Travelling with Che Guevara
చే గెవారా పరిచయం అక్కర్లేని విప్లవకారుడు. క్యూబన్ విప్లవం లో కాస్ట్రో సోదరులతో పాటు ప్రధానపాత్ర కూడా పోషించాడు. అయితే, ఇదే ఎర్నెస్టో గెవారా చే గెవారా ఎలా అయ్యాడు? అన్న ప్రశ్నకు జవాబు కావాలంటే అతనీ విప్లవబాట పట్టడానికి బీజం ఎక్కడ పడింది అన్నది అర్థం చేసుకోవాలి. ఇది మెడిసిన్ చదువుతున్నప్పుడు తన స్నేహితుడు అల్బెర్టో గ్రనడో తో కలిసి దక్షిణ అమెరికా ఖండం లోని వివిధ దేశాలను మోటార్ సైకిల్ లో పర్యటించి తమ ప్రజల జీవితాలను తెలుసుకోవాలన్న ఆశకు వాస్తవరూపం ఇవ్వడంతో మొదలైందని చెప్పవచ్చు. ఈ సమయంలో చేగెవారా రాసుకున్న డైరీ “Motorcycle Diaries” అన్న పేరుతో అతను మరణించిన ఎన్నో సంవత్సరాలకి పుస్తకంగా వచ్చింది. తరువాత దాన్నే అదే పేరుతో సినిమాగా కూడా తీశారు. మన “గమ్యం” సినిమా కూడా ఈ పుస్తకం ప్రేరణతో తీసినదే. విషయానికొస్తే, అప్పట్లో గ్రనడో కూడా తన దినచర్య రాసుకున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ పరిచయం చేయబోతున్న పుస్తకం ఆ డైరీనే.
కథ విషయానికొస్తే, మెడిసిన్ ఆఖరు సంవత్సరంలో ఉన్న ధనిక గువేరా కుటుంబ వారసుడు ఎర్నెస్టో, అప్పటికే చదువైపోయిన బయోకెమిస్టు గ్రనడో ఇద్దరూ ప్రపంచాన్ని చూడాలని దక్షిణ అమెరికా ఖండాన్ని మోటార్ సైకిల్ లో పర్యటించాలని నిశ్చయించుకుంటారు. ఇది ఏడు నెలల పాటు సాగుతుంది. అర్జెంటినా, చిలీ, పెరూ, కొలంబియా దేశాలలో పర్యటించి వెనిజులా చేరడంతో ఈ పర్యటన ముగుస్తుంది. దీని తరువాత గెవారా తన వైద్యవిద్య పూర్తి చేసుకోడానికి అర్జెంటినా వెనక్కొస్తే, గ్రనడో అక్కడే పరిశోధకుడిగా చేరి, తరువాత వివిధ దేశాలు తిరుగుతూ చివరికి అప్పటికే విప్లవకారుడై క్యూబాలో ఉన్న చేగెవారా ఆహ్వానం మేరకు హవానా విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా స్థిరపడ్డాడు. ఈ పుస్తకంలో ఆ ఏడునెలల అనుభవాలే ఉంటాయి కానీ, ఈ కథని అర్థం చేసుకుని అనుభవించడానికి మొత్తం కథ గురించి అవగాహన ఉండాలని ఇదంతా చెప్పాను.
వీరిద్దరూ గ్రనడోకి చెందిన ఓ పాత మోటార్ సైకిల్, కాస్త డబ్బు, కాస్త సామాను తీసుకుని గ్రనడో ఇంటి వద్దనుండి పర్యటన ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి ఇక ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో కొత్త పాఠాలు. ఎక్కడికెళ్ళినా రూపాయి నాణేనికున్న రెండు వైపుల్లాగా – ఓ పక్క ప్రకృతి అందాలు, మరో పక్క బీదలపాట్లూ కనిపించి వీరిని ఆలోచింపజేస్తూ ఉంటాయి. అలాగే, ఈ దారుల్లో తారసపడ్డ కష్టజీవులతో, కష్టాలజీవులతో మాట్లాడుతూ, వారితో కలిసి భోంచేస్తూ వారి జీవితాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాల్లోనే వీరికి సంఘం లోని అసమానతలు, పాలకుల నిరంకుశత్వం, సాధారణ ప్రజల నిస్సహాయత – వాస్తవ జీవితం తెలుస్తుంది. అక్కడక్కడా వీరు ఆసుపత్రులు-ప్రధానంగా కుష్టురోగానికి సంబంధించినవి-పర్యటిస్తారు. అక్కడి వైద్య సౌకర్యాలూ, ప్రజల అజ్ఞానం, అరకొర వసతుల మధ్య కూడా తరగని నమ్మకంగల మనుష్యులూ – ఇలా ఎన్నింటినో, ఎందరినో చూస్తూ ఉంటారు. ఒకటా రెండా, ఉన్నన్ని రవాణా మార్గాలూ ప్రయత్నించేస్తారు. దొరికిన పనల్లా చేస్తారు వీరిద్దరూ ఈ దార్లలో.
ఇదంతా విని ఇదంతా ఏదో సీరియస్ వ్యవహారం అనుకునేరు! వీరిద్దరూ ఎంత సరదా సరదాగా ఈ రోజులన్నీ గడిపారో చెప్పడం కష్టం. చదివి అనుభవించాల్సిందే. ప్రధానంగా నాకు బాగా నచ్చిందేమిటంటే, ఆనందాన్నీ, బాధనీ, కోపాన్నీ, ఆవేశాన్నీ – ప్రతి భావోద్వేగాన్నీ ఆహ్వానించి అనుభవించారిద్దరూ. ప్రతిచోటా గ్రనడో చేగెవారా ప్రవర్తననూ, అతనితో చర్చలనూ వివరంగా రాస్తూ వచ్చాడు. ఇందులో మనకి గ్రనడో, చే ఇద్దరి బంధమే కాక, వ్యక్తిగా చే ని అర్థం చేసుకోగలిగే వీలుంది. చే గురించిన అభిమానం గ్రనడో ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది. దేని గురించి రాసినా, గ్రనడో రాసిన విధానంలో ఓ passion ఉంది. అలాగే, భాష చాలా సరళంగా ఉంది. (దీనికి క్రెడిట్ అనువాదకుడిది అనుకుంటా). ఈ పుస్తకం చదివాక నాకు కూడా అలాంటి పర్యటన చేసేయాలన్నంత ఆవేశం కలిగింది 🙂 ఇంతకీ, పుస్తకం చదివినవారిపై బాగా ప్రభావం చూపగలదు. అలాగే, ఈ పుస్తకం చదివిన తరువాత ఆలోచింపజేస్తుంది. ఓసారి “నేనేమిటి? జీవితమంటే ఏమిటి? జీవితానికి గమ్యం ఏమిటి?” అన్న ప్రశ్నలు కలిగిస్తుంది. ఇది ఇరవైల్లో ఉన్న ప్రతివారూ తప్పక చదవాలని నా అభిప్రాయం. అంటే, మిగితా వారు చదవకూడదని కాదు కానీ, ఈవయసు వారిపై ఇది బాగా ప్రభావం చూపుతుందన్నమాట.
ఈ పుస్తకం వివరాలు:
Travelling with Che Guevara: The making of a revolutionary
Alberto Granado
Translated by: Lucia Alvarez De Toledo
New Market Press, New York.
Cost: Rs 395/-
(నేను పూణే లోని క్రాస్వర్డ్ స్ట్రోర్స్ లో కొన్నాను. అమేజాన్ లంకె ఇక్కడ).
mahender reddy
che guevara’s story is very very intresting……….
mahender reddy
చే గెవారా katha chala asakyiga undi.
వెంకటరమణ
సమీక్ష చాలా బాగుంది . చదవాలన్న ఉత్సుకతను రేకెత్తిస్తుంది.