కథ – ఏమిటీ? ఎందుకు? ఎలా?

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

**********

“There have been great societies that did not use the wheel, but there have been no societies that did not tell stories” – 

Ursula K. Le Guin, American athour.    

ఏమిటీ కథ? ఎందుకు, ఎలా చెప్పాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన జీవితాల్లో కథకున్న ప్రాధాన్యత గురించి ఒక్కసారి ఆలోచించుకుందాం. కథ ఎక్కడినుంచో మన మధ్యకి వచ్చింది కాదు, నేర్పగా నేర్చుకున్నది కాదు. మనవే అయిన జీవితాల్లోంచి, దైనందిన అనుభవాల్లోంచి, ఆలోచనాపరిధి లోంచి పుట్టిందే. 

వ్యక్తిగతంగా, సమాజగతంగా ఎదురయ్యే సంఘటనల కలబోతే కథ. ఇది నిన్నటిది కావచ్చు, నేటిది కావచ్చు. రేపటిదీ కావచ్చు. నిన్నలన్నీ ఎలాటివో, మనిషికి ఏమేం నేర్పేయో, వాటి మంచి చెడ్డలేమిటో, ఆ నిన్నల్లో జీవితాలెలా గడిచాయో చెప్పేవి కొన్నైతే, వర్తమానంలో జరిగే సన్నివేశాల్ని, అనుభవాల్నే కథలుగా చెప్పేవి కొన్ని. రేపటి రోజులెలా ఉంటాయో కూడా చెప్పేవి కొన్ని. ఇలా మనిషి జీవితాన్ని అవగాహన చేసుకుందుకు, ఉన్నతీకరించుకుందుకు కథ సాయపడుతుంది. 

అయితే కథ ఎవరు రాయాలి, ఎలా రాయాలి అంటే దీనికి నిబంధనలు, పరిమితులు ప్రత్యేకం లేవు. 

పాపాయి బడి నుంచి ఇంటికి రాగానే ఆ రోజు బడిలో ఏం జరిగిందన్న అమ్మ ప్రశ్నకి తనదైన స్థాయిలో, తనకున్న భాషతో ఆసక్తికరంగా ఓ కథ చెప్పేస్తుంది ఆ చిన్నారి. తనకెవరు నేర్పారు కథ చెప్పటం? ఆమె ఆలోచనల్లోంచి, చెప్పాలన్న కుతూహలంతోటి అత్యంత సహజంగా విషయాల్ని చెప్పేస్తుంది. ఎంత గొప్ప సంగతి!

పాపాయి చెప్పిన ఇప్పటి కథ రేపటి తరానికి కొత్త సంగతుల్ని చెపుతూ, సాహిత్య రూపాన్ని దిద్దుకుందంటే ఆశ్చర్యమేముంది? అంతకంటే సాహిత్యానికున్న ప్రయోజనం మాత్రం ఏముంది?

ఇదిగో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పుస్తకం కూడా ఈ విషయాల్నే చెపుతుంది. అదీ కథల రూపంలో. నిన్నటి కథకులతో పాటు వర్తమాన కథకులూ తమదైన కథాకథనాల్ని కమ్మగా చెప్పిన కథల పుస్తకం “కథ – ఏమిటీ? ఎందుకు? ఎలా?”. తెలుగు సాహిత్యంలో తమదైన స్థానాన్ని పదిలపరుచుకున్న ప్రముఖులతో పాటు ఔత్సాహిక కథకులూ వీరిలో ఉన్నారు.

ఏ కాలంలోనైనా ప్రపంచవ్యాప్తంగా మానవసమాజంలో వచ్చే మార్పులను సాహిత్యం పదిలపరుస్తూ వస్తోంది. క్షణక్షణం మారుతున్న నేటి వేగవంతమైన జీవితాల్లోని సంక్లిష్టతల గురించి అవగాహన చేసుకుని, వాటిని పరిష్కరించుకునే దారులను వెతుక్కోవలసిన అవసరం మనకుంది. దీనికి సాహిత్యం చేసే సేవ అమూల్యమైనది.

తూర్పుగోదావరి జిల్లా రచయితలసంఘం ప్రధాన కార్యదర్శి డా. పి. చిరంజీవినీ కుమారి గారు ఈ సంకలనానికి గౌరవ సంపాదకులుగా ముందుమాటలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు.  దాని ప్రకారం ఏ సమాజమైనా, ఎటువంటి దృక్పథాలు ఉన్న రచయితలైనా జనాన్ని జాగృతం చేయగలిగిన శక్తిని కలిగి ఉండాలంటారు. అందుకోసం కథనెలా రాయాలి, కథా వస్తువు ఏమిటి? అనే విషయాన్ని చర్చించుకోవాలంటారామె. ఆ ఆలోచనతోనే భిన్న తెలుగు ప్రాంతాలనుంచి పేరొందిన రచయితల సహకారంతో ఈ సంకలనాన్ని కూర్చారు. 

పుస్తకంలోని ముప్ఫై కథలలో కొన్నింటిని మాత్రం ఇక్కడ పరిచయం చేసుకుందాం. కానీ ఈ చిన్నపరిచయం అసంపూర్ణమైనదే. పుస్తకానికి పూర్తి న్యాయం చెయ్యాలంటే కథలన్నీ నిదానంగా చదివి ఆస్వాదించవలసిందే.

మొదటి కథ తల్లావజ్జుల పతంజలిశాస్త్రి గారి “దీపాలపల్లె బోవాల”. ఈ కథా నేపథ్యం చెపుతూ రచయిత ‘మనిషి నిలువెత్తు సజీవ స్మృతి అని, అనేక ప్రాచీన స్మృతుల్ని మనం తెలీకుండానే మోసుకుంటూ ప్రయాణిస్తున్నామంటారు.’ ఈ కథలో నాగముని అనే వృద్ధుడు జీవిత చరమాంకంలో ఒక ఆసుపత్రిలో ఉంటాడు. మరణశయ్య మీద మరుపు చెరుపుల మధ్య తన జీవితంలో గాఢ ముద్ర వేసిన అనుభవాలను, అనుభూతులను తడుముతూంటాడు. నాగముని జ్ఞాపకాల్లోంచి అతని పూర్వ జీవితపు అనుభవాల్లోకి, వర్తమానం లోకి కథ చదువుతూన్న మనం కూడా ప్రయాణించటం అరుదైన అనుభవం. 

కథ చదుఫుతుంటే తొంభైయ్యోపడిలోకి వస్తున్న మా అమ్మగారి మాటల్లో ఒక్కోసారి ఉన్నట్టుండి వర్తమానంలోంచి తొలగి ఎక్కడో సుదూర గతంలోకి జారిపోయే ధోరణి మనసుకి సహజంగానే తోచింది. 

రెండవ కథ క్రాస్ రోడ్స్ రచయిత జాన్సన్ చోరగుడి. తన విధి నిర్వహణలో ఎదురైన అధికారి చెప్పిన అనుభవాన్ని, ఒక ‘వన్ లైనర్’ ని తీసుకుని అల్లుకున్న కథ అంటారు. రాజకీయ పరపతి, అధికారం ఉన్న వ్యక్తుల నుంచి నిజాయితీగా పనిచెయ్యాలనుకునే ఉన్నతోద్యోగులకు ఎదురయ్యే సమస్యలు ఎంతటి ఆవేదన కలిగిస్తాయో, జీవితంలో మళ్ళీ మళ్ళీ మానసిక శాంతిని ఎలా హరిస్తాయో ఈ కథ చెపుతుంది. ఇది సహజమే అన్నంత గాఢంగా తమ చర్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న అవినీతిపరులకున్న బలం అపరిమితమైనది. ఏ స్థాయిలోంచి జీవితాల్ని మొదలు పెట్టినా, ఏ ఆశయాలతో మొదలెట్టినా ఉద్యోగరీత్యా వచ్చిన అధికారాన్ని, పలుకుబడిని స్వంత లాభానికే వాడుకునే సంప్రదాయం మన జీవితాల్లోకి వచ్చి చేరింది. కారణం ఇంకెవరో ఎలా అవుతారు? వ్యవస్థను రక్షించుకోవలసిన ధైర్యాన్ని సమాజం నుంచే సంపాదించాలి.

చిటికెన వేలు అట్టాడ అప్పలనాయుడు కథ.  శ్రీకాకుళం జిల్లాలో ‘సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ’ ఏ మేరకు తన లక్ష్యాలను సాధించిందో, అక్కడి గిరిజనులకు మేలు చేస్తోందా, మేలు చేస్తున్నామనుకుని కీడు చేస్తోందా అన్నదానిని కథాంశంగా తీసుకున్నట్టు రచయిత కథా నేపథ్యంలో చెప్పారు. 

దేశవ్యాప్తంగా వర్తమాన సమాజంలో ఎక్కువగా వింటున్నది గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలే. ప్రకృతి మధ్య బతుకుతున్న గిరిజనుల జీవితాల్ని మెరుగు చేస్తామంటూన్న ప్రభుత్వ నిర్ణయాలు వారి కాలికింద భూమిని లేకుండా చేస్తున్నాయి. వారి ఉనికినే మాయం చేస్తున్నాయి. వారికి మెరుగైన జీవితాలిచ్చేందుకు పనిచేస్తున్న ఈ సంస్థలు అంతిమంగా ఎవరి లాభం కోసం పనిచేస్తున్నాయో నిలబెట్టి అడగవలసిన పరిస్థితి.

సోమన్నదొర గూడెంలో తనవారి మధ్య వస్తున్న విభేదాల్ని చూస్తూ అశాంతి పాలవుతాడు. తనవారి కోసం తుపాకి పట్టుకుని పనిచేసిన రోజుల్ని తలుచుకుంటాడు. కొత్త తరం ఆలోచనా తీరు చూసి విస్తుబోతాడు. జనజీవన స్రవంతిలో బతకమని ఒకనాడు తనకిచ్చిన భూమిని ప్రభుత్వం వెనక్కి ఇవ్వమన్నప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతాడు, ‘ఆ భూమిని ఇప్పుడు యిమ్మంతన్నావు. అదిచ్చీసి జనజీవన స్రవంతి నుంచి యెళిపోమనా?’ ఎంత అర్థవంతమైన వాక్యం!

ఒకనాడు తన తండ్రి చిటికెనవేలు తన బతుక్కో తోవ చూపిందని, తన మనవడికి ఈ చిటికెనవేలు అవసరమే లేదంటూ ఒక నిర్ణయానికొస్తాడు సోమన్నదొర. మనసు చెమరించే సన్నివేశం! 

వాగ్దాన పరిమళం కథా రచయిత దాట్ల దేవదానం రాజు. తన జీవితంలోంచే తీసుకున్న కథాంశం అంటారు కథా నేపథ్యాన్ని చెపుతూ. వాగ్దానానికున్న పరిమళాన్ని అతి సున్నితంగా, అందంగా మనచుట్టూ ప్రవహింపజేసిన కథ. నేటి తరం కొడుకు తన తాత, తండ్రి జీవితాల్ని చూసే వాగ్దాన బలం ఎంత గొప్పదో తెలుసుకున్నానంటాడు. ఇంతకు మించి తరవాతి తరాలకి చూపించవలసిన దారేముంది?

గేట్ కథా రచయిత ఖదీర్ తన కథా నేపథ్యాన్ని చెపుతూ మనుషులు తెలిసితెలిసీ ఒక్కోసారి తోటి మనుషుల పట్ల, బంధాల పట్ల ఏమరుపాటుగా ఉంటారని, దానివల్ల మనుషుల మధ్య బంధాలు జారిపోతాయని, వాటితో పాటు శాంతి, సంతోషం కూడా మాయమైపోతాయని చెపుతారు. సొగసైన కథ. 

ఆకలికి అన్నం పెట్టే దారిని, ఆ దారిని చూపిన మాష్టారిని వెతుక్కున్నాడతను. మాష్టారి కుటుంబంలో ఒకడయాడు. జీవితంలో చకచకా మెట్లెక్కాడు. అందమైన జీవితం అమరింది. ఎప్పుడో నిదానంగా వెనక్కి వచ్చి పలకరింబోయాడు. మాష్టారు దంపతులు ఎప్పటిలాగే ఆదరించారు. వెనుక మూసుకున్న గేట్ మాత్రం అతనిలోని లోటుని స్పష్టంగా చూపించింది.

కలలు రాలుతున్న నేల రచయిత పెద్దింటి అశోక్ కుమార్. వైవిధ్యాలతో నిండిన సమైక్య భారతం గొప్పదనం ప్రపంచం ముందు చెప్పుకుందుకు మాత్రమే. మనుషుల మధ్య ఉన్న ప్రాంత, కుల, మత, భాష, రంగు, ఆహారం, ఆహార్యం లాటి ఏ తేడాని కూడా సమాదరించలేని అల్పత్వాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయ, అధికార యంత్రాంగం స్వంత బాగు వరకే పరిమితమవటం బాధాకరం.

వేంపల్లె షరీఫ్ కథ అన్ పబ్లిష్డ్ కథా నేపథ్యం చెపుతూ తన జీవితంలోంచే కథని చెప్పే ప్రయత్నం చేసానన్నారు రచయిత. చిన్నపిల్లాడి చేతికి ఫోన్ ఇచ్చినందుకు భార్య మీద కోపం చూపబోయిన ఒక మధ్యతరగతి భర్తకి ఆమె సమాధానం చురుక్కుమనిపిస్తుంది. మన జీవితాల్లోంచే వచ్చిన సహజమైన కథ.

శిఖామణి గారి స్కూటర్ వాలా! టీనేజ్ అబ్బాయిల ఊహల్ని, కలల్ని సరదాగా చెపుతుంది. 

మాకినీడి సూర్యభాస్కర్ గారి జీవన ప్రవాహం సాధారణంగా కనిపిస్తూనే జీవన తాత్త్వికతని చెపుతుంది. లిఫ్ట్ లో ఎక్కి దిగుతూ కొద్ది క్షణాల పాటు కలిసి గడిపిన వ్యక్తుల అనుభవాన్ని జీవితంతో పోల్చటం బావుంది.

ఆలూరి విజయలక్ష్మి గారి కథ ఊబి జీవితం పట్ల సరైన ఆలోచన, అవగాహన లేక నేటి యువతరం వ్యసనాల బారిన పడటాన్ని చెప్తుంది.

పట్నాల్లోనూ, నగరాల్లోనూ కనిపించే భూకబ్జాలు, భూమి ఆధారంగా చేస్తున్న మోసాలు పేదల జీవితాల్ని అతలాకుతలం చేయటం జి. వెంకటకృష్ణ గారి చేజారిన బతుకు చెపుతుంది. ఒకే రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల మధ్య అభివృద్ధిలో కనిపించే వ్యత్యాసాలు, వాటి వెనుక ఉన్న రాజకీయ కారణాల్ని కథ చర్చించింది.

బడుగు బతుకులను దోచుకునే వ్యవస్థలో కలిగే ఉక్కపోత గురించి కాళ్ళకూరి శైలజ గారి ఉక్కపోత కథ చెపుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా యాంత్రిక జీవితాల్లో మునిగిపోయిన మానవుడి హద్దులేని సుఖలాలసకి ప్రకృతి దోపిడీకి గురవుతూనే ఉంది. పర్యావరణం సమతుల్యత గురించి ఆరాటపడే వారు చేస్తున్న సూచనలు, ప్రయత్నాలు సముద్రంలో నీటిబొట్టు మాత్రమే. జరుగుతున్న నష్టాన్ని మౌనంగా చూస్తూన్న నేటి తరం భవిష్య తరాలకి సమాధానం ఏం చెపుతుందో!పిచ్చుకలూరు కథలో ఈ అంశాన్ని చెప్పారు ఉండవిల్లి. ఎమ్

భూమిని, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుని అన్నదాత అంటూ గొప్పగా చెప్పుకోవటమే కానీ రైతు పడే కష్టాన్ని తీర్చేవారెవరూలేరీ దేశంలో. ప్రకృతి మీద ఆధార పడిన వ్యవసాయదారుడంటే అందరికీ తేలికే. పండగొచ్చేస్తోంది కథలో మధునాపంతుల సత్యనారాయణ మూర్తి గారు రైతు జీవితంలో పండుగ అనేది ఉత్తమాటే అంటారు. సంభాషణలు అందమైన గ్రామీణ యాసతో బావున్నాయి.

ఈ కథలన్నీ వివిధ ప్రాంతాల, నేపథ్యాల నుంచి రాసిన కథలు. వర్తమాన సమాజంలో కనిపిస్తున్న ఎన్నో సమస్యల్ని, సంగతుల్ని, వాటి చుట్టూ అల్లుకున్న తమ ఆలోచనల్ని, ఆక్రోశాన్ని కథలుగా అందించారీ కథకులు. 

పుస్తకం ముందు పేజీల్లో డా. చిరంజీవినీ కుమారి గారన్నట్టు రచయితలంతా చుట్టూ ఉన్న జీవితాల్ని తమ రచనల్లో ప్రతిబింబింపజేస్తూ, మొత్తం సమాజానికి దీపధారులు కావలసిన బాధ్యత ఉంది. ఆమే చెప్పినట్టు దానిని ఎలా చెయ్యాలో, ఏమేం ప్రయత్నాలు చెయ్యాలో కలిసి కూర్చుని ఆలోచించవలసిందే. అదే ఈ పుస్తకం తీసుకురావటంలో ఉన్న ఉదాత్తాశయం. కథలన్నీ చదివాక ఆ ఆశయం నెరవేరిందనిపిస్తోంది. ఇలాటి మరిన్ని కథా సంకలనాలు రావలసిన అవసరమూ ఉంది.  

పుస్తక సంపాదకులు అద్దేపల్లి ప్రభు. ఈ పుస్తకం తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం, కాకినాడ వారి కృషి. రచయితల్ని, ఈ పుస్తకం వెనుక పనిచేసిన వారినందరిని అభినందిద్దాం. జూన్ 2024 ముద్రణ.

You Might Also Like

Leave a Reply