పురూరవుడూ, శారదా శ్రీనివాసన్ గారూ, చలం, నేనూ!
అనగనగా ఓరోజు ప్రొద్దుటూరులో పెళ్ళికెళ్ళి, బోరు కొట్టి, రోడ్లను సర్వే చేస్తూ ఉంటే, ఓ పుస్తక ప్రదర్శన కనబడ్డది. అక్కడ “మైదానం”. అప్పటికి చలం గురించి వినడమే. “మైదానం బా ఫేమస్ కదా… చదూదాం” అనుకుని, తీసుకున్నాను. కట్ చేసి మళ్ళీ హైదరాబాదొచ్చేస్తే, అంత చిన్న పుస్తకాన్ని కూడా చదవలేక మూసేసిన నేను. “నేను కూడా చదవలేను” అని చేతులెత్తేసిన మా అమ్మా. దెబ్బకి కొన్నాళ్ళు చలం జోలికి పోలేదు. తర్వాత “మ్యూజింగ్స్”. అంతా బానే ఉంది కానీ, మళ్ళీ ఆ “ఆడ బాడీ లాంగ్వేజీ” నా వల్ల కాలేదు చదవడం. “చలం భలే రాస్తాడు. కానీ, నేనే కొన్ని సార్లు జీర్ణించుకోలేను” అని ఫిక్సయి, ఊరుకున్నాను.
కాలం మారింది. ఈ టైములో, ఓరోజు అనుకోకుండా హైదరాబాదు వెళ్ళాను. చలం “పురూరవ” రేడియో నాటకం వింటారా? అని కత్తి మహేశ్ అడిగారు – వెంకట్ ఇంట్లో అంతసేపూ కూర్చుని మాట్లాడిన పెద్దావిడ వెళ్లగానే. “చలమా? అది..మరి…” ఏం చెప్పాలో అర్థం కాక, లోలోపల వర్రీ ఔతున్నా – నేను చలంని భరించలేనేమో అన్నానంటే అవతల నన్నేమంటారో అని. “ఇప్పుడు వచ్చి వెళ్ళారే, శారదాశ్రీనివాసన్ గారు – ఆమె ఈ నాటకంలో వాయిస్ ఓవర్. చాలా బాగుంటుంది.” అన్నారు. “ఓహో… సరే, విందాం…” అనుకున్నా. ఇంతలో ఓ సాంపిల్ విన్నాక, త్వరలో వినాలి అని ఫిక్సయ్యా. మళ్ళీ కట్ చేస్తే, బెంగళూరు.
“ఎక్కడ్నుంచి వచ్చావు?” (పురూరవుడు)
“అక్కడ్నుంచి” (ఊర్వశి)
ఇక వినడం మొదలుపెట్టాను. వింటూనే ఉన్నాను. వింటూ రిపీట్ కొట్టుకుంటూ, మళ్ళీ మళ్ళీ వింటూనే, ఈమాటవారి ఆడియో లంకె ని ఓ స్నేహితురాలికి పంపాను. ఇద్దరం చెరో ఊర్లో కూర్చుని కలిసి విన్నాము ఆడియో. తరువాత ఇంకోళ్ళకి, ఇంకోళ్ళకి. ఇలా ఓ ఐదు మంది చేత వినిపించాను. నేను ఈ గ్యాపులో ఓ రెండుసార్లు మళ్ళీ విన్నాను. డైలాగులు అలా నిలిచిపోయాయి మనసులో… ఓహ్! చలం ఎంత బాగా రాసాడో…ఈ పుస్తకం చదవాలి… అనిపించింది. తరువాత ఈమాటలోనే కనిపించింది ఈబుక్.
“నువ్వెవరో నాకు తెలియకపోతే, నువ్వెవరో నీకు తెలీదు”
…………………………
“ఎన్ని జన్మల నుంచి నాకోసం తపిస్తున్నావో నీకు తెలుసా? నేను లేనిది నువ్వేమిటి?”
“నేనెవరో చెబుతాను అప్పుడైనా నీవెవరో తెలుస్తుందేమో నీ బుద్ధికి”
….
“నిద్రపోలేదా?”
“ఎందుకు నిద్ర? నువ్వు నాతో ఉండగా నాకు నిద్రా?”
…..
– అబ్బబ్బా! ఏమిటీ డైలాగులు. మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను అవే డైలాగులు. ఓ పక్క శారదగారి కంఠం ఎక్కడ్నుంచో (అక్కడ్నుంచి) వినిపిస్తూ ఉంటే.
“వెరపునీ, వంకర్లనీ, కామాన్నీ, అవసరాన్నీ ఎరుగని ప్రేమ అతనికి అర్థం కావడం లేదు.”
“నిన్ను ఎడమకాలితో తన్ని పోలేక హాస్యమాడుతున్నాను. నీమీది నా ప్రేమవల్ల.”
“నీమీద కాదు. నీమీద గొప్ప ప్రేమ. నా కసి నీ అల్పత్వం మీద, అంధత్వం మీద”
-ఆహా! నా కసి నీ అంధత్వం మీద… అల్పత్వం మీద… రింగు రింగుమంటున్నాయి అవే మాటలు నా చెవుల్లో. చెవులు మూసుకోవాలనిపించింది. కానీ, కళ్ళు ఓ పక్క ఆ తెరని చూస్తూ, చదివేస్తూ ఉంటే, ఓ పక్క శారదగారి గొంతుక ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటే…ఏం చేసేది? అదో రకం తీపి బాధ కాబోలు. అలా వింటూ వింటూ ఉండిపోవడం…
“ప్రేమ హృదయంలో పొంగి పొంగి పొర్లి నింపేస్తూ ఉంటే నిద్ర ఎందుకు? ఏమీ చెయ్యడమెందుకు? ఆలోచించడమెందుకు? ఎందుకనే ప్రశ్నేలేదు. ఇంక ఏ ఆలోచనకీ, తలపుకీ తావు లేదు”.
“నీ నేత్రాలు నిద్రపోయే నా నేత్రాలలోంచి నా జడత్వాన్ని మేల్కొలిపి ఆకాశజ్యోతుల్ని వెలిగిస్తాయి. ఎవరు నువ్వు? నా మీద అంత ప్రేమేమిటి నీకు!”
“నాకు నువ్వెవరో నీకెట్లా చెప్పను?”
-నాకు ఇవన్నీ చదువుతూ ఉంటే ఏమనిపిస్తోందో నేను మాత్రం ఎట్లా చెప్పను? ఏమని చెప్పను!
“యోచన అంత నిష్ఫలం ఏదీ లేదు”
“ఎప్పటికీ నువ్వు గ్రహించలేని విషయం ఏమిటంటే, ఇంకొకళ్ళు చెప్పడం వల్ల ఎన్నడూ అర్థం కాదని. క్రమంగా కాలంలో స్వంత అనుభవం బోధించవలసిందే. మాటలతో నేర్చుకునే విషయాలు చాలా అల్పమైనవన్నమాట. ఎదుగు విశాలంగా, తెలుస్తాయి. తెలియడమంటే ఏమిటనుకున్నావు? అనుభవించే అర్హత కలగడమన్నమాట. అనుభవంతో తప్ప వికాసం లేదనే సూత్రమే లేకపొతే ఈ ప్రపంచమే అనవసరం.”
– హహహ…. ఇది ఎన్నిసార్లు తల్చుకుని నవ్వుకున్నానో. యోచనంత నిష్పలం ఏదీ లేదు. ఇలా ఇంతందంగా ఎలా రాస్తారో? అని ఆలోచించడం కూడా దండుగే. అనుభవించడమే!!
“అద్భుతమూ, అతీతమూ అయిన విషయాలను చూస్తూ కూడా సాధారణత్వం కింద సమర్థించుకునే అల్పస్థితి ఈ లోక దురదృష్టం. అట్లానే కాకపోతే సూర్యోదయమనే పరమద్భుతాన్ని ప్రతినిత్యమూ చూస్తూ నిర్జీవంగా బ్రతుకుతూ ఉండగలరా?”
– ఇది చదివేదాకా అర్థం కాలేదు, నిర్జీవంగా కూడా మనిషి బ్రతగ్గలడని!
“లోకంలో అపాయమూ, అవసరమూ ఎప్పుడూ ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయడమే వాటి నివారణోపాయం” – నాకు ఊర్వశి మాట్లాడిందో, చలం మాట్లాడాడో అర్థం కాలేదు.
“మానవుడి కపటత్వానికీ, బానిసత్వానికీ చిహ్నం వస్త్రం.”
“అందాల కలలకి రూపమిచ్చుకుంటేగానీ అందాన్ని అనుభవించడం చేత కాదు. అందుకే మీలోకంలో కవిత్వం, శిల్పం, గానం అవసరం.
– ఇలా కూడా అనుకోవచ్చని నాకు ఇన్నాళ్ళూ అర్థం కాలేదు. 🙂
“ప్రయాణం దూరం మీదా, కాలం మీదా ఆధారపడదు. ఒకరి ఆలింగనంలో ఒకరు చాలా సన్నిహితులై, చాలా దూరాలు ప్రయాణం చేస్తారు. ఇంక తిరిగి ఆ ప్రేమతో సమీపించలేనంత దూరాలు.”
“అంత ఘోరంగా విధిని తిడతారా మానవులు ! ఈ దు:ఖం, వ్యధ, రోగం, అంతా వాళ్ళకే తెలీని మనుష్యుక స్వంత అవసరాలు, నిగూఢ వాంఛలు. చావుకే ఏడుస్తారా? ఆ ఎడబాటుని బ్రతికిఉన్నవాళ్ళు, చచ్చిన వాళ్ళూ ఇద్దరూ కోరుకుంటేనే జరుగుతుంది. ”
“తాము ఎక్కడ సాయపడలేరో అక్కడ దిగులుపడి తమ కర్తవ్యం తీర్చుకున్నామని సంతుష్టి పడతారు మానవులు. ”
“వూరికే వాంఛిస్తారు కానీ, తమ అర్హతలని తల్చుకోరు మనుష్యులు”
“ఈ శరీరమూ ఈ ఇంద్రియాలే చాల ఇరుకు. వాటి వెనుక ఆ మనసు.. ఇంత స్పష్టమైన విశాలత్వంలో ఇన్ని చీకట్లు మూలలూ ఎలా కల్పించుకోగలుగుతోందో నీ మనసు అని జాలి పుడుతుంది.”
“మనసుకి పూర్తిగా అర్థం కాని విషయాలు మాటల్లోకి తీసుకొస్తే అవి అబద్ధాలవుతాయి కూడానూ. ఆ బలవంతం వల్ల”
“మనకి అర్థం కాని సత్యమే సమస్య. బాధ అంత బాధ కాదు. బాధ కలుగుతుందనే భయమంత. ఆ భయం వల్ల జాగ్రత్త. జాగ్రత్తే గొప్ప బంధం. అసలు బాధే అది. ఆ జాగ్రత్త మనసుని కిందకు లాగక పోతే, అసలు బాధలో అంత బాధ లేదు.”
-ఆహా! జీవిత సత్యాలు! ఒకే చోట, రొమాంటిసిజం, ఫిలాసఫీ, కొత్త కొత్త వ్యాఖ్యానాలు…. చలం నాకు తెగ నచ్చేశాడు ఈసారి మాత్రం.
“మా వెంట జ్ఞాపకాలను ఈడ్చుకుంటూ తిరగము. అందువల్లనే స్వేచ్ఛ అన్నది లేదు ఈ లోకంలో. ఎక్కడ భారమైతే అక్కడే ఆ స్థితిని వదిలి సుఖంలోకి వెడతారు అక్కడ.” – అందుకే వీళ్ళకి బాధలుండవు కాబోలు.
“ఈ దేహాన్నీ, మనసునీ నేను నీకోసం ధరించడం అంటే ఎట్లా ఉంటుందనుకున్నావు? నువ్వు ఏ విడువలేని ప్రియురాలి కోసమో గాలీ కాంతీ లేని మురికికూపంలో వెళ్ళి నివశించాల్సి వస్తుందనుకో, ఈ విశాల సుందర దృక్పథం నుంచి ఈ ఆత్మతోనే కీటక శరీరంలోకి ప్రవేశించావనుకో, ఎట్లా అనిపిస్తుంది? అట్లా అనిపిస్తుంది నాకు.” ”
-అబ్బ! నేనైతే, పరమ నిర్జీవంగా suffocating గా ఉంది అని చెప్పి ఉందును. బాధకూడా ఇంతందంగా చెప్పొచ్చన్నమాట 🙂
“కల తరువాత మేలుకొన్నప్పుడు నిద్ర ముందు జీవితాన్ని ఎక్కడ వదిలావో, మేలుకొని ఆ కొనని అందుకోగలుగుతున్నావు కనుక, జీవితం నిజమైంది. నిద్రలో జరిగింది కల, అబద్దం అయింది. ఎందుకూ? కల జరిగిన తరువాతి కొనని అందుకోలేవు కనుక. మళ్ళీ ఈ జీవితం కొన అందకుండా ఎక్కడో మేల్కొన్న రోజున ఈ జీవితం కల కాదా?”
– అయ్య బాబోయ్! అద్భుతమైన ఇమాజినేషన్. జీవితం కొన అందకుండా ఎక్కడో మేల్కొన్న రోజున….. ఈ జీవితం కల కాదా…. ఎంత నిజం! జీవితం కొన అందకుండా పోవడం – అన్న ఊహే నా ఊహకి అందట్లేదిక్కడ.
ఏంటో, అంతా గందరగోళంగా ఉంది. వదలకుండా శారదగారి గొంతు నన్ను వెంటాడుతోంది. ఎప్పుడుబడితే అప్పుడు – “మనకర్థం కాని సత్యమే సమస్య”… “జీవితం కొన అందకుండా…” – అంటూ ఆ డైలాగులే గుర్తొస్తున్నాయి. “ఎక్కడ్నుంచి వచ్చావు?” “అక్కడ్నుంచి”…వెంటనే నవ్వులు. పురూరవుడిని తల్చుకుంటే జాలేస్తోంది. అఫ్కోర్సు, నాకు ఈ పుస్తకం చదివేవారందరి గురించీ కూడా బెంగగా ఉంది. అలా ఆ మాయలో పడి ఏమౌతారు? అని. ఇక్కడ ఆ “ప్రేమ”లో పడి గింజుకు కొట్టుకుంటున్నా కనుక, నాకు తెలుసు, ఈ పుస్తకం చదివితే ఏమౌతుందో!
మీరుగానీ చదివారంటే – ముఖ్యంగా నాటకం వినేసి చదివారంటే, ఇంకంతే. ఇలాగే ఆ డైలాగులు టైపు కొట్టుకుంటూ ఉండిపోతారు, రచన గురించో, రచైత గురించో రాయబోయి. ఐనా సరే, చదువుతా అంటే, ఇక ఎవరి ఖర్మకు ఎవరు భాధ్యులు? మీ ఫ్రెండ్స్ పని ఐపోయినట్లే!!
Naresh Nandam
అద్భుతం సౌమ్యగారూ,
చాలా రోజుల తర్వాత ఈమధ్యే పుస్తకం ఓపెన్ చేశాను.
(పుస్తకం.నెట్ మాత్రమే కాదండోయ్.. పుస్తకం కూడా!)
పురూరవుడు చాలా రోజులనుంచి చదవాలనుకుంటోన్న పుస్తకం. అయితే మీరన్నట్లు ముందు విని, తర్వాత చదువుతాను.
అభినందనలు.
varaprasad
amma chalakalanikigani janam chalanni telusukoledu,telusukoledu anekante nati rachayitalu chalanni janam chadivite tama rachanalanu evaroo chadavarane asooyato ayanno bootani chesaru,meelanti medavulake ayana ardamkavataniki antasamayam padite maa bontla paristiti emiti,………….prasad
పుస్తకం » Blog Archive » శారదా శ్రీనివాసన్ గారి జ్ఞాపకాల తోట నుండి..
[…] అప్పట్లో పరిచయం చేసిన చలం నాటిక ‘పురూరవ’ ద్వారానే నాకీవిడ గురించి […]
bhanu prakash
మీ వ్యాసం యెంథ బాగుందంటె ఇప్పతికి నాలుగు సార్లు ఆ డయలాగ్స్ ని చదువుకున్నాను అంటె మీ వ్యాసాన్ని కూడా , అలా మీ వ్యాసం పూర్తిచెసి ఫస్ట్ కామెంట్ చదవగానె అక్కడ “అద్భుతం” అని ఉంది, నిజంగా ఒక అద్భుతాన్ని అనుభవించిన ఫీలింగ్ , ఐనా చలమె ఒక అద్భుత కవితా భాండాగారం ఇంకా ఆయన నుంచి అద్భుతాలు రాకా ఇంకెమొస్తై , తాజ్మహల్ కి పొలిష్ కొట్టి ఎగ్జిబిషన్ లొ పెట్టినట్టూ మీ రివ్యూ సూపర్ ఇంతకుమించి మాటలు రావడంలెదు ఈ పుస్తకాన్ని పరిచయం చెసినందుకు క్రుతజ్గ్నతలు , మా శ్రీకాకుళం విశలాంధ్ర బుక్ హౌస్ లొ ఎన్ని సార్లు అడిగినా ఈ బుక్ దొరకలెదు మీరు పరిచయం చెసి కస్త పుస్తక పుణ్యం చెసిపెట్టారు
shivaratri sudhakar
hai, sowmya garu.
puroorava naatakam gurinchi meeru varninchina varnana chaalaa adbhithangaa undi.meeku kooda chalam shaili vachhesinatluni.
కత్తి మహేష్ కుమార్
జాన్ హైడ్ కనుమూరి గారూ,
శారదా శ్రీనివాసన్ గారు హిమాయత్ నగర్, రోడ్ నెంబర్ 10 లో ఉంటారు. నాకోసారి ఫోన్ చెయ్యండి. మనం కలిసేవెళ్దాం.
Sreenivas Paruchuri
నేను పైన చెప్పిన వ్యాసమిక్కడ:
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/2-3/memories
నిజానికి “ఈమాట”లో కూడా ఈ లింక్ ఇవ్వబడింది.
http://www.eemaata.com/em/issues/200811/1350.html
— శ్రీనివాస్
సుజాత
John Hide garu,
Or..you can get Sarada Srnivasan’s details in AIR, Hyd.
Sreenivas Paruchuri
రెండేళ్ళ క్రితం అనుకుంటాను … ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో “జ్ఞాపకాలు” శీర్షిక క్రింద గొరుసు జగదీశ్వరరెడ్డిగారు ఆవిడతో ఒక ఇంటర్వ్యూ చేశారు. దానిలో శారదగారి mobile phone number కూడా వుంది. — శ్రీనివాస్
జాన్ హైడ్ కనుమూరి
ఈ శారద గార్ని కలవాలని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్ఖ రాసివుంటే రామకోటికన్నా పెద్దదయ్యేదేమో! మళ్ళీ మీరు గుర్తు చేసారు. నా యవ్వనపు రోజుల్లోని రేడియో నాటకాలు, పరిణతి చెందిన తర్వాత చదివిన చలం రచనలు గుర్తుచేసారు. శ్మార్గాన్ని ఆరదగాని కలిసే మార్గాన్ని ఎవరైనా చెబుతారా.??
john000in@gmail.com
కత్తి మహేష్ కుమార్
“చలాన్ని అర్థంచేసుకోకు, అనుభవించు” అని నేను ఎప్పుడూ చెప్పేమాటల్ని కొందరైనా అర్థంచేసుకున్నందుకు ఆనందంగా ఉంది.
varaprasad
sir simpple wordslo mee coment ohh superb,meelantivarivalle chalam inka b(r)atikunnadu.thanq sir
నిషిగంధ
చాలా బాగా వ్రాశారు!! నేను పుస్తకం చదవలేదు కానీ నాటకం మాత్రం పదే పదే విన్నాను (ఈమాట వారికి బోల్డన్ని కృతజ్ఞతలు).. శారద గారి నవ్వు, ఆవిడ గొంతులో ధ్వనించే ప్రేమ తీవ్రత నన్ను ఎప్పటికీ వెంటాడుతుంది!
‘ఆడ బాడీ లాంగ్వేజ్ ‘ ఇది అర్ధం కాలేదు 🙁
శివరామప్రసాదు కప్పగంతు
అద్భుతం.