సి.పి. బ్రౌన్ అకాడమీ, ఆల్ఫా ఫౌండేషన్.
ఇవాళ బుక్ ఫేర్ లో నన్ను అమితంగా ఆకట్టుకున్న స్టాల్స్ లో ఒకటి, సి.పి. బ్రౌన్ అకాడమీ వారి స్టాల్. స్టాల్ ముందు పెట్టిన పుస్తకాలు అన్నీ చిన్నపిల్లలవి అనిపించాయి. స్టాల్ కూడా చిన్నదే. కాకపోతే ఆసక్తికరమైన పుస్తకాల పేర్లు చేస్తూ లోపలకెళ్లి, రెండు పుస్తకాలు కొన్న. ఒకటి “తెలుగు పరిశోధనా వ్యాసమంజరి”, మరోటి: “సాహితీ స్రవంతి” అనే సాహిత్య పత్రిక.
ఇంటికొచ్చాక, వారి వెబ్‍సైటూ చూసి, సాహిత్య పత్రికలో ఏముందో అని తిరగేస్తుంటే, వీరి గురించిన వివరాలు వెంటనే పంచుకోవాలనిపించింది. ఇప్పటికిప్పుడు పుస్తకం పూర్తి చేయడం వీలు కాదు కాబట్టి, వారిచ్చిన కాటలాగుని ఇక్కడ యునికోడీకరించి పెడుతున్నాను. హైద్ బుక్ ఫేర్ కి వెళ్ళేట్టు అయితే తప్పనిసరిగా ఈ స్టాల్ పై ఓ కన్ను వేయండి. (స్టాల్ నెం. గుర్తు లేదు కానీ, ఇది డయాస్ వెనుకున్న వరుసలో అటు చివర్న (ఈ-తెలుగు స్టాల్ వరుసలో, ఈ-తెలుగుకి కుడి చివర్న ఉంటుంది.)
సాహిత్య పత్రికలో నాకు ఆసక్తి కలిగించిన విషయాలు: “ఒకే పద్యంలో విద్యావ్యవస్థ” అంటూ ఓ పద్యాన్ని డా|| గరికపాటి నరసింహారావు గారి వ్యాసం, అలనాటి సాహిత్యం శీర్షికన శ్రీశ్రీగారు రాసిన “నేటి తెనుగు కవితలు – పోకడలు”, త్రిపురనేని గోపిచంద్ మమకారం కథ, దాని ఆంగ్లానువాదం, “తెలుగు సాహిత్యం – ముస్లిముల సేవ” – ఆచార్య కె. రుక్నుద్దీన్ అనే వ్యాసం. ఇందులో “కోతి కొమ్మచ్చి” పై శ్రీరమణ గారి సమీక్ష కూడా ఉంది.
కాటలాగులో వివరాలు:
సి.పి.బ్రౌన్ అకాడమీ హైదరాబాద్‍కు చెందిన ఆల్ఫా ఫౌండేషన్ అనే రిజిస్టర్డ్ ఛారిటబుల్ సంస్థ ఆధ్యర్యంలో 2007లో స్థాపించబడింది.
ఆకాడమీ ముఖ్యోద్దేశ్యాలు:
కాలగతిలో అనేక కారణాల వల్ల దేశ భాషలు నిరాదరణకూ, నిర్లక్ష్యానికి గురవుతున్న తరుణంలో తెలుగు భాషా, తెలుగు సంస్కృతీ వికాసాన్నీ ప్రోత్సాహించాలనే సంకల్పంతో ఆల్ఫా ఫౌండేషన్ వారు సి.పి.బ్రౌన్ ఆకాడమీని ఆరంభించారు. సి.పి. బ్రౌన్ ఆకాడమీ ముఖ్యోద్దేశాలు:
–> తెలుగు వారి పిల్లలకు తమ భాషా, సాహిత్య, సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని తెలియజెప్పి, వారు తెలుగు భాషాజ్ఞానం పెంచుకునేందుకు సులభమయిన సరళమయిన బోధనాప్రణాళికలు ఏర్పరచడం.
–> తెలుగులో మంచి సాహిత్యాన్ని అందించగల రచయితలను ఎంపిక చేసి ప్రోత్సహించడం.
–> తెలుగు భాషలో ఉన్న పుస్తకాలన్నింటిన్నీ, పత్రికలను, పరిశోధనా గ్రంథాలను సేకరించి కంప్యుటీకరణ చెయ్యడం, మరియు ఒక బృహద్గ్రంథాలయం ఏర్పరచి, తెలుగు వారందరికీ అందుబాటులోకి తేవడం.
అకాడమీ కార్యకలాపాలు:
సలహా మండలి సభ్యుల ప్రోత్సాహంతో, బ్రౌన్ అకాడమీ ప్రస్తుతం ఈ కింది ప్రణాళికలు చేపట్టింది.
–> కారణాంతరాల వల్ల తెలుగు చదవటం, రాయటం నేర్చుకోలేకపోయిన తెలుగు పిల్లలకు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో నివసిస్తున్న పిల్లల స్వయంశిక్షణకు వీలుగా శాస్త్రీయ పద్ధతిలో, తెలుగులో రోమన్ లిపితో సహా వర్ణమాల, శబ్ద మాల, వాక్య నిర్మాణం, తెలుగు సంభాషణ వంటి వాచకాలు ముద్రించబడ్డాయి. ప్రయోగాత్మకంగా కొందరు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వీటిని అందించి, వారి ప్రతిక్రియల ఆధారంగా ఈ పుస్తకాలను తగినట్ల్ఉ సంస్కరించి, వీటిని బహుళ ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతున్నది. సంస్కరించబడిన వాచకాలు ఆకాడమీ వెబ్ సైటులో కూడా ఉంచబడినవి. అలాగే భాష నేర్చుకోవడానికి బాగా ఉపకరించే సుమతీ శతకమూ, వేమన శతకమూ, తెలుగు సామెతలు వంటివి చిన్న సచిత్ర పుస్తకాలుగా, ఆకర్షనీయంగా రోమన్ లిపిలో మూలాన్నీ, సరళమైన ఆంగ్ల తాత్పర్యం వ్యాఖ్యానాలతో ప్రచురించటం జరుగుతూ ఉంది. వీటిని కూడా త్వరలో ఆకాడమీ వెబ్‍సైటులో ఉంచడం జరుగుతుంది.
–> తెలుగు భాషా, సాహిత్య విషయాల్లో జీవితమంతా కృషి చేసి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు, ’తెలుగు భారతి పురస్కారం’ పేరుతో భారతీయ పురస్కారానికి దీటైన (ప్రతిష్టాత్మకమైన బహుమతి అకాడమీ ఏటేటా అందించబోతున్నది.) ఈ 2008 ఉగాదితో ఆరంభించి ప్రతీ ఉగాది పండుగకు ఇలాంటి బహుమతులు అందించాలని సంకల్పం.
–> తెలుగు సాహిత్య విషయాలలో పరిశోధనలు జరిగే విశ్వవిద్యాలయాలన్నింటి నుంచి ఆయా పరిశోధన వివరాలు సేకరించి త్రైమాసికంగా ఒక సంకలనం ప్రకటించటం, ఏటేటా ఉత్తమ పి.హెచ్.డి థీసిస్‍కు తగిన బహుమతి అందించే విషయం కూడా పరిశీలనలో ఉంది.
–> తెలుగు భాషలో ఒక చక్కని నిఘంటువును అకాడమీ పర్యవేక్షణలో పరిశోధకుల ద్వారా నిర్మింపచేసి, తెలుగు సాహిత్య ప్రియులకందజేయడం అకాడమీ తలపెట్టిన మరొక బృహత్ ప్రణాళిక.
–> తెలుగు భాషలో ఉత్తమమైన కావ్యాలు, అనువాదాలు, జీవిత కథలు, ఇతర గ్రంథాలు రాసిన, రాస్తున్న కవులకు, రచయితలకు ముద్రణ విషయంలో ఆర్థిక సహాయం అందించాలని ఆలోచన కూడా అకాడమీకి ఉన్నది.
–> అలాగే తెలుగులో సరళమైన భాషలో ఉన్నత ప్రమాణాలతో ఒక సాహిత్య మాసపత్రికను, ప్రవాసాంధ్రుల పిల్లలకు ఉపయోగపడేలా రోమన్ లిపిలో ఒక తెలుగు పిల్లల మాసపత్రికను ప్రకటించే ప్రయత్నం కూడా అకాడమీ చేపట్టాలనుకుంటున్నది.
–> బ్రౌన్ అకాడమీ అధికార భాషా సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో ’భాషా సంస్కృతుల వారసత్వాన్ని కాపాడుకోవడం ఎలా?’ అనే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు, స్కూల్ పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి.
–> తెలుగులో సమకాలీన సాహిత్య స్రుజనను ప్రోత్సాహించే ప్రయత్నంలో భాగంగా సీ.పీ.బ్రౌన్ అకాడమీ, తెలుగు కథల పోటీ నిర్వహిస్తోంది. దీని గురించి ప్రకటన జారీ ఛేయటం జరిగింది. రానున్న మాసాలలో ఇదే విధంగా నవలా రచన పోటీలు, నాటక రచన పోటీలు నిర్వహించబడతాయి.
సి.పి. బ్రౌన్ అకాడమీ ప్రచురణలు:
బాలశిక్షణ సామాగ్రి – I
వర్ణమాల – అక్షరమాల పరిచయం:
{సెట్ (8 పుస్తకాలు + సిడి)} – Rs 495/-
విడి పుస్తకం ధర: Rs 60 /-
వర్ణమాల- అభ్యాస పుస్తకం
శబ్ధమాల – రకరకాల పదముల పట్టిక
వాక్య నిర్మాణం – వాక్యం రాయడం – వివరణ
తెలుగులో మాట్లాడుకుందాం – చిన్న చిన్న సంభాషణలు
వేమన శతకం – రోమన్ లిపిలో కొన్ని వేమన పద్యాలు – తాత్పర్యం.
సుమతీ శతకం – రోమన్ లిపిలో కొన్ని పద్యాలు – తాత్పర్యం.
సామెతలు
సిడి.
జీవిత చరిత్రలు:
౧. ’గ్రంథాలయ సారధి’ – అడుసుమల్లి శ్రీనివాస రావు. – Rs 95 /-
— డాక్టర్ వెలగ వెంకటప్పయ్య.
౨. ’మార్గదర్శి’ – దుర్గాభాయ్ దేశ్‍ముఖ్ – Rs 90/-
–శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల
౩. వావిళ్ళ రామస్వామిశాస్త్రి Rs 90/-
— శ్రీ వజ్ఝల వెంకట సుబ్రహ్మణ్య శర్మ
ప్రబంధ రత్నావళి:
౧. మనుసంభవం పరిచయం (ఆంగ్లం) – Rs 120/-
–ఆచార్య ఎస్.ఎస్ ప్రభాకర రావు
౨. ఆముక్తమాల్యద (పరిచయం) Rs 95/-
–శ్రీమల్లాది హనుమంతరావు
౩. తెలుగు పరిశోధనా వ్యాసమంజరి Rs175 /-
— సం|| డా| వేలుదండ నిత్యానంద రావు.
౪. సి.పి.బ్రౌన్ అకాడమీ బహుమతి కథలు – 2008 Rs 150/-
౫. వసు చరిత్రము (పరిచయం) – Rs 95/-
— డా|| కిలాంబి జ్యోతిర్మయి.
సాహితీ స్రవంతి (త్రైమాసిక సాహిత్య పత్రిక)
౧. విడిపత్రి : రూ|| 20
౨. సంవత్సరం చందా: రూ|| 80
సౌమ్య
Hmm… I thought it would have been some other govt related acadamy like – Telugu academy, Sahitya Academy.. etc etc. 🙂
Good to know abt them… Yeah, nice collection.