నీ చేయి నా చేతిలో.. .పరకవితా ప్రవేశం
రాసిన వారు: గరికపాటి పవన్ కుమార్
********************
ప్రపంచ భాషల్లో వచ్చిన కవిత్వాన్ని, వాటిని రాసిన కవులే తెలుగులో పుట్టి ఆ కవితలను తెలుగులోనే రాసినట్టుగా మనం చదువుకోగలిగితే?..అందమైన ఊహే..ఇంచుమించుగా ఆ ఊహను వాస్తవ రూపంలోకి మార్చిన పుస్తకం “నీ చేయి నా చేతిలో…”. ట్రంబుల్ స్టిక్నీ, నెరుడా, బ్రాడ్స్కీ, మొంటాలే మొదలైన వారందరికి పంచె కట్టించి తెలుగులో పీఠం వేసి కూర్చోబెట్టిందీ పుస్తకం.
అష్ట భాషల కవిత్వాన్ని, పదిమంది కవులను మనకు పరిచయం చేస్తూ, వారి కవిత్వానికి గీటురాయైన కవితలు కొన్నిటిని అనువదించి అందించారు. కవిత్వానువాదం కత్తి మీద సాము లాంటిదే. ప్రతి పదానికి అర్థం తెలిసినంత మాత్రాన ఆ కవిత అర్థమైపోయింది, మన తెలుగే కదా దున్నేయవచ్చు అనుకుంటే పొరపాటే. మూలాన్ని రాసినప్పుడు కవిలో కలిగిన భావావేశంలో కొంతైనా అనువదించేప్పుడు అనువాదకుడిలో ఉండి తీరాలి, లేకపోతే ఆ అనువాదాలు నిస్సారంగా ఉంటాయి. అయితే అటువంటి భావావేశం అనువాదకుడు పుష్కలంగా సంపాదించాడనడానికి ప్రతి అనువాదం సాక్ష్యంగా నిలిచింది. అంతే కాదు మూలంలోని పద ప్రయోగాలూ, కవిత నడక, పోకడ, కవి శైలి, ప్రాస నియమాలు, యతి స్థానాలు అన్నిటినీ క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న తర్వాతనే అనువాదానికి ఉద్యమించినట్లు కనబడుతుంది. దీనికి నిదర్శనం ఏ కవిత చదువుతున్నా సహజంగా అదే మూలమన్నట్టూ భావన కలుగుతుంది, ఎక్కడా ఇది అనువాదమన్న స్ఫురణే పాఠకుడికి రాదు. అలా అని ఈ కవితలలో మూలంలోలేని పదాలు కానీ, భావాలు కానీ మచ్చుకైనా కనిపించవు. మహాకవి గోథే అనువాదాలలో మూడు రకాలను నిర్వచించారు[1], అందులో మూడవ తరహా అనువాదాలు అత్యంత విశిష్టమైనవి, అవి భావంలోనూ, రూపంలోనూ మూలవిధేయంగా ఉంటాయి. ఆ కోవకు చెందినవే ఈ అనువాదాలు.
పాల్ సెలాన్ విశిష్ట కవిత Todesfuge కి తెలుగు అనువాదం “మృత్యు మేళ”. పటిష్టమైన ఈ కవితను తెలుగులో అనువదించిన తీరు అద్భుతం. ఈ కవిత మూలాన్ని పాల్ సెలాన్ చదువుతూ ఉంటే రికార్డ్ చేసిన క్యాసెట్ వింటూ అనువాదాన్ని చదివాను, అద్భుతంగా కవితలోని సంగీత గుణం, కవిత శైలి, నడక అన్నీ జర్మన్ నుంచి నేరుగా తెలుగులోకి దిగబడ్డాయి. ఇలా కవిత్వార్ధమే కాదు, కవిత బాహ్యరూపం కూడా అనువాదంలో ప్రతిఫలించాలనే పట్టుదల ప్రతి అనువాదంలో గమనించవచ్చు.
ఒక కవి తరువాత ఇంకొక కవిని చదువుతూ పోతుంటే కవుల శైలి విభేదాలు, పద ప్రయోగాల మధ్య తేడా, రూపంలో భిన్నత్వం అన్నీ ఇట్టే గమనించవచ్చు. ఈ అనువాదకుడు పరకవితా ప్రవేశం అనే విద్య ఎక్కడ నేర్చాడా అని అబ్బురపడక తప్పదు.
యూరోపియన్ కవితా రూపాలలో ప్రధానమైనవి[2] :సానెట్(sonnet), ఓడ్(ode).ఈ కవితా ప్రక్రియలను వాటి వాటి కవితా శైలులతో సహా చక్కగా అనువదించాడు. సానెట్ అనేది పధ్నాలుగు పంక్తులతో వివిధమైన అంత్య ప్రాస నియమాలతో చెప్పే భావ కవిత. స్టిక్నీ, రిల్కే ల సానెట్లను- ప్రాసలో కొంత స్వేచ్చ తీసుకున్నా -రూపాన్ని మూలానికి ధీటుగా మలచాడు భూషణ్. అనువాదకుడు తన భాషలో కి మలిచేటప్పుడు పదానికి సమాంతర పదం లేనప్పుడు మరో పదంతో ఎలా స్వేచ్చ ప్రదర్శిస్తాడో, శైలిలో కూడా అదే ఒడుపును ప్రదర్శించడంతో అనువాదంలో sonnets శోభాయమానంగా ఉన్నాయి.. ఛందశ్శాస్త్రంలో బ్రౌన్ పురస్కార గ్రహీత జెజ్జాల కృష్ణ మోహన రావు సానెట్ మీద రాసిన వ్యాసంలో తెలుగులో సానెట్ మీద పెద్ద కృషి జరగలేదు అని రాశారు[3].దాన్ని బట్టి, ఇటువంటి సానెట్ అనువాదాలను చేసి తెలుగు వారికందించిన వారిలో భూషణ్ ఆద్యుడనే చెప్పవచ్చు
కవిత్వానువాదంలో ఆసక్తి ఉన్నవాళ్ళు పాఠ్య పుస్తకంగా, కవిత్వం అంటే ఇష్టపడేవారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ కవులను చదువుకోడానికి తప్పక చదవాల్సిన పుస్తకం.
ఈ కవితలలో కొన్ని “విశ్వ కవిత” అనే శీర్షికన “ఈ మాట” వెబ్ పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి.
(ఇంతగా ఈ కవితలు నన్ను, నా భార్య సంగీతను ఆకట్టుకున్నాయి కాబట్టే వీటి ఆధారంగా మూలాలను పరిశీలిస్తూ అస్సామీస్ లోకి అనువదించాము. అస్సామీస్ లో ఈ పుస్తకం “మోర్ హాత్ తొమార్ హతోత్” ( నీ చేయి నా చేతిలో ) గా త్వరలో వెలువడనుంది.)
Notes:
1 Sharon Sloan (1992), Translations (Johann Wolfgang Von Goethe Trans. original worked published in German, stuttgart, 1819) In Rainer Schulte & JOhn Biguenet(Eds.), Theories of Translation An Anthology of Essays from Dryden to Derrida (pp. 60-63). Chicago: The University of Chicago Press
2 Charles Mills Gayley & Benjamin Putnam Kurtz (1919),University of California, Methods and Materials of Literary Criticism – Lyric, Epic, and Allied Forms of Poetry. Boston: Atheneum Press.
3 జెజ్జాల కృష్ణ మోహన రావు, సన్నుతి లేక నవగీత – తెలుగులో సానెట్
పుస్తకం » Blog Archive » కవిత్వానువాదం పై ప్రశ్నోత్తరాలు
[…] నీ చేయి నా చేతిలో మీరిద్దరు కలిసి చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదేనా (అనువాదమైనా, మరేదైనా) […]
budugoy
అనుకోకుండా నా చేతబడ్డ ఈ పుస్తకంలో ట్రంబుల్ స్టిక్నీ అనువాదం చూసి నేను అచ్చెరువొందాను. ఎంత దుష్కరమైన్ ఆంగ్ల కవితను ఇంత చక్కగా తెలుగులోకి ఎలా తీసుకొచ్చారా అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది.
అలాగే ఒక చిన్నగమనిక. మీరు పుస్తకాన్ని ఫోటో తీసినపుడు ఫ్లాష్ ఆఫ్ చేసి తీయాల్సింది
గరికపాటి పవన్ కుమార్
ఈ పుస్తకం , తమ్మినేని యదుకుల భూషణ్ ఇతర రచనలు
౧.నేటికాలపు కవిత్వం తీరు తెన్నులు (విమర్శ)
౨.సముద్రం ( కథల సంపుటి)
౩.చెల్లెలి గీతాలు (కవిత్వం)
౪.వాన కురిసిన పగలు (కవిత్వం)
హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ ,పాలపిట్ట బుక్ స్టాల్ లో దొరుకుతుంది.
సౌమ్య
వావ్! చాలా మంచి పరిచయం. ఈ సమీక్ష పూర్తి చేసే కొద్దీ నాకు ఆ పుస్తకం చదవాలన్న కుతూహలం పెరిగిపోయింది.