అనంతం – శ్రీశ్రీ

తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు శ్రీశ్రీ. ఆయన ఆత్మకథే ఈ “అనంతం”. ఆయన ప్రకారం ఇది “ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల”.  కాస్తో కూస్తో శ్రీశ్రీ రచనలతో ప్రత్యక్ష చదువరులుగానో పరోక్షంగా ఏ ఆకలిరాజ్యమో, రుద్రవీణో చూసో సంబంధం ఉన్నవారెవరికైనా ఆయన జీవితం గురించిన కుతూహలం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అందునా ముందురోజుదాకా శ్రీశ్రీ కథలు వగైరా చదువుతూ ఉన్నానేమో, “అనంతం” కనబడగానే టక్కుమని చదవడం మొదలుపెట్టేశాను. మూడొందలకి పైగా పేజీలున్న ఈ పుస్తకాన్ని ఏకబిగిన కాకపోయినా చిట్టి విరామాలూ, ఓ రాత్రి నిద్రా మినహాయిస్తే ఓరోజులోపే చదవడం పూర్తిచేసానంటే పుస్తకం ఆసక్తికరంగా ఉందని వేరే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను.

ఇదివరలో ఎప్పుడూ కవుల ఆత్మకథలు చదివినట్లు జ్ఞాపకంలేదు నాకు. ఇదే మొదటిది అనుకుంటాను. ఈ ఆత్మకథ ద్వారా కవులగురించీ, కవిత్వం గురించీ – తెలుగు కవులే కాదు ఎంతో మంది పాశ్చాత్య కవుల గురించీ తెలుసుకున్నాను. “కవిత్వంతో నా ప్రయోగాలు”, “కవిత్వ ఆరంభం”, “సర్రియలిజం”, “జీవితంలో నా గురువులూ”, “జనార్ధన రావు జ్ఞాపకాలు” మరియు “కృష్ణశాస్త్రి జ్ఞాపకాలు” వంటి ఛాప్టర్లు పాఠ్యపుస్తకాల వంటివి కవిత్వం గురించీ చారిత్రక ఆసక్తి ఉన్నవారికీ, కవిత్వం రాయాలనుకునేవారికీ -అందరికీనూ. వీటిలో శ్రీశ్రీ ఎంత విరివిగా చదివాడో తెలుస్తోంది. అయితే, ఇంత ఆత్మకథలోనూ ఎక్కడా తన కథల గురించి గానీ, తాను చేసిన అనువాదాల గురించి గానీ, తాను ఎన్నో కథల్ని తెనిగించిన విలియం సారోయాన్ గురించి గానీ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యమే. తన కవితల గురించీ, అంత సవివరంగా, పోగొట్టుకున్న కవితల్నీ, నాటకాల్నీ గురించీ రాసిన మనిషి కథల్నీ, అనువాదాల్నీ ఎందుకు మరిచారో మరి! అవి కూడా ప్రస్తావించి ఉంటే, ఈ పాఠ్యపుస్తకం మరింత విలువైన నిధి అయి ఉండేది. ఆ పరంగా చూస్తే ఇది శ్రీశ్రీ ఆత్మకథ కాదు. అప్పటి తెలుగు సాహిత్య ప్రపంచం చరిత్ర. విశ్వనాథ, రావిశాస్త్రి, తాపీ ధర్మారావు, చెళ్ళపిళ్ళ, ఆరుద్ర, నారాయణబాబు, విరసం సభ్యులు- ఇలా ఎన్నో పేర్లూ, వీరందరితో శ్రీశ్రీ జీవితంతో ఉన్న సంబంధం చదువుతూ ఉంటే, ఈ పుస్తకాన్ని నేను చరిత్ర పుస్తకమని ఎందుకు అంటున్నానో అర్థమౌతుంది.

శ్రీశ్రీ విదేశీపర్యటనల అనుభవాలు చదువుతూ ఉంటే గుర్తు వచ్చింది అందులో ఒక భాగం మాకు స్కూల్లో పాఠ్యాంశంగా ఉండేదని. నిజానికి కాస్త పరికించి చూస్తే ఇదొక సంప్రదాయిక ఆత్మకథ పద్ధతిలో లేదు. నాకైతే ఆ మధ్య చదివిన టాగోర్ ఆత్మకథ గుర్తు వస్తోంది. నిజానికి ఆయన ఆత్మకథ రాసుకోలేదు. కానీ, ఆయన ఉత్తరాలూ, వ్యాసాలూ ఇవన్నీ ఒక పద్ధతిగా కూర్చి ఆత్మకథలా చేసారు ఆ పుస్తకాన్ని. శ్రీశ్రీ అనంతం అలాంటిది కాదు. ఆయన “అనంతం” గానే రాసారు దానిని సీరియల్గా. ఇది నేను చదువుతూ ఉంటే చూసిన మా అమ్మా, అమ్మమ్మా ఇద్దరూ అన్నారు – డెబ్భైలలో ఇది సీరియల్ గా వచ్చేదని. కానీ, “అనంతం” ఒక conventional ఆత్మకథ template లో లేదు. పుస్తకంలో చాలా చోట్ల ముందుపేజీలలో చదివిన విషయాలే మళ్ళీ కనిపించిన దాఖలాలు ఉన్నాయి. అది చూస్తే కూడా ఇది ఆత్మకథగా కన్నా ఓ వ్యాస పరంపరగా అనిపిస్తుంది. అఫ్కోర్సు, శ్రీశ్రీ దీన్ని అలా కుదురుగా ఓ చోట కూర్చుని, దీని కోసమని సమయం వెచ్చించి రాయలేదనుకోండి. “అప్పుడప్పుడూ అక్కడక్కడా రాస్తే ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో అచ్చయ్యాయి” అని ముందుమాటలో చలసాని ప్రసాద్ గారు కూడా అన్నారు.

అలాగే కొన్ని కొన్ని భాగాలు చాలా అసంపూర్తిగా అనిపిస్తాయి నాకు. ముఖ్యంగా ఆయన సినిమా అనుభవాల కథ. అన్నేళ్ళు సినిమాల్లో ఉన్న మనిషి తన ఆత్మకథలో దానికిచ్చిన చోటు చాలా తక్కువ. ఆయన తన సినిమా రచనలకి సాహితీపరంగా విలువివ్వనని ఇందులోనే చెప్పుకున్నారనుకోండి, అది వేరే విషయం. అలాగే కమ్యూనిజం గురించీ, తనలో దేవుడు అన్న భావానికి సంబంధించి చిన్నప్పట్నుంచి కలిగిన పరిణామం గురించి చివరి ఛాప్టర్లలో బాగా చెప్పారు.  ఇంతకీ 30లలో శ్రీశ్రీ కుటుంబం ఆర్థిక సంక్షోభానికి గురి కాకుండా ఉంటే ఆయన పరిణామం ఎలా ఉండేదా అన్న కుతూహలం కలిగింది ఆయన తనకప్పట్లో ఉన్న భవిష్యత్ ప్రణాళికలను గురించి చెబుతూ ఉంటే.

వ్యక్తిగత జీవితం పరంగా ఈ పుస్తకంలో చాలా విషయాలను గురించి నిజాయితీగా చెప్పుకొచ్చారు. అక్కడ చెప్పిన వాటిలో కొన్ని విషయాలను జనం ముందు చెప్పుకోడానికి బోలెడు ధైర్యం కావాలి కూడానూ. అంతవరకూ ఆయనంటే నాకు గౌరవభావం కలిగింది కానీ, ఆయన వ్యక్తిగత వివరాలు చదువుతూ ఉంటే మాత్రం చెప్పలేని నిరాశ కలిగింది. సంఘ జీవితంలో ఓ శక్తిగా ఉన్న మనిషి వ్యక్తిగత జీవితంలో అన్ని లోపాలుగా కనిపించే విషయాలున్నాయేమిటా అని బాధ కలిగింది. అయితే, దాన్ని ఆయన ఎక్కడా దాచే ప్రయత్నం చేయకపోవడమే బహుశా నా మనసులో ఆయన్ని ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టిందనుకుంటాను. వ్యక్తిగా శ్రీశ్రీ గురించి నాకు ఈ పుస్తకం చదివాక సదభిప్రాయం కలుగలేదు కానీ, గౌరవం మాత్రం ఉంది. సదభిప్రాయం లేకుండా గౌరవం ఎలా ఉంటుంది? అంటారా? మీరూ ఈ పుస్తకం చదవండి. 🙂

పుస్తకం వివరాలు:
అనంతం: ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల (anantham – Atmacharitratmaka charitratmaka navala)
రచన: శ్రీశ్రీ (Sri Sri)
కూర్పు: చలసాని ప్రసాద్
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
వెల: 120 రూపాయలు

You Might Also Like

5 Comments

  1. Sowmya

    కొడవళ్ళ గారు:
    శ్రీశ్రీ కథలు, అనువాద కథల సంకలనం పై సమీక్షా వ్యాసాలు త్వరలోనే పుస్తకంలో వెలువడగలవు.

  2. కొడవళ్ళ హనుమంతరావు

    సౌమ్య గారికి,

    శ్రీశ్రీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో లోపాలుండి చాలా బాధ, నిరాశ కలిగించిందన్నారు. అవి సెక్సు సరదాలా, తాగుడా, గుర్రప్పందాలా, సినిమాలా, ఇందిరాగాంధీ ఇరవై సూత్రాలా? బహుశా అన్నీ. “అయ్యో! మానవుడా! ఓహో! మానవుడా!” అనుకుంటూ చదవమంటారనుకుంటాను. చిన్నదైనా మంచి సమీక్ష రాశారు.

    శ్రీశ్రీ William Saroyan కథలని అనువదించాడని చెప్పారు. ఎక్కడ దొరుకుతాయి? అని అడుగుదామనుకున్నాను. రాత్రి, ఫిబ్రవరి 2009 “తెలుగునాడి” తిరగేస్తుంటే, కాకతాళీయంగా, “మహా పెన్నిధి” అని ఈ మధ్యనే విడుదలైన శ్రీశ్రీ “కథలు, అనువాద కథలు,” పుస్తకాన్ని కొనియాడిన చిరు సమీక్ష కనబడింది. ఆ పుస్తకం మీద మీరు కాస్త పెద్ద సమీక్ష రాస్తే బావుంటుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  3. cbrao

    శ్రీ శ్రీ వైరుధ్యాల పుట్ట. రచనలు చూడాలా, రచయిత వ్యక్తిగత లోపాలను చూడాలా? మన అభిమానం ఎవరిపైన? రచనలపైనా లేక రచయిత పైనా? రచయిత నిబద్ధుడు కాకపోతే తను చెప్పిన మంచి విషయాలకు విలువ తగ్గుతుందా? పుస్తకం గురించిన రాసిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పుస్తక పరిచయం బాగుందని ప్రత్యేకంగా రాయనవసరం లేదనుకుంటాను.

  4. gaddeswarup

    This is probably well known.There are some writings bout Srisri’s life and a tribute by Jan Myrdal here:
    http://www.mahakavisrisri.com/
    a site maintained by hi son.

Leave a Reply