రాతియుగం నుండి కృత్రిమమేధా యుగం వరకు సమాచార వలయాల చరిత్ర – నెక్సస్

వ్యాసకర్త: రహ్మానుద్దీన్ షేక్

********

సేపియన్స్, హోమో డెయూస్ మరియు  21వ శతాబ్దికి 21 పాఠాలు వంటి ప్రఖ్యాత గ్రంథాల రచయిత యువాల్ నోవా హరారీ, తన తాజా పుస్తకంతో మళ్ళీ మన ముందుకు వచ్చారు. “నెక్సస్: ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ నెట్వర్క్స్ ఫ్రొం ది స్టోన్ ఏజ్ టు ఏఐ (నెక్సస్ : రాతియుగం నుండి కృత్రిమ మేధా యుగం వరకు సమాచార వలయాల చరిత్ర)” లో హరారీ మానవ చరిత్రను, ప్రధానంగా సమాచార వలయాల (నెట్వర్క్‌ల) ప్రభావాన్ని, వాటి పరిణామాన్ని విశ్లేషిస్తారు.


వాస్తవాల కంటే అనుసంధానం ప్రధానం

ఈ పుస్తకంలో హరారీ సమాచారం పట్ల మనకున్న “అమాయకపు దృష్టికోణా”న్ని సవాలు చేస్తారు. మనమంతా సమాచారం అంటే వాస్తవానికి అద్దం పట్టే విషయాలుగా పరిగణిస్తాము. కానీ సమాచారం అసలు లక్ష్యం అనుసంధానమని హరారీ అంటారు. ఈ ఆలోచనతోనే పుస్తకం సాగుతుంది. ఆయన ప్రకారం సమాచారం సమాజాలను కలిపి ఉంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ సమాచారం ఒక్కోసారి నిజం కావచ్చు, ఒక్కోసారి తప్పుడు సమాచారమూ కావాల్సి వస్తుంది. సమాజాన్ని స్థిరంగా ఉంచేందుకు కొన్ని సార్లు ఊహాజనిత సమాచారాన్నే ప్రభుత్వాలు, పెద్దస్థాయి సంస్థలు మనకు అందిస్తాయి. సామాన్య ప్రజలను అనుసంధానం చేసి ఉంచాలంటే అన్ని సార్లూ వాస్తవిక సమాచారాన్ని అందజేస్తే సరిపోదు. పైగా అలా చేస్తే, కొన్ని కొన్ని సార్లు సమాజం అల్లకల్లోలమైపోతుంది.

ఇందుకు ఉదాహరణలు మనకు మానవ చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. పురాతన కాలం నుండి మతాలు, పురాణాలు, రాజకీయ వ్యవస్థలు – ఇవన్నీ సమాచారంపై ఆధారపడి ఏర్పడ్డాయి. అనేక పురాతన నాగరికతలు దేవతల కథలపై ఆధారపడి ఏర్పడ్డాయి. ఆధునిక కాలంలోనూ, భారీ ప్రాపగాండా నెట్వర్క్‌లు కొన్ని దేశాలలో రాజకీయ పార్టీలను స్థాపించడంలో సహాయపడ్డాయి. ఇందుకు ఉదాహరణగా హరారీ నాజీ జర్మనీ ప్రస్తావన తెస్తారు. స్వతహాగా ఎవరికీ హాని తలపెట్టని జర్మన్ పౌరులలో ఒక నిర్దిష్ట జాతి పట్ల ద్వేషం పెంచి, ఆ జాతి నాశనానికి, తద్వారా ప్రపంచ యుద్ధానికి దారి తీసిన సమాచారోపయోగాన్ని హరారీ వివరిస్తారు. నాజీ జర్మనీ పాలనలో ప్రజల అభిప్రాయాన్ని మారుస్తూ వారి మధ్య పరస్పర అనుసంధాన్ని పెంచేందుకు అబద్ధపు సమాచారం, అపోహలు, ఊహాజనిత సమాచారం ఎలా సహాయపడ్డాయో చెప్పారు. ఈ ఉదాహరణలను పరిగణించి రేపటి రోజు దేశాలను, వ్యవస్థలను నడిపే యువకులు నేడు ఆకళింపు చేసుకుని జాగ్రత్తగా ఉంటే సమాచార అనుసంధాన వలయాల ద్వారా జరుగుతున్న నష్టాన్ని పూరించవచ్చు.

చరిత్రలో సమాచార వలయాల అంశాన్ని వివరించేందుకు పుస్తకం మూడు భాగాలుగా విభజించబడింది.

భాగం 1: మానవ సమాచార వలయాలు – ఇక్కడ హరారీ పురాతన సమాజాలు కథల ఆధారంగా ఎలా ఏర్పడ్డాయో విశ్లేషిస్తారు. పురాణాలు, పౌరాణిక కథలు ఎలా అనేక వ్యక్తులను ఒకే సమాజంగా అనుసంధానించాయో చెప్తారు. ఈ కథలు అందరూ ఒకే విధంగా అనుసరించడం వల్ల పెద్ద సమాజాలు ఏర్పడే అవకాశం కలిగింది.

భాగం 2: మానవేతర మర సమాచార వలయాలు – ఈ భాగంలో హరారీ కంప్యూటర్‌లు, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి ఆధునిక సమాచార టెక్నాలజీల ప్రభావాన్ని వివరిస్తారు. ఈ సాంకేతికతలు (టెక్నాలజీలు) మానవ సమాచార వలయాల కంటే వేగంగా పెద్ద మార్పులను సమాజంలో తీసుకురావడంలో ముందున్నాయి. AI మానవ సమాచార వలయాలను మరింత సమర్థంగా చేసాయి, చేస్తున్నాయి. ఉదాహరణకు ఎన్నికల సమయంలో అభ్యర్థులు సాంకేతికత వాడి అంతకు మునుపు కన్నా ఎక్కువ మందికి చేరుకోగలుగుతున్నాడు. అయితే ఈ సాంకేతికతలు అదుపు తప్పే ప్రమాదం కూడా ఉందని హరారీ హెచ్చరిస్తారు.

భాగం 3: కంప్యూటర్, ఇంటర్నెట్ ఆధారిత రాజకీయాలు – ఈ భాగంలో హరారీ AI రాజకీయ వ్యవస్థలపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో విశ్లేషిస్తారు. AI సాంకేతిక పరిజ్ఞానం ప్రజాస్వామ్యాలను ఎలా ప్రభావితం చేస్తుందో, నిరంకుశ పాలనలకు‌ (డిక్టేటర్‌స్జిప్) ఇది ఎంతగా సహాయపడుతుందో హరారీ చర్చిస్తారు. ఒక నిరంకుశ పాలకుడి కన్నా AI బలమైన నియంత్రణ సాధించగలదని హరారీ హెచ్చరిస్తారు.

భారతదేశ సమాచార శక్తి

హరారీ భారతదేశంలో టెక్నాలజీ పాత్రను, సమాచార వలయాల పాత్రను కూడా చర్చిస్తారు. 2020లో భారతదేశ ప్రభుత్వం టిక్‌టాక్, వీచాట్ లాంటి చైనీస్ యాప్‌లను నిషేధించింది. దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు హాని కలిగించే సామర్థ్యం ఇలాంటి సాంకేతికతలకుందని ఈ ఉదాహరణ ద్వారా హరారీ చెప్పారు. ఇలాంటి నిషేధం అంతకు ముందూ ఆ తర్వాత చాలా దేశాల్లో అమలులోకి వచ్చింది. ఈ ఉదాహరణ ద్వారా ప్రభుత్వాలు తలచుకుంటే సమాచారాన్ని ఎలా నియంట్రించగలవో హరారీ చెప్తారు. భారతదేశంలో మరుగుదొడ్లు లేకపోవడం ఒక ముఖ్యమైన సమస్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారు, ఇది స్వచ్ఛ భారత్ మిషన్‌కు దారితీసింది. 2014 మరియు 2020 మధ్య, భారత ప్రభుత్వం 10 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడానికి $10 బిలియన్ల పెట్టుబడి పెట్టింది. బహిరంగ మలవిసర్జన శుభ్రతకు, మహమ్మారి రోగాల వ్యాప్తికి దోహద పడుతుంది. మోదీ స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా బహిరంగంగా మలవిసర్జనను నిరోధించడానికి విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. ఈ అంశం గురించి ఆశావాదిగా మాట్లాడిన హరారీ, మరో కోణంలో ఈ సమస్యను చూపిస్తూ మానవ సమాచార వ్యవస్థ వలన స్వచ్ఛ్ భారత్ మిషన్ అమలులో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపిస్తూ నిరాశా కోణాన్ని బహిష్కృతం చేసారు. భారతదేశంలో బహిరంగ మల విసర్జన చేసేస్తారు కానీ, ఇక్కడి మానవ సమాచార వలయాల ద్వారా ఏర్పడిన కుల, మత విశ్వాసాలలో మలానికి సంబంధించిన విషయాలను నీచంగా, తక్కువ జాతి వారు చేసే పనిగా చూస్తారు. అందువలన మరుగుదొడ్లను కట్టడంలో, కట్టిన మరుగుదొడ్లను నిర్వహించడంలో ఎవరూ ముందుకు రాకపోవటం వలన స్వచ్ఛ్ భారత్ మిషన్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. తక్కువ కులం వారు తమ ఇంటి ముందు మలవిసర్జన చేసారని ఇద్దరు చిన్నారులను ఆ ఇంటి యజమాని చంపేసిన ఉదంతాన్ని భారత దేశంలో ఉన్న కుల మానవ వలయపు గట్టి ప్రభావాన్ని చెప్పటానికి హరారీ ఉదహరించారు. 

ప్రపంచంలో ఏ దేశమైనా శక్తిమంతమైనదిగా ఎదగాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి. ఈ ప్రాముఖ్యత “డేటాను నియంత్రించే వ్యక్తి ప్రపంచాన్ని నియంత్రిస్తాడు” అని మోదీ 2018లో ఒక సభలో మాట్లాడుతూ చెప్పిన మాటల వల్ల తెల్లమవుతుందని హరారీ చెప్పారు.

AI: రెండు వైపులా పదునున్న కత్తి

పుస్తకంలో ప్రస్తావనకు వచ్చిన ప్రధాన విషయం AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) – ఇది మానవ సమాజాలను ఎలా మార్చగలదో హరారీ ప్రస్తావిస్తారు. AI కేవలం ఒక నిర్జీవ పనిముట్టులా కాకుండా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రోజురోజుకీ మన జీవితాల్లో AI ప్రాముఖ్యత పెరుగుతూ పోతోంది. భయంకరమైన క్యాన్సర్ రోగాన్ని సరైన సమయంలో కనిపెట్టి చికిత్స చేసే AI ఉంది. బజారుకెళ్ళి అట్ల పిండి కొంటే, పచ్చడి కొనుక్కోమని సూచించే AI  ఉంది. కొంతమంది టెక్ ధీరులు దీన్ని సమస్యల పరిష్కార మార్గంగా చూస్తున్నారు, కానీ హరారి భవిష్యత్ ప్రమాదాలను కూడా ప్రస్తావిస్తారు.

మొహమాటాలు లేని వ్యతిరేక దృక్కోణం

పుస్తకంలో హరారీ ఏకకాలంలో సమాచారంపై ఉన్న రెండు ప్రధాన దృక్కోణాలను స్పష్టంగా వివరిస్తారు. సమాచారం అనేది వాస్తవాలను తెలపడానికి మాత్రమే పని చేయడం లేదు, అది సమాజాలను అనుసంధానించడం కోసం కూడా పనిచేస్తుంది. ఈ పుస్తకం సమాజాలపై సమాచార ప్రభావాన్ని మరియు మానవులు సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారో అన్న విషయం గురించి లోతైన అవగాహనను ఇస్తుంది.

సమయోచిత పుస్తకం

నెక్సస్ మనం జీవిస్తున్న సమాచార యుగాన్ని విశ్లేషించే అత్యంత సమయోచిత పుస్తకం. హరారీ పరిశీలన ఈ పుస్తకంలో మరింత కేంద్రీకృతంగా ఉంది. అనుసంధాన శక్తి, తప్పుడు సమాచార దుష్ప్రభావాలు మరియు AI భవిష్యత్తు మీద విశ్లేషణ, మానవ చరిత్ర మీద సమాచారం ఎలా ప్రభావం చూపిస్తుందో, అలాగే అది మన భవిష్యత్తును ఎలా మార్చగలదో హరారీ చర్చిస్తారు.

అయితే పుస్తకంలో ఇంతకు ముందు పుస్తకాలలో చర్చించిన విషయాలు పునరావృతమయ్యాయన్న భావన పాఠకులకు కచ్చితంగా కలుగుతుంది.

హరారీ అభిమానులకు ఇది ఒక కొత్త దృక్కోణంతో కూడిన పుస్తకం. హరారీ పుస్తకాలను ఇంకా చదవని కొత్తవారికి ఇది హరారీని పరిచయం చేసే ఒక అద్భుతమైన ప్రవేశ పుస్తకం.

You Might Also Like

Leave a Reply