భావిని అంచనా వేసిన రెండు నవలలు

వ్యాసకర్త: శారద మురళి

********

 వ్యాసంలో ప్రముఖ ఆంగ్ల రచయిత జార్జి ఆర్‌వెల్ గురించీ, ఆయన రాజకీయ నమ్మకాల గురించీ తెలుసుకున్నాం. సమకాలీన వ్యవస్థనూ, రాజకీయాలనీ అవగాహన చేసుకుంటూ, వాటి ఆధారంగా భవిష్యత్తు గురించి ఆందోళనా, నిరాశా వ్యక్త పరుస్తూ జార్జి ఆర్‌వెల్ వ్రాసిన రెండు డిస్టోపియన్ నవలలు, “ఎనిమల్ ఫార్మ్”(Animal Farm), “1984”. “ఎనిమల్ ఫార్మ్” 1945లో ప్రచురితమైతే, నాలుగేళ్ళ పిదప 1949లో “1984” నవల విడుదలైంది.

ఆంగ్ల సాహిత్యంలో ఎంతో ఉన్నత స్థానం సంపాదించుకున్న ఈ రెండు నవలలూ వామపక్ష సిద్ధాంతాలనూ, నిరంకుశ ధోరణులనూ నిరసిస్తాయి. అయితే, నిజానికి ఆర్‌వెల్ వామపక్ష సిద్ధాంతాల పట్ల చాలా సానుభూతి కలవాడు. పీడిత జనాల విముక్తి కోసం ఎంతో ఆరాట పడ్డవాడు.

“ఎనిమల్ ఫార్మ్” పుస్తకం చదివితే మనకు ఆయన సమకాలీనురాలూ, ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి అయిన ఏన్ రాండ్ (1905-1982) నవలలు గుర్తొస్తాయి. రాండ్ కూడా వామ పక్ష సిద్ధాంతాలనూ, కమ్యూనిస్టు నాయకత్వాన్నీ తీవ్రంగా నిరసిస్తూ నవలలు వ్రాసారు. వాటిల్లో “వి ద లివింగ్” (We the living, 1936), “ఆన్‌థెం” (Anthem, 1938) ముఖ్యమైనవి. 

అయితే ఇద్దరి నమ్మకాల్లోనూ తేడాలున్నాయి. ఆర్‌వెల్ కమ్యూనిస్టు నాయకత్వాన్నీ, వారి నిరంకుశ ధోరణినీ తప్పు పట్టాడు కానీ వామ పక్ష సిద్ధాంతాలని కాదు. సమ సమాజం రావాలనీ, అందుకు కమ్యూనిస్టు భావజాలమే దారి అనీ నమ్మారు జార్జి. కానీ, రాండ్ కమ్యూనిస్టు భావజాలాన్నీ, వామ పక్ష సిద్ధాంతాలనే తప్పు పట్టారు. అసలా సిద్ధాంతాలే సరైనవి కాదనీ, సమ సమాజం తో మానవ జాతి ఇంకా క్షీణించి పోతుందనీ అభిప్రాయపడ్డారు.

ఎనిమల్ ఫార్మ్, ఎ ఫెయిరీ స్టోరీ:

జంతువులని మనుషులకి ప్రతీకలుగా ఉపయోగించి మానవాళికి మేలు చేసే కథలు చెప్పుకోవడం మనకేమీ కొత్త కాదు. పంచతంత్రంలోని కథలన్నీ అలాటివే కదా! ఎనిమల్ ఫార్మ్ కూడా అటువంటి ప్రతీకాత్మకమైన కథ.

సాధారణంగా మనం ఫార్మ్ (Farm) అంటే పొలం అనే అర్థంలో వాడతాం. అయితే పాశ్చాత్య దేశాల్లో ఫార్మ్ అంటే ఆవులూ, మేకలూ, పందులూ, గుర్రాలూ, కోళ్ళూ, బాతులూ వంటి జంతువులని పెంచుతూ జీవిక సాగించడం. 

“ఎనిమల్ ఫార్మ్ : ఎ ఫెయిరీ స్టోరీ ” అనే వ్యంగ్యమైన పేరులోనే మనకి కథ ఏంటో కొంచెం తడుతుంది. అయితే, “ఎ ఫెయిరీ స్టోరీ ” అనే కాప్షన్‌ని చాలా దేశాల్లో నిషేధించారట. అమెరికాలో ఈ పుస్తకం పేరు వుట్టి “ఎనిమల్ ఫార్మ్” గానే వుంచారు. తెలుగు అనువాదం మాత్రం “ఎనిమల్ ఫార్మ్- ఎ ఫెయిరీ స్టోరీ ” అనే వుంచారు.

ఇంగ్లండులోని ఒక మారు మూల ఫార్మ్ లో పని చేస్తున్న జంతువులన్నీ తమ యజమానులు తమని పెట్టే హింసను భరించలేక వారిపై తిరగబడి, వారిని ఓడించి తమని తామే ఫార్మ్ యజమానులుగా ప్రకటించుకుంటాయి. జంతువులు మనుష్యుల కింద బానిసల్లా బ్రతకక్కర్లేని ఒక సమ సమాజాన్ని స్థాపించాలని నిర్ణయించుకుంటాయి. అందుకు దిశా నిర్దేశం చేసే నాయకుడుండాలి కాబట్టి, “నెపోలియన్” అనే పందిని నాయకుడిగా ఎన్నుకుంటాయి.

 ఫార్మ్ లోని జంతువుల సమ సమాజ స్థాపన జరిగిందా? ఎనిమల్ ఫార్మ్ చివరికేమైంది?   దాదాపు వంద పేజీల ఈ చిన్న నవలికలో కమ్యూనిస్టు నాయకుల మీద హాస్యంతో కూడిన కరుకైన విమర్శనీ, కమ్యూనిస్టు ప్రభుత్వాలలోని వంచననీ అద్భుతంగా చిత్రీకరించారు ఆర్‌వెల్. తాను ఈ నవల ద్వారా స్టాలిన్ ప్రభుత్వంలో రష్యా ప్రజల దురవస్థని వర్ణించదలచుకున్నట్టు చెప్పారు ఆర్‌వెల్.

“ఎనిమల్ ఫార్మ్ పుస్తకంలో మొదటిసారి నేను రాజకీయ సిద్ధాంతాలనూ, సృజనాత్మక రచననూ ఒక చోట చేర్చే ప్రయత్నం చేసాను,” అని ఒక వ్యాసంలో వ్రాసారాయన.

ఈ పుస్తకం ఆర్‌వెల్ 1943-44 ప్రాంతాల్లో వ్రాసారు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రష్యా నియంత స్టాలిన్‌తో మంచి సంబంధాల కోసం కృషి చేసేది. అందువల్ల, ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి పబ్లిషర్లెవరూ ముందుకు రాలేదు.  అయితే 1946లో ఈ పుస్తకం ప్రచురణ తరవాత ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోని బోలెడన్ని కాపీలు అమ్ముడయ్యాయి.  టైం పత్రిక ఈ నవలను ఆంగ్లంలోని వంద అత్యున్నత నవలల్లో ఒకటిగా ఎంపిక చేసింది.

దాదాపు డెబ్భై అయిదేళ్ళక్రితం, అంటే 1949లో ఆర్‌వెల్ ఊహించి రాసిన 1984 వ సంవత్సరం ఇప్పుడు మనమున్న సమయాన్నించి సరిగ్గా నలభై యేళ్ళ గతం. అయితే ఈ నవలలో ఊహించిన విధంగా జరిగిందా లేదా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. కొన్నిసార్లు ఆయన ఊహించిన విషాదకరమైన భవిష్యత్తు మన కళ్ళ ముందు లీలగా గోచరిస్తున్నట్టే అనిపిస్తుంది.

ఎనిమల్ ఫార్మ్ లాగే ఇది కూడా డిస్టోపియన్ (నిరాశా పూరితమైన) భవిష్యత్తుని ఊహించి వ్రాసిందే. మొదటి దాన్లో కమ్యూనిస్టు నాయకత్వంలోని వంచనా, నాయకుల స్వార్థమూ, వంటి విషయాల గురించి వ్రాసారు. 1984లో ఒక నిరంకుశ, పెత్తందారీ ప్రభుత్వం పద ఘట్టనల కింద వినపడని ఆక్రందనలని గురించి వ్రాసారు. నిజంగా ఈ నవల చదివేటప్పుడు, మన ఆలోచనలని సైతం నియంత్రించాలనుకునే ప్రభుత్వాల కింద బ్రతకడం అనే ఊహే మనల్ని వొణికిస్తుంది. అంత నిర్మొహమాటంగా, నిర్భయంగా వుంటుందీ నవల.

1984 సంవత్సరంలో “ఓషెనియా” అనే చిన్న రాజ్యం, “యూరేషియా”, “ఈస్ట్-ఏషియా” అనే ఇంకో రెండు రాజ్యాలతో నిత్యం యుద్ధాల్లో మునిగి తేలుతూ వుంటుంది. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధానంతరం ఒక న్యూక్లియర్ యుద్ధం కూడా జరిగి మానవాళి  బాగా దెబ్బతిని వుంటుంది. అయినా నాయకులు నిత్యం ప్రజల నెత్తిన ఏదో వొక యుద్ధం రుద్దుతూనే వుంటారు.

ఓషేనియా రాజ్యం “బిగ్ బ్రదర్” అనే నియంత నాయకత్వంలో, “పార్టీ” అధీనంలో వుంటుంది. నియంతకీ, పార్టీ ఇతర నాయకులకీ ఊహించలేని శక్తులుంటాయి. రాజ్యంలోని ప్రతి మనిషినీ వేయి కళ్ళతో గమనిస్తూ వుంటారు. పార్టీకి వ్యతిరేకంగా పనులు కాదు, ఆలోచనలని సైతం పసిగట్టి నిర్దాక్షిణ్యంగా మట్టు పెట్టగలరు.

ఇళ్ళల్లో, వీధుల్లో, అంతటా సర్వాంతర్యామిలా కెమెరాలూ, టివీ స్క్రీనులూ వుంటాయి. వాటి కళ్ళు కప్పి ప్రజలు ఊపిరి కూడా పీల్చలేరు. నగరమంతటా “పెద్దన్నయ్య నిన్ను చూస్తూనే వున్నాడు” అని పోస్టర్లు అంటించి వుంటాయి.  మనుషులు వున్నట్టుండి మాయమైపోతారు. వారిని గురించి ప్రశ్నించే వ్యవస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏదీ వుండదు. పౌరులకి ఎటువంటి హక్కులూ వుండవు.

యుద్ధమే శాంతి”, బానిసత్వమే స్వాతంత్ర్యం“, “అజ్ఞానమే బలం“, వంటివి పార్టీ సిద్ధాంతాలు. ఇటువంటి సిద్ధాంతాలతో, అత్యాధునికమైన బ్రెయిన్ వాషింగ్ పద్ధతులతో పార్టీ తిరుగులేని శక్తిగా పరిపాలిస్తూ వుంటుంది. “థాట్ పోలీస్” అనే వ్యవస్థ మనుషుల ఆలోచనలని సైతం పసిగట్టగలదు.  అన్నిటికంటే విచిత్రం, వార్తల ప్రచురణ సైతం పార్టీ నాయకుల కనుసన్నల్లో సాగుతుంది. ఒకడు బ్రతికున్నాడని పార్టీ అంటే వున్నట్టు, లేడంటే లేనట్టు. “నిజం” అనే మాట కనబడదు, అర్థమూ కాదు.

కథానాయకుడు విన్‌స్టన్ స్మిత్ పార్టీ ఆఫీసులో ఒక చిన్న గుమాస్తా. అతను పనిచేసేది “నిజం” అనే ప్రభుత్వ శాఖలో (మినిస్ట్రీ ఆఫ్ ట్రూత్). అతని పని ప్రతి రోజూ చరిత్రని ప్రభుత్వాధికారుల ఆజ్ఞానుసారంగా తిరగరాస్తూ వుండడమే. తను వ్రాస్తున్న చరిత్రలో ఎటువంటి నిజమూ లేదన్న సంగతి అతనికి బాగా తెలుసు. తమ దేశం యే దేశంతో యుద్ధం చేస్తోందన్న విషయం కూడా ఎవరికీ నిర్ధారణగా తెలియదు. కొన్నేళ్ళపాటు “యూరేషియా మన శత్రువు” అని ప్రకటించిన ప్రభుత్వం, వున్నట్టుండి ఒకనాడు “యూరేషియా మన నిజమైన మిత్రుడు, మన శత్రువు ఈస్ట్ఏషియా” అని తీర్మానిస్తుంది. అంత వరకూ వచ్చిన వార్తా పత్రికలన్నిటీనీ ఆ మేరకు సవరిస్తుంది. ఇది విన్‌స్టన్‌ని అన్నిటికంటే అతన్ని ఎక్కువగా బాధించే విషయం.

ఏ మాత్రమూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేని జీవితమూ, చేస్తున్న అర్థంలేని వంచనా పూరితమైన ఉద్యోగమూ వల్ల విన్‌స్టన్‌ తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కూరుకొని పోయి వుంటాడు. అటుపైన, తన సహోద్యోగి జూలియా అనే అమ్మాయిని ప్రేమిస్తూ వుంటాడు కూడ. కానీ పార్టీ అనుమతి లేకుండా ప్రేమా, పెళ్ళి ఏదీ కుదరని జీవితం. అయితే ఉన్నట్టుండి అతనికి జూలియా కూడా తనని ప్రేమిస్తుందని తెలుస్తుంది. ఇద్దరూ రహస్యంగా అప్పుడప్పుడూ కలుసుకుంటూ వుంటారు. జూలియా కూడా అతనిలాగే పార్టీ పట్లా, ప్రభుత్వం పట్లా అసంతృప్తిగా వుంటుంది. ఇద్దరూ ఈ విషయమై ఎంతో చర్చించుకుంటారు. తమలాటి వాళ్ళందరూ ఒక తిరుగుబాటు కూటమిలా కలుస్తున్నారని తెలుస్తుంది. అయితే అందులో నిజమెంతో, ఆ తిరుగు బాటు కూటమిలో వున్నవాళ్ళెవరో ఎవరికీ తెలియదు. అంతా కేవలం గుసగుసలుగా, పుకార్లుగా మాట్లాడుకోవడమే తెలుసు.

ఒకరోజు విన్‌స్టన్‌కి ఓబ్రియన్ అనే సహోద్యోగి రహస్యంగా కలవమని వర్తమానం పంపుతాడు. తను ఊహిస్తున్న తిరుగుబాటు కూటమికి చెందిన వ్యక్తి ఓబ్రియన్ అయే వుంటాడన్న ఉత్సాహంతో వెళ్తాడు విన్‌స్టన్. అక్కడ అతనికి అసలు నిజం తెలుస్తుంది. ఆ తరవాత వొచ్చే పది ఇరవై పేజీల్లో మనుషులనీ, వాళ్ళ బలహీనతలనీ, స్వార్థాలనీ, కాచి వడబోసి, నిలువెత్తు నగ్నంగా మనముందు నిలబెడతాడు ఆర్‌వెల్. ఆ పేజీలు చదివి ఆ బాధ అనుభవించాల్సిందే కానీ వర్ణించలేము. ఇదే జీవితం, ఇదే మనిషి, అన్న నిజం ఒక లాటి నిరాశ కలగ జేయక మానదు.

అధికార వర్గాలకి వ్యతిరేకంగా ఒక మాటని కానీ, ఒక ఆలోచనని కానీ అనుమతించని నిరంకుశ పాలనలో సామాన్యుని బ్రతుకెంత దుర్భరంగా వుంటుందో, అసలా వ్యవస్థ మానవ జీవితానికెంత హానికరమో హెచ్చరిస్తుందీ పుస్తకం.

కథా, రచయిత ఊహా శక్తీ ఒక ఎత్తైతే, రచనలో వున్న గాఢతా, ఆవేదనా ఒక ఎత్తు. 

“మనిషికి ప్రేమించబడటం కంటే అర్థం చేసుకోబడటం ఎక్కువ ముఖ్యం.”, “ఒక రహస్యాన్ని రహస్యంగా వుంచాలంటే, దాన్ని నీ నుంచి కూడా రహస్యంగా వుంచుకోవాలి.” ఇటువంటి లోతైన వాక్యాలు పుస్తకమంతటా వుంటాయి.

తన పుస్తకాన్ని “వ్యంగ్య రచన”గా చెప్పుకున్నారు ఆర్‌వెల్. 1923 నుండి 2005 వరకూ వచ్చిన ఆంగ్ల నవలల్లో వంద గొప్ప నవలల్లో ఒకటిగా ఈ పుస్తకాన్ని టైం పత్రిక ఎన్నిక చేసింది. ప్రవృత్తి రీత్యా సోషలిజం సిద్ధాంతాలని నమ్మిన ఆర్‌వెల్, కమ్యూనిస్టు నాయకత్వాల వైఫల్యాల వల్ల పొందిన నిరాశకి వ్యక్తీకరణ ఈ నవల. 1946 లో ఈ నవల వ్రాయడం మొదలుపెట్టి 1948 కల్లా ముగించారు. 1949 జూన్ లో మొదటి ముద్రణ ప్రచురితమైంది. 1950 జనవరిలో ఆర్‌వెల్ మరణించారు.

You Might Also Like

Leave a Reply