్యక్తిగత విమర్శ అవుతుందట.”
***
ఇవన్నీ ఒక ముప్ఫై ఆరేళ్ళ యువకుడు కడపలో తన సొంతిట్లో కూచుని సాహిత్యంలో దిగజారిపోతున్న విలువలను చూసి ఆవేదన చెంది, తలకు మించిన భారమైనా సరే, పత్రిక తెచ్చి అందులో చేసిన విమర్శలు. ఏ రచనను తాకినా మెరుపుతీగలా జిగేల్మని అచ్చెరవు గొలుపుతుంది.
( ఫిబ్రవరి 28న రాచమల్లు రామచంద్రా రెడ్డి (రా.రా) 88 వ జయంతి )
Footnotes:
1. Czeslaw Milosz, To Begin Where I Am (Newyork:Ferrar,Straus and Giroux,2001),p.421-430
2. అపారమైన అనుభవంతో విపరీతమైన శ్రమకోర్చి రా.రా రాసిన చివరి పుస్తకం. రా.రా, అనువాద సమస్యలు (విజయవాడ: విశాలాంధ్ర ,1991) .
2. అపారమైన అనుభవంతో విపరీతమైన శ్రమకోర్చి రా.రా రాసిన చివరి పుస్తకం. రా.రా, అనువాద సమస్యలు (విజయవాడ: విశాలాంధ్ర ,1991) .
3. “ఈ దేశంలో ప్రధాన సమస్య స్టాలినిజం అనేది” ( 12/5/72న మాస్కో నుండి కె.వి.రమణారెడ్డికి రాసిన లేఖ. రా.రా లేఖలు (ప్రొద్దుటూరు: రా.రా స్మారక సమితి,1990),p.105 .
పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ
[…] రా.రా. అలసిన గుండెలు, సొదుం జయరాం కథలు రెండూ […]
Vadapalli SeshatalpaSayee
రా.రా. రచనల సూచి
http://www.andhrabharati.com/download.php?f=rA_rA_rachanala_sUchi.pdf
మెహెర్
@కొడవళ్ళ హనుమంతరావు:
నా వ్యాఖ్యలో నేనుద్దేశించని ఘాటు వుందనిపిస్తోంది ఇప్పుడు చదువుకుంటే. ముందు పేరాలో విమర్శించిన తర్వాత మీరా వాక్యాన్ని అలా చివర్న చేర్చిన తీరు నిజంగా ఆయన్ని చులకన చేసినట్టే అనిపించింది నిన్న చదివినప్పుడు. అవును, మీకా ఉద్దేశ్యం వుండి వుండకపోవచ్చు. సాహిత్య విమర్శలో సంయమనం వుండద్దన్న ధ్వని వచ్చివుంటే మీ వాఖ్యని నేనర్థం చేసుకున్న తీరు వల్లే.
నేనక్కడ రాసింది నేనక్కడ చదివిందానికి తగిన సమాధానమే అయినా, నేనక్కడ చదివింది బహుశా మీరక్కడ రాసింది కాదు కాబట్టి (ఇది నా విషయంలో తరచుగానే జరుగుతూంటుంది), ఇప్పుడా పాత కామెంట్‌ని డిలీట్ చేస్తున్నాను. Sincere apologies. Sorry about the mess.
తమ్మినేని యదుకుల భూషణ్.
@Vadapalli SeshatalpaSayee:
శాయి గారు
విక్రమార్కుని విడ్డూరం తో పాటు ప్రచురించ బడ్డ (రా. రా. రచన) మరో పిల్లల పుస్తకం :
చంద్రమండలం- శశిరేఖ ( మొదటి ముద్రణ 1958 ,ఏడవ ముద్రణ 1980).
” 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు అర్థం అయే విషయాలు మాత్రమే
యిందులో వున్నాయి ” అని రా.రా. పుస్తకానికి రాసిన ముందుమాట లో పేర్కొన్నారు.
చిలకపాటి శ్రీనివాస్
@ మెహెర్,
రా.రా. వ్యక్తిత్వాన్ని మొదటి పేరాలో అంత పొగిడాక, మళ్ళీ చివరి పేరాలో తన మాట వినేవారెవరూ లేరని ఆయన వాపోయిన సంగతి ప్రస్తావించాక ఆయన శవయాత్రలో యాభై మందికూడా లేరనడంలో బాధ కాక వేరేదీ నాకు కనిపించలేదు. ఇక కొడవళ్ళ గారు అభ్యంతరపెడుతున్నదల్లా తోటి సాహిత్యకారులను జంతువులతో పోల్చడం లాంటి ధోరణి. గోడమీదపిల్లిలా ఉండమనీ అన లేదు; కుండ బద్దలు కొట్టవలసిందనే ఆయన అంటున్నది.
సంయమన గుణం ఉండడమే seething vulgarity ఎట్లా అయిందో నాకు అర్థం కాలేదు. దమ్ము లేని వాళ్ళు గోడమీద వ్యవహారాలకు అట్లా ‘తెగబడటం’ కూడా చిత్రంగా అనిపించింది. నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చెప్పడానికీ, ఎద్దేవా, గేలీ చేయడానికీ ఇంకా తేడా ఉందనే అనుకుంటాను. సాహిత్యంతో ఏ మాత్రం పరిచయమున్నవారికయినా ఆ tone తెలిసిపోతూనే ఉంటుంది. ఒకరిని కించపరిచి తన ఆధిక్యత చూపుకోవడమూ, తన వ్యంగ్య వైభవాన్ని ప్రదర్శించాలనుకోవడమూ మామూలు మానవ బలహీనతలుగా తప్ప సాహిత్యాన్ని మేలు చేసేవిగా నాకు కనపడలేదు. బహుశా చదువరుల ఆసక్తిని పెంచుతాయేమో , బజార్లో ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకుంటుంటే చుట్టూ జనాలు మూగిన మాదిరి.
ఇంతకంటే మర్యాదగా విమర్శకుడికీ, రచయితకీ, పాఠకుడికీ మధ్య సంభాషణ జరగనట్లయితే ఇక సాహిత్యం మనకు నేర్పుతున్నదేమిటి?
– చిలకపాటి శ్రీనివాస్
తమ్మినేని యదుకుల భూషణ్.
@కొడవళ్ళ హనుమంతరావు:
ఇతరేతర ,కత్తుల వంతెన అన్న పదాల వాడుక విషయంలో వివాదం ఉంది.
‘ఇతరేతర’ అంటే అక్కడ సందర్భాన్ని బట్టి రా.రా ‘పరస్పర’ అని అర్థం చేసుకున్నాడు.
చివరికి శ్రీ.శ్రీ వివరణ ఇచ్చాడు ‘ఇతరేతర’ కు వాడుక అర్థం ‘ఇతర’ అని తాను
ఆ పదబంధాన్ని అదే అర్థంలో వాడాను అని.గ్రాంధిక చాయలు అధికంగా ఉండే
శ్రీ శ్రీ కవిత్వంలో ఈ పదబంధాన్ని శ్రీ శ్రీ వ్యావహారికార్థం లోవాడి ఉంటాడని నేను
ఊహించలేదు అని తన రా.రా interview లో చెప్పారు (అంచంగి వేణుగోపాల్
కాదు అమ్మంగి వేణుగోపాల్ ) అనువాద సమస్యల్లో దీని గురించి ప్రత్యేకంగా
వివరించారు. బుకాయించే వాడు తన తప్పుకు బాధ్యత వహించడం అన్నది
వట్టి మాట.కాబట్టి,ఇస్మాయిల్ గారి విసురును అంత సీరియస్ గా తీసుకోవలసిన
అవసరం ఉందనుకోను.’వంతెన’ విషయంలో అక్కడ సందర్భాన్ని బట్టి
వ్యాఖ్యానించాడు రా.రా .శ్రీ .శ్రీ పూర్వం గురజాడ మీద రాసిన వ్యాసంలో
‘ఆనకట్ట’ అనే అర్థంలో ఆ పదాన్ని వాడి ఉన్నాడని నిదర్శనం చూపిస్తూ.
వంతెన అంటే bridge అని తెలియని స్థాయి కాదు రా.రా ది.
సంయమం లేనిది విమర్శ సాధ్యం కాదని నా అభిప్రాయం .సాహిత్య విమర్శ పేరిట
అవాకులు చెవాకులు పేలే వారిని (ఉదా :అద్దేపల్లి ,మిరియాల)రా.రా గట్టిగా అదిలించి
ఉండవచ్చు. దాన్ని సంయమ లోపంగా భావిస్తే ఇక చేసేదేమీ లేదు .రా.రా. లేఖలు
చూసినా మనకు అర్థమయ్యేది అతని వస్త్వైక విమర్శనా దృష్టి .రష్యాలో వారి లెనిన్
పూజను విమర్శిస్తాడు. stalinism ను ఘాతుక భూతంగా అభివర్ణిస్తాడు. మహీధరకు
రాసిన లేఖలో అనుకొంటాను మార్క్సిస్టుల ధోరణి ని ఎండగడతాడు. తెలుసుకోవలసింది
ఏమంటే రా.రా. జీవితానికి ,సాహిత్యానికి పెద్ద ఎడం లేదు .విమర్శ అతని జీవిత విధానంలో
భాగం.కాబట్టే ,అతనిలో private వ్యాఖ్యలు ,public వ్యాఖ్యలు కనిపించవు. వ్యాఖ్య అంటే
నిర్ద్వంద్వంగా వ్యాఖ్యయే.కానీ ,తెలుగులో ఇతర సాహిత్యవేత్తల్లో ( ఇస్మాయిల్ గారితో సహా)
ఈ పరిస్థితి లేదు. సినారె పరమ చెత్త కవి అంటారు. కానీ, దాని గురించి ఏమి చేయరు
ఫలానా వారి అనువాదాలు పరమ చెత్త అంటారు. కానీ అవన్నీ చాటు మాటు వ్యాఖ్యలకే
పరిమితం.బహిరంగంగా పత్రికల్లో రాయరు .కూలంకషంగా చర్చించరు. రా.రా. లాంటి వాళ్ళు
ఇక్కడ ఘాటుగా స్పందిస్తారు ( స్వభావంలో ‘సంయమం’ లేదు కనుక )
అయోగ్యులకే అన్ని గౌరవాలు లభించే మన సాహిత్య వాతావరణాన్ని సమూల ప్రక్షాళన
గావించవలసిన అవసరముంది.దానికి రా.రా. ఏర్పరచిన దారిని రహదారిగా మార్చడం వినా
మరో మార్గం లేదు.అప్పుడు గాని మరుగున పడ్డ మంచి కవులూ రచయితలు వెలుగులోకి
వచ్చి మన సాహిత్యం జవజీవాలు నింపుకొని దేశంలో సగౌరవంగా తలెత్తుకొని నిలబడదు.
(పోతే ,ఒక ఆసక్తి కరమైన విషయం రా.రా. ఇస్మాయిల్ , ఇద్దరూ తుదిశ్వాస తీసిన దినం:
నవంబర్ 24 )
కొడవళ్ళ హనుమంతరావు
మెహర్ గారికి,
నా వ్యాఖ్యలో చివరి మాటలు, రారా కి మన సమాజం ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదనే విచారంతో చెప్పిన మాటలు. అంతేగాని ఆయన వ్యక్తిత్వాన్ని తూచే ప్రయత్నం ఎంత మాత్రమూ కాదు. సరిగా వ్యక్తం చెయ్యకపోవడం నా పొరబాటే.
నేను సాహితీవనానికి కాస్త అవతల మసలేవాణ్ణే కాని, విమర్శలో సంయమనం గురించి నేనేర్పరచుకున్న అబిప్రాయం రారా వీ, రాళ్ళపల్లి వీ కొన్ని రచనలూ, వాటి మీద వ్యాఖ్యలూ చదివే. అయినా దానిమీద సంవాదం చేసే ‘దమ్ము’ లేదని ఒప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.
కొడవళ్ళ హనుమంతరావు
తమ్మినేని యదుకుల భూషణ్.
@Vadapalli SeshatalpaSayee:
రా. రా. పిల్లలకోసం రాసిన పుస్తకాలు విక్రమార్కుని విడ్డూరం ,చంద్రలోక యాత్ర
(శాస్త్రీయ చింతన గురించి చక్కని ముందుమాట సంతరించి పెట్టాడు రా.రా ;ఐదారు
ముద్రణలు పొందాయి ఈ పుస్తకాలు ,నా దగ్గర ఉన్నవి 1980 నాటివి )
Sreenivas Paruchuri
re: alasina gunDelu: I see that Sayee-gaaru uploaded the 2nd edition.
his own essays. raa.raa, the literary critic critiquing raa.raa the story writer. A must-read essay!
But, my favourite is the 3rd edition from early 1980s. It contains a 48-50 page long afterword from raa.raa *critically* criticizing
Regards,
Sreenivas
సౌమ్య
Sreenivas garu: How can we all read it then?
మెహెర్
@Vadapalli SeshatalpaSayee: WOW, FEAST!
Thank you very much.
సౌమ్య
శేషతల్పశాయి గారికి: చాలా థాంక్స్!!
Vadapalli SeshatalpaSayee
http://www.andhrabharati.com/download.php?f=alasina_guMDelu.pdf
http://www.andhrabharati.com/download.php?f=vikramArkuni_viDDUraM.pdf
సౌమ్య
రారా పై సూర్య దినపత్రిక వ్యాసం ఇక్కడ.
సౌమ్య
రారా వ్యాసాలే కాక, కథలు రాసారని ఇవాళ తెలిసి, తూలిక.నెట్ లో ఒక అనువాదం చదివాను.
అక్కడే ఆయన ’అలసిన గుండెలు’ అన్న కథాసంపుటి వెలువరిమ్చారని తెలిసింది. (తూలిక లంకె: http://thulika.net/2007January/RaRa.htm). అలసిన గుండెలు – యూలిబ్లో చూశా కానీ, పూర్తిగా ఉన్నట్లు లేదు. ఈ పుస్తకం ఎవరివద్దనన్నా ఉంటే, (ఈబుక్ ఉన్నాసరే) – తెలుపగలరు.
మెహెర్
[part of this comment is deleted]
ఇది వరకూ విని వున్నా పుస్తకాలేవీ లభ్యంగాకపోవటం వల్ల ఏవో కొన్ని వ్యాసాలు తప్ప రా.రా రచనలేవీ చదవలేకపోయాను. మలిగిపోతుందన్న తరుణంలో రా.రా పై ఆసక్తిని మళ్ళీ రగిల్చిన వ్యాసకర్తకు కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
రారా ని గుర్తు చేసినందుకు భూషణ్ గారికీ, అందుబాటులో లేని సారస్వత వివేచనని అందించినందుకు రమణ గారికీ కృతజ్ఞతలు. నమ్మిన విలువలకి కట్టుబడి నిర్భయంగా నిష్పక్షపాతంగా రాయడం ఉత్తమ విమర్శకునికుండాల్సిన లక్షణం. అది రారా కి మొదట్నుంచీ ఉన్న ఆస్తి. యుక్త వయసులోనే రాజీ లేని మనస్తత్వాన్ని చూపాడు: గిండీ ఇంజనీరీగ్ కాలేజీలో గాంధీ నిరాహారదీక్షకు మద్దతుగా సమ్మె చేసినందుకు బహిష్కరణకు గురైన విద్యార్థుల్లో అతనొకడు. క్షమాపణ చెప్తే తిరిగి చేర్చుకుంటామన్నారు. నిరాకరించి చదువు మానుకున్న వారు రారా, చండ్ర పుల్లారెడ్ది [1].
అయితే విమర్శకుడికి ఉండాల్సిన సంయమన గుణం రారాలో లోపించింది. అద్దేపల్లిని ఆక్షేపించడంలో సంయమనం కోల్పోయి శ్రీశ్రీ కవిత్వం లో కొన్ని పాదాల మీద తనే దుర్వ్యాఖ్యానం చేశాడు. “కత్తుల వంతెనకి అర్థం చెబుతూ వంతెన అంటే ఆనకట్టని ఒక విమర్శక మల్లుడు బుకాయించాడు,” అని ఇస్మాయిల్ ఎద్దేవా కూడా చేశాడు. ఎందుకో తెలుగుపై మంచి పట్టు ఉన్న వాళ్ళు కూడా అభ్యంతరమైన పదజాలం వాడతారు. కుండ బ్రద్దలు చేసినట్లు చెప్పాలి కాని, చెంప ఛెళ్ళుమనిపించాలా? తోటి సాహితీకారులని జంతువులతో పోల్చడం ఏం మర్యాద?
రారా మార్గంపై యాకూబ్ M. Phil. చేశారు. దాంట్లో [2] అంచంగి వేణుగోపాల్ 1985లో చేసిన ఇంటర్వ్యూ ఉంది. వర్ధమాన రచయితలకి మీరిచ్చే సలహా ఏమిటని అడిగితే రారా జవాబు: “నా సలహా ఎవరు వింటారని!” హైద్రాబాదులో ఆయన శవయాత్రలో పాల్గొన్నవాళ్ళు యాభై మంది కూడా లేరట!
కొడవళ్ళ హనుమంతరావు
[1] భారతీయ సాహిత్య నిర్మాతలు – రారా. తక్కోలు మాచిరెడ్డి. సాహిత్య అకాదెమీ, 2006.
[2] తెలుగు సాహిత్య విమర్శలో రారా మార్గం, యాకూబ్. శిలాలోలిత ప్రచురణలు, 1991.
తమ్మినేని యదుకుల భూషణ్.
@సౌమ్య:
అవును. మీరు రా.రా. లో బలాన్ని బాగా అంచనా వేశారు. రా.రా బుద్ధి తీవ్రతకు
ఒక ఉదాహరణ ,రా.రా అనువాద సమస్యల్లో పు.౧౦౮ (p.108) Thanks to అన్న ఇంగ్లీష్ వాడుక తప్పుగా అర్థం చేసుకున్న కేశవ రెడ్డిని విమర్శించి ,ఒక చిన్న విషయాన్ని
చెబుతాడు. ఆయన వాక్యాలు యథాతథంగా ఉటంకిస్తున్నాను.
‘ధన్యవాదా’లనేది హిందీ మాట.తెలుగులో కృతజ్ఞతలు అనాలి. ధన్యవాదాలని యెవరైనా
అంటే వారికి తెలుగు రాదనే చెప్పాలి.
రా.రా కు హిందీ రాదు , అయినా అబ్బుర పరిచే పరిశీలన రా.రా స్వంతం.
(హిందీలోని ధన్యవాదాన్నే బెంగాలీలో ధొన్నొబాద్ అంటారు)
నా సారస్వత వివేచన 1996 లో ఒక స్నేహితుడు పట్టుకెళ్ళి
“వనితా విత్తం పుస్తకం ..పరహస్త గతం ,గతం “అన్న సూక్తిని
నిజం చేశాడు.కొత్తపాళీ (మిత్రులు నారాయణ స్వామి (నాశి )తమ
కథల పుస్తకం ప్రచురణ నిమిత్తం విజయవాడ వెళ్ళినప్పుడు
నేను అడిగిందే తడవుగా ఈ పుస్తకం పట్టుకొచ్చారు.
(ఈ వ్యాసం నాశికే అంకితం)
పలుకారణాల వల్ల అతి తక్కువ వ్యవధిలో ఈ వ్యాసం రాయ వలసి
వచ్చింది. ఇందులో ఒక తప్పు దొర్లింది. ఎవరైనా సరి చేస్తారేమోనని
ఎదురుచూశాను.పెద్దగా గమనించి నట్టు లేరు .రా.రా పుట్టింది 1922 లో,
కాబట్టి పత్రిక పెట్టే నాటికి (1968) రా.రా. కు నలభై ఆరేళ్ళు.
రెండు చోట్లా అలాగే సవరించుకొని చదువుకోగలరు.
శీర్షికలో రా.రా అనే ఉంది రా.రా. అని ఉండాలి .ఈ విషయాన్ని ,
పురుషాయతం చర్చ మీద మరింత సమాచారాన్ని పెద్దమనసుతో
నా దృష్టికి తీసుకువచ్చిన మిత్రులు కొలిచాల.సురేష్ కు నా కృతజ్ఞతలు
(ధన్యవాదాలు కాదు!!).
సాహిత్యంలో శ్రద్ధాసక్తులు గలవారు వారు చదివిన పుస్తకాన్ని-
అది కవిత్వం కావచ్చు మరేదైనా కావచ్చు.నిష్కర్షగా,నిర్భయంగా
విమర్శించాలి. నిజాయితీ లేని రచనలను చీల్చి చెండాడాలి.వ్యక్తిని
బట్టి విమర్శ మారకూడదు. జ్ఞానపీఠ గ్రహీత ,గనిలో కార్మికుడు
ఎవరి పుస్తకమైనా గుణదోష నిర్ధారణ ఒకేరీతిలో జరగవలసిందే.
అది మనం రా.రా. కు ఇవ్వగల నిజమైన నివాళి.
ఈ సందర్భంగా ఎంతో కష్టించి పుస్తకాన్ని నడుపుతున్న నారీ ద్వయానికి
(సౌమ్య,పూర్ణిమ)నా హార్దికాభిందనలు.చాలా మంది చక్కని సమీక్షలు
అలవోకగా రాస్తున్నారు.అది బుచ్చిబాబు మీద అయితేనేమి తాము సరదాగా
చదివిన ఆంగ్లపుస్తకమ్మీదయితేనేం ;ఒక ఆరోగ్యకర వాతావరణం కనిపిస్తోంది.
అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు.
స్వస్తి.
తమ్మినేని యదుకుల భూషణ్.
తమ్మినేని యదుకుల భూషణ్.
@budugoy:
చలాన్ని రా.రా. చాలా లోతుగానే అంచనా వేశాడు.చలం రమణాశ్రమం చేరినా అతనిలో భగవద్భక్తి తెచ్చిపెట్టుకున్నది ;విశ్వనాథకు అటువంటి తత్వం స్వభావంలో ఉన్నది అని
రా.రా. అభిప్రాయం. చలం చివరి దశలో రాసిన పుస్తకాలు అదే విషయాన్నిబల పరుస్తున్నాయి. ఇంకొక విషయం ,చలంలో నిజంగా మూఢ నమ్మకాలు ప్రవేశించాయి.
అష్టగ్రహ కూటమి అందులో ఒకటి.శ్రీ.శ్రీ క్కూడా ఆ రోజుల్లో చలం దీని గురించి ఉత్తరం రాశాడు. మొదటిలో పెను ఉప్పెన లాంటి తర్కం ,వాదం గల చలం ఇలా మూఢ నమ్మకాలకు బలి కావడంతో ,చలం జీవితంలో తొలి,మలి దశలను సంధానించే
సూత్రంగా సుఖవాదాన్ని తీసుకు వచ్చాడు రా.రా. అనిపిస్తుంది.
———————
మార్క్సిజాన్ని సమాజాన్ని మార్చగల ఒక వ్యవస్థగా మనసా వాచా నమ్మడం ఒక కారణం.
అందులో మతం లేదా దైవం వారి ప్రతినిధులకు అభేదం ఉంది. కావున ,నాకీ వ్యాఖ్య
ఆశ్చర్యం కలిగించలేదు. వివేకానంద ,పరమహంస ,రమణ మహర్షి ,అరవిందుల గూర్చి అదే వ్యాసంలో పు.౫౨ (p.52) లో ఒక అభిప్రాయం ఉంది. నామదేవులు తుకారముల్లా వారు భక్తులు కారు ,వారు ఇరవై శతాబ్దానికి చెందిన వికసిత బుద్ధులకు సరిపోగలరు అని .
———
సౌమ్య
భూషణ్ గారికి: రారా గురించి వినడమే కానీ ఎప్పుడూ చదవలేదు. మీ పుణ్యమా అని, ఈ పరిచయ వ్యాసం, ఆపై రమణ గారి పుణ్యమా అని ’సారస్వత వివేచన’ పుస్తకం – రారా ను చదవగలుగుతున్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు. నామటుకు నాకైతే, విమర్శల సంగతి అటు పెడితే, తన ఆలోచనల పట్ల ఆయనకున్న స్పష్టత, అవి వ్యక్తీకరించడంలోని స్పష్టత – రెండూ నచ్చాయి. ఇకపోతే, శ్రీశ్రీతో పాటు చాలా మంది అన్నట్లు – నిజంగానే ఈయన నిర్దాక్షిణ్యమైన విమర్శకుడు అనిపించింది
budugoy
యదుకుల భూషణ్ గారు, మీ “నేటికాలం కవిత్వం-విమర్శ” పుస్తకంలో రా.రా గురించి రాస్తూ మీ మెచ్చుకోలు చదివాను గానీ రా.రా సాహిత్యం ఎక్కడా దొరక్క (నేనూ తగినంత ప్రయత్నం చేయకా) నాదంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేకపోయాను.
ఇన్నాళ్ళకు రారా మీద మీ వ్యాసం వల్ల “సారస్వత-వివేచన” చదివే అవకాశం లభించింది. ఇప్పుడు మీతో నూటికి నూరుపాళ్ళూ ఏకీభవిస్తాను. రా.రా. నిస్సందేహంగా గొప్ప విమర్శకుడు.
మన సమకాలీన సాహితీ విమర్శకులను చదవాలంటే నాకో విధమైన జంకు కలుగుతుంది. రా.రా. మరో సందర్భంలో చెప్పిన మాటలు ఇక్కడ వాడుకుంటాను. “యెవరో గొప్ప పండితులు మనకు తెలిసీ తెలియని భాషలో మనకు తెలిసీ తెలియని యేదో మహా జటిలమైన సమస్య మీద వాదించుకున్నట్లుంది.” ఉదాహరణ కావాలంటే మన కె.శ్రీనివాసు, ఎన్.వేణుగోపాల్ వ్యాసాలు చదవండి. రా.రా. ఆ దారిన నడిచెవాడు కాదుగదా, అలాంటి వాళ్ళపై చాలా గట్టి అభిప్రాయమే ఉంది. ఉదా: “మహానుభావుడు చలం” లో సంపత్కుమార భాషాడంబరమైన వ్యాఖ్యలపై సటైర్లు చదివి తీరాల్సిందే.
చలం మీద రా.రా. అభిప్రాయాలు తప్పకచదవాల్సిన వ్యాసం. కాకపోతే నాకు రుచించని ఒక వ్యాఖ్య..”చలమే లేకపోతే విశ్వనాథ సత్యనారాయణ గారి కుళ్ళు ఫ్యూడల్ చాతుర్వఋన భావాల దుర్గంధంతో తెలుగు సాహిత్యం యింకా కంపు కొడుతుండేది. చలమే లేకపోతే జీవిత వాస్తవానికి దూరమయిన గాంధీయిజంలాంటి యే కూహనా మానవతావాదమో తెలుగు సాహిత్యంలో రాజ్యం చేస్తుండేది”. మేధోజనితమైనదేదీ, బుద్ధిజనితమైనదేదీ అన్న తేడా చాలా స్పష్టంగా తెలిసిన రా.రా.కు వీళ్ళిద్దరిపై ఇలాంటి అభిప్రాయం ఉండడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది.
అలాగే చలం మొదట్లో రాసిన రచనలనూ, రొమాంటిసిజంలో తీవ్రవాదంగా ఐడెంటిఫై చేసిన రా.రా.యే ఆ దశలో చలం హెడనిస్టు అనడం అస్సలు బాగోలేదు.
రా.రా., ఆమాటకొస్తే ఒకతరం మేధావులంతా కూడా చలం చివర్లో అధ్యాత్మికతవైపు మొగ్గడాన్ని జీర్ణించుకున్నట్టు లేదు. వారు మనసా వచా నమ్మిన హేతువాదమో లేద మార్క్సిజమో, మరో వాదమో కారణమనుకోవచ్చు. రా.రా.యే చెప్పినట్టు చలం ఒక అన్వేషకుడు. ఆ అన్వేషణలో బహుశా రమణమహర్షి సాంగత్యం ఒక మజిలీ అయ్యుండొచ్చు. చలం మరో నలభయ్యేళ్ళు జీవించి ఉంటే ఆ మజిలీ చివరిదో కాదో కూడా తెలిసుండొచ్చు.
అలాగే మరో వ్యాఖ్య : ” అజ్ఞానపుటంధయుగంలో దేవుడూ, మతమూ, పరలోకమూ మొదలయిన విశ్వాసాలు జీవితం మీద కప్పిన మాయ ముసుగులను చీల్చి పారవేసి, గురువూ, దైవం, రాజూ, పురోహితుడూ, పతిదేవుడూ, భూదేవుడూ, పితృదేవుడూ మొదలయిన భ్రమలన్నీ విదలించుకొని, యేసుక్రీస్తులూ, భగవద్గీతలూ, గాంధీ మహాత్ములూ, జగద్గురువులు మనకండ్లకు కట్టిన గంతలు బ్రద్దలు కొట్టి, జీవితాన్ని హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, భ్రమరహితంగా పరిశీలించే వాస్తవికవాదం__జీవితాన్ని దైవలీలగా కాక, కేవలమానవ వ్యాపారంగా చూసే వాస్తవికవాదం__ మనసాహిత్యంలో ప్రధానధోరణిగా వుంది”
పై వ్యాఖ్యలో మీకేమైన దోషం కనిపించిందా? నాకున్న ప్రధాన అభ్యంతరమంతా దైవమనే కాన్సెప్టునూ మిగిల్న దైవానికి (self-procliamed)ప్రతినిధులను ఒకేగాటన కట్టడం. టీచర్లు బాగోలేకపోతే చదువు మీద విముఖత పెంచుకోవడం లాగుంది ఈ వాదం. సనాతన ధర్మంపై, వేదాంతాం పై వివేకానందుడులాంటి వారి బోధనపై రా.రా.(మిగతా హేతువాదులైనా ) ఎలాంటి అభిప్రాయాల్ని వెలిబుచ్చారో తెలుసుకోవాలనుంది. any pointers? ఏదేమైనా రా.రా. తెలుగు సాహిత్యం మీద అంతో ఇంతో ఆసక్తి ఉన్న ప్రతివాడూ చదవదగ్గ విమర్శకుడు. మీవ్యాసంలో చివరి వాక్యంతో నూటికి నూరుపాళ్ళూ ఏకీభవిస్తాను. జయంతి సందర్భంగా ఆయన్ని మాకు పునఃపరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
రమణ
తమ్మినేని యదుకుల భూషణ్ గారు,
“ఒక ప్రమాణాన్ని స్థాపించదలచుకున్నవాడు నిష్కర్షగా వ్యవహరించవలసిందే. వ్యక్తిని బట్టి విమర్శ మారకూడదు”.
ఒప్పుకుంటున్నాను. నిష్కర్ష కు కఠినత్వానికీ తేడా ఉందనే అనుకుంటున్నాను.
పవనకుమార్
@తమ్మినేని యదుకుల భూషణ్.: శ్రమ తీసుకుని వివరించినందుకు కృతజ్ఙతలు. విభేదించడానికి అంగీకరిస్తాను. ఇందులో జెండర్ గొడవ ఉంది. వివరాల్లోకి పోను గాని, స్త్రీపురుషులతో కూడిన ప్రపంచానికి పురుషుడు ప్రాతినిధ్యం వహించడం అనే గొడవ ఇందులో ఉంది. పురుషకారానికి విస్తృతార్థం అబ్బడం వెనుక నున్న పరిణామం సామాజికమే.
తమ్మినేని యదుకుల భూషణ్.
@రమణ:
రా.రా మరణించాక వచ్చిన పత్రికా సంపాదకీయాలను రా.రా లేఖలు పుస్తకానికి అనుబంధంగా ఇచ్చారు. ప్రభ సంపాదకీయం లో ఒక ఆసక్తిరమైన విషయం :
క్రూరుడైన విమర్శకుడు అన్న శ్రీ శ్రీ వ్యాఖ్య మీద :
” అయితే శ్రీ శ్రీ తనకు తానుగా ఆ మాట అనలేదని ఇంటర్వ్యూ చేసిన వారే అలాంటి సమాధానం వచ్చేలా ప్రశ్న (లీడింగ్ క్వశ్చన్ ) వేసి అదే సమాధానం రాబట్టారని
రా.రా ఒక సారి నాతో అన్నారు ” –చైతన్య ప్రసాద్
———-
రా. రా విమర్శకు వ్యక్తులతో పనిలేదు .” దాక్షిణ్యం న కర్తవ్యం ” (చాణక్యనీతి ) తరహా.
” యుక్తియుక్తం వచో గ్రాహ్యం ,బాలాదపి శుకాదపి
యుక్తిహీనం వచో త్యాజ్యం బ్రహ్మాదపి శుకాపి ”
అన్న శ్లోక భావాన్ని నరనరాన జీర్ణించు కున్నాడు.
అది విమర్శకు సరైన పధ్ధతి అని నేను అనుకొంటాను.
ఒక ప్రమాణాన్ని స్థాపించదలచుకున్నవాడు నిష్కర్షగా
వ్యవహరించవలసిందే. వ్యక్తిని బట్టి విమర్శ మారకూడదు.
తమ్మినేని యదుకుల భూషణ్.
@budugoy:
మొదటిది ‘స్వయంవరణం ‘నవల మీద సమీక్ష ( పు.77)
రెండవది ‘ కొల్లాయి గట్టితేనేమి’ మీద సమీక్ష (పు.16)
‘ కొల్లాయి గట్టితేనేమి ‘ నవల మీద రా.రా కు సదభిప్రాయమే ఉంది.
ఈ నవల మీద రా. రా రాసిన 23 పేజీల వ్యాసం చాలా విలువైనది.
తమ్మినేని యదుకుల భూషణ్.
శబ్దరత్నాకరం సమగ్రం కాదు.పదస్వరూపాన్ని నిఘంటువులద్వారా తెలుసుకోవాలి.
మన తెలుగులో సమగ్రమైన నిఘంటువు లేకపోవడం మూలాన వచ్చిన చిక్కులు
ఇవి.పురుష అన్న పదానికి ఉన్న అర్థ విస్తారం (semantic expansion) మగ అన్న
పదానికి లేదు. (manly అన్న పదంలో ఇదే ఇబ్బంది ఉంది, సమయాభావం వల్ల
నేను ఉజ్జాయింపుగా చెప్పానే గానీ పూర్తి పదస్వరూపం వివరించలేదు, ఆ పని మీకే
వదిలివేశాను,కారణం సంస్కృత నిఘంటువులు మీకు అందుబాటులో ఉన్నాయన్నారు)
శబ్ద రత్నాకరం ,మీ దగ్గరున్న సంస్కృతాంధ్ర నిఘంటువు ఇచ్చిన అర్థాలు
కామశాస్త్ర పరమైనవి.మీరు పురుష అన్న పదానికి అర్థాలు ,అర్థభేదాలు
ఆప్టే,విల్సన్,మోనియర్ లాంటి నిఘంటువుల్లో చూసి ఉంటే విషయం బోధపడేది.
( బాధ్యాతాయుతం ,సంస్కారయుతం అన్న ప్రయోగాలతో పురుషాయుతం
అన్న పద బంధాన్ని పోల్చి చూడండి మీకు కొంత స్పష్టత ఏర్పడుతుంది.)
పురుషకారము అన్నపద ప్రయోగము మీకు తెలిసివుంటే ఈ పదబంధం తేలికగానే
అర్థమవుతుంది.ఇక్కడ gender గొడవలేదు. స్వశక్తిని,స్వబుద్ధిని నమ్ముకొని దైవం ,
విధిని పట్టించుకోని మానవ ప్రయత్నం పురుషకారం.అలాంటి పురుషకారం ఎవరి జీవితంలో
కనిపించినా వారు పురుషాయుత జీవితం గడిపినట్టే. (వీరికి తమ ధ్యేయాలు ప్రధానం.ఆ
సాధనలో కష్టనిష్ఠూరాలను లెక్కచేయరు. ఇలా చేస్తే ఏమవుతుంది అన్న ఆలోచనే లేదు.
అది తమకు సత్యమని తోచాలి అంతే.) బ్రాడ్ స్కీ కూడా ఇటువంటి పురుషాయుత జీవితాన్ని
గడిపిన వాడు కాబట్టే నేను వ్యాసం ఎత్తుకోవడం తోటే ఆ ప్రస్తావన తెచ్చాను.
మహాపురుషుల జీవితచరిత్రలు వెదికితే మీకు పురుషాయుత అన్న ప్రయోగం
కనిపించవచ్చు. ఒక సమగ్ర నిఘంటువు (అంటే ప్రతి అర్థభేదానికి ప్రయోగాలు
చూపే నిఘంటువు ) లేని కారణాన తెలుగులో రచయిత తనది కాని పని చేయ
వలసి వస్తుంది.
budugoy
మంచి వ్యాసం. రా.రా పుస్తకాలు దొరకకపోతే ఈ వ్యాస ప్రయోజనం నెరవేరినట్టేనా అని ఆలోచిస్తుంటే రమణ గారు లింకు చూపించారు ధన్యవాదాలు. మహీధర గారి నవలల్లో నేను చదివింది కొల్లాయి గట్టితేనేమి ఒక్కటే. దాంట్లో మాత్రం హృదయక్షోభ తక్కువేమీ లేదు. ఈ వ్యాఖ్య సమయం, సందర్భం తెలుసుకోవచ్చా? పవనకుమార్ గారు, సూక్ష్మమైన విషయాన్ని పట్టుకున్నారు. మీరు చెప్పిన దాంట్లో రెండో విషయంతో ఏకీభవిస్తాను.
పవనకుమార్
@పవనకుమార్: చిన్న సవరణ. ‘మగవాడిలా ప్రవర్తించే ఆడది అని శబ్ద రత్నాకరం’ అన్నాను. ఆ అర్థమిచ్చింది సంస్కృతాంధ్ర నిఘంటువు. శ.ర. లో ఉపరతి అని ఒక అర్థం మాత్రమే ఉంది.
పవనకుమార్
@తమ్మినేని యదుకుల భూషణ్: వివరణకు థాంక్స్. 1)’మన తెలుగులో,”పురుషాయుత” ను manly అన్న అర్థంలో వాడుతున్నాము.’ అన్నారు మీరు. శబ్ద రత్నాకరం ప్రకారం ‘పురుషాయిత’ అర్థం కూడా దాదాపు అదే. మగవాడిలా ప్రవర్తించే ఆడది అని శబ్ద రత్నాకరం. మొత్తం మీద…మీ వివరణ మేరకు చూసినా; ఇక్కడ మనం పదా,ర్థాల మీద కచ్చితమైన అవగాహనకు రాలేకపోతున్నాం. ఒక పద స్వరూపం స్పష్టంగా తెలియనప్పుడు దాన్ని వాడకపోవడమే సరైన పని. మీ మాటను హాయిగా తెలుగులో… ‘పురుషాయుత జీవనాన్ని వదిలిందిలేదు’ బదులు ‘చివరి వరకు మగాడిగా బతికాడు’ అని రాసుకోవద్చు.
2) ఇక, ఈ భావనను ఇష్టపడాలో వద్దో… ఆలోచనీయమే. నాకైతే, అభ్యంతరమే. మగాడు మగాడుగా అడది ఆడదిగా బతకాలి. అదొక అస్తిత్వ సమస్య. ఏదీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ‘మగాడుగా బతకడాన్ని’ సాహిత్య విమర్శలో ఒక గుణంగా పరిగణించడం అనుచితమే. నిక్కచ్చిగా మాట్లాడడం, సత్యం… అనేవి ప్రత్యేకించి మగతనానికి సంబంధించినవి కావు.
3) విమర్శకుడు నీళ్లు నమలకుండా, కచ్చితంగా ఉండాలనే విషయంలో నాకున్న ఓట్లన్నీ మీకే.
4) ఒక రిక్వెస్ట్: మన తెలుగులో,’పురుషాయుత” ను manly అన్న అర్థంలో వాడి’న ఒక సందర్భాన్ని ఉటంకించగలరా!
రమణ
శ్రీశ్రీ ఒక ఇంటర్వ్యూ లో “రా.రా క్రూరమైన విమర్శకుడు, విమర్శ అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు” చెప్పారు. మీరు ప్రస్తావించిన అద్దేపల్లి, రా.రా సంవాదం గురించే. సారస్వత వివేచన లోని కొన్ని వ్యాసాలు చదివాను. నవీన్, ఆర్.యస్. సుదర్శనం వంటి వారు కూడా ఆయన రాతలకు బలవ్వక తప్పలేదు. రెండు మూడు వ్యాసాలు చదివాక, తెలుగు సాహిత్యం గ్రూపులతో నడిచిందా! అనే సందేహం కలిగింది.
సారస్వత వివేచన పుస్తకం జాలం లో దొరుకుతుంది.
http://www.new.dli.ernet.in/cgi-bin/test1.pl?next=1&path1=/data_copy/upload/0071/571&first=1&last=170&barcode=2990100071566&button=Go.
డిజిటల్ లైబ్రరీ లోని పుస్తకాలను ఒక్కో పేజీ కాకుండా, ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ క్రింది లింక్ చూడండి.
http://bhuvanavijayamu.blogspot.com/2009/06/how-to-download-chandamama-other-books.html.
తమ్మినేని యదుకుల భూషణ్
పురుషాయితం అన్నది సాంకేతిక పదం (technical word). సంస్కృతసాహిత్యంలో కనిపిస్తుంది.ప్రధానంగా అనంగరంగం లాంటి పుస్తకాల్లో.అందుకని శబ్దరత్నాకరంలో
ఇచ్చిఉంటారు.మన తెలుగులో,”పురుషాయుత” ను manly అన్న అర్థంలో వాడుతున్నాము. పురుషాయత అన్నరూపం సరైనది అనిపిస్తుంది నాకు. సమష్టిని సమిష్టిగా వాడుకచేస్తున్నట్టుగా ఈ పదాన్ని ప్రస్తుతరూపంలో వాడుతున్నామని నా అనుమానం.ఈ శబ్దం విషయంలో ఇంకా లోతైన విచారణ అవసరం.ఇప్పటికింతే.
తమ్మినేని యదుకుల భూషణ్.
పవనకుమార్
‘పురుషాయుత జీవనాన్ని వదిలిందిలేదు.’… పురుషాయుత జీవనం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది. చెబుతారా! నా దగ్గరున్న శబ్దరత్నాకరం, సంస్కృతాంధ్ర నిఘంటువులలో ఈ పదం దొరకలేదు. దీనికి బాగా దగ్గరగా పలికే పురుషాయితానికి వేరే, ఇక్కడ అవసరం లేని, అర్థం ఉంది. ఈ పదబంధం ఉండే ఉంటుంది. లేకుంటే, అన్య స్ఫురణ ఇచ్చే ఇలాంటి పదం వాడి ఉండరు. అసలు వ్యవహారంలో లేని ఇలాంటి పదాలు వాడడం ఏ పరమార్థానికి? రచయిత చెప్పదలిచిన భావానికి తగిన వ్యావహారిక పదం లేనప్పుడు సరే, ఇది అలాంటి సందర్భమా?
Sarma
రాచమల్లు రామచంద్రారెడ్డి గారు వ్రాసిన “మహిళల ఉద్ధరణ” పుస్తకం చదివాను. అది రష్యా, జెర్మనీ లాంటి దేశాలలోని మహిళల జీవితాల గురించి లెనిన్ వ్రాసిన వ్యాసాల అనువాదం. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు చలం గారి అభిమాని కూడా. నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు చలం గారి పై విమర్శలు చేస్తున్నప్పుడు రామచంద్రారెడ్డి గారు, రంగనాయకమ్మ గారు చలం గారి పక్షాన నిలబడ్డారు.