పుస్తకాభిమానం

రాసిపంపినవారు: లలిత

పుస్తకం వారు చూడండి ఎలా చదువరులను ఊరిస్తారో, మేము ఈ పుస్తకం చదివేశాం, ఆ పుస్తకం చదివేస్తున్నాం అని. చదివి ఊరుకోకుండా సమీక్షలు రాస్తుంటారు. “చదవండి మరి,” అని ఉసి కొల్పుతుంటారు. చదవక పోతే జ్వరమొస్తుందని కూడా భయమేస్తోందీ మధ్య, మాలతి గారిని చూసి.

ఇలా “చదవండి చదవండ”ని హోరెత్తిస్తుంటే, తెలుగు సాహితీ ప్రియులకి సుష్టుగా విందులేర్పాట్లు చేస్తుంటే, “పెద్దలకి మాత్రమేనా?” అని అడగటమే తరువాయి, “పిల్లల కోసమూ వస్తున్నాయి తీపి మిఠాయిలు,” అని వెంటనే బాలల సాహిత్యోత్సాహికులను ప్రోగు చేసి “ఫోకస్” ప్రకటించేశారు.
పిల్లలకు పుస్తకాలను పరిచయం చెయ్యడం గురించి చంద్రలత గారు చెప్పారు. పుస్తకాలకు పిల్లలను పరిచయం చెయ్యడం గురించి బుడుగోయ్ గారు చెప్పారు.  ఇలా తమ తమ బ్లాగుల్లో ఎందరో చెప్పి ఉంటే అవి ఎందరో చూడలేకపోయి ఉండవచ్చు.
నాకనుభవమైన మంచి విషయాలలో ఆంగ్లంలో ఉన్న బాలల సాహిత్య సంపద ఒకటి. అవును, అది అనుభవమే. ఆ పుస్తకాలు మనమూ పిల్లల్లా చదవడమూ, మళ్ళీ మళ్ళీ బొమ్మలు చూస్తూ పేజీలు తిరగెయ్యడమూ, పిల్లలు ఆ పుస్తకాలను ముచ్చటగా చదవడమూ, అడిగి చదివించుకోవడమూ, ఆ పాత్రలను గురించి ముచ్చటించుకోవడమూ, వాటిని అనుకరించడమూ, ఆట పట్టించడమూ అన్నీ, ఇంకా ఎన్నో, అనుభవైకవేద్యం.
తెలుగు దేశంలో ఉంటూ, తెలుగు కొన్నేళ్ళు  మొదటి భాషగా నేర్చుకుంటూ, తెలుగు మాధ్యమంలో చదివే తోబుట్టువులతో పెరుగుతూ ఉన్నా కూడా, నాకు తెలుగులో అటువంటి బాలల సాహిత్యం పరిచయం కాలేదు. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బాలజ్యోతి దాటి నాకు ఎక్కువ తెలియదు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. పిల్లల పత్రికల విషయంలో మాత్రం, తెలుగు, ఆంగ్లంలో అప్పట్లో వచ్చిన Champak, Tinkle వంటి వాటితో కలుపుకుని నాకు మన పిల్లల పత్రికలే బహు బాగా నచ్చాయి, ఈ నాటికి కూడా. National Geographic వారివి బావుంటాయి. కాని అవి ఒకే విషయం పై ఉంటాయి. ఈ విషయంలో కూడా ఇంకా ఎవరైనా అభిప్రాయాలు పంచుకుంటే బావుంటుంది.

ఇక పేరుకి కామిక్స్ ఐనా, అమర చిత్ర కథ వారివి పాఠ్యపుస్తకాలే అనొచ్చు, చరిత్రనూ, ప్రముఖుల జీవిత చరిత్రలనూ, పురాణేతిహాసాలనూ పరిచయం చెయ్యడంలో. తెలుగులో కూడా వచ్చేవేమో కాని, ఆంగ్లంలోనే ఎక్కువ బావుంటాయి. తెలుగులో మన పౌరాణిక సినిమాలు, చందమామ ఉన్నాయనుకోండి. ఆంగ్లంలో, ఆదివారం పిల్లల సెక్షను (Dennis the menace,….) మొదలుకుని, Phantom, Mandrake,…..TinTin, ఇంకా పెద్దయ్యాకనుకోండి, Asterix కామిక్కులు బాగా గుర్తున్నాయి.

జ్ఞాపకాలు తవ్వితే ఇంకా గుర్తుకు వస్తాయేమో, కానీ స్పష్టంగా తెలియచెప్పడానికి చాలా సమయం కావల్సి వస్తుంది. ఐనా, ఇంకా బాగా పరిచయం చెయ్యగల వారు చాలామందే ఉన్నారని నా నమ్మకం. వారు పుస్తకం వారి పిలుపునందుకుని ముందుకు వస్తారని నా ఆశ. అదీ కాక, నా ఉద్దేశ్యం కూడా వేరే. అది, తెలుగులో పిల్లల కోసం ఇప్పుడు ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి, ఎలాంటివి ఉంటే బాగుండును, అని.

పంచతంత్రం కథలు, హరివిల్లు, పిల్లల కోసం తెలుగులో నేను ఇంతవరకూ చూసిన వాటిల్లో నాకు చాలా నచ్చినవి. ఇవి నాకు నచ్చడానికి ముఖ్య కారణం వాటిలోని భాష. కష్టపడిపేర్చినట్లు కాకుండా సులభంగా చదువుతుంటే అలా దొర్లిపోయేలా ఉంటుంది. మాట్లాడుకోగల భాషే, కానీ పొందికగా ఉంటుంది. చదవడానికి బావుండే భాషే,కానీ కష్టంగా ఉండదు. పంచతంత్రం కథలు ఎలాగూ పిల్లలను ఆకర్షిస్తాయి. హరివిల్లులో పాటలు మనలనీ పిల్లలని చేస్తాయి. హరివిల్లులోనైతే రచయిత ఊహలూ, బాపు గారి బొమ్మలూ ఇంకొన్ని కారణాలు. పంచతంత్రం కథలో బొమ్మలు కూడా బావున్నాయి, రంగులు లేకపోయినా. బాలానందం పాటలు, నాటికల పుస్తకాలు కొన్నాను. అప్పట్లో ఆ కార్యక్రమాలను follow అవుతూ వినడానికీ, ఇప్పుడు చదవడానికీ చాలా తేడా ఉంది. అందులో “నాన్నా పులి” గేయ కథ చాలా బావుంది. నాకెందుకో ఆంగ్ల కథల తెలుగు అనువాదాలు అంతగా నచ్చలేదు. తెలుగు పుస్తకాలకు దగ్గరగా ఉన్న వారు, పిల్లల  అభిరుచిని ఎరిగిన వారు, తెలుగు పుస్తకాలను వారికి బాగా పరిచయం చేసే వారూ, ఇంకా వివరంగా బోలెడు పుస్తకాలను గురించి వ్రాయగలరని ఆశిస్తున్నాను.

పట్టు పువ్వులు పిల్లల ఊహలు, అనుభవాలూ, ఆలోచనల సమాహారం. అంతే అయినా ప్రత్యేకమే. కాని, ఈ పిల్లలు బడికి రాగలగడమే వారికి ఒక గొప్ప అవకాశం. నా చేతికి ఈ పుస్తకం అందే నాటికే బడిని వదిలెయ్యాల్సి వచ్చిన వాళ్ళెందరో. వారందరికీ అవకాశం కల్పించి, ప్రోత్సహించి, వారి భావాలని అక్షరాలలో పెట్టించి అందించారు చంద్రలత గారు. ఆమే పరిచయం చేసిన “Going to School in India” పుస్తకం చదువుతుంటే నాకు “పట్టుపువ్వులు” కూడా ఆకర్షణీయంగా, రంగుల బొమ్మలతో తిరిగి ముద్రిస్తే బావుంటుంది కదా అనిపించింది. పిల్లలకు దగ్గరౌతుందని. ఇంతవరకూ మా పిల్లల చేత ఒక్కటి మాత్రం పరిచయం చేయించగలిగాను తెలుగు4కిడ్స్ లో. (ఇదే పేజీలో హరివిల్లు పాటలు కూడా కొన్ని చూడగలరు.) ప్రైవేటు పాఠశాలలలో ఐనా ఎన్ని బడులలో గ్రంథాలయాలు ఉంటున్నాయో తెలియదు. ఉన్న వాటన్నింటిలోనూ ఇటువంటి పుస్తకాలు ఉండాలి. వాటిని పిల్లలకు పరిచయం చెయ్యాలి.

ఇక్కడ బడులలో library time ను చాలా బాగా వినియోగిస్తారు. పిల్లలకు మంచి మంచి కథలు చదివి వినిపిస్తారు. ఒకటో తరగతిలోనే Dewey Decimal Classification పరిచయం చేస్తారు, పిల్లలు అర్థం చేసుకుంటారు కూడా. వివిధ పండగలూ, ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకునే రోజుల్లో వాటికి సంబంధించిన పుస్తకాలను ప్రత్యేకంగా బయటకు తీసి పెడతారు. ఒక్కో president గురించి, వీలైనంత వరకు ఒక్కో దేశం గురించి, ఒక్కో సంస్కృతి గురించి కనీసం ఒకటైనా పుస్తకం ఉంటుంది. పిల్లలు వయసు / పఠనా శక్తిని బట్టి ఎక్కువ బొమ్మలు, కొన్నే పదాలున్న పుస్తకాలు (picture books) నుంచి  ఎదుగుతూ చిన్ని chapter books నుంచి మెల్లగా పిల్లల నవలలూ, రక రకాల series పరిచయం చేస్తారు. రెండో తరగతిలోనే genre పరిచయం చేస్తారు.  నిఘంటువులు కూడా పిల్లల వయసు, తరగతికి తగ్గట్టు వివిధ levels లో ప్రచురిస్తారు. పిల్లల కోసం వివిధ రంగాలలోప్రముఖుల (art నుండీ astronomy వరకూ) గురించి రాసిన పుస్తకాలు కూడా  సులభంగా ఆకర్షణీయంగా అందుబాటులో ఉంటాయి. పిల్లలకు ఆసక్తి ఉన్న విషయమేదైనా, కథలైనా, facts ఐనా, ఆటలైనా, art ఐనా, religion ఐనా,  ఇంకేదైనా, తప్పనిసరిగా వారి ఆసక్తికి తగ్గ పుస్తకాలు వారి వయసుకి తగినవి దొరుకుతాయి. ఇవన్నీ చూస్తూ నాకు మనం మన పిల్లలకి, మన రాష్ట్రంలో, తెలుగును, రాష్ట్ర, దేశ, చరిత్రను, ఇతర విషయాలను, ఏ పద్ధతిలో పరిచయం చేస్తున్నాము అని కుతూహలం కలిగింది. అది ఈ నెల “ఫోకస్” వల్ల తీరగలదని అనిపిస్తోంది.

అందరూ పంచుకునే ఆసక్తికరమైన విషయాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను.

You Might Also Like

7 Comments

  1. Telugu4kids

    Thanks again.
    “సమకాలీన జీవితాల్ని ప్రతిబింబిస్తూ మనక్కావాల్సిన పుస్తకాల్ని మనమే రాసుకోవాలి బహుశా.”
    And that’s but natural too.
    There are writers, readers / buyers and publishers here.
    There are those who are not tired of demanding 🙂

    “అప్పటితో పోల్చుకొంటే ఇప్పటి పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. రకరకాల పుస్తకాలు, యానిమేషన్ డివిడిలు దొరుకుతున్నాయి.” This is where I wish there are more articles in this month’s focus. from those who have close access to such.

    I tried and tried and tried and bought and after finding success just about a tenth or less, stopped about a couple years back. Now I’m taking a chance with Chandamama. That my kids are a bit older and Chandamama has been responding and trying best to meet our expectations are also reasons for that.

    So, I am really interested in knowing the latest from those closest to books. The situation does sound better, going by some blog posts. It is by no means completely addressed. But that just means opportunity for enthusiasts 🙂

  2. జంపాల చౌదరి

    2002-2004 మధ్యలో విజయవాడ పుస్తక ప్రదర్శనలో పిల్లల పుస్తకాలకోసం చూస్తే అస్సలేమీ కనిపించేవి కాదు. ఒకసారైతే వికాస విద్యావనంవారు అమ్మకానికి కాకుండా పిల్లల పుస్తకాల ప్రదర్శనకోసమే ఒక స్టాలు పెట్టారు. అప్పటితో పోల్చుకొంటే ఇప్పటి పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. రకరకాల పుస్తకాలు, యానిమేషన్ డివిడిలు దొరుకుతున్నాయి.

    ఐతే ఒక ముఖ్యమైన ప్రశ్న: వివిధ వయసుల్లో పిల్లలకి వారి వయసుకూ, పరిణతికీ సరిపడేట్టు పుస్తకాలు ఉన్నాయా? లేవని నా అనుమానం (ఒకప్పుడు నమ్మకం; ఇప్పటి పరిస్థితి స్పష్టంగా తెలీదు). అక్షరాలు గుర్తుపట్టటానికి అవసరమైన అక్షరాల పుస్తకాలు (alphabet readers) దగ్గరనుంచి అప్పుడే మాటలు చదవటం నేర్చుకొంటున్న వారికి, ధారాళంగా వాక్యాలు చదవగల పిల్లలకు, కౌమారావస్థలో ఉన్న (adolescent) పిల్లలకు తగిన పుస్తకాలు మనకి ఉంటే, పిల్లలలో భాష పట్ల, పుస్తక పఠనం పట్ల, సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  3. కొత్తపాళీ

    Lalitha, Welcome back. Glad to know you are continuing your good work.
    తెలుగులో పిల్లల పుస్తకాలు ఇంకా చాలా అధోగతిలోనే ఉన్నాయి. మొన్న విజయవాడలో ఒక పుస్తకాల దొంతర చూశాను. ఎవరో వెలగా వెంకటప్పయ్య అనే ఆయన రాసినవి .. అనేక ప్రసిద్ధ శతకాలకి పిల్లలకర్ధమయ్యే రీతిలో అర్ధ తాత్పర్యాలతో .. పుస్తకం కాగితం అచ్చుక్వాలిటీ, కవరు బాగున్నాయి కానీ ఆర్టువర్కు, రాసిన భాష చాలా పేలవంగా ఉన్నై. వేరే షాపుల్లో నాకు కనబడిన పిల్లల పుస్తకాలు ఎంతసేపూ అక్బర్ బీర్బల్ కథలు, పంచతంత్రం కథలు .. లేదా పౌరాణిక గాథలు. ఇవే. నీతి కథ కాని పుస్తకాలేవీ పిల్లలకి దొరకవా అని మొన్ననే ఒక మిత్రుడు ఆక్రోశం వెలిబుచ్చాడు. సమకాలీన జీవితాల్ని ప్రతిబింబిస్తూ మనక్కావాల్సిన పుస్తకాల్ని మనమే రాసుకోవాలి బహుశా.

  4. తెలుగు4కిడ్స్

    అందరికీ ధన్యవాదాలు. మంచి పుస్తకం వారి గురించి చాలా చదువుతున్నాను, బ్లాగుల్లో.
    వివరంగా వారి పుస్తకాలను ఎవరైనా పరిచయం చేస్తే బావుంటుంది కదా, ఈ నెల “ఫోకస్” దృష్ట్యా?
    తెలుగు పిల్లల పుస్తకాలకు దగ్గరగా ఉన్న వారు పిల్లలూ, పెద్దలూ ఇష్టపడే పుస్తకాలను గురించి వివరంగా చెప్తే బావుంటుంది కదా?
    కోతి కొమ్మచ్చి, శ్రీపాద వారి కథలు వాటి వంటి సమీక్షలు చూస్తుంటే నోరూరినట్లే అవుతుంది వెంటనే కొని చదివెయ్యాలని. ఆ విధమైన ఉత్సాహంతో పిల్లల పుస్తకాల గురించి ఎక్కువ మంది రాస్తారని ఎదురు చూస్తున్నాను. ఈ విషయంలో నేను అడిగేదే ఎక్కువ, చెప్ప గలిగే దానికంటే.
    ఆంగ్లంలో బాల సాహిత్యం నన్నెందుకు ఆకర్షించిందో వీలైతే ఇంకో వ్యాసంలో పంచుకుంటాను.
    పెద్ద వాళ్ళు చదివే పుస్తకాల గురించి రాసినంత ఉత్సాహంగా, పిల్లల పుస్తకాల గురించి కూడా రాయాలని నా ఆశ.
    ఇక్కడ రోజుకో పుస్తకం చదవమని చిన్నపట్నించీ ఇంటి పని ఇస్తుంటారు.
    తరగతిని బట్టి reading list ఇస్తారు, కనీసం వందకు పైగా ఉంటాయి ఒక్కో లిస్టులో.
    అలా కాక పోయినా, వారానికో తెలుగు పుస్తకమైనా చదివే అలవాటు చెయ్యాలనుకోండి, ఎటువంటి సలహాలు ఇస్తారు?

  5. మాగంటి వంశీ

    లలితగారూ

    వీలున్నప్పుడు ఈ లంకె చూడండి. మీ వెబ్సైటుకు ఉపయోగపడవచ్చు.

    http://manchipustakam.in/showcat.asp?cat=11

    ఇలాటి లింకులు, ఇంకా బోల్డు పుస్తకాలు కొన్ని కంప్యూటర్ అరల్లోనో , ఈమెయిలులోనో ఎక్కడో దాక్కునున్నాయి, దులిపి తియ్యాలి…..తీసాక పరిచయం చేస్తాలెండి…

    మీ “ఫోకస్” క్ఌప్తంగా ముగించేసారే! ఈ సబ్జక్టు మీద బోలెడు రాయగలిగే సత్తా వున్నవాళ్ళు ఇలా చేయటం బాలేదు. 🙂

    మాగంటి వంశీ

  6. మాలతి

    అయ్యో, మీలాటి ఉత్సాహవంతులు జొరాలు తెచ్చేసుకుంటే బాగోదండీ. అయినా మీసైటూ, ఈవ్యాసమూ చూస్తే, నాకా భయం లేదు లెండి. మీరు పిల్లలకోసం చేస్తున్న సేవను అభినందిస్తున్నాను. నేను కూడా బాల, చందమామ, బాలమిత్ర, బాలానందంతోనే పెరిగాను. మరొకసారి మీవల్లా, పుస్తకంవారివల్లా తలుచుకుంటున్నాను.

  7. vinay

    meeruలలితగారూ మీ వ్యాసం బాగుంది. నాకు తోచిన కొన్ని పుస్తకాల వివరాలు ఇక్కడ ఇస్తున్నాను.

    టాం సాయర్ – మార్క్ ట్వైన్
    హకల్ బెరీఫిన్ – మార్క్ ట్వైన్
    రాజు పేద – మార్క్ ట్వైన్

    నండూరి రమామమోహనరావు గారు అనువాదం చేసిన పై మూడు పుస్తకాలు నవోదయలో దొరుకుతాయి. ఇవేకాక మరికొన్ని పుస్తకాలు

    ప్రకౄతిపిలుపు – జాక్ లండన్ – అనువాదం కొడవటిగంటి కుటుంబరావు
    పంచతంత్రం కథలు – అనువాదం సహవాసి

    ఇవేకాక మంచిపుస్తకం వారు, జనవిజ్ఞానవేదిక వారు కొన్ని పిల్లలపుస్తకాలను ప్రచురించారు.

Leave a Reply