కొత్తపాళీ “రంగుటద్దాల కిటికీ” సమీక్ష

రాసిన వారు : సుజాత (మనసులో మాట)

నా స్వపరిచయం ప్రత్యేకంగా ఏమీ లేదు. జర్నలిజం చదువుకుని కొద్ది రోజుల పాటు పని చేసాను. రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు,నామిని గారి రచనలంటే బాగా ఇష్టపడతాను. జీవితాన్ని నిజాయితీగా ఆవిష్కరించే ఏ రచనైనా నా అభిమాన రచనే! ఇంకా చదవని, వెదుకుతున్న పుస్తకం క్రిస్టఫర్ రీవ్(హాలీవుడ్ సూపర్ మాన్) రాసిన still me! ఏ పనైనా చేస్తూ సరే పుస్తకాలు చదవగలను. వంట చేసేటపుడు కూడా పుస్తకం చేతిలో ఉండాల్సిందే! రాయడం అంటే బద్ధకం, చదవడం అంటే ఎక్కడ లేని ఉత్సాహం!

*************************************
rangutaddalakitikiవర్షం కురిసి వెలిసిన ఓ చల్లని సాయంత్రం అలా నడక సాగిస్తున్నపుడో, కిటికీ లోంచి పచ్చని ప్రకృతిని ఆహ్లాదకరంగా వీక్షిస్తున్నపుడో మంచి కథో నవలో గుర్తొస్తే అది రంగుటద్దాల కిటికీ అయి ఉంటే ఆశ్చర్యపడక్కర్లేదనిపించింది ఈ కథా సంకలనం చదివాక!

ఎన్నారైల జీవన చిత్రాన్ని (ముఖ్యంగా అమెరికా జీవితాల్ని) ఆవిష్కరించే సాహిత్యాన్ని మొదటగా విస్తృతంగా పరిచయం చేసింది మందపాటి సత్యం,వంగూరి చిట్టెన్ రాజు గార్లైతే ఆ తర్వాత చాలా మంది ఎన్నారై రచయితలు ఈ ప్రయత్నాన్ని కొనసాగించి వారి వారి కోణాల్లో చేసిన కృషి అభినందనీయం! కొత్తపాళీ గా తెలుగు బ్లాగ్లోకానికి సుపరిచితులైన శ్రీ ఎస్. నారాయణ స్వామి గారు రచించిన “రంగుటద్దాల కిటికీ” కథా సంకలనం ఇటీవల విడుదలైంది. హైదరాబాద్ బుక్ ఫేర్ లో తెలుగు బ్లాగర్లనే కాక ఇతర సాహితీ ప్రియులను కూడా ఆకట్టుకుంది. మొత్తం 21 కథలున్న ఈ సంకలనంలో “రంగుటద్దాల కిటికీ” కథ ఎక్కడుందని చూశాను గానీ అది కేవలం సంకలనం పేరు మాత్రమే!రచయిత కనీసం ఒక ముందు మాట రాసి ఈ పేరు వెనుక ఉన్న ప్రేరణ ఏమిటో వివరిస్తే బాగుండేది.

గొప్ప గొప్ప సంఘర్షణలు, మనసుని ఉద్వేగ పరిచే చిత్రణలు, అంతర్జాతీయ చర్చాంశాలు,వాదాలు ఇవేవీ లేకుండా హాయిగా చల్లగా సాగిపోయే కథలు ఇవన్నీ! అలాగని మరీ సరదా టోన్ తో రాసినవి కావు. కొన్ని కథలు నిజంగా ఆలోచనలని రేకెత్తిస్తాయి కానీ మనసు పాడు చేసుకునేంత సీరియస్ గా మాత్రం కాదు.ఎక్కువగా ఈ మాట అంతర్జాల పత్రికలో ప్రచురిమైన ఈ కథలు ఇప్పటికే బ్లాగర్లు కొందరు చదివినా నాలాగా మొదటిసారి చదివిన వారికి తప్పక చదవాల్సిందే అనిపించేలా ఉంది ఈ సంకలనం!

మనసులోని భావాలు పంచుకునే తోడు లేక, తనవారనుకున్న వారు ధనానికే తప్ప మనసుకు విలువనివ్వనివారని తెలుసుకున్న ఓ తండ్రి సరస్సు దగ్గర పరిచయమైన ఒక బాతు తో స్నేహం కలపడం, అది వలస పోతే ఎలాగని బెంగపడటం “వీరిగాడి వలస” కథ ఇతివృత్తం! తనని అనుమానించిన కోడలికీ, ఆమెకు వంతపాడిన కొడుక్కీ ఘాటుగా సమాధానం చెప్పిన రాఘవరావు లాంటివాళ్ళు ఇంకా బోల్డు మంది తయారు కావాల్సి ఉందనిపిస్తుంది.

సాహసం శాయరా డింభకా కథ చాలా మంది ఒకసారి తమ జీవితంలోకి తొంగిచూసుకునేలా చేస్తుంది. ఇలాంటి అనుభవాలు ఎన్నారైలకే కాదు, ఎవరికైనా సరే ఎదురయ్యే ఉంటాయి. సాయం పొందాక కన్వీనియెంట్ గా మర్చిపోయేవారికి కొదవా ఈ లోకంలో? అదే సమయంలో మనం ఎదురు చూడని వారే మనకి సాయం చేసే సంఘటనలు కూడా అరుదేం కాదు!

“వర్జినిటీ”ని మాత్రమే “ఇండియన్ వాల్యూ” గా గుర్తించే విద్యాధికుడైన నవతరం యువకుడు కృష్ణకు కథా నాయిక వాసంతి ఇచ్చిన షాకు బహుబాగు!తన సంగతెలా ఉన్నా,తను చేసుకోబోయే పిల్ల మాత్రం కన్య అయి ఉండాలని,అదే ఇండియన్ వాల్యూ అని నమ్మేవాళ్ళు ఏ దేశమేగినా,ఎందుకాలిడినా ఒకటే! ” ఇండియన్ వాల్యూస్ ” కథ చాలా సేపు ఆలోచించేలా చేస్తుంది.

విమర్శకుల ప్రశంసలు విరివిగా పొందిన “తుపాకీ” కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూసిన దాన్ని ప్రతిబింబించే అద్దంలాంటి పసిహృదయాన్ని సమర్థవంతంగా చిత్రించిన ఈ కథలో “నాన్నా, నాకు తుపాకీ వద్దు“అన్న చిట్టచివరి డైలాగ్ చక్కని ముక్తాయింపు!

అమెరికా జీవితాల్లోని ఒక డొల్లతనపు కోణాన్ని నగ్నంగా ఆవిష్కరించే మరో కథ “చక్కని చుక్క“! ఇందులో రాశి మనస్తత్వాన్ని చిన్న తనం నుంచీ పెద్దయ్యేదాకా సుచరిత కళ్ళతో రచయిత వర్ణించిన తీరు అద్భుతంగా తోస్తుంది.రచయిత నిశిత పరిశీలనని మనకి అవగతం చేస్తుంది.

ఏ కథలోనూ ప్రధానమైన అంశం కాకపోయినా,పూలదండలో చెమికీలా దాదాపు ప్రతి కథలోనూ తళుక్కున మెరిసే సున్నితమైన హాస్యం కథలకు వన్నెలద్దింది. ఓ తల్లి గొడవ కథలో అమెరికన్ అల్లుడు తెలుగు పెళ్ళికి ఒప్పుకున్నా, వేద వేదమంత్రాలు వల్లిస్తున్నా ఆ తల్లి సంతోషించక,”హబ్బో, ఈ తెల్ల పెళ్ళికొడుకు శాస్త్రులు గారి వెనకాలే మంత్రాలు చిలకపలుకులు బాగానే వల్లిస్తున్నాడే”అని వెటకరిస్తుంది. సున్నితమైన హాస్యాన్ని పండిస్తూనే మరో పక్క తల్లి మనసుని ఆవిష్కరించే సఫల ప్రయత్నం!

“రాయల్ వియ్”పర్సన్ లో సాగే స్వగతం “ఓరి భగవంతుడా ఇప్పుడేం దారి?” కథ లో పక్కింటమ్మాయినీ,పన్లో పనిగా పనిమనిషినీ కూడా ట్రై చేసి భంగపడిన యువకరత్నం పూయించే నవ్వులు చాలానే!

ఆదా, నీవేనా నను తలచినది, అత్తగారితో కొత్త కాపురం ఇవి కొన్ని సరదా కథలు. కొన్ని కధలు చక్కని స్కెచ్ ల లాగా కూడా అనిపిస్తాయి. పూర్వజన్మ వాసన,ఎఫీషియెన్సీ ప్లీజ్, ఒక జనవరి శనివారం…. ఇవన్నీ అలాంటివే! వీటిలోనూ ప్రత్యేకంగా నిలిచేది ఒక జనవరి శనివారం..! “కళాకారుడికి కావలసింది”,”వలయం”,”డిటెక్టివ్ నీలూ” సాదా సీదాగా ఉన్నాయి.

ఎన్నారై సాహిత్యమనగానే అక్కడి వాతావరణాన్నో,రోడ్లనో, మాల్స్ నో,లేక జీవన విధానాన్నో కళ్ళకు కట్టినట్టు చూపించాలని రచయితలు పడే తాపత్రయం, నారాయణ స్వామి గారు పడకపోవడం ఈ కథల్లో ముఖ్యంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కథల్లో జీవితం, అందులోని పాత్రలతో పాటు విదేశీ వాతావరణం కథకు అనుసంధానంగా అంతర్లీనంగా కనిపిస్తుందే తప్ప అదే ప్రముఖ పాత్ర వహించదు. (ఈ కథలన్నీ జాలపత్రికల్లో ప్రచురితం కావడం వల్లా, టార్గెట్ రీడర్స్ ఎక్కువగా ఎన్నారైలే కావడం వల్లా రచయిత ఇలా రాసి ఉండవచ్చు కూడా!)

అక్కడక్కడ కథల్లో ఆంగ్ల సంభాషణలు ఎక్కువగా చోటు చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది కల్గిస్తుంది.(తెలుగులో ఆంగ్ల సంభాషణలు చదవడమంత తలనొప్పి ఇంకోటి ఉండదు!)అన్వర్ గీసిన ముఖచిత్రం అద్భుతంగా అమరింది.

నవోదయ పబ్లిషర్స్ ప్రచురించిన ఈ పుస్తకం ధర 75 రూపాయలు(లేదా 9 డాలర్లు)అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం!

You Might Also Like

12 Comments

  1. పుస్తకం » Blog Archive » రంగుటద్దాల కిటికీ – ఒక సంవత్సరం ఆలస్యంగా

    […] సుజాత గారు జనవరిలో రాసిన సమీక్ష ఇక్కడ చదవండి. (No Ratings Yet)  Loading […]

  2. శ్రీ

    ఈ పుస్తకాన్ని కొత్తపాళీ గారు విజయవాడలో ఆవిష్కరించారు. అమెరికాలో కూడా ఈ పుస్తక ఆవిష్కరణ సభకి ఏర్పాట్లు చేస్తున్నాము. ఫిబ్రవరిలో కానీ,మార్చిలో కానీ సభ ఉండచ్చు. వివరాలు తొందరలోనే నేను పోస్టు చేస్తాను.

    అన్నట్టు ఈ పుస్తకం నేను కూడా చదివాను.నాకు కూడా వీరిగాడి వలస బాగా నచ్చింది.కొన్ని కథలు అర్ధం కాలేదు.

    సుజాత గారు పుస్తక సమీక్ష బాగా రాసారు. ఆమె మనసులోని మాటలే రాస్తారు.

  3. కె.రామారావు

    భలేవారండీ,

    కల్పన గారు,

    పైన సమీక్ష అని చెప్పి సమీక్ష కాదంటే ఎలా? ఎవర్నో ఏదో అనాలని కాదు నా ఉద్దేశ్యం. రాసినవారికీ సమీక్షించేవారికీ ఏ మాత్రమూ పరిచయం అన్నది లేకపోతే సమీక్షకి మరింత స్వచ్ఛత వస్తుందని ఆశ.

    స్వగతం:
    రాబోయే కాలంలో ఎవరైనా గొప్ప రచయిత పరిచయమయ్యే అవకాశం వస్తే, “భవిష్యత్తులో వీరి రచన మీద సమీక్ష ఏదైనా రాయవలసి వస్తుందేమో అన్న జంకు లేకుండా, ఇంతటి పరిచయంతో పాటు గొప్ప బాధ్యతని కూడా పెట్టావా దేవుడా” అనుకుంటా. 🙂

  4. kalpana

    రామారావు గారు,

    మీ వ్యాఖ్య ఇంకెక్కడైనా సరిపోతుందేమో కానీ ఇక్కడ సుజాత మాత్రం నిర్హ్మోహమాటం గానే రాసింది. కొన్ని కథలు సాదా సీదా గా వున్నాయని కూడా చెప్పింది. పైగా ఇవి పుస్తక పరిచయాలే కానీ సమీక్షలు కావు.

    కల్పన

  5. సుజాత

    leo garu,
    Thanks very much for the help. So kind of you. I will buy it.

  6. leo

    @సుజాత గారు
    still me amazonలో దొరుకుతోంది అండి. మీకు కావాలి అంటే నేను కొని పంపగలను.

    Here and Here.
    Google books Link here.

  7. సుజాత

    స్వాతి కుమారి గారూ,

    మీకేం తెలీలేదో నాకు తెలీలేదు:-)).

    ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల కొట్లలోనూ లభ్యం అని పైన సమీక్షలో రాశానే!

  8. సుజాత

    ఈ మధ్య కొందరి మాటలు ఎలా ఉంటున్నాయంటే “ఫలానా కథ/నవల మేము చదివిన పాయింటాఫ్ వ్యూలో నువ్వెందుకు చదవవూ! మాకు నచ్చనపుడు నీకెలా నచ్చిందీ?” అని అడుగుతున్నట్లుగా ఉంటున్నాయి. ఇంతకు ముందు కూడా గమనించాను. ఇదేమిటో, ఎందుకో అర్థం కావడం లేదు. .

    రామారావు గారూ,

    సుమతీ శతక కారుడి భాష్యం నాకు వర్తించదు. నచ్చకపొతే ఆ విషయం చెప్పడానికి మొహమాటం ఏమీ లేదు.

    మీకు పై కథా సంకలనంలో ఏ కథ నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో వివరంగా రాసి ఉండాల్సిందండీ. మీకు ఎందుకు నచ్చలేదో చెప్పాలి గానీ “మీకెందుకు నచ్చాలి?” అని అడిగినట్లుగా వినపడుతోంది మీ వ్యాఖ్య!క్షమించాలి.

    ఇక పోతే రచయిత తో పరిచయం గురించి. (ఇలా ప్రకటించవలసిన అవసరం లేదుగానీ,)కొత్తపాళీ గారితో ఒక బ్లాగర్ గా తప్ప కనీసం మెయిల్స్ రాసే పరిచయం కూడా లేదు నాకు.

    స్వగతం:
    రాబోయే కాలంలో ఎవరైనా గొప్ప రచయిత పరిచయమయ్యే అవకాశం వస్తే “భవిష్యత్తులో వీరి రచన మీద సమీక్ష ఏదైనా రాయవలసి వస్తుందేమో ఖర్మ, ఈయనకు దూరంగా ఉంటే మంచిది”అని తొలగిపోవాలో ఏమిటో!:-))

  9. కె.రామారావు

    ….
    నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతీ.

    అని సుమతీ పద్యకారుడన్నాడు.

    క్షమించాలి… ఎందుకో సమీక్షలన్నీ మధ్యేమార్గంగా పోతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అసలు సమీక్షకుడికి, రచయితకి గతంలో ఏ విధమైన పరిచయం అన్నది లేకపోతే బాగుంటుంది అని నా అభిప్రాయం. లేకపోతే సమీక్షలో ప్రధానమయిన విమర్శని చూడగలిగే అదృష్టం కలగదు.

  10. స్వాతి కుమారి

    చూశారా. నాకు తెలీలేదు. ఎక్కడ దొరుకుతుందీ పుస్తకం?

  11. neelaanchala

    ఈ పుస్తకం లో నాకు ఇండియన్ వాల్యూస్ కథ బాగా నచ్చింది. చివరి కథ ఖాండవ వనం కూడా! ఆ కథ గురించి మీరు ప్రస్తావించనే లేదే!

  12. వేణు

    కొత్త పాళీ గారి ఈ కథా సంపుటిని ప్రస్తుతం చదువుతున్నాను. ఇప్పటివరకూ- వీరిగాడి వలస, ఓరి భగవంతుడా ఇప్పుడేం దారి?, తుపాకి కథలు నాకు నచ్చాయి.

    మీ సమీక్ష బావుంది. కథల ఇతివృత్తాలనూ, సారాన్నీ చక్కగా వివరించారు!

    కథా స్థలం అమెరికా కాబట్టీ, ఎంచుకున్న కథాంశాలను బట్టీ ఈ కథల్లో ఆంగ్ల సంభాషణలు తప్పనిసరే. ‘తుపాకి’ కథలో అమెరికన్లు బ్రయన్, జిమ్మీ, ఆఫ్రికన్ అమెరికన్ మాథ్యూలు తెలుగులో మాట్లాడుకున్నట్టు రచయిత రాశారు. ఇది పాఠకులకు సౌకర్యంగానే ఉండొచ్చు; కానీ నిజానికి సహజంగా ఉండాలంటే అక్కడ ఇంగ్లిష్ సంభాషణలు ఉండాల్సిందే కదా? 🙂

Leave a Reply