From my front porch : An anthology of Telugu stories
నేను మొదటిసారి తూలిక.నెట్ సైటును 2005 ఫిబ్రవరి ప్రాంతంలో చూశాను. అప్పుడు చదివిన ఒకటో అరో కథలు నాకు నచ్చలేదు. ఆ తరువాత, ఒకట్రెండు సంవత్సరాలకి అప్పుడప్పుడూ చూస్తూ వచ్చి, కొన్ని అనువాదాలు నచ్చి, మాలతిగారితో పరిచయం అయ్యి – ఇప్పటిదాకా వచ్చాము కాలంలోకి. ఆగస్టులో “From my front porch” రిలీజైనప్పుడు కొన్నానే కానీ, ఇన్నాళ్ళకి ఇప్పుడు చదివా. అందుకే – పరిచయం ఆలస్యమైంది. మాలతిగారికి పరిచయం అనవసరం కనుక, విషయం లోకి వచ్చేస్తున్నా… సైటులో నేను మొదట్లో చదివిన కథలు నాకు ఆనలేదు కానీ, ఈ సంకలనంలోని 18 కథలు చాలా నచ్చాయి. అనువాదం కోసం ఎంపిక నచ్చింది – అనువాదమూ నచ్చింది. పుస్తకం కూడా ఆకర్షణీయంగా ఉంది.
విశ్వనాథ వారి కథలను నేనెప్పుడూ చదవలేదు. తూలిక ద్వారా తెలిసినదే! ఆ కథతోనే ఈ సంకలనం మొదలైంది (జీవుని ఇష్టం : the soul wills it). యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు ఒకటీఅరా చదివినా నాకు మరీ సినిమాటిగ్గా అనిపించి ఆపేశా… ఇక్కడ చదివిన కథ “free to fly away” ని మాత్రం చాలాసార్లు తల్చుకున్నాను చదివి చాలారోజులైనా కూడా. వాసా ప్రభావతి గారి – “mogili – the potter’s daughter” ఒక్కటే అనుకుంటా ఈ కథల్లో నేను మొదట తెలుగులో చదివి తర్వాత ఇంగ్లీష్లో చదివింది. అలాగే, ఈ పుస్తకంలో మధురాంతకం నరేంద్ర, చాసో, వాసిరెడ్డి సీతాదేవి, కనుపర్తి వరలక్ష్మమ్మ, పి.శ్రీదేవి, రావిశాస్త్రి, పోరంకి దక్షిణామూర్తి, మునిపల్లె రాజు, ఎమ్వీరమణారెడ్డి, పాపినేని శివశంకర్, కీర్తిప్రియ, రామకోటి, సరళాదేవి గార్ల కథలున్నాయి – ఇలా పేర్ల జాబితా ఎందుకు చెబుతున్నానంటే, వివిధ తరాల రచయితలను ఎంచుకున్నారని చెప్పడానికి.
నాకు అన్నింటికంటే ఈ సంకలనంలో బాగా నచ్చిన విషయం : డైవర్సిటీ. ఒక్కో కథ ఒక్కో కథాంశంతో, శైలుల్లో కూడా చాలా తేడా ఉంది. చాసో “ఎంపు” (choices) చదువుతూ ఉంటే, నాకో కొత్త ప్రపంచం కనబడింది. అడుక్కుతినేవాళ్లలో పెళ్ళికొడుకు ఎంపిక ఎలా జరిగిందన్నది కథగా రాయాలన్న ఆలోచన ఆయనకి ఎలా కలిగిందో అంతుపట్టట్లేదు నాకు. వాసిరెడ్డి సీతాదేవి గారి కథ “lead me to light” నాకు వీటిల్లోకి బాగా నచ్చిన కథల్లో ఒకటి – కథలో దేవుడూ-మనిషీ మధ్య చర్చ జరుగుతూనే ఆ సర్కస్ వాడి కథ ను ప్రవేశపెట్టి, దీనికీ దానికి ముడిపెట్టి – ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించిన తీరు నాకు నచ్చింది. “The rite of sacrifice” అనబడు “యజ్ఞం” చాలాసేపు నన్ను ఆలోచనల్లో పడేసింది. మాలతి గారి స్వీయానువాదం “venomous creature” గానీ, నరేంద్ర గారి “violation” గానీ, కారా గారి “యజ్ఞం”, కవిసామ్రాట్ – “జీవుని ఇష్టం”, రావిశాస్త్రి – “marigolds” – ఒక్కోటీ ఒక్కో తరహా కథ. ఈ రకరకాల కథలన్నీ అయ్యాక – “కథ ఇట్లా ఉండాలె” కనుపర్తి వరలక్ష్మమ్మ గారి కథతో దీన్ని ముగించడం చాలా బాగుంది.
ఈ పుస్తకం వల్ల – నాకు కొత్త కొత్త పేర్లు కూడా తెలిసాయి (అంటే, వాళ్ళు పాత రచయితలే…నాకు కొత్త). ఉదాహరణకి – “Three Monkeys” (కీర్తిప్రియ), “wilted lotus” (ఎమ్. రామకోటి), “the long awaited moment” (పి.సరళాదేవి) – పై మూడు కథలూ చదవుతున్నప్పుడు – ఎవర్రాసారో? అనుకుంటూ ఉన్నా. పేర్లు చూస్తే – నాకు తెలీవు. నాబోటివారి కోసమే వెనుక రచయితల పరిచయం వేసారు – మంచి పని. ఇది చాలా పుస్తకాల్లో కనబడదు. అప్పుడోసారి కొకు లేఖలు చదువుతున్నప్పుడు – ఆయన రకరకాల మనుష్యుల్తో జరిపిన సంప్రదింపులు రాసారు కానీ – వాళ్ళెవరో అర్థం కాక బిక్కమొహం వేస్కున్నాను. ఈ పుస్తకంతో ఆ సమస్య లేదు 🙂
“యజ్ఞం” కథ మొదట ఇంగ్లీషులో చదువుతా అని ఊహించనేలేదు (నేను మొదట యజ్ఞం అన్న పేరున్న కథ చదివానే…అనుకుంటూ ఉన్నా. తర్వాత అర్థమైంది…నేను చదివింది న్యాయం అన్న కథ) . ఇలా – తెలుగు తెలిసుండీ, తెలుగు కథలు ఆంగ్లంలో చదవడం ఒక విధంగా బాధాకరం కావొచ్చు కానీ, అదొక ఆసక్తికరమైన అనుభవం. ఈమధ్యే త్రివేణీ పత్రిక ఆర్కైవ్స్ లో కృష్ణశాస్త్రి కవిత్వం, తెలుగులో చదివిన కవిత ఇంగ్లీషులో చదువుతూ మురిసిపోయా – అదో ఆనందం. ఇప్పుడీ కథల విషయంలో ఇంగ్లీషులో చదివాక తెలుగులో చదువుతా కాబోలు. (అయితే, మనం తెలుగులో చదివేసిన కథ ఆంగ్లానువాదం చదివితే మనకి నచ్చదు..అన్నది నా థియరీ! తూలిక.నెట్ లో చదివిన కథల్లో అది నిజమైంది. కానీ, తెలుగు కథ మొదట ఇంగ్లీషులో చదివి, తర్వాత తెలుగులో చదివితే ఏమౌతుందో చూడాలి.) ఏదేమైనప్పటికీ, ఈ సంకలనం చదివితే, మీరు తెలుగు కథలు తెలుగులో చదవాలి అనిపించి తీరుతుంది. అంటే, “ఈ కథ చాలా బాగుంది… ఒరిజినల్ చదవాలి” అనిపిస్తుందే, అలాగ. బెంగాలీ నవలలు చదువుతున్నప్పుడు – “అరే! బెంగాలీ వచ్చుంటే ఎంత బాగుండేది..ఒరిజినల్స్ చదివేదాన్ని కదా…” అనిపించేది. ఈ కేసులో మనకు అసలు భాష కూడా తెలుసు కనుక, అలాంటి సమస్యల్లేవు. 🙂
అలాగే, కొన్ని కథలు ఆనువాదాలు చదవగానే విరక్తొస్తుంది… ఎందుకు చెస్తారా అనువాదాలు అని…. కానీ, ఈ పద్దెనిమిది చదువుతున్నప్పుడు – నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ చదివా, అంతే కాక అసలు కథలు చదవాలన్న కుతూహలం పెరిగిపోయింది – కనుక, అనువాదాలు బాగున్నాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా 🙂
పుస్తకం వివరాలు:
From my front porch (An anthology of Telugu stories)
Compiled and Translated by Malathi Nidadavolu
Published: 2009
Sahitya Academy
Rs 150/-
(సాహిత్య అకాడెమీ వారి స్టాల్స్ లో దొరుకుతుంది పుస్తకం. బెంగళూరు బుక్ ఫెస్ట్ లో కూడా వారి స్టాల్ లో కనిపించింది.)
My publications in English and Telugu « English thulika
[…] in English. Hyderabad, Andhra Pradesh, India: Lekhini organization, 2010. Review by Sowmya, V. B.: http://pustakam.net/?p=2586 (in […]
పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు
[…] 47. A Spectrum of My people (Short Stories from Andhra Pradesh) – Malathi Nidadavolu. 48. From My Front Porch – Malathi Nidadavolu. 49. All I Wanted Was to Read and Other stories – Malathi […]
పుస్తకం » Blog Archive » పుస్తకంతో ఒక సంవత్సరం
[…] పుస్తకంలో ఒక వ్యాసం – మాలతిగారి From the Front Porch Anthology గురించిన వ్యాసం తెలుగు కథల […]
cbrao
ఎంపిక చేసిన రచయితలు, కధలు బాగున్నై. ఎప్పుడో వచ్చిన యజ్ఞం కధలో పల్లెలపై ప్రపంచీకరణ ప్రభావం కనిపిస్తుంది. భిన్న శైలులతో కూడిన తెలుగు కధలను ఆంగ్లానువాదం చెయ్యటం కత్తిమీద సామే. ఈ పని విజయవంతంగా చేసిన అనువాదకురాలకు అభినందనలు. సమీక్ష పుస్తకం పై ఆసక్తిని పెంచింది.
నాపుస్తకంమీద సౌమ్య సమీక్ష! « తెలుగు తూలిక
[…] http://pustakam.net/?p=2586 […]
కొత్త పుస్తకాలు 2009 « తెలుగు తూలిక
[…] వి.బి.సౌమ్య సమీక్ష ఇక్కడ […]
kalpana
” అనువాదాలు బాగున్నాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా”
కానీ మీరు చెప్పినట్లు మాకు అర్ధమైంది గా…
మాలతి గారి పుస్తకం మీద మంచి సమీక్ష అందించారు సౌమ్య.