శ్రీశ్రీ “అనంతం”తో నా అనుభవాలు

రైలు ప్రయాణంలో తినడానికి అయితే ద్రాక్షో, లేదా నారింజో, అదీ కాకపోతే ఏ ఆపిలో, అరటపళ్ళో తీసుకెళ్ళచ్చు. అలా తొక్క వలచి, ఇలా గట్టుకుమనడానికి సౌకర్యంగా ఉండేలాంటిదేదైనా తీసుకెళ్తాం సహజంగా. పనసతొనలూ ఏ డబ్బాలోనూ, ఏ కవరులోనో జాగ్రత్తగా పెట్టుకుని కూడా తెచ్చుకోవచ్చు. కానీ, పనస పండు అలా పండులానే రైల్లో తినడానికి తీసుకెళ్ళరు, బుద్ధున్న వాళ్ళు ఎవరైనా. కానీ నాలాంటి తెలివైన వాళ్ళు తీసుకెళ్తారు. సెకండ్ క్లాసు కంపార్ట్ మెంట్ లో కూర్చుని పనసను కోయడానికి నానా తిప్పలూ పడ్డం వల్ల ఒనగూరే ఏకైక ప్రయోజనం: “ఏంటీ వెర్రి పని!” అని చుట్టూ ఉన్న జనాలు అనుకుంటారే తప్ప, మన జోలికి వచ్చే సాహసం చెయ్యరు. మనం వాళ్ళని కాస్త చూసీచూడనట్టు సర్దుకుపోతే, “పనసతో కుస్తీ” భలే రంజుగా సాగుతుంది. (ఇంతటి తెలివితేటలు భరించలేకే, నా స్నేహితుల్లో కొందరు..”నువ్వు అసలు కెవ్వు కదా” అని అంటూ ఉంటారు!)

సరే.. ఇంతకీ నేనిక్కడ, మీరు చేయబోయే రైలు ప్రయాణంలో ఏం పండ్లు పట్టికెళ్ళాలా అని కాదు చెప్తున్నది. అన్నీ కలిసొచ్చి, గతి లేక ఇరవై ఎనిమిది గంటల పాటు నేను రైలు ప్రయాణం చేయాల్సి ఉందనీ, అదీ సెకండ్ క్లాస్ స్లీపర్‍లో అని తెల్సి కూడా “అనంతం” అన్న పుస్తకాన్ని బాగులో పెట్టుకున్నాను. పోనీ పొరపాటున పెట్టుకుంటే పెట్టుకున్నా, రైలింకా ఊరి పొలిమేర దాటకుండానే మొదలెట్టాను. మొదలెడితే ఎట్టాను, ఆపేయచ్చు కదా! ఆపలేదు, దాని పర్యవసానమే ఈ వ్యాసం.

పుస్తకం అట్ట మీదే ఉన్న “ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల” అన్న సబ్-టైటిల్‍ని చూసి, బాగా చూసి, మతలబు తెలీక, పుస్తకం తెరిచాను. “ప్రారంభం” అంటూ ప్రారంభమయ్యిందో వ్యాసం. ఆయన ఎక్కడ పుట్టిందీ, ఎలా పెరిగిందీ లాంటి విషయాలున్నాయి.

“నిజానికి అబద్ధం, లాభానికి నష్టం, చీకటికి వెలుతురూ, చావుకి బ్రతుకూ కేవలం వ్యతిరేకార్థాలు కావు. ఈ ద్వంద్వాలకి మధ్య అనేకమైన అర్థభేధాలతో అనేక భావాలుంటాయి. ఉదాహరణ: చీకటి, చీకటి కాని దానికి వ్యతిరేకం. చీకటి కానిది వెలుతురు కాదు. మరేమయినా కావచ్చు. అలా కాదగ్గవి అనేకం”

అన్న వాక్యాలు చదివి ఆహా అనేసుకున్నాను. శ్రీశ్రీ కవిత్వం చదువుతున్నానా అనిపించింది ఆ క్షణంలో. “మాటల్లో కూడా కవిత్వం ఉంటుంది.” అన్నారాయనే ఒక చోట! శ్రీశ్రీ వచనం చదవడం అదే మొదటిసారి నాకు. కాస్త కొత్తగా, చాలా వింతగా తోస్తూ ఉండింది చదువుతున్న కొద్దీ. సాధారణంగా ఆత్మకథల్లా జీవితవిశేషాలన్నీ ఏరికోరి ఒక చోట పేర్చే పని శ్రీశ్రీ ఈ పుస్తకంలో చేయడం లేదని త్వరగానే అర్థమయ్యింది. తన జీవితానుభవాలను చెప్తూనే ఆ క్షణాన ఆయనలో కలిగే భావావేశాన్ని, ఆలోచనా విధానాన్ని రంగరించారు.

బయట వాన పడుతుంటే ఇంటి చూరిలో నుండి వానను ఆస్వాదిస్తూ, వేయించిన జీడిపప్పు తింటున్న అనుభూతి కావాలనుకొని ఈ పుస్తకం చదివితే, కలిగే విసుగు వల్ల పుస్తకాన్ని పక్కకు విసిరేయాల్సి వస్తుంది. అయినా శ్రీశ్రీ కవిత్వంతో ఏ మాత్రం పరిచయమున్న వారైనా ఈ పుస్తకం నుండి అలాంటి ఆశలు పెట్టుకోరనే నాకనిపిస్తుంది. “శ్రీశ్రీ” అనేది సామాన్య పేరు కాదు. సాధారణం అంతకన్నా కాదు. అందుకే “అనంతం” చదవాలనుకుంటే చీకటినీ, వెలుతురునీ, చీకటికీ – వెలుగుకీ మధ్య అనేకమైన అనంతాన్ని చూడగలగిగే ధైర్యం ఉండాలి.

“ఏ ఒక్క క్షణాన్ని వర్ణించినా అనంత కాలాన్ని వర్ణించినట్టే. నా జీవితం ఒక క్షణం. ఇదే అనంతం. ఇది నేను రాయకముందే పూర్తి అయ్యింది. రాసినప్పటికీ రాయనట్లే అవుతుంది. రాయకపోయినా రాసినట్టే అవుతుంది.”

తికమకగా ఉంది కదూ! ఓ మనిషి ఆత్మను బంధించలేని ఆత్మకథ వృధా! ఎక్కడ పుట్టారు? ఏ పరిస్థితుల్లో పెరిగారు? ఎవర్ని కలిసారు? ఎందరికి దూరమయ్యారు అనే విషయాలే కావాలనుకుంటే ఆత్మకథలు అవసరం లేదు. సమకాలీనుల్లో ఎవరో ఒకరు ఆ పని చెయ్యగలరు. అరవై డబ్భై సంవత్సరాల పాటు జీవితంతో సహ-జీవనం అయ్యాక రాసుకుంటే ఈ వాక్యంలా ఉండాలేమో!

“నాకు నమ్మకం మీద నమ్మకం పోయింది.”

“మరే! నాకున్నూ” అనుకున్నా! శ్రీశ్రీ వచనంలో గమ్మత్తులో, భావాల్లో మత్తో తెలీదు గానీ ఇలాంటి వాక్యాలు కోకల్లలు.

“విశాఖపట్టణం ఒక నిద్ర. అందులో స్వప్నాలే నా జీవిత సంఘటనలు.”

నాకు చాలా నచ్చిన కోట్స్ లో ఇది ఒకటి. ఒక ఊరిని, అందులోని వాతావరణాన్ని నరనరాల్లో నింపుకునేంతగా ప్రేమిస్తేనే ఇలాంటి వాక్యాలు పుట్టుకొస్తాయనుకుంటాను. ఒక ఊరిలో జీవించాక, అది మనగా, మనం దానిలా మారిపోతామేమో! అప్పుడు దాని గురించి చెప్పమంటే, ఇలాంటివే ఏవో కావాలి.

“సముద్రం నా ఆవేశం, నా ఆనందం!”

శ్రీశ్రీ కవిత్వం చదివేటప్పుడు వచ్చే ఆవేశం గుర్తొస్తుందా? లేకపోతే మళ్ళీ ఆయన కవితలు చదవండి. ఉవ్వెత్తున లేచే ఆ భావతరంగాలకు ఒక సముద్రం ప్రేరణ అంటే అతిశయోక్తి కాదేమో!

“గెలిచినప్పుడు గెలుస్తాం ఓడిపోయినప్పుడు ఓడిపోతాం” అనేది మా నాన్న మనస్తత్వం. “గెలవడానికి ఆడాలి. ఓటమిని అంగీకరించకూడదు” అనేది నా మనస్తత్వం.

ఆ మనస్తత్వాన్ని ఈ పుస్తకం దాదాపుగా ఆవిష్కరించింది. శ్రీశ్రీ జీవన ప్రస్థానంలో అనేకులతో విభేధాలు, అభిప్రాయభేధాలు ఈ పుస్తకం ద్వారా తెలుస్తాయి.

“ముత్యాల్లాంటి తెలుగక్షరాల మీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో (a, aa, i,ee విధంగా) తెలుగు నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తుందని నా నిశ్చితాభిప్రాయం.”

తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన ఒక సూచన. తెలుగక్షరాలు రాయడం అలవాటు పోయిందే అని నేను వాపోతుంటే, ఈయనేమో ఇలా! ఇప్పుడూ కంప్యూటర్ల మీద మనం అలానే రాస్తున్నాం కదా.. (అక్షరాలు కనిపించటం తెలుగులో అయినా)

శ్రీశ్రీ అనంతం అనగానే, “ఆయన అవి రాయకుండా ఉండాల్సింది. ఇవి రాయడమెందుకూ?!” లాంటి వాదనలు చాలా విన్నాను. శ్రీశ్రీ తన ఆత్మ చరిత్ర ఎందుకు రాయబూనారో, ఈ కింది వాక్యాల్లో సుస్పష్టంగా చెప్తారు.

“”అనంతం” నేను ఆషామాషీగా కానీ, ఉబుసుపోక గానీ రాయలేదు. కళాకారుడుగా రాయలేదు. ఒక సైంటిస్టుగా నా జీవిత వాస్తవికతను సందర్శించే ఉద్దేశంతో రాస్తున్నాను. ఇందువల్ల నా అభిమానులు తమ మనస్సులలో కల్పించుకున్న ఇమేజ్ బద్దలయ్యిపోయే ప్రమాదం ఉంది. కాని నాది సత్యాన్ని పరిశీలించే ప్రయత్నం. నిజం ఎల్లప్పుడూ తియ్యగానే ఉండదు. చేదునిజాలను దాచడమూ, మధురమైన అబద్ధాలను సరఫరా చేయ్యడమూ లాభసాటి వ్యాపారం కావచ్చు. కాని నాకా వ్యాపారమూ వద్దు. ఆ లాభమూ వద్దు. “

మనిషి చేసే చాలా పనుల ద్వారా, వ్యవహార తీరు ద్వారా “ఫలానా మనిషి ఫలానాలా ఉంటాడు” అనేస్తుంటాం. కాబట్టి ఈ పుస్తకంలో శ్రీశ్రీ చేసిని కొన్ని పనులు, కొన్నింటిపై ఆయన అభిప్రాయాలు మనకి ఎబ్బెట్టుగా, ఏహ్యంగా అనిపించొచ్చు. కాకపోతే, శ్రీశ్రీ వాటిని నిజాయితీగా రాసుకున్నారు. అవి ప్రచురితమైతే పర్యవసానాలు ఆయనకి తెల్సు. అయినా ధైర్యంగా రాశారు. ఆ నిజాయితీ, ధైర్యాన్నీ గమనించకుండా, “ఓహ్.. ఏదేదో రాశాడు” అని జానాలెందుకు గింజుకుంటారో ఏంటో!

“There are three things worthwhile in this life. To read poetry, to write poetry, to live poetry.”

And this book is about a man who has done exactly that, nothing but that. మహాకవి అన్న సింహాసనం మీద కూర్చోబెట్టినా, తన జీవితాన్ని ఒక మనిషిగా నెమరువేసుకొన్నారు. To know the Mahakavi, read his poetry. To know the man under the world-put-mask of Mahakavi, read this book.

(అనంతం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన మరి రెండు సమీక్షలు ఇక్కడ మరియు ఇక్కడ.

This article was written in 2009.)

అనంతం

You Might Also Like

7 Comments

  1. varaprasaad.k

    అద్భుతః ఇంతకంటే మంచి మాట దొరికితే ఒట్టు.ఏడున్నావో గాని సామీ ఏడిపిస్తున్నావు కదయ్యా..మొదలు పెట్టడమే ఆలస్యం గుక్క తిప్పుకోనివ్వవు కదా,నువ్వు బాగానే పోయావు,ఇక్కడ జనం మాత్రం నిన్ను తలచు కోని రోజు లేదు….సాష్టాంగ దండ ప్రణామం.

  2. Srini

    మీ ఓబ్సేర్వేషణ్ పై ఒక కామెంట్. మీ ఉపోద్ఘాతం చదివాకా నాకో విషయం గుర్తుకోచింది. చాల రోజుల క్రితం నేను (తెలుగు వాళ్ళు అధికంగా ఉన్న ఒక లాగ్ డిస్టెన్స్ ఫ్లైట్లో వెళుతూ ఒక పాత ఎమెస్కో పుస్తకం చదువుతూ కాలం గడిపాను. అప్పుడు చాల మంది నాకు మీరు చెప్పిన పనస కాయ లుక్కు ఇవ్వడం నేను గమనించాను : ) మీ ఎక్స్ప్రెషన్ బావుంది !

  3. Srini

    మీరు అలాగే అనుకున్నారు, నేను అలాగే అనుకున్నాను ! కొన్ని కొన్ని సార్లు చదువరులు రచయితలు యాభై ఏళ్ళక్రితం రాసింది ఇవాళ చదివేసి ఇవాల్టి కోడ్ అఫ్ కండక్ట్ ప్రకారం వాళ్ళని ఉరి వేస్తారు. అయన రాసిన దాంట్లో తప్పు ఉన్డోచు లేక పోవచ్చు. ఈజీగా తీసుకోవాలి. ఆ యాభై ఏళ్ల నాటి రచనని ఒక గ్యాపకంగా తీసుకోవాలె తప్ప రాసినవాల్లని సిలువ మీద వెయ్య కూడదు. నా వరుకు ఆ పుస్తకం నచ్చింది. శ్రీ శ్రీ పర్ఫెక్ట్ మనిషా కాదా అన్నది నాకు అప్రస్తుతం.

  4. Chiranjeevi pattipati

    నిగంగా నే అనంతం శ్రీ శ్రీ మెడ అబిమానాన్ని పోయే ల chesindi

  5. ప్రసాద్

    శ్రీశ్రీ రాసిన “అనంతం” పుస్తకం విషయంలో రంగనాయకమ్మ గారు రాసిన ఉత్తరం, దానికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన అవక తవక జవాబూ, దానికి రంగనాయకమ్మ గారి స్పందనా – ఈ విషయాలన్నీ, రంగనాయకమ్మ గారు రాసిన, “మానవ సమాజం (నిన్నా – నేడూ – రేపూ)” పుస్తకంలో వున్నాయి (పేజీలు: 231-233). శ్రీశ్రీ, ‘అనంతం’ పేరుతో ‘ప్రజాతంత్ర’ వార పత్రికలో 1975 నించీ చాలా కాలం పాటు ‘ఆత్మ కధ’ రాశారు. అందులో ఒక వారం శ్రీశ్రీ రాసిన విషయాలు చూసి, రంగనాయకమ్మ గారు ఆ పత్రిక లోనే నవంబరు 1, 1975 సంచికలో ఒక ఉత్తరం రాశారు. దానికి శ్రీశ్రీ ఇచ్చిన జవాబు జనవరి 25, 1976 సంచికలో వచ్చింది. ఆ జవాబు చూసి, రంగనాయకమ్మ గారు మళ్ళీ ఫిబ్రవరి 8, 1976 సంచికలో ఇంకో ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాల్లో, శ్రీశ్రీ చేసిన వ్యభిచారం గురించీ, శ్రీరంగ నీతుల గురించీ, మార్క్సిస్టు పేరుతో చేసే మోసాల గురించీ ప్రశ్నలున్నాయి. వాటికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన దొంగ జవాబు ప్రస్తావనా, ఆ జవాబుపై వచ్చే ప్రశ్నలూ, అన్నీ వున్నాయి. “అనంతం” పుస్తకంలో ఘోరమైన విషయాలు వున్నాయి. “పాఠకులందరూ తెలివి తక్కువ వాళ్ళూ, ఏం రాసినా, ఏం చేసినా అడగరూ, పైపెచ్చు భక్తితో గొప్ప భజన చేస్తారూ” అనే ధీమా ఈ పుస్తకంలో అడుగడుగునా కనబడుతుంది.

    రాతల్లో మాత్రమే అభ్యుదయాన్ని చూపుతూ, ఆచరణలో దాన్ని పట్టించు కోకుండా వుండే రచయితలకూ, కవులకూ భజనలు దొరుకుతాయేమో గానీ, నిజమైన గౌరవం మాత్రం దొరకదు. వారిని పాఠకులు కల కాలం నమ్మరు. వారు ఎంత గొప్ప గొప్ప విషయాలను చెప్పినా సరే, చెప్పిన విషయాలను వారే పాటించ నప్పుడు, “గొప్ప చెప్పారులే, గొప్ప గొప్ప కవితాత్మక పద్ధతుల్లో, ఎవరూ కని పెట్టని విషయాలని!” అని తీసి పారేయాలనిపిస్తుంది. రాసే వారికి చేతలు ఎంత ముఖ్యమో అర్థం కాకపోతే, ఈ అగౌరవాలు తప్పవు.

    కవులూ, వ్యక్తులూ వేరు, వేరు కారు. ఉపాధ్యాయులూ, వ్యక్తులూ వేరు వేరు కారు. రాజకీయ నాయకులూ, వ్యక్తులూ వేరు వేరు కారు. నాస్తికులూ, వ్యక్తులూ వేరు వేరు కారు. ఇక మార్క్సిస్టు విషయం లోనూ అంతే. అన్నీ ఒకరే. ఆ ఇద్దరూ, నిజానికి, ఒక్కరే. అవసరం కోసం వేసుకునే రెండు వేర్వేరు ముసుగులు మాత్రమే.

    శ్రీశ్రీ చెప్పినట్లు (అచ్చు ఇవే మాటలు కాక పోవచ్చు), “వ్యక్తులూ, వారి జీవితాలూ వారి వారి సొంతం. పబ్లిక్‌ లోకి వస్తే, ఏమన్నా అడుగుతాం, ఏమన్నా అంటాం.”

    “నీవు నేర్పిన విద్యే నీరజాక్షీ” అనే సామెత గుర్తొస్తుంది.

    ప్రసాద్

  6. venkat.b.rao

    తెలుగు జీవితంలోనే శ్రీశ్రీ ఒక కాలానికి చెందిన వ్యక్తి. ఉజ్జాయింపుగా, 1990 ల దాకా వుండిది ఆ కాలం. మనిషి, ‘పరవాలేదులే, ఎలాగోలా బతకలేక పోతామా!’ అన్న నమ్మకంతోనూ, తనకే తెలీని ఒక భరోసాతోనూ బతికేసిన కాలం, బతకగలిగిన కాలం. 1990 ల తరువాత అది మారింది. ఇప్పుడు ఆ నమ్మకం లేదు. ఎలాంటివాడికయినా ‘రేపేమవుతుందో?’ అని తెలీని భయమే, అపనమ్మకమే!

    ఆ కాలమే ఒక epoch, ఒక romance! శ్రీ అబ్బూరి రామకృష్ణారావుగారి ‘నటాలి’ తరఫు నాటక ప్రదర్శన ముగిశాక, రాత్రి చీరాలనుంచి కేవలం పావలా డబ్బులతో కాలినడకన బయలుదేరి, మధ్యలో ఆ పావలాతో రోడ్డు పక్కన ఒక పూరి పాక అంగడిలో పునుగులు తిని టీ తాగి…బాపట్లకు నడక సాగించిన రోజు లాంటి రోజులు అప్పట్లో శ్రీశ్రీ కే కాదు ఇంకా చాలా మందికే ఉండేవి. అయినా, రేపు మామూలుగానే తెల్లవారుతుందని భరోసా…ఏదో తిని బతకగలుగుతామన్న నమ్మకం తో రోజులు అంత మందికీ గడిచేవి. బతకడం ఒక issue కాదు. ఫలానా దానికోసం బతకుతున్నామా లేదా అన్నదే issue! శ్రీశ్రీ ఇంకా శ్రీశ్రీ లాంటి అప్పటి చాలామందికి ఆ ఫలానా అన్నది సాహిత్యం కోసం అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

    శ్రీ అబ్బూరు వరదరాజేశ్వర రావుగారి ‘కవన కుతూహలం’ ఆ కాలపు ఈ romance ని చాలా బాగా గ్రంథస్తం చేసింది. ఆ legacy అంతా ఏమయిపోయిందో తెలీదు. ఆ concerns అన్నీ ఎటు మాయమై పోయాయో తెలీదు. డబ్బుతో అంతా కొట్టుకు పోయినట్టు కొట్టుకు పోయింది. బతుకు తీరే మారిపోయింది.

    ఇప్పుడు ఇక్కడ నిలబడి, అనంతంలోంచి శ్రీశ్రీని చూస్తే ఎంత అమాయకుడిగానో, పిచ్చివాడిలానో కనబడతాడు. జీవితంతో మరీ అంత దారుణంగా ఎలా ఆడుకోగలిగాడా అని సందేహం వేస్తుంది. సగం ఆయన capabilities ఆ ధైర్యాన్ని ఇస్తే, మిగతా సంగం అప్పటి కాలం ఇచ్చింది అని నేననుకుంటాను. ఇప్పుడు దాదాపుగా ఆ capabilities లేవు, కాలమూ కాదు.

    అందులో ఏముందని అంతగా మోహపడ్డామో తెలీదుగాని, అందరం ఒక కాస్తంత అమాయకంగా ఆలోచించ గలిగే శక్తిని, సామర్ధ్యాన్ని పోగుట్టుకున్నామేమో అని సందేహం కలుగుతూ ఉంటుంది నాకు, అప్పుడప్పుడూ! అది తప్పుకూడా కావచ్చును.

    శ్రీశ్రీ అనంతాన్ని జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదాలు!

Leave a Reply