Interpreter of Maladies
రాసిన వారు: శ్రావ్య
***********
ఝుంపా లాహిరి రాసిన ఈ పుస్తకం పేరైనా కనీసం చాలా మందే విని ఉంటారు. క్లుప్తంగా రచయిత్రి గురించి చెప్పాలంటే, ఈవిడ భారతీయ తల్లితండ్రులకి లండన్ లో పుట్టారు, అమెరికాలో పెరిగారు. ఆవిడ రాసిన కథల సంపుటి ఈ పుస్తకం “Interpreter of Maladies”.
ఇందులో మొత్తం తొమ్మిది కథలు ఉన్నాయి. కొన్ని పాత్రలు ఇండియాలో ఉన్నటువంటివి, మరి కొన్ని అమెరికాలో. కొన్ని కధలు ఆ కధలో పాత్ర కథ చెప్తున్నట్టుగా రాస్తే, కొన్ని కథల్లో మరో వ్యక్తి చెప్తున్నట్టుగా రాశారు.
A temporary matter: మొదటి కథలో, ఒక జంట పెళ్ళి ఎలా ఫెయిల్ అయిందో, ఆ దారి తీసిన పరిస్థితులు (జంటకి చనిపోయిన బిడ్డ పుట్టటం వల్ల వాళ్ళిద్దరి వ్యథ) , ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వారి ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్, ఎమోషనల్ గా దగ్గరవ్వాల్సిన టైంలో ఒకరికి ఒకరు ఆ సపోర్టు ఇచ్చుకోకుండా ఎలా దూరమయ్యారో, ఇవన్ని narrate చేసారు. వాళ్ళకి ఒక ఐదు రోజుల పాటు రాత్రిళ్ళు కరెంటు కాసేపు ఉండదు అని నోటీసు వస్తుంది. ఈ నోటిసు మీద “టెంపొరరీ” అని ఉంటుంది. ఐతే, ఈ కరెంటు లేనప్పుడు ఈ జంట చాలా కాలం తరవాత మనసులో మాటలు, confessions చెప్పుకోటం మొదలుపెడతారు. ఆ ఐదు రోజుల్లో భర్త కి కొద్దిగా హోప్ వస్తుంది. ఫెయిల్ అయిపోతున్న బంధం రిపైర్ ఔతుందేమో అన్నట్టుగా కాస్త అనిపిస్తుంది. కాకపోతే ఆ hope టెంపొరరీయే , వాళ్ళ పెళ్ళి కూడా temporary matter గానే కథ ముగుస్తుంది.
When Mr.Pirzada came to dine: ఈ కథ ఒక చిన్న పిల్ల చెప్తున్నట్టుగా రాసారు. ఈ కథ వారి ఇంటికి వచ్చే ఒక పరిచయస్తుడి గురించి. ఈ అమ్మాయి తల్లితండ్రులు భారతీయులు – కాని ,అమెరికా లో నివసిస్తున్నవారు. కథలో వారి ఇంటికి వచ్చివెళ్ళే వారి తల్లితండ్రుల స్నేహితుడు కూడా భారతీయుడనే అనుకోవటం, అతను వారి దేశస్తుడు కాదనీ, అతనిది ఢాకా అని , అతని కుటుంబం అక్కడే ఉంది అని తండ్రి చెప్పగా తెలుసుకుంటుంది. ఆ వ్యక్తి, తన తల్లితండ్రులు ఒకే భాష మాట్లాడి, ఒకే లాగా కనిపిస్తూ , ఒకే రకమైన తిండి తింటున్నప్పుడు అతను వేరే దేశస్తుడు ఎందుకు ఔతాడో ఆ చిన్న పిల్లకి అర్థం కాకపొవడం ఇవ్వన్ని పదేళ్ళ పిల్ల perspective నుంచి narrate చేసారు. అతను కుటుంబం నుంచి దూరం గా ఉండటం వల్ల, అతను తన ఏడుగురు పిల్లల్ని తన భార్యని అవుతున్నాడు అని వారి మాటల ద్వారా ఈ అమ్మాయి తెలుసుకోటమే కాక ఢాకా లో యుధ్ధ వాతావరణం వల్ల వాళ్ళ సమాచారం ఏమీ తెలియక ఇతను పడే ఆందోళన ,వారు క్షేమం గా ఉండాలి అని ఈ అమ్మాయి కూడా అనుకోవటం, ఆ విషయం ఎలా తెలపాలో తెలీక, రోజూ తాను పడుకునే ముందు అతను తన కోసం తెచ్చే క్యాండీ తిని వారి కోసం ప్రార్థించటం కథలో రాసారు.
Sexy: ఈ కథ ఒక అమెరికన్ అమ్మాయి, ఒక పెళ్ళైన ఇండియన్‍తో సంబంధం గురించి. ఆ సంబంధం inappropriate అని ఆ అమ్మాయి యే రకం గా రియలైజ్ ఔతుంది అనేది parallel గా రన్ అయ్యే విషయాల ద్వారా రచయిత్రి తెలిపారు. కథలో అమెరికన్ అమ్మాయికి ఇండియా గురించి తన పెద్దగా తెలియదు. తన ఆఫిసులోనే పని చేసే లక్ష్మి ద్వారా ఆమె కజిన్ కుటుంబం లో ఇష్యూస్, ఆ కజిన్ ని , కజిన్ కొడుకు ని కలవటం ద్వారా తన లైఫ్ లో ఆ ఇండియన్ అతనితో తన సంబంధం తో అన్వయించుకుని ఎలా ఆ సంబంధం కి fullstop పెడుతుంది అనేది ఈ కథలో బాగా narrate చేసారు.
Mrs. Sen’s : ఈ కథ లో ఒక గృహిణి ఒక పదకుండేళ్ళ అబ్బాయి ని బేబీ సిట్టింగ్ చేస్తూ ఉంటుంది. అమెరికాలో ఉన్నప్పటికీ ఆవిడ అలవాట్లు ఇండియాలో లానే ఉంటాయి. ప్రతి రోజూ తన కోసం మిసెస్ సేన్ వెయిట్ చేయడం, కేరింగ్ గా చూస్కోటం వల్ల అబ్బాయి కూడా ఆవిడ దగ్గర అలవాటు అయిపోతాడు త్వరగా. తన రోజూ వారి పనులు, కూరలు తరుక్కోటం, వండే విధానం, వారు ఉండే ఇల్లు, ఆవిడ బట్టలు ఇవి అన్ని వర్ణిస్తారు కథలో. ఆవిడ తన బంధువుల్ని ఇండియాని బాగ మిస్స్ అవుతూ ఉంటారు. ఈ పిల్లాడితో తన మనసులో భావల్ని పంచుకుంటూ ఉంటారు. అమెరికా లో లైఫ్ కి ఆవిడ ఎంతకనీ అలవాటు పడదు. కార్ డ్రైవింగ్ నేర్చుకోమని భర్త చెప్పినా ఈవిడ కి అంతగా ఆసక్తి ఉండదు. మాట్లాడటానికి దగర్లో లేని బంధువులు, అలవాటు లేని కొత్త దేశం, నిత్యం బిజీ గా ఉండే భర్త, ఫోర్స్ఫుల్ గా నేర్చుకోవాల్సిన కొత్త అలవాట్ల వల్ల ఆవిడలో helplessness – బహుశ, technology అంతగా లేని రోజుల్లో ఇలానే ఫీల్ అయ్యేవారేమో సాంప్రదాయానికి బాగా అలవాటైన వాళ్ళు అనిపించింది.చివరకి భర్త బలవంతం వల్ల ఓ రోజు ఈ పిల్లాడు ఉండగా డ్రైవ్ చేసినప్పుడు accident అవ్వటం, దాని వల్ల ఇంక పిల్లాడి తల్లి మానిపించటం. అతను ఈవిడ ని మిస్స్ అవడం చెప్తూ కథ ముగుస్తుంది.
A Real Durwar : ఈ కథ లో ఒక పెద్దావిడ ఒక బిల్డింగ్ లో మెట్లు అవీ శుభ్రపరుస్తూ అక్కడే ఉంటూ ఉంటుంది.ఒక్కప్పుడు బాగా బతికిన కుటుంబమనీ ఇప్పుడు పరిస్థితులు ఇలా అయ్యాయి అనీ అడిగిన వారికి అడగని వారికి కూడ చెప్తూ ఉంటుంది. ఎప్పుడూ అక్కడే ఉంటూ కొత్త వారెవరైన వస్తే ఎవరు, ఏంటి అని గదమాయించి అడగటం, కనిపెట్టుకుని ఉండటం చేస్తూ ఉండేది. తన తో ఎప్పుడూ బానే ఉండే ఆ జనమే, ఒకసారి అనుకోకుండా బిల్డింగ్ లో ఐన దొంగతనం ఈవిడ అజాగ్రత్త వల్లే ఐందనీ, తన పని తాను సరిగ్గా చేయలేదనీ నిందించి పంపేస్తారు. ఉన్నన్ని రోజులు, ఎవరూ ఈయని ఉద్యోగం ని కనిపెట్టుకుని చేసినా చివరకి ఆ విధం గా ఆవిడని పంపేయడం..మనుషుల వైఖరి ఈ కథలో అంశం.
This Blessed House : కథలో ఒక కొత్త ఇంట్లోకి ఓ భార్యాభర్తా మారతారు. ఈ కథలో భార్య పాత్ర చిన్న చిన్న విషయాలకి ఆనందపదే అల్పసంతోషిలా చెప్పటం జర్గుతుంది. భార్య చేసే పనులు భర్త కి చిన్నపిల్ల చేష్టల్లాగా కూడా అనిపిస్తూ ఉంటాయి.ఆ ఇంట్లో వీళ్ళకి జీసస్ కి మేరీమాతకి , క్రిస్తియానిటీకి సంబంధించిన వస్తువులు వీళ్ళకి దొరుకుతూ ఉంటాయి. వీరు హిందువులు కావటం వల్ల భార్య ఆ వస్తువులని ఇంట్లోనే ఉంచటం , పైగా ఇల దొరకడాన్ని ట్రెజర్ దొరికినట్టుగా ఆనందపడటం ఇవేవి భర్త కి నచ్చవు. పైగా ఇంటికి ఎవరినైన వచ్చినప్పుడు ఆ వస్తువులు అన్ని చూసి ఏం అనుకుంటారు అని అంటూ ఉంటాడు భర్త. ఆ వస్తువులన్ని పారేస్తానని బెదిరిస్తూ ఉంటూనే చివరకి తన భార్య ఇష్టానికి విరుద్దం గా చేయకూడదన్నట్టుగా నిర్ణయం తీస్కున్నట్టుగా కథ ముగుస్తుంది.
The Treatment of Bibi Haldar : ఈ కథలో ప్రధాన పాత్ర కి ఏదో అంటుపట్టని రోగం ఉన్నట్టుగా సాగుతుంది. ఈ అమ్మాయి తన చుట్టాలతో పాటు ఉంటూ వారికి సాయం చేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు అమ్మాయి అనారోగ్యం ఎలా కుదురుతుంది అని ఎవరికి తోచిన సలహా ఇవ్వటం, చివరకి అమ్మాయి కి పెళ్ళి చేస్తే బాగుంటుంది అని ఎవరో చెప్పటం కాని బంధువులు ఈ పిల్ల కి పెళ్ళి చేయడానికి ఇష్టపడకపోటం, చేద్దమని అనుకున్నా కూడ చేస్కోటానికి ఎవరూ ముందుకి రాకపోటం, దాని వల్ల ఈ అమ్మాయి బాగా డిప్రెస్స్ అవడం ఇలా సాగుతుంది. చివరకి ఆ అమ్మాయిని వదిలేసి వాళ్ళ చుట్టాలు వారి దారిన వెళ్ళాకా , అనుకొకుండా ఎలానో ఈ పిల్ల గర్భవతి అవడం, పిల్లాడ్ని కని, ఆ చుట్టాలు వదిలేసిన వ్యాపారమే చేస్కుంటూ బిడ్డని సాకుతూ ఉండడం ద్వారా తన అనారోగ్యం అంతా పోయినట్టుగా కథ ముగుస్తుంది. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళలో నిస్సహాయతని ,అలానే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా ఉపాధి వచ్చి ఒక బాధ్యత ఉన్నప్పుడు అదే మహిళ లొ వచ్చే మార్పు ఈ కథ సారాంశం.
Interpreter of Maladies: ఈ కథ ఒక టూర్ గైడ్ , ఒక కుటుంబానికి మధ్య జరుగుతుంది .ఈ కుటుంబంలో ఓ భార్యాభర్త , వారి ముగ్గురు పిల్లలు. టూర్ గైడ్ కి భార్యభర్త ని చూస్తే , ఏదో ఎవరి లోకం లో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తారు తప్ప , వారి మధ్య ఏ మత్రం connection ఉన్నట్టు అనిపించదు. కోణార్క్ టెంపుల్ కి వెళ్తూ దారి మధ్యలో వీళ్ళని వారి గురించి అడుగుతూ, తన గురించి చెప్తూ మాటల్లో తాను ఇదివరకు ఒక దాక్టర్ దగ్గర పని చేసేవాడినని్, ఆ డాక్టర్ కి రోగులందరి భాష రానందువల్ల వీళ్ళ బాధ ఏదో తెలుసుకుని అది డాక్టర్ కి తర్జుమా చేసి చెప్పేవాడినని టూర్ గైడ్ చెప్తాడు. అది విని ఏమైన అలా జరిగిన సంఘటలని చెప్పమని మిసెస్ దాస్ అడుగుతుంది . ఆవిడ తన గురించి అలా ఇంటరస్టు చూపించడం కొద్దిగా ఎక్ష్జైటెడ్ గా ఫీల్ ఔతాడు. దారి మధ్యలో ఆగినప్పుడు ఫోటోలు తీస్కుంటూ, కాపీలు టూర్ గైడ్ కి కూడా పంపడానికి మిసెస్ దాస్ అతని అడ్రెస్ అడుగుతుంది.దాంతో ఇతను ఆవిడతో ఆ రకంగా స్నేహం ఏర్పరుచుకోవచ్చని ఊహల్లోకి వెళిపోతాడు. మిసెస్ దాస్ ఆవిడ భర్తతో నిర్లిప్త వైఖరి,టూర్ గైడ్ కి అతని భార్యకి మధ్య ఏమీ ఎమోషనల్ ఎటాచ్మెంట్ లేకపోటం కథలో ఇక్కడ కనిపిస్తుంది. తన భార్యే ఎప్పుడూ తనని , తన జాబ్ ని పొగడకపోవడం, ఇక్కద మిసెస్ దాస్ తనని మెచ్చుకోవడం వల్ల, అలాగే మిసెస్ దాస్ కూడా పెద్దగా మిస్టర్ దాస్ తో ఇష్టం గా ఉన్నట్టు లేకపోవడం వల్ల, అతనికి మిసెస్ దాస్ అంటే ఆసక్తి మొదలైనట్టు అనిపిస్తుంది. వీరు ఎప్పుడు మళ్ళి తిరిగి వెళ్ళి ఆ ఫోటోలు పంపిస్తారు, ఎప్పటినుంచి తనకి మిసెస్ దాస్ కి అలా స్నేహం మొదలవ్వచ్హ్హు అని ఈయన ఊహల్లో ఉంటాడు. ఇలా ఉండగా ఒక చోట భర్తా పిల్లలు దిగగా మిసెస్ దాస్ కార్ లో ఉండిపోయి అప్పటిదాకా ఎవరికీ తెలీని నిజాన్ని టూర్ గైడ్ కి confess చేస్తుంది. కాని తనకి ఎందుకు చెప్పిందో అతనికి అర్థం కాదు. అతను పూర్వ ఉద్యోగం లో ఇలా ఇతరుల బాధలని తెల్సుకుని వాళ్ళకి interpreter గా చేసినందుకు, అతను తన బాధ , guilt ని విని ఓదారుస్తాడు, స్వాంతన చెందుదాం అని మిసెస్ దాస్ ఆశిస్తుంది. కాని ఆమె గురించి వేరే రకమైన ఊహల్లో ఉన్న అతను ఆ విధంగా react అవలేకపొతాడు. సరిగ్గా అప్పుడే మళ్ళి ఫోటో తీస్కోవాలి అనుకోటం, ఏ పిల్లాడి గురించైతే మిసెస్ దాస్ చెప్తుందో అతను కోతుల వల్ల గాయపడితే మిసెస్ దాస్ పిల్లాడ్ని దగర తీస్కుని సముదాయించడం లో మొత్తానికి టూర్ గైడ్ అడ్రెస్ రాసిన పేపర్ ఎగిరిపోడంతో కథ ముగుస్తుంది.
The Third and Final Continent: ఈ కథ ఒకతను ఇండియా నుంచి లండన్ వెళ్ళి అక్కడ చదువుకుని, అమెరికా లో లో ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు అతని అనుభవాలు, ఆలోచనలు , ఒక కొత్త దేశం లో అతను ఎలా అలవాటుపడ్డాడు, అలానే కొత్త భార్యతో ఎలా అలావాటుపడ్డాడు అని తనే చెప్పినట్టుగా సాగుతుంది.ఈ కథ ఎందుకనో ఎక్కువ touching గా అనిపించింది. బహుశా నేను కూడా స్వదేశం వదిలి చదువుకోటానికి వచ్చి కొత్త వాతావరణానికి అలవాటు పడటం అదీ చదివి కథతో relate చేసుకోడం వల్లనో ఏమో. ఇలా కొత్తగా ఎక్కడికైన వచ్చాక ఎన్నో సంవత్సరలు అయినప్పటికీ, మొదట్లో వచ్చి సెటిల్ అయిన ప్రాంతం ఇల్లు అన్నీ కూడా మనకి స్పెషల్ గా అనిపిస్తాయి. అలా గుర్తు ఉండిపొతాయి. వాటితో ఏదో అనుబంధం ఉన్నట్టుగా ఉంటుంది.కథలో కూడా అలానే చెప్తారు. ఆయన అద్దెకి ఉండే ఇంట్లో ఇంటి ఓన్నరు చాలా పెద్దావిడ. వందేళ్ళపైన ఆవిడకి వయసు అని ఇతనికి తెలిసాక ఆవిడ అంటే ఇంకా ఒక విధమైన గౌరవం పెరుగుతాయి. ఒకావిడ అలా ఒంటరిగా పిల్లల్ని ఎన్నో ఏళ్ళు కష్టపడి పెంచిన తీరు తెలుసుకుని అతనికి తన చిన్నప్పట్లో తన తల్లి , ఆవిడ అనారోగ్యం, నిస్సహాయత గుర్తు వస్తాయి.ఆవిడ వయసు తెలిసాక, ఆవిడతో ప్రతి సాయంత్రం కాసేపు కూచోడం, రోజూ ఒకటే విషయం మాట్లాడటం అతనికి విసుగనిపించేవి కావు. తన భార్య ఇండియా నుంచి రావడం, అతని responsibility అతను ఫీల్ అవ్వడం , అలానే పెళ్ళి చేస్కున్నప్పటికీ ఆమే తనకి చాల కొత్త అని అతని ఆలోచనలు, భార్య వస్తూనే అతనితో కేరింగ్ గా ఉండటం , ఇవ్వన్నిటి గురించి కథ సాగుతుంది. ఆమె వచ్చిన కొత్తలోనే ఓ సారి తాను అద్దెకి ఉండిన ఆ ముసలావిడ ఇంటికి తీస్కెళ్తాడు. ముసలావిడకి కూడా ఇతను అంటే చాల గౌరవం.అద్దె సమయానికి ఇవ్వడం, తనతో గౌరవం గా ఉండటం, అతను గౌరవం వ్యక్తపరిచే చిన్న చిన్న పనులు (అద్దె చెక్కు ఎక్కడొ పియానో మీద పెడితే, పెద్దావిడ నడిచి శ్రమ పడాల్సి వస్తుందని ,ఆవిడ చేతికి ఇవ్వటం లాంటివి చేయడం ద్వార అతని మంచి ప్రవర్థన పెద్దావిడని కూడా ఆకట్టుకుంటుంది.) ఇతని భార్య ని చూసి “perfect lady” అని compliment ఇస్తుంది పెద్దావిడ. అలా మెల్లగా భార్యకి తనకి మధ్య దూరం పోతూ ఉంటుంది. కొంతకాలానికి పెద్దావిడ పోయినట్టు న్యూస్పేపర్ లో చూసి ఇతను బాధపడగా భార్య ఓదారుస్తుంది. చాలా సంవత్సరాలు గడిచిపోయినా ఆ ఇంటితో తన గుర్తులు అతనికి అలానే గుర్తుండిపొయి తన కొడుకు కి కూడా అటు వైపు వెళ్ళినప్పుడల్లా చూపించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
రచయిత్రి ఇండియాలో ఉన్నది తక్కువే ఐనా,లేక ఆవిడ స్వతహాగా ఇమ్మిగ్రెంట్/నాన్ ఇమ్మిగ్రేంట్ కాకపోయినా చాలా డీటైల్ గా ఇండియన్స్ వి జీవన విధానం, వారి ఆలోచనలు, లైఫ్ స్టైల్ బాగా రాసారు అనిపించింది. చదవకపోతే తప్పకుండా చదవండి. చదివితే మీ అభిప్రాయం చెప్పండి.
(ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన మరో వ్యాసం ఇక్కడ)
Leave a Reply