క్షమించు సుప్రియా

(చట్టబద్దం కాని ఓ హెచ్చరిక: ఈ వ్యాసం సరదాగా చదుsupriyaaవుకోగలరు. విభేదించినా సరే. అయితే పెడర్థాలు మాత్రం  వద్దు)

“అతడి దవడ కండరం క్షణంలో వెయ్యోవంతు బిగుసుకుని తిరిగి మామూలుగా అయిపోయింది.”

“అతడు బయటకు వెళ్ళబోతూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగి అన్నాడు…”

“అదే అతడు చేసిన తప్పు”

“గది అందంగా ఉంది. ఒక వైపు అందంగా అమర్చిన సోఫా సెట్….అది కాదు అతడు చూస్తున్నది”

ఇలాంటి భావప్రధాన తార్కిక వివరణా లక్షణ లక్షితాంగమైన శైలి ఎవరిదో తెలుగు నవలా పఠనాసక్తి గల లలనా మణులకు, అందునా 80 వ దశకంలో నవలలు చదివే అలవాటు ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లలనా మణులు అనడానికి ఈ వ్యాసం ఆసాంతం చదివి కారణం మీరే వీలయితే వెతుక్కోండి, కారణం దొరక్కపోతే మాత్రం సమీక్షకుడు అనాచరణ యోగ్య బాహ్య స్వరూప ప్రకటిత మనస్కుడు అన్న నిర్ణయానికి రాకండి!

ఆయన నవల్లే కాదు, చందమామ కథలతో మొదలుకుని, ఈ పక్కన కనబడే కథల సంపుటిలో ఉన్న కథల్లాంటి కథలూ రాశాడు. ఆ తర్వాత ఆయన పరిణతి పొంది (అంటే నవలల్లాంటివి రాయటం శుద్ధ వేస్ట్ అని కాబోలు) మానసిక, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే పుస్తకాలూ వెలయించాడు. (వెలయించాడు అంటే మంచి వెలకు రాసి, అమ్మకాలు సాధించేడు అని ర(క)వి సమయం). ఈయన 69 లో చందమామ లో భేతాళ కథ రాసి, అందులో తన “తర్కానికి అందని క్లిష్టత” ను జొప్పించాడు.ఇది పబ్లిషర్ వాక్కు. (పబ్లిషర్ వాక్కు- బ్రహ్మ వాక్కు. పబ్లిషరే కదండీ పుస్తకానికి బ్రహ్మ) ఆ కథ ఈ సంపుటి చివర ప్రత్యేక “కానుక” గా ఇచ్చారు పబ్లిషర్ దేవో భవలు.

ఈ పుస్తకం మొదట్లో, “యండమూరి సాహిత్యం – ఒక ప్రస్తావన” అని ఒక మున్నుడి ఉంది. (సాహిత్యం అనే సమాసానికి ఎవరైనా విగ్రహ వాక్యం చెబితే బావుణ్ణు. నేననుకుంటున్నది “హితస్య భావః సాహిత్యం” అని అది తప్పో ఒప్పో తెలియదు) అందులో ఈ రచయిత రచనలు ఎందుకు చదివిస్తున్నాయి? అతని ప్లస్ పాయింట్లు, అతని మైనస్ పాయింట్లు, ఆయన రచనలు ఎంత విజ్ఞాన దాయకమైనవో ఓ సినిమా స్క్రిప్టు లా వివరంగా వ్రాశారు.

ఈ కథల సంపుటిలో తొమ్మిది కథలు. చివరి కథ “నీకు”. ఐ మీన్, చివరి కథ పేరు “నీకు”.

ముందుగా ఓ ప్రోలోగ్ (పుస్తక రచయిత శైలి లక్షణాలలో ప్రోలోగులు రాయటం కూడా ఒకటి). 60 వ దశకం మొదలుకుని, దాదాపు 80 వ దశకం ఆరంభం వరకు మహిళా రచయిత్రులు రాజ్యమేలారు. “ఆరడుగులల ఆజానుబాహువు, పడవ లాంటి కారు,  ముంగురులు నుదుటి మీద అల్లరిగా పడటం, అతడి కళ్ళు అల్లరిగా నవ్వటం ఇత్యాది శుభ లక్షణాలతో కూడిన కథానాయకుడు, బేలతనం, అతని బలమైన బాహువుల్లో నిశ్చింతగా అనిపించటం, పదే పదే జ్ఞప్తికి రావటం వంటి మానసిక లక్షణాలున్న కథానాయకి, వారిద్దరూ కలిసి చివరకు సుఖంగా బతకటం వంటి కథాకథనాలతో మహిళా రచయితలు ఉప్పెనలా పోటెత్తారు. ఆ నవలలు చదివి ఊహా లోకాలలో విహరించిన యువతులు 80 వ దశకంలో పెళ్ళిళ్ళు చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. వారిని దృష్టిలో పెట్టుకుని, తన రచనల్లో (వారి బలహీనతలకు, జీవితంలో వారు రాజీ పడటానికి ప్రతీకగా) మెటీరియలిజం, సినిసిజం జొప్పించినట్లు, ఓ వ్యక్తిత్వ వికాస రచనలో, తన విజయాలను వివరిస్తూ చెప్పాడు రచయిత. ఇదుగో, ఈ కథ (ఇంకొన్ని) కొంచెం అలాంటి వారిని ఉద్దేశించి రాశారేమో మరి.

ఈ (చివరి) కథ ఓ ఉత్తరం. అందులో ఓ భార్య తన జీవితం ఎలా డల్ గా ఉందో చెబుతుంది. ఈ ఉత్తరాన్ని నలిపి పారెయద్దని మనవి చేసుకుంటుంది. ఆఫీసు పైనుండి విసిరేయబడి, మడతలు పడ్డ ఆ ఉత్తరం ఆసాంతం చదివిన తర్వాత, రామమూర్తి ఈ ఉత్తరంలో భర్త ఒక ఈడియట్ అని తిడతాడు. … ఆ తర్వాత తనూ అలాంటి వాడినే కదా అని ఆలోచనలో పడతాడు…..”అందుకేగా దాచి ఉంచింది” అంటూ చివర్లో రచయిత ముగిస్తాడు.

ఆఖరు కథకు ముందు కథ. ఇది ఆఖరు కథకు రివర్సు. ఈ కథలో భార్య గయ్యాళి. సరసం తెలియని ఆడది. వారిద్దరి శృంగార జీవితం రచయిత మాటల్లో ” అపరిహార్యము, అబాధితము, పరమార్ధము, పూర్ణసత్యము అయిన ప్రేమ…. కిందికొస్తే అనిశ్చితము, అవ్యక్తము, అసిద్ధీము, అసంపూర్ణమూ అయిన వాస్తవం” …ఆ వాక్యాల్లో పదాల్లాగే గందరగోళంగా ఉంటుంది. (చదువరీ! అసిద్ధీము – అవును మీరు సరిగ్గానే చదివారు. అది ముద్రా రాక్షసమేమో తెలియదు. ముద్రా దైవతమైతే కూడా దాని అర్థం నాకు తెలియదు). చివరికి భర్త మరో భావ సారూప్యం ఉన్న అమ్మాయిని ఇష్టపడతాడు…చివర్లో అస్పష్టంగా వదిలేస్తాడు రచయిత. (ఈ కథ సినిమాగా రూపు దిద్దుకున్న ఓ నవల – నల్లంచు తెల్ల చీర కు ఆధారమేమో అని నా డవుటు)

(పై రెండు కథల సమ్మేళనం ఈ సంపుటిలో రెండవ కథ)

చివర్నించీ మూడవ కథలో భావప్రధాన తార్కిక వివరణ (లాజికల్ ఐడియలిజం) పాలు ఒకింత ఎక్కువయింది. ఈ కథలో భైరవమూర్తి, భార్య బురద రాముడు సినిమాకెళుతుంది. ఆఫీసు ఏదో కారణం తో సెలవు అవడంతో  సినిమా హాలు దగ్గర భార్యను, తల్లిని చూస్తాడు తను. భార్య ఇంటికి వచ్చి, వేరే సినిమాకెళ్ళినట్టు అబద్ధం చెబుతుంది. ఈయన దవడకండరం (రచయిత చేతిలో) బిగుసుకుంటుంది. ఇంతకూ కథలో నీతి చివర్లో పబ్లిషర్ నోట్ లో వివరించబడుతుంది. పరాయి స్త్రీతో తిరిగే మగవాడు భార్యనెంత మోసం చేస్తున్నాడో, భర్త చొక్కా స్టీలు సామాన్లకేసే భార్య అంతే మోసమే చేస్తున్నది. క్వాంటిటీలో మాత్రమే తేడా!!!

ఇంకో కథ “రెండు రెళ్ళు ఆరు” సినిమాలో సుత్తి వీరభద్ర రావు(ఐరావతం), శ్రీలక్ష్మి(ఆండాళ్ళు) కథే. కాకపోతే, సంగీతం బదులు ఈల.

ప్రేమంటే?
స్నేహం + సెక్స్ = ప్రేమ
ఆప్యాయత + సెక్స్ + ఇంకొకటి = ప్రేమ
ప్రేమకు క్లైమాక్స్ సెక్స్
స్నేహాన్నీ, ప్రేమనీ విడదీసే ఒకే ఒక పొర సెక్స్
ఇలాంటి రకరకాల కాంట్రడిక్షన్స్ తో అల్లిన ఓ కథ “లవర్స్ మస్ట్ లెర్న్” అన్నది. ఈ సంపుటిలో అన్నిటికన్నా నచ్చగలిగేదీనూ.

అలాంటిదే మరో కథ ఈ కథల సంపుటి పేరుతో ఉన్న ఓ కథ. ఈ సంపుటిలో మిగిలిన మరో రెండు కథల గురించి చెప్పడం అనవసరం.

అయితే ఈ కథల సమీక్ష ఎందుకుట? ఎందుకో తెలియదు, ఈ రచయిత శైలిలో ఓ మత్తు, గమ్మత్తూ ఉన్నాయి. పుస్తకం మొదలెడితే చాలు, ఆపకుండా చదివిస్తుంది. ఇంకో విషయం ఈ పుస్తకం చాలా సార్లు పునర్ముద్రణ పొందింది. దీనికి మున్నుడి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు (ఇల్లాలి ముచ్చట్లు ఫేం) రాశారు.

అన్నట్టు అన్ని సమీక్షలు ఒకేలా ఉండటమూ బావోదు. ఏమంటారు?

You Might Also Like

7 Comments

  1. రాంకి

    మీ వ్యాసం చాలా బాగుంది

  2. lavanya

    serious gha ee madhaya ayana pusthakalu bore kodhutunnai cheppindhey cheppii.

  3. meher

    @ Srinivas,

    నేనేమీ ప్రతిపాదన చేయటం లేదు. నా అభిప్రాయాన్ని చెప్తున్నానంతే.

    పేర్లు చెప్పటం అవసరం అంటారా? అలా చెప్పి, కాస్తో కూస్తో మనస్సాక్షి మిగిలున్నోళ్ళెవరైనా వుంటే వాళ్ళకి భుజాలు తడుముకునే అవకాశాన్ని నిరాకరించడం ఎందుకు 🙂 అయినా, మీకేమన్నా స్థిమితం చేకూరుతుందంటే, ఆ పేర్లు ఇక్కడ వున్న వాళ్ళెవరివీ కాదులెండి. అలాగని ఏదో ప్రభావం కోసం వాడేయలేదు “చప్పిడి గుజ్జుల”న్న మాట. నా దృష్టిలో లెక్కపెడితే చేతి లెక్కలకు చాలనంతమందే వున్నారు: కీర్తి శేషులైతేనేం; గతకీర్తి బాధితులైతేనేం; వీళ్ళపై బతుకుతున్న పరాన్నజీవులైతేనేం. ఇప్పుడిక్కడ పేర్లు ఎత్తి, నాది కాని ఈ సమిష్టి వేదికపై గలాభా చేయడం నాకిష్టం లేదు. ఆ అవసరమూ, ఆసక్తీ, ఓపికా అంతకన్నా లేవు. ప్రేమలు వ్యక్తం చేసుకోవటంలో ప్రయోజనం వుంది, అందం వుంది; ఉత్తపుణ్యానికి ద్వేషాలు వ్యక్తం చేసుకోవటంలో రెండూ లేవు.

    ఇకపోతే, రవిగారు మాట్లాడుతున్నది రాబడి నష్టం గురించి కాదనుకుంటా.

    ~ మెహెర్

  4. Srinivas

    ఆయన నాటికల్లోనూ, నవలల్లోనూ కనిపించే గుణాలు కథల్లో కనపడవు. గుర్తుంచుకోదగ్గ కథలేమీ ఉన్నట్టు గుర్తు లేదు.

    నాటికల్నుంచి మొదలయిన ఆయన సాహితీ ప్రయాణం క్రమంగా నిజాయితీని కోల్పోవడం చూసినప్పుడు ఆకాశంబందుండి పద్యం గుర్తొస్తుంటుంది.

    @ మెహెర్
    ఆ చప్పిడిగుజ్జులెవరబ్బా! మీ ప్రతిపాదంకి కాస్త బలం చేకూర్చండి.

    @రవి
    ఆయనేమీ నష్టపోలేదు. ఎప్పుడూ లాభాల్లోనే ఉన్నాడు.;-)

  5. రవి

    ఫణి (బ్లాగాగ్ని) గారు,

    “ఆ ఒక్కటి అడక్కు” ఇంకొక కథల సంకలనం అనుకుంటున్నాను. ఖచ్చితంగా తెలియదు.

    మెహెర్ గారు,

    మంచి విశ్లేషణ. ఆయన తన మానాన తను రాసుకుంటూ, తన రాతల మీదే దృష్టి నిలిపి ఉంటే, ఆంధ్ర దేశంలో చాలా మందిని పుస్తకాలు చదివేలా ప్రేరేపించి ఉండేవాడు. అరువు తెచ్చుకున్న అపాయకరమైన మేధోసంపత్తి ద్వారా, తనూ నష్టపోయాడు, పాఠకులు నష్టపోయారు.

  6. బ్లాగాగ్ని

    ఇవే కథలు “ఆ ఒక్కటీ అడక్కు” అన్న పేరుతో వచ్చిన సంకలనంలో చదివాన్నేను. క్షమించు సుప్రియా అన్నపేరుతో వస్తున్నాయా ఇప్పుడు? నేనదింకా ఏదో కొత్త(అనగా నేను చదవని) యండమూరి నవలనుకుంటున్నానే!!

  7. meher

    🙂 నిజమే, యండమూరి నవలా నాయకులకు దవడ కండరాలు విసుగుపుట్టేంత తరచూ బిగుసుకుంటుంటాయి.

    కానీ యండమూరిని ఎవరేం అనుకున్నా, ఓ తరం తెలుగు పాఠకులకు చందమామ సాహిత్యం నుంచీ సీరియస్ సాహిత్యానికి తప్పక అవసరమైన వారధిగా ఆయన పనిచేసాడన్నది మాత్రం నిశ్చయం. కొందరు వంతెనే బాగుందని ఆగిపోయారు; కొందరు ముందుకు వెళ్ళారు, వెళ్తున్నారు. ఆయన స్థానం అదే. అంతకు ఎక్కువా కాదు; అంతకు తక్కువ ఎంతమాత్రమూ కాదు. తన సామర్థ్యపు శిఖరాగ్రం మీద మంచి ఊపులో వున్నపుడు ఆయన రాసిన రచనల్ని, ఇప్పుడు సీరియస్ రచయితలుగా చెలామణీ ఐపోతున్న చాలామంది చప్పిడి గుజ్జులెవరైనా సరే మెడలు నొప్పేట్టేంతగా తలలు పైకెత్తి చూడాల్సిందే.

    ఆయనకు కథను కూర్చోబెట్టి చదివించేలా చెప్పడం ఎలానో బాగా తెలుసు. అదేం పాపం కాదుగా! అయితే కథ చెప్పడం మాని నైతికానైతికాల అంచనాలకీ, తీర్పులకీ, ఉద్భోదల జోలికీ వెళ్ళినప్పుడు మాత్రం విసుగుతెప్పిస్తాడు. తన ప్రతిభను సత్తువకు మించి వాడుకున్నాడనిపిస్తుంది. వట్టిపోయానని తెలుసుకుని వ్యక్తిత్వ వికాస పుస్తకాల వైపు మళ్ళాడు. అదో అరువు తెచ్చుకున్న అపాయకరమైన మేధోసంపత్తి (నా అభిప్రాయం). ఇప్పుడాయన రచనల్ని భరించలేకపోయినా, ఒకప్పుడు బాగా ఆకట్టుకున్నాయన్న కృతజ్ఞతను మాత్రం విస్మరించలేను.

    ఈ పుస్తకం చదివాను గానీ, చాన్నాళ్లవటం వల్ల ఏమీ గుర్తు లేదు. ఇప్పుడు ఈ సమీక్ష ద్వారా మళ్ళీ గుర్తు చేసుకోవడం బాగుంది.

    ~ మెహెర్

Leave a Reply