సమాజాన్ని ప్రతిఫలించిన “ఆన్నా కరేనినా”

రాసి పంపిన వారు: దీపసభ
***************
annakareninaఎప్పుడయినా సముద్రం ముందు నిల్చున్నారా? లోపలికి వెళ్లాలంటే బెరుకు, అడుగుపెట్టాలన్న ఉత్సాహం రెండూ ఒకేసారి అలల్లా తోసుకొచ్చే ఆ భావాన్ని ఎప్పుడయినా అనుభవించారా? వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు… ఏదయినా కానివ్వండి. ‘గొప్పది’ అని ముద్రపడినవాటి జోలికెళ్లాలంటే ఒక ఉత్సుకత… అదే సమయంలో అదోరకమైన తటపటాయింపు. అవికూడా సామాన్యమైనవాటికి మల్లే మన ముందుకు అంత చప్పున రావు. ‘వజ్రం ఎవరికోసమూ వెదకదు, తానే వెదకబడుతుంది’ అంటాడు మహాకవి కాళిదాసు. బైబిలు కూడా ‘ముత్యం వంటి స్త్రీ వెతకబడుతుంది’ అంటుంది. అలా ప్రత్యేకించి వెతికితే, శ్రద్ధ పెడితే, సహనం వహిస్తే దోబూచులాట చాలించి ఏదో రోజు ఎదురుపడతాయి. అప్పుడు తెలుస్తుంది వాటి విలువ. వాటితో మనం కలవడంలోని ఆనందం. మరీ మార్మికంగా చెబుతున్నాననుకోకండి.. లియో టాల్‌స్టాయ్‌ రచన ‘ఆన్నా కరేనినా’ సరిగ్గా ఇలాగే నాతో ఇరవయ్యేళ్ల పాటు దోబూచులాడింది. తాతగారింట్లో ఓ పాత బీరువాలోంచి తొంగిచూసినప్పుడు మొదటిసారి నేను దాన్ని పలకరించాను. అది గొప్పదని అప్పటికే తెలుసు. ఎందుకో తెలీదు. బెరుకుగా చేతిలోకి తీసుకుని మొదటి పేజీ తిప్పగానే ‘సుఖపడే సంసారాలన్నీ ఒకలాగే ఉంటాయి. సుఖంలేని సంసారాలకి మాత్రం దేని బాధలు దానివి’ వాక్యం కనిపించింది. సుఖదుఃఖాలు, అవి ఉండటాలు లేకపోవటాలు – ఇలా వేటిమీదా అవగాహనలేని చిన్నతనం కావటం వల్ల అది నాకేమీ అర్థంకాలేదు. కానీ ఆ వాక్యం గమ్మత్తుగా అనిపించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ పుస్తకాన్ని తెరిచి ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మొదటిసారి సముద్రపు అలల్లో పాదాలు తడిసిన భావన.

1873 మే నెలలో ‘ఆన్నాకరేనినా’ రాయడానికి శ్రీకారం చుట్టినప్పుడు రష్యన్‌ మహారచయిత లియో టాల్‌స్టాయ్‌ (1828-1910) ఒక మిత్రుడికి ‘ఈ నవల కచ్చితంగా నా రచనల్లో తొలిగా నవల అనే పేరుకి అర్హమైనది, నా అంతరంగాన్ని ఆవహించింది, దీని రచనాక్రమంలో పూర్తిగా నిమగ్నం అయిపోయేను…’ అని రాసేడు. జీవితం అప్పటికే లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి రచయిత ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. స్థూలంగా కథ చెప్పాలంటే – ఆన్నా కరేనినా అనే ఉన్నత వర్గపు మహిళ తన వివాహ బంధాన్ని అతిక్రమించడం, దాని వల్ల రేగిన మొత్తం ఘటనలు – అని ఒక్క వాక్యంలో చెప్పుకోవచ్చు. కాని నవలలో అంతర్గతంగా ఉన్న అర్ధం ‘కుటుంబగాథ’ను అధిగమించి ఉంటుంది. కుటుంబం, సంఘం, సంస్కరణలు, దృక్పథాలు – ప్రతిదీ తారుమారు అయిపోయి కొత్త రూపు దాల్చే సమయంలో పరిస్థితులు ఎలా కుదురుకుంటాయి అనేది ఒక సమయంలో రష్యాకి సంబంధించి అత్యంత ప్రాముఖ్యంగల ప్రశ్న. ఈ నవల ముఖ్య సూత్రం అదే. ఆన్నా భర్త కరేనిన్‌, నాలుగేళ్ల కొడుకు సెర్యోషలతో హాయిగా ఉంటుంది. తమ్ముడి కాపురంలో తలెత్తిన గొడవను పరిష్కరించడానికి వెళ్లినప్పుడు ఆమెకి వ్రాన్‌స్కీ పరిచయమవుతాడు. అది కాస్తా ప్రేమగా పరిణమించి ఇద్దరూ ఒకటవుతారు. సమాజపు కట్టుబాట్లను ధిక్కరించి కలిసుంటున్నా, ఆ సమాజం తమను వెలిగా చూస్తోందన్న భావన వాళ్లలో పోదు. వ్రాన్‌స్కీ ప్రజాజీవితంలో మునిగిపోయి దాన్ని ఎదుర్కోగలిగినా, ఆన్నా స్త్రీ సహజమైన ఆలోచనలతో అంత త్వరగా సమాజాన్ని ఎదిరించలేకపోతుంది. గౌరవప్రదమైన జీవితం నుంచి బైటికొచ్చేశానన్న కుంగుబాటు, కొడుకు ఎడబాటు, ప్రేమించిన వ్యక్తి నిరాదరిస్తున్నాడేమోనన్న అనుమానం… రకరకాల ఆలోచనలతో ఆమె విసిగిపోయి రైలు కిందపడి చనిపోతుంది. మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఇంతే కథ. ముందే చెప్పినట్టు ఇది కేవలం ఆన్నా, వ్రాన్‌స్కీల కుటుంబగాథ మాత్రమే కాదు. నాటి రష్యా జీవితాన్ని ప్రతిబింబించే పాత్రలు బోలెడుంటాయి. వాటికి సంబంధించిన చిన్న చిన్న అంశాలు కూడా నవలలో చిత్రితమవుతాయి. ‘ఇప్పుడు నా జీవితం, నాకు యేం జరిగినా జరగనీగాక, నా యావజ్జీవితం, జీవితంలోని ప్రతి క్షణం ముందటిలాగా అర్ధహీనంగా వుండదు. కాని మంచికి ప్రతిరూపంగా దానికి వొక అర్ధం కలుగుతుంది, దాన్ని అలా అర్ధవంతం చేసుకునే సామర్థ్యం నాకు వుంది.’ ఈ మాటలతో ‘ఆన్నా కరేనినా’ నవల ముగుస్తుంది.

వర్ణనలేమీ లేకుండా ‘సూటిగా విషయంలోకి వెళ్లిపోయే’ సాహిత్య కాలంలో ఉన్నాం ఇప్పుడు. పైగా పాఠకులు వర్ణనలు చదవరనే అపోహ ఒకటి రచయితలకు. అయితే మనిషినో, సన్నివేశాన్నో, వాతావరణాన్నో కళ్లకు కట్టినట్టు వర్ణించడం ఎక్కువగా నాటి రష్యన్‌ నవలల్లో కనిపిస్తుంది. అలాగే చెబుతున్నదానికి సంబంధించి ఎన్ని పాత్రలు అవసరమో అన్నీ వస్తాయి. వాటి పేర్లు, బంధుత్వాలు, ప్రవర్తనలు… అన్నిటినీ గుర్తుంచుకోవడం జెట్‌ స్పీడ్‌ చదువరులకు చిరాకు తెప్పిస్తుంది. వర్ణనలు, చిత్రణ ముఖ్యం అనుకునేవారికి ఈ నవల విందుభోజనమే. ఆన్నాను మొదటిసారి వ్రాన్‌స్కీ చూసిన సందర్భంలో ఆమె చూపు అతనికెలా అనిపించిందో చూడండి….

“ఆమె కళ్లు రజితవర్ణంగా, ప్రకాశమానంగా వున్నాయి. గుబురుగా ఉన్న పక్ష్మాల వల్ల నల్లగా కనిపించాయి. ఆ కళ్లు అతని ముఖంమీద – అతను ఆ కళ్లనే చూస్తూ వున్నాడు – ఒక క్షణంపాటు స్నేహపూర్వకమైన శ్రద్ధ కనబరుస్తూ చూపు సారించాయి, అతన్ని గుర్తుపట్టినట్టుగా. మరుక్షణంలో యెవరికోసమో వెతుకుతున్నట్టు జనసమూహంకేసి మళ్లేయి. ఆ లిప్తకాలంలోనే ఆమె వదనంమీద లాస్యం చేసిన సంయమిత ఉత్సాహాన్ని అతను గమనించేడు. ఆమె అరుణాధరాల్ని వొంపు తిప్పుతూ లీలగా భాసింపచేసిన మందహాసాన్ని గమనించేడు. ఆమె మొత్తం మూర్తిలో యేదో ఉప్పొంగి వస్తూవున్నట్టూ అది ఆమె యిష్టానిష్టాల ప్రమేయం లేకుండానే ఆమె చిరునవ్వులోనూ, కళ్ల తేజస్సులోనూ వ్యక్తం అయినట్టూ వుంది. ఆమె ప్రయత్నపూర్వకంగా కళ్లల్లోని ఆ దీప్తిని ఆర్పింది. అయినా ఆమె యిష్టానిష్టాలకి వ్యతిరేకంగానే అది లీలగా భాసితమయే ఆమె చిరునవ్వులో ప్రకాశించింది.”

ఒక వయసులో చదివిన పుస్తకాలు (ముఖ్యంగా పురాణాలు, భారతభాగవతాలు మొదలుకొని ఏ మార్క్సిజమో వరకూ, అలాగే యుద్ధము-శాంతి, అతడు-ఆమె వంటి కాల్పనిక సాహిత్యమూ) అప్పుడు అర్థం కాకపోవడమూ, విసుగనిపించడమూ తర్వాతెప్పుడో చదివినప్పుడు మహాద్భుత అనుభవాన్ని అందించడమూ పుస్తకప్రియులకు అనుభవంలో ఉంటుంది. ఆన్నా కరేనినా సరిగ్గా అలాంటి పుస్తకమే. ఈ నవల కిందపెట్టకుండా చదివిస్తుందనీ శరీరంలో రసాయనాలను పోటెస్తుందనీ పూర్తిచేసిన వెంటనే ఏదో తాదాత్మ్యం ఆవహిస్తుందనీ చెప్పను. రెండువందల ఏళ్ల కిందటి రష్యన్‌ సమాజంలో… ఆన్నా కరేనినా మన పొరుగింటామె అయినట్టు బతుకుతూ…. ఒక కాలనాళికలో ప్రయాణించి అదాటున బయటికొచ్చేసినట్టు మాత్రం అనిపిస్తుంది.

“నేను రాసినదాన్ని యీనాటి పిల్లలు యిరవై యేళ్ల తర్వాత చదువుతారని, వాళ్లు యేడిచి, హసించి జీవితాన్ని ప్రేమిస్తారని నాకు గనక చెబితే, నేను నా యావజ్జీవితాన్ని, సకల శక్తుల్నీ దానికే అంకితం చేసేవాణ్ని” అని టాల్‌స్టాయ్‌ రాశాడు. టాల్‌స్టాయ్‌గారూ, ఇరవయ్యేళ్ల తర్వాత కాదు, రెండు వందల యేళ్ల తర్వాత పుట్టినవాళ్లం కూడా మీ రచనలను చదువుతున్నాం, వాటినుంచి జీవితాన్ని చూడటం నేర్చుకుంటున్నాం చూడండి!

You Might Also Like

6 Comments

  1. Mrs.Naren

    Currenlty reading..Thanks for the very nice introduction…:-)

  2. శ్రీనిక

    దీపసభ గారు,
    పరిచయం బాగుంది.చాలా కాలంనుంచి చదవాలన్న కోరిక మరింత బలోపేతం చేసింది మీ పరిచయం.
    ధన్యవాదాలు.

  3. kalpana

    దీపసభ గారు,

    నేనొప్పుకోనండీ.. నేను రాద్దామనుకుంటుంటే మీరెలా రాసేస్తారండీ?

    నన్ను అమితం గా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఇది ఒకటి. బాగా రాశారు. మీరు, టాల్ స్టాయ్ కూడా.

  4. నరేష్ నందం

    “వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు… ఏదయినా కానివ్వండి. ‘గొప్పది’ అని ముద్రపడినవాటి జోలికెళ్లాలంటే ఒక ఉత్సుకత… అదే సమయంలో అదోరకమైన తటపటాయింపు.”
    నిజమే.. “అన్నా కెరినీనా..” నా పుస్తకాల షెల్ఫులో సంవత్సరం నుంచీ ఉంది.
    ఎప్పటికప్పుడు చదువుదాం అనుకుంటాను.
    వివిధ కారణాలతో కుదరలేదు.

    ఇప్పుడు ప్రయత్నిస్తాను.
    ఒక మంచి పరిచయంతో కెరినీనాను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  5. తృష్ణ.

    బాగుందండీ.మంచి పుస్తకం గురించి రాసారు.

Leave a Reply