మాలపల్లి

“మాలపల్లి” అన్న నవల గురించి వినడమే కానీ, ఎప్పుడూ అది ఏమిటి? ఎలా ఉంటుంది? అన్న కుతూహలం కలుగలేదు. ఇటీవలి కాలంలో ఒకరిద్దరు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈ పుస్తకం గురించి విన్నాను. మాలతి గారి సైటులో ఓ వ్యాసాన్ని చూసాను. అప్పట్నుంచి నాలో ఈ నవల గురించి కుతూహలం మొదలైంది. అనుకోకుండా అది నా చేతికి చిక్కడంతో, ఎట్టకేలకు నేనూ ఈ నవలని చదవగలిగాను. ఇది 1922 లో రాసారట. దీనికి సంఘవిజయమన్న పేరు కూడా ఉంది. రచన ఉన్నవ లక్ష్మీ నారాయణ.

కథ విషయానికొస్తే, నాకు ఇది రెండు రకాలుగా అనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే, ఓ కుటుంబం కథ ఇది. ఆ కుటుంబంలోని వ్యక్తుల కథ. వారు సమాజానికి ఏం చేసారు? వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇలాంటివి చూపే కథ. కానీ, ఇంకో విధంగా ఆలోచిస్తే, ఇది ఒక సమాజం కథ. ఆ సమాజంలో పరిస్థితులూ, కొనసాగిన ఉద్యమాలూ, అందులోని వీరులూ-ధీరులూ, ప్రజల మధ్య ఉన్న అనుబంధాలు, తమ నాయకులపై వారి అభిమానం, ఉద్యమకారుల జీవితాలు – ఇలాంటివన్నీ కళ్ళకు కట్టినట్లు చెప్పే కథ. రెండింటిలో ఈ నవలని గురించి చెప్పడానికి ఏ వర్ణన అయినా సబబుగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ నవల చదవడం నాకు పూర్తిగా కాకున్నా చాలా వరకు మంచి అనుభవం. అప్పటి సమాజం గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. పంచమోద్యమం అన్న కాన్సెప్టు నుండి, సామాజిక అసమానతలను రూపుమాపాలన్న సంస్కరణాభిలాష, స్వాతంత్రోద్యమం – ఇలా రకరకాలుగా మలుపులు తిరిగింది కథ. కథలో ఎటొచ్చీ, ప్రధానంగా ఉన్నది ఒక కుటుంబంలోని వ్యక్తులే అనుకోండి, అది వేరే విషయం 🙂

ఈ నవలలో భాష చాలా కష్టంగా అనిపించింది నాకు మొదట్లో. నవల చదవడం ఆపేద్దామా అన్నంత భయమేసింది. కానీ, ఓ నలభై-యాభై పేజీలయ్యేసరికి భాషా బాధలు నశించాయి. అలవాటైంది కాస్త. అలాగని నాకు ప్రతి పదం అర్థమైందని కాదు కానీ, భావం మాత్రం అర్థమైంది. ఇది వ్యావహారికంలో రాసిన నవల అని విన్నాను. ఎనభై ఏళ్ళ క్రితం నాటి వ్యావహారికం ఇంత గ్రాంథికంగా ఉండేదన్నమాట అనిపించింది నాకు. భాషా పరిణామాన్ని తలుచుకుంటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు. కొన్ని కొన్ని చోట్ల చర్చలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా – కథ మొదట్లోనే దేవుడికి అంటులేదంటూ జరిగిన ఓ చర్చ నన్ను బాగా ఆలోచింపజేసింది . అది ఇక్కడ చదవొచ్చు. తరువాత చర్చల్లో ప్రధానంగా నాకు నచ్చినవి – చర్చి ఫాదర్ తో రామదాను, అప్పాదాసు మొదలైన వారికి జరిగిన చర్చ. జైళ్ళలో జీవితాలూ, సెటిల్మెంట్ల లో పరిస్థితులూ, మతాచార్యుల వ్యవహారం – ఇలా ఎన్నో విషయాలని గురించి చాలా వివరంగా తెలిసింది నాకు ఈ నవల ద్వారా.

కథలో విరివిగా ఎక్కడపడితే అక్కడ తత్వాలూ, కీర్తనలూ, పద్యాలు, గేయాలూ వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఒక విధంగా ఆలోచిస్తే, అది నిజజీవితానికి వీలైనంత దగ్గరగా నవలను ఉంచే ప్రయత్నం అనిపించింది. మరో విధంగా ఆలోచిస్తే నాకు సత్యజిత్ రాయ్ రాసిన “those songs” అన్న వ్యాసం గుర్తు వస్తోంది. అందులో భారతీయ సినిమాల్లో ప్రత్యేకంగా పాటలు పెట్టడం గురించి రాస్తూ, మనకు సినిమా అన్నది ఖర్చులేని మానసికోల్లాసం కలిగించే ఏకైక విధానం కనుక అందులోనే అన్ని రకాల ఆటపాటలనీ చొప్పించే ప్రయత్నం చేస్తారు మన సినిమావాళ్ళు – అన్న అభిప్రాయం వ్యక్తం చేసారు. అంటే, సంగీతానికో హాలు, నాటకానికో హాలూ – ఇలాంటివి మన సమాజంలో కష్టమని. ఆ వ్యాసాన్ని ఈ నవలకి అన్వయించాను నేను. నా ఆలోచనలో పస లేదని తెలుస్తూనే ఉంది కానీ, ఎందుకో ఈ పోలికను ఆపలేకపోతున్నాను. ఈ నవల చదువుతూ ఉంటే నాకు తట్టిన ఇంకో ఆలోచన – దీనీ, కన్నడ రచయిత “భైరప్ప” రాసిన “దాటు” నవలకీ మధ్య ఉన్న సారూప్యం. కథా పరంగా పోలిక కొంతే ఉండొచ్చు కానీ, రెండు నవలలు రాయడంలో రచయితల ఆశయాలు కాస్త దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. (దాటు గురించి ఇదివరలో పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.). ఇవన్నీ కాక, ఎక్కడ ఆ తత్వాలూ, కీర్తనలూ వగైరా మరుగున పడిపోతాయేమోనన్న భయం కూడా ఉండి ఉండవచ్చు వాటిని వీలున్న చోటల్లా జొప్పించడంలో.

మొత్తానికి ఈ నవల రాయడంలో రచయిత ఉద్దేశ్యం ఏమైఉంటుందని ఒకసారి నాబ్లాగులో కామెంటు వచ్చింది. నాకు అర్థమైనంత వరకు ఇది సామాజిక నవల, సంఘ-విజయం అన్న పేరులోనే నవల ఉద్దేశ్యం అర్థమౌతోంది. రచయిత ఉద్దేశ్యం ఏమైనా కూడా, ఈ నవల ద్వారా అప్పటి సమాజం గురించి చాలా సంగతులు తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఆలోచిస్తే, ఇది ఓ చరిత్ర పాఠం. సంఘ చరిత్ర అనొచ్చేమో. వ్యక్తిగా ఆయనెంత చదివారో (పుస్తకాలనీ, వ్యక్తుల్నీ, సమాజాన్నీ అందరినీ) ఈ పుస్తకం చూస్తూ ఉంటే అర్థమౌతుంది.

గమనిక: నేను కావాలనే కథ గురించి ఎక్కువ మాటలాడలేదు. అసలు కథ ఏమిటి? అన్న విషయం గురించి. కథని వివరిస్తూ, విశ్లేషిస్తూ ఎవరన్నా మరో వ్యాసం రాస్తారని ఆశ. 🙂

ఈ నవల గురించి మాలతి గారి వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ

You Might Also Like

5 Comments

  1. పుస్తకం » Blog Archive » నూరేళ్ళ తెలుగు నవల

    […] ఈ పుస్తకంలో పరిచయం చేయబడ్డ ఇతర నవలలు: మాలపల్లి (ఉన్నవ లక్ష్మీనారాయణ); బారిష్టరు […]

  2. కొడవళ్ళ హనుమంతరావు

    సహవాసి సంక్షిప్తం HBT వాళ్ళు ప్రచురించారు: http://hyderabadbooktrust.blogspot.com/2009/04/blog-post_23.html#comments

    ఈ నవలపై జయప్రభ విమర్శానాత్మక వ్యాసం, “ఉన్నవ-మాలపల్లి,” [1] చదవదగ్గది. భాష గురించి సౌమ్య ప్రస్తావించి ఆశ్చర్యపోయారు కనుక, జయప్రభ అందు గురించి అన్న మాటలు చెప్తాను: “ఇహ భాష విషయానికొస్తే ఉన్నవ వాక్యాలలో తెలుగుతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వ్యావహారిక వచనం జీవంతో తొణికిసలాడుతుంది. నిత్యమూ వాడుకలో వినవచ్చే ఎన్నోరకాల పలుకుబడులూ..సామెతలూ ఈ నవలనిండా కన్పిస్తాయి. అయితే ఉన్నవకి భాష విషయంలో ఒక విభజన లాంటిదేదో ఉన్నట్టుంది. వ్యవసాయపు విషయాల్లోనూ, నిత్యవ్యవహారాల్లోనూ, సంభాషణల్లోనూ తేటగా ఉండే తెనుగునీ, వినసొంపైన భాషనీ రాసి – ప్రేమ, ప్రకృతివర్ణన, పారమార్ధిక విషయాలకి సంబంధించిన చర్చలు-ఇలాంటి వాటికి సంస్కృతభూయిష్ఠమైన వాక్యాలని గుప్పిస్తారు.”

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “మార్గము – మార్గణము (సాహిత్య వ్యాసాలు),” జయప్రభ, 2003.

  3. malathi

    బాగుంది సమీక్ష. నిజమే. దీనికి సాంఘికచరిత్రగానే ఎక్కువ విలువ అనిపిస్తుంది నాక్కూడా. దీన్ని సంక్షిప్తరూపంలో (380 పేజీలు) సాహిత్య ఎకాడమీ ప్రచురించారు 88లో అనుకుంటాను. అందులో భాష మూలంకంటె తేలిగ్గా వుండొచ్చు నేను చూడలేదు.

  4. వేణుగోపాల్

    ఛార్లేస్ డికెన్స్ మొదలగు వారు వ్రాసిన ప్రఖ్యాత ఇంగ్లీషు నవలలకు చిన్నపిల్లలు చదువుకోవడానికి వీలుగా ఎబ్రిడ్జ్ డు వెర్షన్లు (ప్రతి నవలకు 10 -12 వరకు) వచ్చాయి. మనం చాలావరకు అవే చదివాము కాని అసలు డికెన్స్ పుస్తకాలు చదివింది ఎంతమంది. Oliver Twist చదవడానికి నాకు 3 నెలలు పైన పట్టింది (నేను చదివిన మొదటి original ఇంగ్లీషు నవల అదే అనుకోండి).

    మన తెలుగులో కూడా ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు ఉన్నాయి. ఇటువంటి పుస్తకాలకు కూడా కుదింపు లేక సంక్షిప్త రూపాలు వస్తే మన పిల్లలు చదువుతారు విషయం తెలుస్తుంది. లేక పోతే ప్రస్తుతం వస్తున్న నవలలే చదివి ఇదే తెలుగేమో అనుకునే అవకాశం ఉంది. ఎవరేనా ముందడుగు వేస్తే బాగుంటుంది.

  5. sunita

    నేను కూడా ఈపుస్తకం గురుంచి రాద్దామని మొదలుపెట్టి కొంత రాసి తీరిక లేక ఊరుకున్నాను. తొందర్లోనే పూర్తి చేస్తాను.

Leave a Reply