సూర్యపుత్రి – “కవిరాజు”

రాసిన వారు: బొల్లోజు బాబా

*******************

suryaputriసూర్యచంద్రులు, తరువులు తుమ్మెదలు, పూలు పరిమళాలు, భూమ్యాకాశాలు, రేయింబవళ్లు….. ఇవే … ఈ పుస్తకం నిండా. ఇంతకు మించేమీ లేవు. బహుసా ఇంకేం కావలసి ఉంటుంది చిక్కని శుద్ద కవిత్వం వ్రాయటానికి. కవి అన్వేషణ ప్రకృతిలో అంతమైనపుడు పుట్టే కవిత్వానికుండే సార్వజనీనత జీవితమంత విశాలంగా, హృదయమంత లోతుగా ఉంటుంది. తెలుగు కవిత్వంలో వాదాలు ఉద్యమాలు తప్ప మరింకేముంటున్నాయి అన్న విమర్శకు “కవిరాజు” వ్రాసిన “సూర్యపుత్రి” కవితాసంకలనం మంచి సమాధానం.

ఈ సంకలనంలో మొత్తం102 చిట్టి చిట్టి కవితలున్నాయి. వీటిని నానీ, హైకూ లేక మినీ కవిత వంటి పేర్లతో పేర్కొనకపోవటం గమనార్హం. ఒక్కొక్కటి రెండు నుంచి పదిహేను లైన్ల మధ్య ఉండి చక్కటి ప్రకృతి దృశ్యాన్నో, ఓ జీవనసత్యాన్నో, మంచి పదచిత్రాన్నో ప్రతిబింబిస్తూ పరవశింపచేస్తాయి.

ప్రకృతిలోని వైవిధ్యాలు అనంతమైనట్లే దాన్నే వస్తువుగా తీసుకున్న ఈ కవిత్వం కూడా గొప్ప విస్త్రుతీ లోతు కలిగి ఉంది. ఒక వాక్య పరిపుష్టి కోసం, ఒక నూతన పదచిత్ర కల్పన కోసం ఎంతో గొప్ప అన్వేషణ, ఆలోచనల నిరంతర మధనం ఉంటే తప్ప ఇలాంటి ఉత్తమ కవిత్వం సిద్దించదు. సూర్యుడు అన్న పదం సుమారు పాతిక కవితలలో వచ్చినప్పటికీ ప్రతీ చోటా కొత్త అర్ధంలో, కొత్త కోణంలో ఆవిష్కరింపబడుతుంది. ఉదాహరణకు…

కిందపడి చిట్లి ఛిద్రం కాకుండా అందుకుని

ఆకులు ఆదరించిన మంచుబిందువుల్ని

ఎత్తుకొని సూర్యుడు అక్కున చేర్చుకొంటున్నాడు!

*******************

గాలిలో కదిలే మబ్బులు

స్వేదం తుడుచుకొని

సూర్యుడు విసిరేసిన జేబురుమాళ్లు

*******************

ఎవరో చల్లిపోయిన

చుక్కలన్నీ బొక్కి

తూర్పుకొండెక్కి కూస్తున్నాడు సూర్యుడు

లోకాన్ని మేల్కొలుపుతూ

– ఇక్కడ తీసుకున్న మూడు కవితల్లో; మంచుబిందువులను ప్రేమతో అక్కున చేర్చుకొనే దివాకరునిగా, మబ్బుల కర్చీఫ్ తో చమటలు తుడుచుకొనే మార్తాండుడిలా, చుక్కల్ని బొక్కి తూర్పుకొండెక్కి కూసే (కోడిపుంజును స్పురింపచేస్తూ) ఉదయార్కుని లా – సూర్యుడు మూడు రూపాలలో కనిపిస్తాడు. ఒకదానికొకటి పోలికే లేని విధంగా సృజన సాగటం “కవిరాజు” సౌందర్య దృష్టికి, సునిశిత పరిశీలనకూ నిదర్శనంగా భావించవచ్చు.

కొన్ని కవితలలో కనిపించే ప్రకృతి దృశ్యావిష్కరణ విశ్మయపరుస్తూంటుంది.

రంగు రంగుల వస్త్రాలు ధరించి సీతాకోకచిలుకలు

చిగురుటాకుల అద్దాల్లో సింగారాలు సరిచేసుకుంటూ

మైమరచిపోతూంటే…….

పక్కనున్న పువ్వులు తాజా తేనెను చీమలు జుర్రుకు

పోతాయని

చింతాక్రాంతమై చిన్నబుచ్చుకొంటున్నాయి.

-పై కవితలో “చిగురుటాకుల అద్దాల్లో” అన్న వాక్యం వద్ద నిగనిగలాడే లేజివుళ్లు గుర్తుకు వస్తాయి. ఇక చీమ జుర్రుకు పోతాయని పూవులు బాధ పడుతున్నాయనటం ఎంతటి గొప్ప ఊహ. తాముదాచుకున్న అందాల్ని తమ ఇష్ట సఖునికి అర్పించటంలో జరుగుతున్న ఆలస్యాన్ని, జరగబోయే ఉపద్రవాన్ని (చీమలు దోచుకుపోవటం), రమ్యంగా అక్షరబద్దం చేసాడు కవి.

అలానే మరో బుల్లికవితలో –

కంటకాలు పదిలంగా పేర్చి తాడి చెట్టు మొగలో

కాకి గూడు కట్టుకొంది.

అది, పాటై ఎప్పుడు తనమీద వాలుతుందోనని

చిగురుటాకుల వేదిక సిద్దం చేసి, మామిడి చెట్టు

ఎదురుచూస్తూంది.

– ఇక్కడ పాటై వాలటం అనే పాదం వద్ద కవిత లోతూ సొగసూ ఇమిడి ఉన్నాయి. తాడి చెట్టునుండి ఎగురుకుంటూ కాకిపిల్ల వచ్చి తనపై వాలాలని మామిడి చెట్టు సమాయుత్తమవటం విశ్వప్రేమకు సంకేతం కాదూ?

’నీలాకాశాన్ని ఎంత ఈదినా కొంగ తెల్లగానే ఉందని’ అంటారు ఇస్మాయిల్. ఈ కవిరాజు కూడా దాదాపు అదే భావాన్ని మరో కోణంలో వినూత్నంగా ఇలా అంటారు.

ఆకాశాన్ని కడిగిన

వర్షపునీరంతా చేరి

భూమ్మీది జలాశయాలు

నీలంగా మారిపోయాయి.

– వర్షం పడటానికి ముందు తూనీగల గుంపు సంచరించటం ఒక చక్కటి రమణీయ ప్రకృతిదృశ్యం. అదే విధంగా డబ్బు మూటలున్న (లేదా ఓ మంత్రిగారి) వాహనానికి ఎస్కార్టుగా పోలీసులు కలయతిరగటం మరో దృశ్యం. ఈ రెంటినీ ఓ పదచిత్రంగా మలచిన తీరు అద్బుతంగా అనిపిస్తుంది.

విహంగ వీక్షణలతో

తూనీగల తనిఖీలు

వరుణుడొస్తున్నట్లుంది

నీటి మూటలతో!

– ఈ సంకలనంలోని కవితలన్నీ ప్రకృతి చూపించే రమణీయ దృశ్యాలకు అక్షరరూపాలు. ఒక సంకలనంలోని అన్ని కవితలు ఒకే వస్తువుపై సాగటం, అదీ ఏమాత్రం పునరుక్త దోషం లేకుండా, చాలా చాలా అభినందించాల్సిన సంగతి. కవిత్వానికి కావాల్సిన క్లుప్తత ఉండాల్సిన స్థాయిలో ఉండటం వలన ఈ కవితలన్నీ అటు పలుచగానూ కాక ఇటు అస్పష్టతా పొరలు కమ్ముకోకుండా, హృద్యంగా ఉండి ఆనందింపచేస్తాయి.

కొన్ని చోట్ల అంత్యప్రాసల లౌల్యం (7, 47 పేజీలలో) అంతగా అతకలేదు.

కాలుష్య పరంగా ప్రకృతి దృశ్యవిధ్వంశాన్ని రెండు కవితలు మాత్రమే ప్రతిబింబించటం వాస్తవాలను కొంత తప్పించుకోవటమే.

ఈ పుస్తకానికి ఆచార్య రామవరపు గణేశ్వరరావు, డాక్టర్. యస్.టి.వి. రాజగోపాలాచార్యులు గార్లు ముందుమాటలు వ్రాసారు.

మొత్తం మీద ఈ కవితా సంకలనం ప్రకృతికి ఒక సుకవి ఎత్తిన హారతిలా భావించవచ్చు.

ఇజాలు, రాజకీయాలు, వాదాలు లేని చక్కని ఆహ్లాదకరమైన కవిత్వాన్ని ఇష్టపడేవారికి ఈ సంకలనం తప్పక నచ్చుతుంది.

పి.ఎస్: “కవిరాజు” అనేది కలంపేరు. అసలు పేరు: శ్రీ పి.ఎస్. ఎన్. రాజు. వీరు ఇదివరలో వెలువరించిన కవితాసంకలనాల పేర్లు: సూర్యరధం

1983, సూర్య ధ్వజం 1989, సూర్య కఠారి 1994, సూర్యాంశువులు 1996, సూర్యపుత్రి 2009. అన్ని సంకలనాలకు “సూర్య” నామం ఉపసర్గ గా ఉండటం విశేషం.


You Might Also Like

5 Comments

  1. బొల్లోజు బాబా

    మెహెర్ గారూ,
    థాంక్యూ.
    మీ ఊహ ఇంకా అందంగా ఉంది. బహుసా మీరే కవి ఊహకు దగ్గరగా ఉన్నట్లు ఇపుడు నాకూ అనిపిస్తుంది. ఈ కవితపై మరింత గౌరవం పెరుగుతూంది.

    కామేశ్వర రావు గారికి
    ఈ కవితలకు శీర్షికలు లేవండి.

    బొల్లోజు బాబా

  2. కామేశ్వర రావు

    “కంటకాలు పదిలంగా పేర్చి తాడి చెట్టు మొగలో” కవితలో నాక్కూడా మెహెర్ గారు చెప్పిన అర్థమే స్ఫురించింది. బాబాగారు, ఈ కవిత శీర్షిక ఏమిటి?

  3. మెహెర్

    బొల్లోజు బాబా గారు, పరిచయం బాగుంది.

    క్రింది కవితకు మీరిచ్చిన వివరణ విషయంలో నాదో అనుమానం:

    కంటకాలు పదిలంగా పేర్చి తాడి చెట్టు మొగలో

    కాకి గూడు కట్టుకొంది.

    అది, పాటై ఎప్పుడు తనమీద వాలుతుందోనని

    చిగురుటాకుల వేదిక సిద్దం చేసి, మామిడి చెట్టు

    ఎదురుచూస్తూంది.

    – ఇక్కడ పాటై వాలటం అనే పాదం వద్ద కవిత లోతూ సొగసూ ఇమిడి ఉన్నాయి. తాడి చెట్టునుండి ఎగురుకుంటూ కాకిపిల్ల వచ్చి తనపై వాలాలని మామిడి చెట్టు సమాయుత్తమవటం విశ్వప్రేమకు సంకేతం కాదూ?

    ఈ పంక్తుల వెనుక కవి ఊహించింది మీరనుకుంటుందేనా అని నా సందేహం. ఎందుకంటే నేను చిన్నప్పుడో కథ విన్నాను. కోకిలకు గుడ్లు పొదగడం చేతకాదనీ, కాబట్టి అది తన గుడ్లను తీసికెళ్ళి కాకి గూట్లో పెడుతుందనీ, కాకి వాటిని తన గుడ్లేనేమో అన్న భ్రమతో పొదిగి, పిల్లల్ని తన పిల్లలేనేమో అనుకుని సాకి, అవి కూయడం దాకా వచ్చేసరికి “కావ్ కావ్” అని గాక “కుహు కుహూ” అని కూసేసరికి నిజం తెలుసుకుని వాటిని బయటకి తన్ని తరిమేస్తుందనీ చెప్తారు. ఇది బాగా ప్రాచుర్యంలో వున్న పుక్కిటి కథే. ఇక్కడ కవి ఈ భావననే వాడుకుంటున్నాడనిపిస్తుంది. ఇక్కడ మామిడి చెట్టు కాకి కోసం కాదేమో ఎదురుచూసేది; కాకి గూటి నుండి వచ్చే కోయిల మామిడిపూత కోసం కుహుకుహూల పాటతో ఎప్పుడు తన మీద వాలుతుందోనని మామిడి చెట్టు చిగురుటాకుల వేదికతో ఎదురుచూస్తుందీ అన్నది దాని భావమేమో.

Leave a Reply