నివేదిత – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక
********
‘నివేదిత’ పురాణవైర గ్రంథమాలలోని పన్నెండవ (చివరి) నవల.
విక్రమార్క చక్రవర్తి తన కాలంలో తూర్పున కామరూప దేశము, దక్షిణాన సేతువు, పడమటన ఉత్తర బాహ్లికములు, ఉత్తరాన బదరీ నారాయణ క్షేత్రము ఎల్లలుగా దేశం మొత్తాన్నీ తన అదుపులో పెట్టాడు.
అయితే ఆయన తర్వాత దేశం మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి 18 రాష్ట్రాలుగా విడిపోయింది. విక్రమార్క చక్రవర్తి మునిమనుమడైన శాలివాహనుడు తిరిగి దేశమంతటినీ ఒకే అధికారం క్రిందికి తెచ్చి అన్ని దేశాల రాజులనీ తన సామంతులుగా చేసుకోవడం, వేద సంస్కృతిని పునరుద్ధరించడం ఇందులోని కథ.
కథని అలా ప్రక్కన పెడితే, విశ్వనాథ వారి అన్ని నవలలో లాగే ఈ నవలలోనూ కావలసినన్ని తాత్త్విక విషయాలు వుంటాయి. మరెన్నో లౌకిక విషయాలూ దొరుకుతాయి.
యుద్ధం కోసం ఎలా పథకాలు వేశారు, సైన్యాన్ని ఎలా సమీకరించారు, అవతలి వారి వ్యూహాలని కనిపెట్టి వారికన్నా ముందుగా తాము ఎలా సంసిద్ధమయ్యారు– ఇలాంటివన్నీ మనం ఇపుడు యుద్దాలు చేయడం లేదు కాబట్టి అచ్చంగా అలాగే ఉపయోగించుకోలేక పోవచ్చును, కానీ ఒక అధికారి తన తోటివారితో, క్రిందివారితో, ప్రత్యర్థులతో, తనకి సహాయపడాలని వచ్చే సహృదయులతో, తనని దెబ్బతీయాలని వచ్చే వంచకులతో – ఎవరితో ఎలా మెలగాలో చక్కగా అర్థం చేసే సన్నివేశాలూ ఉన్నాయి ఈ నవలలో.
రాజు శాలివాహనుడు, మంత్రి కొడుకయిన చంద్రకళాధరుడు – ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వృద్ధమంత్రి విశ్వాస పాత్రుడు. కానీ ఆయన కొడుకయిన చంద్రకళాధరుడికి మాత్రం యవనులతో స్నేహాలు ఉంటాయి. అతను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఒక యవన స్త్రీ. ఆమే నివేదిత. ఆ కారణం వలన కొడుకుని పూర్తిగా నమ్మవచ్చో లేదో తండ్రే తేల్చుకోలేక పోతూ ఉంటాడు.
ఈ నేపథ్యంలో రాజు, మంత్రి కొడుకుల మధ్య సంభాషణలు, ఒకప్రక్కన స్నేహం, మరొక ప్రక్కన యజమాని, సేవకుల సంబంధం, ఇంకొక ప్రక్కన ఒకరి వీరత్వంపై, వ్యక్తిత్వంపై మరొకరికి వున్న ఆరాధన – ఇవన్నీ అందంగా చిత్రించబడతాయి నవలలో.
మంత్రి కొడుకుకి శాలివాహనుడు సకల భారతదేశానికీ చక్రవర్తి కావలసినవాడు, శకకర్త కావలసిన వాడు అని తెలుసు. అందుకే రాజు కొంత చనువు ఇచ్చినా తన హద్దులలో తానుంటాడు. అయితే కొన్ని విషయాలలో మాత్రం “ఎందుకు అని అడగకుండా మీరు నాకు అనుమతి ఇవ్వాలి” అంటూ ఆంక్షలూ పెడుతూ ఉంటాడు.
చంద్రకళాధరుడు గొప్ప జ్యోతిర్విద్యావేత్త. ఇక అతని భార్య నివేదిత భూత, భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగిన శక్తి వున్న స్త్రీమూర్తి. తనకీ, తన భార్యకీ వున్న ఆ శక్తియుక్తులని ఉపయోగించుకుంటూ శాలివాహనుడిని చక్రవర్తిని చేయడానికి అవసరమయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మంత్రి కొడుకు చంద్రకళాధరుడు.
“అట్లే కానిమ్ము. మేము ఫలితము నపేక్షించు వారమే కాని, కార్యాచరణ మార్గమున నడుగడుగున బాధించువారము కాము. అట్లు చేసినచో కార్యములు గట్టెక్కవు.” అంటూ అతనికి అతను కోరిన వెసులుబాటును ఇస్తాడు చక్రవర్తి.
అలాగని మళ్ళీ ఆ చక్రవర్తి అసమర్ధుడూ, కేవలం మంత్రి కొడుకు సమర్థత మీద ఆధారపడినవాడూ కాదు. ఆయన చాకచక్యాలు, సమర్థతలు ఆయనకీ వుంటాయి. ముఖ్యంగా ఈ చక్రవర్తికి వుండే గొప్ప సమర్థత తన సేవకుల శక్తియుక్తులని చక్కగా అర్థం చేసుకోగలగడం, వారికి తగిన గౌరవాన్ని ఇవ్వడం.
కొన్ని చమత్కారమైన సన్నివేశాలుంటాయి. చక్రవర్తిని కలుసుకోవడానికి ఒకసారి ఎక్కడినుంచో ఒక వృద్ధుడు వస్తాడు. దౌవారికుడు వచ్చి చక్రవర్తికి ఆ వృద్ధుడి రూపాన్నంతా వర్ణించి చెప్పి, ప్రభువులు ఏకాంతంలో వున్నారని చెప్పినా వినకుండా ఆ వృద్ధుడు దర్శనం కోరుతున్నాడనీ, అదేమంటే దుర్వేళ అయితే దర్శనం లభించదు, నేను లగ్నము కట్టి మంచివేళ చూసి వచ్చాను, కాబట్టి ప్రభువు తప్పకుండా అంగీకరిస్తాడు, వెళ్ళి అడిగి రమ్మంటూ తనని తరిమాడనీ చెప్తాడు.
అపుడు శాలివాహనుడు “నీవు వరాహమిహిరుని విద్య నభ్యసించినవాడవు. నీవు లగ్నము కట్టి ఈ వేళ ఎట్టిదో చూడుము” అంటాడు. ఆ మాట విని దౌవారికుడు కంగారు పడతాడు. ‘తనకు విద్య వచ్చని ప్రభువుకెలా తెలుసు? ప్రభువులు ఏమీ ఎరగనట్లు వుంటారు కానీ అన్నీ కనిపెడతారే!’ అనుకుంటాడు.
సరే అతడు అలాగే లెక్కించి అది విజయకాలమని చెప్పడమూ, తర్వాత చక్రవర్తి యొక్క విజయాలలో కీలక పాత్ర పోషించే ఆ వృద్ధుడు లోపలికి రావడమూ – అదంతా జరుగుతుంది.
ఇదే వృద్ధుడు మరో సందర్భంలో చక్రవర్తి దర్శనానికి వస్తే ప్రతీహారి ఆటంకపరచడం, అప్పుడు ఆయన ఆ ప్రతీహారిని చంపేసి లోపలికి వచ్చి ఆ విషయం చక్రవర్తికి చెప్పడం, ‘ప్రతీహారిని చంపడం నేరం. దానికి విధించే శిక్ష శిరచ్ఛేదం’ అని చక్రవర్తి అనడం, ఆ వృద్ధుడు అందుకు అంగీకరిస్తూనే ఆ ప్రతీహారి ఒక శత్రురాజు మనిషి అని తాను గుర్తించిన విషయం, అందుకే అతనిని సంహరించిన విషయం తెలియచేయడం, అయితే రాజుని చంపేందుకే వచ్చిన ఆ మనిషిని అక్కడ ఆ ఉద్యోగంలో నియమించినది మహారాణియే కావడం – ఇదిగో ఇలాంటి చిత్రాలన్నీ వుంటాయి. ఆ వృద్ధుడి పేరు గంగాశంతనుడు. ఆయన దుస్సాధ్యమైన మగధ దుర్గాన్ని ఒక్క అర్థరాత్రిలో చక్రవర్తి వశం అయేలా చేసి పెడతాడు. అంతటి సమర్థుడు.
సరే, అంత సహాయం చేసిన ఆయనతోనేమో తల తీసేస్తాను అంటాడా రాజు! మరొక సంభాషణలో మంత్రి కొడుకు రాజు అంతఃపురంలో తీసుకున్న ఒక నిర్ణయానికి కొనసాగింపుగా తానొక పని చేసి అక్కడ పెడితే మెచ్చుకోక పోగా “రాజాంతఃపురంలోని ఈ రహస్యం నీకెలా తెలిసింది? ఇది తెలిసినందుకు నీకు ఉరిశిక్ష వేయాలి.” అంటాడు. అప్పుడు ఈ గంగాశంతనుడూ అక్కడే ఉంటాడు.
(కాసేపు రాజు అని కాసేపు చక్రవర్తి అని వ్రాస్తున్నాను కదా రెండూ శాలివాహనుడి గురించే. నవల మొదలు పెట్టినపుడు ఆయన రాజు, ముగిసేసరికి చక్రవర్తి. కానీ ఆయన చక్రవర్తి అవుతాడన్న భవిష్యత్తు ముందే తెలిసన వారంతా ఆయనని మొదటినుంచీ చక్రవర్తిగానే సంబోధిస్తూ వుంటారు. సరే, మనకయితే మొత్తం భూతకాలమే కదా!)
మంత్రి కొడుకు “ఈయనకి ఇంతకుముందే శిరచ్ఛేదం విధించారు, ఇప్పుడు నాకూ విధించారు. సరే మీరు చక్రవర్తులూ. శకకర్తలూ అయ్యాక రెండు శిక్షలూ అమలు చేయండి” అంటాడు.
“అవును. రెండు తలలూ జాగ్రత్తగా వుంచుకోండి. మేము తర్వాత తీయించాలి.” అంటాడు రాజు.
“సరే, మా తలలు ప్రభువులవే” అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళబోతూ రాజు మొహం వైపు చూస్తారు.
అక్కడ.. ఆ సంభాషణ చివర్లో.. ఈ క్రింది వాక్యాలు వ్రాసి వదిలి పెడతారు మన కవిసమ్రాట్. “ఆ రాజు మొగము మీద చిరునవ్వుదయించినప్పుడు ఎంత జగన్మోహనముగా నున్నాడు! చక్రవర్తులయు, శకకర్తలయు మొగములందు ముగురమ్మలు ముసిముసి నగవులు వెలార్తురు!” చక్రవర్తి మన కళ్ళముందు అలా కనబడతాడు ఈ వాక్యం చదువుతుంటే. ఇలాంటివి, అంటే చక్రవర్తి రూపాన్ని కళ్ళకి కట్టేవి మరో రెండు మూడు సందర్భాలుంటాయి నవలలో.
ఇక ఈ నవలలో జయద్రథుడు, అదే పురాణవైర గ్రంథమాల మొదటి నవల నుండీ వస్తూన్న, మూడువేల సంవత్సరాలనుండి అనేక జన్మలెత్తుతూ తన పగని నిలుపుకున్న వేదమత విరోధి ఎవరు అనే ప్రశ్న ఒకటి వున్నది కదా! వాడు నిరాకులుడు అనే యవనుడు. అతని తాత భారత దేశంలో స్థిరపడిన శక దేశస్థుడు. నిరాకులుడు ఇక్కడే పుట్టాడు, పెరిగాడు. వాడి దేశానికి ఎప్పుడూ వెళ్ళలేదు చూడలేదు. వాడు ఛాయ అనే ఒక బ్రాహ్మణ యువతిని పెళ్ళాడాలని అనుకుంటాడు. అయితే ఆ పిల్ల తండ్రి సేనాపతిని ఆశ్రయించడం, ఆయన ఆ పెళ్లిని భగ్నం చేయడం జరుగుతుంది. నిజానికి నవల అసలు అక్కడి నుంచే మొదలవుతుంది.
తర్వాత ఆ ఛాయ యవనప్రతినిథి భార్యని, ఆవిడ ద్వారా రాణిగారినీ ఆశ్రయించి వాళ్ళ ద్వారా చక్రవర్తిని దర్శించుకుని తన బాధ చెప్పుకుంటుంది. వర్ణాంతర వివాహాల గురించి చక్రవర్తితో చిన్న చర్చ జరుపుతుంది కూడా. కానీ చివరికి చక్రవర్తి మాటలతో తాను చేసినది తప్పేనని భావించి ఛాయ ఆత్మహత్య చేసుకుంటుంది.
ఆవిషయం తెలియగానే నిరాకులుడి అహం దెబ్బతింటుంది. కోపం వస్తుంది. ఆ కోపంలో నుంచి అతని పగ అంతా బయటకి వస్తుంది. నిద్రలో నుంచి మెలకువ వచ్చినట్లయ్యి మూడువేల ఏళ్ళ నాటి తన లక్ష్యం కళ్ళ ముందు నిలుస్తుంది. ఇక అతను అవంతీ రాజ్యం విడిచిపెట్టడం, అంతవరకూ భారతదేశాన్ని వదిలి వెళ్ళని వాడు అపుడు ప్రయాణం మొదలుపెట్టి సింధు నదిని దాటి ఖురాసాను దేశాధిపతిని కలవడం, చక్రవర్తికి వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చేందుకు అతనిని పురికొల్పి, అతనికోసం లక్ష సైన్యాన్ని సమీకరించేందుకు ప్రయత్నించడం ఇవన్నీ జరుగుతాయి.
సైన్య సమీకరణతో పాటు దానికి సమాంతరంగా వేదసంస్కృతిని నాశనం చేసేందుకూ ప్రయత్నాలు చేస్తాడు నిరాకులుడు. అందుకు తన శిష్యులయిన పారగీతుడు, ప్రోథెరో, త్రయ్యరు, స్మితుడు, రాజసూనుడు, రూకుడు, వైలసనుడు, స్తయినుడు, మక్షిమల్లుడు – వీళ్ళందరినీ నియోగిస్తాడు. వారిలో వారికి కొన్ని భేదాభిప్రాయాలున్నా మొత్తం మీద వారందరూ ఒకటే.
సరే వీళ్ళందరూ చివరికి చక్రవర్తి చేత బంధింపబడతారు. చివరి సన్నివేశంలో చక్రవర్తికీ, ఆ పండితులకీ మధ్య జరిగే సంభాషణ ఆసక్తికరంగా వుంటుంది.
“వాలిని రాముడు చెట్టు చాటునుంచి చంపడం ఏమిటి? అది న్యాయం కాదు.” అంటాడు ఒకడు.
దానికి చక్రవర్తి – “అయ్యో పిచ్చివాడా, అసలు కోతులకి రాజ్యాలేమిటి? యుద్ధాలేమిటి? అవి మాట్లాడటం ఏమిటి? అవన్నీ వదిలిపెట్టి ఈ చెట్టు చాటు నుంచి చంపడం ఒక్కటీ పట్టుకుంటావే! అసలవేవీ నమ్మదగినవి కాదు, వదిలేయ”మంటాడు. కానీ ఆ పండితులు మళ్ళీ దానికీ ఒప్పుకోరు.
“అది కాదు, అసలు రావణుడు, హిరణ్యకశిపుడు యవనులు. విభీషణుడు, ప్రహ్లాదుడు భారతీయులు. అందుకే వ్యాస వాల్మీకులు అలా కల్పించి వ్రాశారు.” అంటాడు మరొకడు.
“సరే, మీ కల్పనలేవో మీరు చేస్తున్నారు కదా! అలాగే వాళ్ళ కల్పనలేవో వాళ్ళు చేయకూడదా!” అంటాడు చక్రవర్తి.
“వాళ్ళ తర్వాత మేము పుట్టాం. కాబట్టి వాళ్ళు రాసినది తప్పనడానికి మాకు హక్కుంది.” అని ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాడు వైలనసుడు.
దానితో చక్రవర్తికి బుర్ర తిరిగి “నాకు అయోమయంగా వుంది. మీకు చదువు లేదు. ప్రపంచ జ్ఞానం లేదు. సామాన్యమానవ జ్ఞానం లేదు. తర్కవాసన లేదు. మిమ్మల్ని ఇంత మంది పండితులని ఎలా అనుకుంటున్నారు?” అని నివ్వెరపోతాడు.
అదీ సంగతి. ఇలాంటి వాదనలమీద, కుతర్కాల మీద విశ్వనాథ నవలలన్నిటిలో ఉన్నట్లే ఈ నవలలోనూ వ్యాఖ్యానాలున్నాయి. ఒకచోట మంత్రి అంటాడు చక్రవర్తితో – “సర్వపదార్థములకు సర్వజ్యోతిస్సులకు నాధారభూతమైన ఒక మహాచైతన్యమున్నదని మేము విశ్వసింతుము. కాని ఈ సూర్య చంద్రాదులను విశ్వసించము – అను నొక పెడవాదమున్నది. గ్రామవాసులును, పట్టణవాసులును ‘మేము శాలివాహన చక్రవర్తినే మన్నింతుము, తక్కిన అధికారులను మన్నింపము’ అనగా వారి జన్మలకు వారికి నొక్కసారియైన చక్రవర్తి దర్శనము కలుగదు. చక్రవర్తి తదితరులైన అధికారుల ద్వారా పాలించును. చక్రవర్తి యొక్క చక్రవర్తిత్వము వారికా అధికారులందు కనిపించును. సేవింప వలసినది ఆ అధికారులనే. మంత్రులును, సేనాపతులును, చక్రవర్తి కంటె కించిదూనులే కాని చక్రవర్తి వంటివారే. ప్రధానమైనది రాజాధికారము కాని వ్యక్తి కాదు.”
ఇంకా నవలలో అక్కడక్కడా చక్రవర్తి కూడా ఇలాంటి మంచి మాటలు బోలెడన్ని చెప్తారు. ఒక రెండు సందర్భాలలో ఆయన చెప్పిన రెండు విషయాలు మాత్రం క్రింద ఉదాహరణగా చూపిస్తున్నాను. రెండూ రెండు ఆణిముత్యాలు.
1) “వ్యక్తి ధర్మము వేరు. జాతి ధర్మము వేరు. దేశ ధర్మము వేరు. వివేకరహితులు మూడు ధర్మములను కలిపి మూడింటికి ముప్పు తెత్తురు. జాతి ధర్మము సరిగా నర్థము చేసికొననిచో అన్ని జాతులొకటే యన్న సిద్ధాంతము ప్రబలును, ఒక్కొక్క జాతి యందున్న విశేష లక్షణములు నశించును. సర్వదేశములు నొక్కటియే యనినచో ఆ సిద్ధాంతమధికముగా నున్న దేశము వెనుకబడును. ఆ సిద్ధాంతము లేని దేశము విజృంభించును. ఇతర దేశముల నది లొంగ దీయును. వ్యక్తి ధర్మమును పాటించినచో మానవ జీవితమే వృథాయగును. మానవుడు బ్రదుక నక్కరలేదు. ఎవడును తన కోసము తాను బ్రదుక నక్కరలేదు. దేశము కొరకు బ్రదుక వలయును. వ్యక్తి ధర్మము లేనిచో దేశధర్మము మాత్రమెందులకు? దేశధర్మము, జాతిధర్మమును గూడ లేనిచో మానవ ధర్మమని యొక్కడున్నదందుము. ఆ ధర్మమేమి? తినుటయు, తిరుగుటయు, ఈర్ష్యామాత్సర్యములు లేకుండుటయు మొదలైన ధర్మములా? నిజమునకవి యోగి ధర్మములు. ఇప్పుడు యోగము లేని యోగిజనులు పుట్టుచుందురు. ఊరకే సంఖ్య మాత్రము పెరుగుచుండును. అందరకు నన్నముకావలయును. పండింపవలయును, వృత్తులు చేయవలయును. ఇంక యోగమేమున్నది? కౌపీన రక్షణార్థమయం పటాటోపః అన్నట్లుండును. పటాటోపమనగా సంసారము. సంసారమనగా దేశము, రాజ్యము, వృత్తులు, పంటలు చాలకపోవుటలు, యెదుటివాని వద్దనుండి గ్రహించుటలు, వాడెదిరించుటలు, యుద్ధములు, నీతులు – మరల నంతయు బలిసియే పోయెను. ఏ ధర్మము నక్కర లేదు. సర్వ ధర్మములు నచ్చటనే యున్నవి! ప్రతారకులు, భిన్న ధర్మములను ప్రచారము చేసి, నిత్యమై భద్రమైన స్థితిని పాడు చేసి, స్వలాభ పరాయణులగుచున్నారు. ఒక్కొక్కప్పుడు వారి స్వలాభ పరాయణత్వములో, వారి సిద్ధాంతములలోని యవివేకము వారికి గోచరించుట లేదు. లోకక్షేమము కొరకే చేయుచున్నామని వారి తాత్పర్యము. భిన్నధర్మముల విజ్ఞానమును వివిచ్యమానముగా తెలిసికొనలేని మనుష్యులు చరించు అపమార్గమునకు లెక్కయేమి?”
2) “భయము భక్తియు నని రెండున్నవి. భయమే వృద్ధి పొందగా భక్తి యగును. భయములో నొక దోషమున్నది. ఆ దోషము పోయినంతనే యది భక్తి యగును. ఆ దోషమేమనగా మనకేదో యపకారము జరుగునన్న భావము. అదే భయము. అపకారము జరుగునన్న భావమెందుకు పుట్టును? తాను న్యాయముగా ప్రవర్తింపనపుడు పుట్టును. న్యాయముగా ప్రవర్తించును! భయము పోయినది! సత్ప్రవర్తన వృద్ధి పొందుచున్నది. దాని పేరు భక్తి.”
*****
విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753
(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
Purana Vaira Granthamala
Haribabu Suranenii
సారీ,పాత వెర్శన్లొఎ కొన్ని తప్పులు దొర్లాయి.ఇది సరయిన పర్సన:
నేను మొత్తం గ్రంధమాల 16 అన్నట్టు చదివాను.ఒక భాగంలో జయధ్రధుడు “యెండిన డొక్కలతో గోచిపాత కట్టుకుని కర్ర పోటేసుకుని వూగుతూ అతివేగంగా నడుస్తూ ఉంటాడు.మేకపాలు తాగుతాడు!” – ఈ వర్ణన యెవరి గురించో మీకు తెలిసే ఉంటుంది.అందులో మొదట 12తో ఆపివేద్దాం అనుకుని తర్వాత పెంచినట్టు చదివాను.మరి ఇక్కడ 12 – ఆఖరిభాగం అంటూన్నారు.చదివి కూడా యెలా పొరబడతాను?
Haribabu Suranenii
నేను మొత్తం గ్రంధమాల 16 అన్నట్టు చదివాను.ఒక భాగంలో జయధ్రధుడు “యెండిన డొక్క్లతో గోచిపాత అక్ట్టుకుని కర్ర పోటేసుకుని వూగుతూ అతివేగంగా నడుస్తూ ఉంటాడు.మేకపాలు తాగుతాడు!” – ఈ వర్ణన యెవరి గురించో మీకు తెలిసే ఉంటుంది.అందులో మొదట 12తో ఆపివేద్దాం అనుకుని తర్వాత పెంచినట్టు చదివాను.మరి ఇక్కడ 12 – ఆఖరిభాగం అంటూన్నారు.చదివి కూడా యెలా పొరబడతాను?