ముంచుకొస్తున్న మహమ్మారి వంకాయ
వ్యాసం రాసిపంపినవారు: సి.బి.రావు
“దృశ్యా దృశ్యం” లో జలాలు, ప్రాజెక్టులు, జీవనోపాధికి వృత్తి మార్చుకోవలసిన ఆగత్యం కలిగించే ముంపుకు గురి అవుతున్న గ్రామస్తుల అవస్థలు,”చేప లెగరా వచ్చు” లో చేపల తిప్పల తర్వాత, చంద్రలత, రాబోతున్న బిటి వంకాయ తెచ్చే పర్యావరణ ముప్పు పై, తమ కొత్త పుస్తకం “వచ్చే దారెటు” లో బాణం సంధిస్తున్నారు.
సభికులకు స్వాగతం పలుకుతూ – ‘కథాసాహితి’ వార్షిక సంకలనం సంపాదకులు వాసిరెడ్డి నవీన్
“దృశ్యా దృశ్యం” లో జలాలు, ప్రాజెక్టులు, జీవనోపాధికి వృత్తి మార్చుకోవలసిన ఆగత్యం కలిగించే ముంపుకు గురి అవుతున్న గ్రామస్తుల అవస్థలు,”చేప లెగరా వచ్చు” లో చేపల తిప్పల తర్వాత, చంద్రలత, రాబోతున్న బిటి వంకాయ తెచ్చే పర్యావరణ ముప్పు పై, తమ కొత్త పుస్తకం “వచ్చే దారెటు” లో బాణం సంధిస్తున్నారు. ఈ పుస్తకావిష్కరణ జనవరి 29, 2010 శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్,బాగ్ లింగం పల్లి, హైదరాబాద్ లో ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.పి.ఎం .భార్గవ చేశారు. తొలుత ‘కథాసాహితి’ వార్షిక సంకలనం సంపాదకులు వాసిరెడ్డి నవీన్ సభకు విచ్చేసిన ఆహుతులకు స్వాగతం పలుకుతూ “వంకాయలంటే ఈ మధ్యనే వంకాయల మహోత్సవం జరిపిన జ్యోతి వలబోజు గుర్తుకొస్తున్నారు. “వచ్చే దారెటు” పుస్తకంలో సామాజిక, పర్యావరణ, శాస్త్ర విషయాలు” ఉన్నాయంటూ పుస్తక ఆవిష్కర్త, పద్మ భూషణ్ డా. భార్గవ ((Founder Director, Centre for Cellular and Molecular Biology; Scientist and Vice Chairman, National Knowledge Commission, writer of the book “Proteins of Seminal Plasma” published by John Wiley, New York) ను సభికులకు పరిచయం చేశారు.
చిత్రంలో ఎడమ నుండి కుడి వైపు: శ్రీయుతులు చంద్రలత, వోల్గా, డా.భార్గవ, డా.కె.శివారెడ్డి మరియు తెలకపల్లి రవి
సభకు అధ్యక్షత వహించిన ప్రఖ్యాత కవి, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, డా.కె.శివారెడ్డి మాట్లాడుతూ ” అధ్యక్షుడిగా వస్తున్నందువల్ల ఈ పుస్తకం చదివే అవకాశంకలిగింది. చంద్రలత గారు బిటి వంకాయపై చిన్న యుద్ధం ప్రకటించారు. ప్రముఖంగా ఆమె నవలా రచయిత, కధకురాలు. ఇలాంటి శాస్త్రీయ విషయం తో కూడిన రచన చేయటం సాహసమే. గతంలో వంకాయ బొరుగు, మాంసం కలిపి నిలువచేసుకుని ఇష్టంగా తినే వాళ్లం. ఇప్పుడు జన్యు మార్పిడితో ప్రమాదం వంకాయకే కాదు, వరి లాంటి ఇతర పంటలకు కూడా అని అంటున్నారు. కార్పొరేట్ వ్యాపార ధోరణలు ప్రకృతిని ఎలా విధ్వంసం చేస్తాయో ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు” అని అన్నారు.
పుస్తక ఆవిష్కరణ చేసిన డా. భార్గవా మాట్లాడుతూ ” బిటి వంకాయ మనకు ఎందుకు అనవసరమో, ఎంతటి అనర్ధకమో మీకు తెలియచేయటానికి నా అనుభవాలు మీతో పంచుకుంటాను. మన దేశంలో వంకాయలకు, వంగ వంగడాలకు ఎలాంటి కొరత లేదు. బిటి వంకాయ వలన అదనంగా ఉత్పత్తి పెరగదు పైపెచ్చు ఇది ఇతర మొక్కలలో జన్యు సంకరానికి కారణభూతమవుతుంది. ప్రకృతి సమతుల్యానికి ఇది హానికరమని ఇప్పటి దాకా జరిగిన పరిశోధనలు, అనుభవాలు చెప్తున్నాయి. ఈ విత్తనాలలోని విష పదార్ధాలు శరీరానికి హానికరం. ఉబ్బసం, రాచపుండు,చర్మ సంబంధిత వ్యాధులు వగైరాలూ ఈ జన్యు మార్పిడి చెందిన వంకాయలు తింటే కలిగే దుష్ఫలితాలు. భూమిలోని, మొక్కలకు ఉపయుక్తమైన సూక్ష్మజీవులకు ఈ వంగడాలు అపాయకరం. భారత దేశంలో జన్యు వైవిధ్యం కల 2500 రకాల వంకాయలు ఉన్నాయి.బిటి వంకాయ పుప్పొడి తో పరపరాగ సంపర్కం వలన ఈ సహజ వంకాయలు విత్తనాలను పునరుత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కోల్పోతాయి.భారదేశంలో ఎన్నో రకాల కూరగాయలు లభ్యమవుతున్నాయి. ప్రపంచ విపణి వీధిలో కూరగాయల వ్యాపారంలో 80 శాతం చెయగల సామర్ధ్యం మనకుంది. జన్యుమార్పిడిగాంచిన విత్తనాల బేహారులను అనుమతిస్తే, మన దేశపు వ్యవసాయ ఎగుమతులు నాశనమవగలవు. వరంగల్ జిల్లాలో బిటి పత్తి మొక్కలు తిని కొన్ని వేల మేకలు చనిపోయాయి. మనదేశం లో 60 శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న తరుణంలో, జీవభద్రత, జన్యు వైవిధ్యం , పర్యావరణం పై బిటి విత్తనాల ప్రభావాన్ని అంచనా వేయటానికై దీర్ఘకాల పరిశోధనలు లేకుండా బిటి వంకాయల నిపుణుల సంఘం స్వల్ప వ్యవధిలో, చిన్నపాటి చర్చతో , దేశ భవిష్యత్ ను మార్చగల విషయంలో తొందరపాటుతో జన్యుమార్పిడి విత్తనాల వాణిజ్యసాగుకు ఆమోదముద్ర వెయ్యటమంటే మన దేశ స్వాతంత్ర్యాన్ని కోల్పోవటమే. మనకు ఈ జన్యుమార్పిడి వంగడాలు వద్దే వద్దు. ఆహార పంటల విషయంలో స్వతంత్రదేశంగానా లేక బానిసదేశంగా ఉండాలా అని తేల్చుకోవల్సిన సమయమిదే.” అన్నారు.
తర్వాత ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా మాట్లాడుతూ ” సరదాగా అనుకునే ఎక్కడైనా బావే కాని వంగతోట కాడ మాత్రం కాదు అనే సరసోక్తి వంకాయ విత్తనాలకు చెప్పాల్సి వస్తుంది.తాచెడ్డకోతి వనమల్లా చెడిచిందన్నట్లుగా ఒక పొలంలో బిటి వంకాయ వేస్తే దాని ప్రభావం తన పొలం చుట్టూ ఉన్న క్షేత్రం పై కూడా పడుతుందంటే ఇది ఎంత ప్రమాదకారో తెలుస్తుంది. ఈ సంకలనంలో మొత్తం మూడు కధలున్నాయి. వీటిలో రచయిత్రి సృజనాత్మకత,సామాజిక,శాస్త్రీయ విశ్లేషణ గోచరమవుతాయి. అవశేషం అనే కధలో ఒక గ్రామంలో కొందరు వృద్ధవనితలు పరస్పర సహకారంతో కలిసి తయారు చేసిన పచ్చళ్లలో , క్రిమిసంహారక మందుల అవశేషం ఉందని అందుకని అమ్మకాలను అనుమతించమని, వెంటనే తయారీ నిలపాలని, తక్షణం సరకు వెనక్కు తీసుకోవాలని అనుమతి లేకుండా ఎగుమతి చేసినందుకు వివరణ ఇవ్వాలని కోరే ఆదేశ పత్రాన్ని అందుకున్న మహిళలు అవాక్కవుతారు. పచ్చళ్ల తయారీకై వాడిన కూరగాయలు, దినుసులు, నూనెలూ అన్నీ వారు బజారులో కొన్నవే. పచ్చళ్ల ఎగుమతులను క్రిమిసంహారక అవశేషాలపేరిట ఆపడంతోపాటు మన వంకాయలను రూపుమాపే జన్యుమార్పిడి వంకాయలను బహుళజాతి వ్యాపారసంస్థలు ఎలా మన కంచంలోకి చేరుస్తున్నాయో రచయిత్రి వివరిస్తారు ఈ కధలో. మరో కధ అగ్గువ (చౌక ధర) లో రైతు రక్తాన్ని చెమటగా మార్చి పండించిన టొమాటోలు, మార్కెట్ చేరి గంపలు దించేసరికి, సరైన గిట్టుబాటు ధర రాక అమ్మలేనప్పుడు, దోరమగ్గిన పండు మాగి , చితికి…,కుళ్లి….,గంపలనిండా…., పారబోసుకోను తప్ప గత్యంతరంలేనప్పుడు కలిగే రైతు వెత గుండె కలుక్కుమనిపిస్తుంది. చివరిది మంచి శిల్పం ఉన్న కధ. ” అక్కడ పూసిన పువ్వు” లో అమెరికా వెళ్లిన వైదేహి మనదేశంలో అంతర్ధానమైన ఒక రకపు గుత్తి గులాబీల మొక్కను అక్కడ చూస్తూ ఎంతో ఉద్వేగానికి లోనవుతుంది. అక్కడి వారు తమ జీవవైవిధ్యాన్ని భద్రం చేసుకుంటుంటే మనము ఏమి చెస్తున్నాము? మన అనుమతి లేకుండా మన మొక్కలు తమ దేశానికి ఎగుమతి చేస్తూ, మన గడ్డపై తమ విష వంగడాలను విక్రయిస్తూ మన జన్యు వైవిధ్యాన్ని వారు సంహరిస్తుంటే చేతులు కట్టుకు కూర్చోవాలా? ” అని మనలను ప్రశ్నిస్తుంది. బహుళజాతి సంస్థలతో యుద్ధం అంటే మాటలు కాదు. మహిళలు గొంతువిప్పగలిగితే వీరిని ఆమడ దూరంలో ఉంచవచ్చు. మన రచయితలు ప్రతి ఒక్కరూ బిటి వంకాయను నిరసిస్తూ ఆ నేపధ్యంలో కధలు రాయాలిప్పుడు.
ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదకుడు, రచయిత తెలకపల్లి రవి మాట్లాడుతూ “చంద్రలత రచనలు ఇదం శరీరం, రేగడి విత్తులు, దృశ్యాదృశ్యం పర్యావరణం, విత్తనాలు, వ్యవసాయం చుట్టూ తిరిగిన ఇతివృత్తాలతో ఉంటాయి. బిటి పత్తి ధరల నియంత్రణ కై రైతులు కోర్టునాశ్రయిస్తున్నారు. వైవిధ్యమైన మన పంటలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చెయ్యాలి. నేటి పరిస్తితుల గురించి శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు కలిసి సమాజానికి అవగాహన కల్పించాలి. అరుంధతీ రాయ్ ఇట్లాంటి విషయాలపై రచనలు చేస్తున్నారు.” అన్నారు.
చివరగా జన రంజక రచయిత్రి చంద్రలత మాట్లాడుతూ ” అడవి మరియు పర్యావరణ శాఖా మంత్రి జై రాం రమెష్ గారు 2010 జనవరి 31 న బిటి వంకాయలపై హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయసదస్సు సమయానికి ఈ పుస్తక ప్రచురణ జరగాలనే ఉద్దేశంతో ఈ పుస్తకంలోని వ్యాసాలను తక్కువ సమయంలో వ్రాసి ప్రచురించటం జరిగింది. సదస్సులో సమర్పించటానికై రచయిత మిత్రుల సహకారంతో బిటి వంకాయ తో వచ్చే అరిష్టాలను వివరిస్తూ ఒక విజ్ఞాపన పత్రాన్ని తయారు చేశాను. పాఠకులకు ఈ సమస్యను వివరించటానికై వచ్చే దారెటు పుస్తకంలో పలు ఉపయుక్త వ్యాసాలు అందించాను. వంకాయే కాకుండా 14 ఇతర ఆహార పంటలలో జన్యుమార్పిడి చేసిన విత్తనాలను ప్రవేశ పెట్టడానికై బహుళజాతి ఉద్యోగ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఎంతో జన్యు వైవిధ్యం ఉన్న దేశం మన భారత దేశం. బిటి వంకాయలలోని పుప్పొడి తో మన దేశ జన్యు వైవిధ్యానికి ముప్పు రాబోతుంది. మన సాంప్రదాయ పంటలకు, అటవీ దుంపలు, మొక్కలకు ప్రమాదం పొంచి ఉంది. జన్యుమార్పిడి గాంచిన పంటలగురించి వ్రాస్తూ జీవరసాయన శాస్త్రజ్ఞుడు, మాలిక్యులర్ బయాలజీ, జన్యు శాస్త్ర నిపుణుడైన డా. ఆరి సీతారామయ్య కెనడాలోని ఒక రైతు అనుభవాన్ని వివరిస్తారు. అక్కడి ఒక క్షేత్రంలో పండించే జన్యు మార్పిడి గావించిన గ్లైఫోసెట్ నిరోధక కనోలా (నూనె గింజలు), సహజ పంటలు పండించే పక్క క్షేత్రాన్ని ప్రభావితం చేశాయి. ఇక్కడ నష్టపోయింది సహజ పంట పండించే రైతు. కాని ఆ రైతుకు నష్ట పరిహారం చెల్లించాల్సింది పోయి మొన్శాంటో వారు తమ అనుమతి లేకుండా తమ సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకున్నందుకు ఎకరానికి 15 డాలర్లు కట్టమని నిగ్గదీసింది. సహజ రైతు అనుమతి రుసుము (Licence fee) చెల్లించటానికి నిరాకరించి న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం సహజ పంట రైతు పక్షాన తీర్పు చెప్పింది. భారత దేశం లో ఇలా జరిగితే రైతులకు సహాయం చెయ్యటానికై మనం సిద్ధంగా ఉన్నామా?
బంగాళా దుంపలు,టమాటలు,వంకాయలు, మిరపకాయలు, ఉమ్మెత్త, పొగాకు,పసనాభి ,నైట్ షేడ్స్ (ఉమ్మెత్త వంటి చెట్టు) సొలనసిన్ జాతి మొక్కలు. ఈ మొక్కలలో జన్యు ఛేదనం ద్వారా నిద్రాణ జన్యువుల వలన ఎలాంటి ప్రమాదం రాగలదో తెలుసుకోవటానికై విస్త్రుత పరిశోధనలు జరగాలి. వంకాయ ఆకులు, కాండాలు ఆరోగ్యానికై ఎలా వాడాలో మన ఆయుర్వేదంలో ఉంది.బిటి వంకాయ విషతుల్యమైంది కావున ఇది ప్రాణాంతకము. ఏది అసలో ఏది జన్యుమార్పిడి గాంచిన వంకాయో తెలుసుకొనటం సామాన్యుడికి సాధ్యమయ్యేది కాదు. మనకు తెలియకుండా మనము ఈ బిటి వంకాయ తిని జబ్బున పడే అవకాశాలు ఎక్కువ. తొందరపడి బిటి వంకాయకు అనుమతిస్తే, తదుపరి బాసుమతి వరి కూడా జన్యు సంకరం కావటానికి సిద్ధమవుతుంది. ఇహ ఆరోగ్య సమస్యలపై పోరాడే ఓపిక మనకుందా? బిటి వంకాయ వాడకంవలన దీర్ఘకాలంలో ఆరొగ్యం పై ఎలాంటి దుష్ఫలితాలు చూపిస్తుందన్న విషయమై స్వతంత్ర శాస్త్రీయ పరిశోధనా సంస్థల నివేదిక అందేదాకా ఇలాంటి జన్యు మార్పిడి పంటలపై పూర్తి నియంత్రణ అవసరం ఎంతైనా ఉంది. ” అని ముగించారు.
జె. లక్ష్మిరెడ్డి (పురాణ ప్రలాపం రచయిత),సురేష్ (Alchemist నవల తెలుగు లో పరశువేది గా అనువాదించిన రచయిత, రైతు బాంధవుడు), భాగ్య (మంచి పుస్తకం), పొత్తూరి విజయలక్ష్మి, కొడవటిగంటి శాంతసుందరి (ప్రఖ్యాత అనువాదకురాలు), వారణాసి నాగలక్ష్మి, డి.కామేశ్వరి, ముదిగొండ సుజాతా రెడ్డి, అబ్బూరి ఛాయాదేవి, ఇంద్రగంటి జానకీబాల , జ్యోతి వలబోజు (తెలుగులో ఉత్తమ బ్లాగరు బహుమతి గ్రహీత) ప్రభృతులు సమావేశానికి విచ్చేసిన వారిలో ఉన్నారు.
Photos & Text: cbrao
cbrao
@కొత్తపాళీ: జనరంజక బదులుగా ప్రఖ్యాత అని మార్చి చదువుకొన మనవి. సభా నివేదిక మీకు నచ్చినందుకు ప్రమోదం.
@మిత్రులకు: బిటి వంకాయలను నేపధ్యం గా తీసుకుని వ్రాసిన కధ “ఇది కలకాదు” గురించిన విశేషాలకై దిగువ గొలుసులో చూడగలరు.
http://deeptidhaara.blogspot.com/2010/02/blog-post.html
Aditya
Very nice post about BT brinjals.
Thanks for the information.
కొత్తపాళీ
చక్కటి సభా నివేదిక అందజేశారు, సందర్భోచితమైన ఫొటోలతో. జనరంజక రచయిత్రి లాంటి విశేషణాలు వాడకుండా ఉంటే బాగుండేది.
cbrao
దేశవాళీ వంకాయ బిటి వంకాయ పై తాత్కాలిక విజయాన్ని సాధించింది. బిటి వంకాయను ఉత్పత్తిచేసినవారి పరిశోధనా ఫలితాలు తప్ప స్వతంత్ర సంస్థ చేసిన ఎలాంటి నివేదిక బిటివంకాయపై లేనందువలన, శాస్త్రజ్ఞుల, ప్రజా వ్యతిరేకతల వలన బిటి వంకాయ వ్యాపార సాగుకు మారటోరియం విధిస్తున్నట్లు కేంద్ర మంత్రి జై రమేష్ నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రకటన చేశారు. భారత ప్రజలను బిటి వంకాయ అనర్ధాలపై చైతన్యవంతులనుచేసిన డా.భార్గవా , వచ్చే దారెటు అంటూ తెలుగులో బిటి వంకాయ పై ఎన్నో విజ్ఞానవంతమైన వ్యాసాలు వ్రాసిన చంద్రలత లకు అభినందనలు. మన దేశపు ఆహార పంటలను పరిరక్షించుకోవటానికై ఎల్లవేళలా అప్రమత్తత అవసరమని బిటి వంకాయ ద్వారా దేశ ప్రజలు కొత్త పాఠాన్ని నేర్చుకొన్నారు.
Sarath
thanks for the info…
cbrao
2010 ఫిబ్రవరి 6 శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో, బీటీ వంకాయపై అనుమానాలు నివృత్తి చేసిన తర్వాతే సాగుకు అనుమతించాలని కేంద్రానికి సూచించామని వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఇది శుభ పరిణామం. వంకాయలే కదాని నిర్లక్ష్యం చేస్తే మిగతా ఆహార పంటలకూ ఇదే గతి పడుతుంది. అలా జరిగిన పక్షంలో భారతదేశం ఆహార పంటల విషయంలో తన స్వాతంత్ర్యాన్ని కోల్పోగలదు. ప్రాణాంతకమైన బిటి వంకాయలను ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా,పాఠకులు తమ నిరసన వ్యక్తం చెయ్యవలసిన సమయమిదే.
మాగంటి వంశీ
ఆ వంకాయ సంగతేమిటో ఈ పుస్తకంతో తేలిపోవాలి. పుస్తకమెలా వుండబోతున్నా, మీర్రాసిన సభావిశేషాలు,ఫుటోలు, సభనలంకరించిన “ప్రజా”భిప్రాయాలు మాంఛి గుత్తొంకాయ కూరలాగున్నాయి.
అదే చేత్తో పుస్తకంలో విశేషాలు కూడా మీ రివ్యూ మసాలా దట్టించి, కొద్దిగా వడ్డించి రుచి చూపించాల్సింది. ఇంకా కత్తిపీట దగ్గర తరుగుడు కార్యక్రమంలో వుంది అంటారా! సంతోషం.
మాగంటి వంశీ