కేతు… తలపులలో! – స్మృతి సంచిక

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

**********

మనిషి అస్తిత్వం మరణానంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రేమించే వ్యక్తుల గుండెల్లో, జ్ఞాపకాల్లో అది శాశ్వతంగా ఉండిపోతుంది. తానున్న సమాజాన్ని నిశితంగా చూస్తూ, అందులోని సమస్యలని వాటి మూలాల్లోకి వెళ్ళి మరీ అర్థం చేసుకుంటూ తనదైన పద్ధతిలో పరిష్కారాల్ని కనుగొంటూ నలుగురి మంచి కోసం ఆలోచించగలిగినప్పుడు ఒక వ్యక్తి జీవితం వ్యక్తిగతపు పరిధి దాటి సమాజపరం అవుతుంది. అలా ఆలోచించగలిగే చదువు, జీవితానుభవం, ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ, వాళ్ళని వినేందుకు తగిన ఓర్పు లాటివన్నీ ఆ వ్యక్తిని సాధారణ జనాల నుంచి ప్రత్యేకం చేస్తాయి. వారికి ప్రచారాలు, ప్రశంసలు ఎవరో పనిగట్టుకు చెయ్యనక్కర్లేదు. ఆ వ్యక్తిత్వపు పరిమళం నాలుగు దిక్కులా అప్రయత్నంగానే విస్తరిస్తుంది.

కేతు తలపులలో… పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డిగారి ఆలోచన, చొరవతో వచ్చిన ఒక స్మృతి సంచిక

కేతు “వ్యక్తిగా కన్నా రచయితగా ఉన్నతులు, రచయితగా కంటె వ్యక్తిగా ఉన్నతులు.” వారి మహోన్నత జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వంలపై మంచి స్మృతి సంచిక తీసుకురావాలన్న సంకల్పంతో ఎందరో రచయితల్ని సంప్రదించి వ్యాసాలను సేకరించినట్టు సంపాదకులు విశ్వప్రసాద్ ముందుమాటలో చెప్పారు.165 పేజీలున్న పుస్తకంలో జీవించిలేని ఎందరో ప్రముఖులు కేతు గురించి ముందెప్పుడో రాసిన వ్యాసాలను కూడా చేర్చటం సంపాదకుని నిబద్ధతకు నిదర్శనం!   

ఈ స్మృతి సంచిక వెలువడేందుకు సహకరించినవారు రాయలసీమ ఉద్యమనేత దేవగుడి చంద్రమౌళీశ్వర రెడ్డి గారు. 

కేతు కుమారుడు శశికాంత్ తండ్రి తనకు పుస్తకాల పట్ల ప్రేమను కలిగించారని చెప్పారు. వారి చిన్న కుమార్తె శిరీష కష్టపడే తత్వం, విలువలు తండ్రి నేర్పించారన్నారు. పెద్ద కుమార్తె మాధవీ లత ఆయన కూతురిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. 

పుస్తకంలోని ప్రతి వ్యాసం విలువైనదీ, కొత్త సంగతుల్ని చెప్పేదీ అయినా 45 మంది ప్రముఖ వర్తమాన రచయితల వ్యాసాల్ని, ఆపైన జీవించిలేని 9 మంది ప్రముఖుల వ్యాసాల్ని చెప్పుకోవాలంటే సాధ్యం కాదు. కొందరి ఆత్మీయ జ్ఞాపకాల్ని మాత్రమే ఇక్కడ చెప్పుకుందాం. 

కేతు కథలను 50 కి పైగా కన్నడం లోకి అనువదించిన డా. మీరాసాబిహళ్ళి శివన్న   కేతును ‘‘మట్టివాసన కలిగిన తెలుగు కథకు’’డంటారు. తాను ఎం. ఏ చదువుతున్నప్పుడు అనువాదానికి సవాలుగా ఉన్న ఏదైనా కథను సూచించమని తన గురువు డా. తంగిరాల సుబ్బారావు గారిని అడిగినపుడు కేతు రాసిన వానకురుస్తే కథను సూచించారని, దానిని అనువదించి ప్రజావాణికి పంపగా కర్ణాటక వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని చెప్పారు. అది రైతుల కష్టాలను వర్ణించే కరువును చెప్పిన కథ కావటం, ఆ సమయంలోనే కర్ణాటకలో తీవ్రమైన కరువు రావటంతో పాఠకులు కథతో మమేకమై పోయారంటారు.

ఎ.కె. ప్రభాకర్ కేతు ఒకే సమాజంలోని రెండు వేర్వేరు ప్రపంచాల జీవన సంక్లిష్టతలను చూపిన వేర్లుబోధి అనే నవలలను రాసారని, అవి రాయలసీమలో ఉత్పత్తి సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని చిత్రించాయంటారు. శాస్త్రీయ వైరుధ్యాల్ని అర్థం చేసుకోగల సామాజిక అవగాహన, శాస్త్రీయదృక్పథం, చిత్తశుద్ధి ఉన్న ఒక నిబద్ధ రచయిత కేతు. ఒక దళితుడి జీవిత సంఘర్షణని (వేర్లు) నవలకు ఎంచుకుని తనది కాని ప్రపంచాన్ని, అనుభవాల్ని రాయబూనటం సాహసమేనంటారు. 

ఓల్గా కేతు సాహిత్యానికి, సమాజానికి సంబంధం ఉందని నమ్మే రచయిత అనీ, సమాజాన్ని శాసిస్తున్న సూత్రాలను వెతికి పట్టుకుని, వాటి ఆధారంగా జీవితాలను పరిశీలించి, సంక్లిష్టమైపోయిన జీవితాలను తానర్థం చేసుకుని అందరికీ అర్థం చేయించాలన్న తపన ఉన్న రచయితంటారు. 70, 80, 90 దశకాల్లో కేతు రాసిన స్త్రీ ప్రాధాన్యత కలిగిన కథల్ని ఉదహరిస్తూ, వీటిని చదివినపుడు కేతు సానుభూతితో, మానవతావాదంతో, వర్గ చైతన్యంతో స్త్రీ పాత్రలను సృష్టించటంతో మొదలెట్టి లింగవివక్షనూ, స్త్రీ అణచివేతనూ అర్థం చేసుకుని ఆవిధంగా స్త్రీ పాత్రలను రూపొందించే గుణాత్మక పరిణామ ప్రయాణం చేసారంటారు.

ఆచార్య రామవరపు గణేశ్వరరావు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు తలపెట్టిన కొకు సాహిత్య ప్రచురణలకు సంబంధించిన వివరాలు చర్చించేందుకు కేతు తమ ఇంటికి రావటంతో వారి పరిచయం జరిగిందంటారు. తమ సుదీర్ఘ పరిచయంలో కేతు శ్రామికుడే తప్ప పేరు ప్రతిష్టల కోసం ఎప్పుడూ తాపత్రయపడినట్లు తనకు అనిపించలేదంటారు.

కొత్తపల్లి రవిబాబు ప్రజాసాహితిలో కేతు రచనలు కేవలం మూడే వచ్చాయని, పశువులకు గడ్డి లేని కరువు పరిస్థితిని ప్రతిభావంతంగా చెప్పిన గడ్డి కథను ప్రజాసాహితి 2003 ఏప్రిల్ సంచిక ప్రచురించిందని చెప్తూ కథను విశ్లేషించారు. కేతు కథలన్నీ ప్రగతిశీలమైనవంటారు.

వివిన మూర్తి సాహిత్యం రాజకీయాల వెనుక చీలిపోవాలా లేక రాజకీయాలకి మార్గదర్శనం చేయగల సమగ్ర దృష్టితో ఉండాలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఈ విభజనల మధ్య వారధిగా నిలిచే కొందరిలో కేతు ఒకరంటారు. ఒక సంక్షోభ సందర్భంలో రచయితగా, విమర్శకునిగా కృషి చేసిన వ్యక్తి, సామాజిక పరిణామాల పట్ల ఎప్పటికప్పుడు స్పందించిన సామాజిక హితచింతకుడైన కేతు మీద ఇంకా పరిశోధన జరగాలంటారు.

పాపినేని శివశంకర్ లోతైన అవగాహనతో పాటు ఎంతో సంయమనం గల వ్యక్తి కేతు. మనసులో స్పష్టమైన అవగాహనతో అభిప్రాయ భేదాల్ని సున్నితంగా వ్యక్తీకరించగల సౌజన్యం, మనుషుల్ని ప్రేమించగల గుణం ఉన్న కేతును వ్యక్తిగానూ, సాహిత్యపరంగానూ అందరూ అభిమానించిన వారే అంటూ కేతును ఇష్టంగా తలుచుకున్నారు. తన పిహెచ్. డి. పట్టా కోసం చేసిన పరిశోధనకు కేతు నుంచి అందిన ప్రశంసలను కూడా చెప్పారు.

బండి నారాయణస్వామి కేతు రాయలసీమ కరువు శోకాన్నీ, మానవ సంబంధాల వెనుక ఆర్థిక మూలాల్నీ మార్క్సిజం దృష్టితో అధ్యయనం చేసిన మేధావి అని, జీవితం అర్థం చేసుకోవడం కోసం సాహిత్యం ఉందని నమ్మినవాడని చెప్పారు.

అట్టాడ అప్పలనాయుడు విశ్వనాథరెడ్డి గారి కథలన్నీ రాయలసీమ భూమికతో ఉన్నా వాటిలోని జీవితం, సంఘర్షణ తెలుగునేల అన్ని ప్రాంతాలకూ పోలి ఉండటం వారి ప్రత్యేకతంటారు. నాలుగున్నర దశాబ్దాలుగా అరసం లో అనేక బాధ్యతలు నిర్వహించి పెద్దదిక్కుగా నడిచిన కేతు సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించే బాధ్యతను అరసం తీసువాలంటారు.

వాడ్రేవు వీరభద్రుడు కేతు ఒక భాషావేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు, కథకుడు, రాయలసీమ సాహిత్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డవాడని చెప్పారు. విశ్వనాథరెడ్డిగారింట ఒక మధ్యాహ్నపు వేళ తనకు దొరికిన ఆత్మీయ ఆతిథ్యాన్ని కన్నీళ్ళతో తలుచుకున్నారు.

హెచ్చార్కె విశూ అన్నతో అంత సన్నిహితం ఫీలవటానికి ఆయన అక్షరోద్యమం మాత్రమే కారణం కాదని, ఆయన జీవన నేపథ్యం కూడా కారణమేమో అంటారు. మొహం మీదొక మంచి మనస్సును ధరించినట్టు ఎప్పుడూ నవ్వుతూ అక్షరాలతో, వాక్యాలతో, కావ్యాలతో ఆడుకుంటూ కనిపించిన విశూ అన్న మొదటి చూపులోనే తన మనసును దోచుకున్నారంటారు.

కాత్యాయని విద్మహే సాహిత్యానికి చరిత్రకు, సాహిత్యానికి సమాజశాస్త్రాలకు అన్యోన్య సంబంధాన్ని గుర్తించిన కేతు విశ్వనాథరెడ్డి గారి అవగాహన పాఠ్య ప్రణాళికలను రూపొందించడంతో కనిపిస్తుందంటారు. పాఠకులను మాత్రమే కాక రచయితలను కూడా చైతన్యవంతులను చేసే కథలు వారివి. గ్రామీణ జీవిత వైరుధ్యాలు, మధ్యతరగతి అవకాశవాద తత్వం, చలన చైతన్యాలు, దళిత మహిళా జనజీవన సమస్యలు, కులమత రాజకీయాలు మొదలైనవన్నీ కేతు కథలకు వస్తువులనీ, ఒక సమస్య అనేక కోణాల నుండి మానవ సంబంధాలను ప్రభావితం చేసే తీరును చిత్రించటం వారికి ఇష్టమంటారు. 

వి. ప్రతిమ ‘’విపరీతమైన ఉద్రేక స్వభావం కలిగి ఉండీ నేనెందుకు కవిని కాలేకపోయా’’ననే విశ్వనాథ రెడ్డి గారు వచన రచననే ఎంచుకున్నారు. 

‘’మానవ సంబంధాలను, అనుభవాలను, స్వీయ అనుభవాన్నుంచి, పరిశీలన నుంచి, జ్ఞానం నుంచి, చిత్రించాలనే కథా రచయితల ఆర్తిని వచన వ్యాప్తి అంటున్నామంటే మనం మాట్లాడుకునేది వచనం, బోధనలో వచనం, ప్రసార సాధనాల్లో ఎక్కువగా అందిస్తున్నది వచనం, నిర్ణీత ప్రయోజనాల కోసం మనం వాడేది వచనం, ఇంత వచన వ్యాప్తి ఉన్నప్పుడు సృజనాత్మక రచయుతలు తమ అభివ్యక్తికి వచనాన్ని ఒక వాహికగా ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు’’ అన్న కేతు మాటలను తలుచుకున్నారు.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథను ఒక ఆయుధంగా మార్చి పాఠకుల మెదళ్ళకు తగిలేలా వదలడం తప్ప తన రచనల మీద తనకు వ్యామోహం లేనివాడు కేతు. ఒక ఆకు రాలినట్టు తన స్థానానికి సంబంధించిన స్పష్టమైన గుర్తును వదిలిపెడుతూ చప్పుడు చేయకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయిన కేతు బహిరంతర భావాల మధ్య సవ్యసాచిలా యుద్ధం చేసినవాడంటారు. 

మనిషిని ఎట్లా చూడాలో బోధించిన కథా గురువంటారు కాట్రగడ్డ దయానంద్.

మన్నం రాయుడు పాత్రికేయునిగా జీవితం మొదలుపెట్టి, రచయితగా రాయలసీమ కథా క్షేత్రంలో అక్షరసేనానిగా నిలిచి, విద్యావేత్తగా అనితరసాధ్య సేవలందించిన విశ్వనాథరెడ్డి గారితో మా కరచాలనాలు, పలకరింపులూ పూర్తిగా విశ్రమించాయి. వారి వ్యక్తిత్వం, సాహిత్యకృషి, మనసుతో వారి సాన్నిహిత్యం సదా స్మరణీయం. కొన్ని నిజాలు అబద్ధాలైతే బాగుండును! మనిషి మరణించడం అంటే… జ్ఞాపకంగా మారిపోవడమే కదా అంటారు వారిని మనసారా తలుచుకుంటూ.

మహమ్మద్ ఖదీర్ బాబు ఆయన కథాక్షేత్రం, కథాంశం, కథన గుణం అకలుషితమైనవి. సేంద్రీయమైనవి. హేతువు కలిగినవి. వారు తాను నమ్ముకున్న నేల గురించి రాసినవి ఒకెత్తైతే, స్త్రీల గురించి రాసినవి ఒకెత్తు. తెలుగు కథకు పెద్దదిక్కుగా ఉన్న కేతుగారి నిష్క్రమణతో తెలుగు కథకుల సమూహం ధైర్యాన్ని కోల్పోయింది.

ప్రొ. కె శ్రీదేవి ఒక గొప్ప రచయితకు జీవితానుభవం, తాత్విక దృష్టి మాత్రమే కాక తను చిత్రిస్తున్న జీవితం పట్ల నమ్మకం ఉండాలి. ఆ జీవితాన్ని కొనసాగిస్తున్న పాత్రల పట్ల గౌరవం ఉండాలి. వీటితో పాటు విశ్లేషణ శక్తి ఉండాలి. వీటన్నింటినీ అద్భుతమైన సమకాలీన స్థితిలో కొనసాగించడం వలన కేతు గొప్ప కథకుడు కాగలిగాడు.

ప్రొ. సిహెచ్ సుశీలమ్మ తనదైన వ్యక్తిత్వపు విలువలతో, సామాజిక సంఘర్షణలకు స్పందించే గుణంతో, స్పష్టమైన భావ ప్రకటనతో, విస్పష్టమైన అభివ్యక్తితో, గొప్ప సామాజిక పరిశీలనాసక్తి కలిగి ఉన్న మంచి వ్యక్తిగా, విద్యావేత్తగా, సాహితీవేత్తగా, నిత్య పఠనాశీలిగా, పరిశోధనాపరునిగా, చిన్నా పెద్దా అందర్నీ ఆప్యాయంగా పలకరించే ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారి నిశ్శబ్ద నిష్క్రమణం తీరని లోటు.

వేంపల్లి షరీఫ్ కడపలో సాహితీ ధర్మానికి విరుద్ధంగా ఏదైనా జరుగుతుందంటే ‘’పెద్దాయన ఉండాడు…ఏమంటాడో…’’ అని భయం ఒకటి ఉండేది. ఆ భయం ఇప్పుడు లేనందుకు మాత్రం నేను నిజంగా దుఃఖిస్తున్నాను.

పెనుగొండ లక్ష్మీనారాయణ “చుట్టూ ఉన్న జీవితాన్ని కథల్లో ఇతివృత్తంగా తీసుకున్నాను. రక్త మాంసాలున్న మనుషుల్ని పాత్రలుగా చిత్రించడానికి ప్రయత్నించాను. పాత్రలు జీవితంతో సంబంధం లేని గాలి కబుర్లాడకుండా చూశాను. వస్తు శిల్పాల మధ్య సామరస్యం కోసం తపించాను” అని కథా నిర్మాణం గురించి కేతు వినయంగా చెప్పుకున్నారు. మంచి కథకుడు కావాలనుకునే వారు ఎవరైనా కథలు రాసే ముందైనా, రాసే క్రమంలోనైనా ఎట్లా రాయాలో అనే ప్రశ్నకు నిరంతరం సమాధానం వెతుక్కుంటూ పోవడం రాతగుణాన్ని పెంచుతుందన్నది వారి సందేశం.

“అంత సీరియస్ కథలు రాసే మీలో అంత హ్యూమర్ దాగుందా? మాకు క్లాస్ పాఠాలు మీరు బోధించింది తక్కువే. జీవిత పాఠాలే నేర్పారు. ఎలా మర్చిపోగలం మిమ్మల్ని” అంటారు తుమ్మల రామకృష్ణ

“మా మాటల్లో, మా నవ్వుల్లో ఆయన ఉన్నారు” అంటారు పాలగిరి విశ్వప్రసాద్.

సొదుం జయరాం “1975 తర్వాత నేను సాహిత్యానికి, సాహితీ మిత్రులకు దూరమయ్యాను. 25 సంవత్సరాలు పాటు మా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. కానీ విశ్వం నా వాడు, నా మిత్రుడు, నా ఆత్మ బంధువు.”

మధురాంతకం రాజారాం “కేతు ఒక మైత్రీచిత్రం. లేబ్రాయంలో తనను అక్కున చేర్చుకున్న కడప జిల్లా పల్లెటూర్లను గురించి రీసెర్చ్ చేసి సిద్ధాంత వ్యాసంలో సరికొత్త పాత విషయాలను వెల్లడించి రుణాన్ని బావుకున్నారు.”

“మట్టి చరిత్రను అనుభవంలోకి తెచ్చిన మా పల్లె పట్టులకు, స్త్రీల చాకిరినీ, బాధల్నీ అనుభూతం చేయించిన మా అమ్మకు” అంటూ తన తల్లి పేర కథల సంపుటిని అంకితం ఇవ్వటం వెనుక వారి అర్థాంగి ఉన్నారంటారు రాజరాం గారు. 

కాళీపట్నం రామారావు వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో ఆయన చేసే విశ్లేషణలు, వాద ప్రతివాదాల్లో ఆయన పాటించిన నిగ్రహం, కథా రచన లో ఆయన అలవర్చుకున్న సంయమనం ఆయన పట్ల నా గౌరవాన్ని పెంచుతూ వచ్చాయి. మొహమాటస్తుడే అయినా అభిప్రాయాల దగ్గరకు వస్తే ఆ మొహమాటాన్ని పక్కన పెట్టగలడు. ఆయన రాసినదాన్ని ఓ కుటుంబరావు గారిని, రావిశాస్త్రి గారిని చదివినంత శ్రద్ధగా చదివేవాడిని.

వల్లంపాటి వెంకటసుబ్బయ్య కేతు శిల్పం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించే రచయితగా ప్రసిద్ధుడు. గ్రామాన్ని ఒక యూనిట్ గా స్వీకరించి, అందులోని వ్యక్తిగత సామూహిక విషాదాల చరిత్రను భావోద్రేక దౌర్భాగ్యం ఇసుమంత కూడా లేకుండా చిత్రించిన నమ్ముకున్న నేల తెలుగులోని అరుదైన కథల్లో ఒకటి.

“కథకు కమిట్మెంటు నేర్పిన వాడు కేతు” అంటారు జ్వాలాముఖి.

విశాలాంధ్ర ప్రచురణాలయానికి కుటుంబరావు సాహిత్య సంపాదకుడుగా విశ్వం చేసిన కృషి చాలా గురుతరమైనదంటారు ఏటుకూరి ప్రసాద్.

విశ్వనాథ కథల్లో కథ ఉండదు కథనం వుంటుంది – ఆవేశం ఉండదు ఆలోచన ఉంటుంది – అలంకారాలుండవు అనుభూతి ఉంటుంది – కృత్రిమత్వం ఉండదు క్లుప్తత ఉంటుంది! అంటారు సింగమనేని నారాయణ.

ఆఖరుగా నేపథ్యం పేరిట తన రచనా వ్యాసంగం గురించి కేతు చెప్పిన ఆసక్తికరమైన కబుర్లున్నాయి. 

“ఒకరకంగా మంచి కథలు రాయాలనే పోటీ మనస్తత్వం నాకంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరొకరకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను. ఈ రెండూ ప్రోత్సాహకాలే అయినా నన్ను నడిపించింది నా అనుభవ ప్రపంచం, నా సాహిత్య ప్రేరణలు” అంటూ – రాజకీయాలూ, ఉద్యమాలూ ప్రేరణ ఇచ్చినా వాటి దైనందిన వ్యవహారాల్లో తాను మమేకం కాలేకపోయానంటారు. 

పుస్తకంలో కేతు జీవితంలో వివిధ సందర్భాల్లోని ఫోటోలు ఉన్నాయి.

చివరి పేజీల్లో వారి రచనల వివరాలు, అందుకున్న అవార్డుల వివరాలు ఉన్నాయి. అరుదైన విషయాలను కూర్చుకున్న ఈ పుస్తకం కేతు రచనల పట్ల పరిశోధన జరిపేవారికి ఎంతో విలువైనది.

ఇన్ని కబుర్లూ రాసాక స్వంత విషయమొకటి చెప్పాలని ఉంది… 

విశ్వనాథరెడ్డి గారు మాండలిక వృత్తి పదాలను సేకరిస్తూ బందరులో పర్యటించినప్పుడు ఆయనకు ఒక స్వర్ణకారుడు చెప్పిన కథను పి. సత్యవతిగారు నా మొదటి కథా సంపుటికి ముందుమాటలో చెప్పారు. 2018 లో నా కథా సంపుటాలను పంపుతూ విశ్వనాథరెడ్ది గారికి ఫోన్ చేసినప్పుడు “పంపించమ్మా, తప్పక చదువుతాను” అన్నారు ఆప్యాయంగా. భలే సంతోషపడ్డాను. 

సాహిత్య ప్రేమికులందరూ తప్పక చదవవలసిన పుస్తకం. సంపాదకులు విశ్వప్రసాద్ గారికి అభినందనలు.

పుస్తక ముద్రణః వినాగ్ ప్రింటర్స్, జూలై 2024

కవరు పేజీః కె. విజయభాస్కర రెడ్డి

వెలః రూ. 250/-

You Might Also Like

Leave a Reply