“ ప్రేమ్‌చంద్ రచనలు” – సాహిత్య సంప్రదాయాలకు వారధి

వ్యాసకర్త: యం. బి. ఉషా ప్రత్యూష

(ఎడిటర్, కథా ప్రపంచం ప్రచురణలు)

******

సాహిత్య ప్రపంచం భాషా సాంస్కృతిక సరిహద్దులను దాటి వైవిద్యమైన కథనాలను తనలో దాచుకున్న నిధి. అందులో 20వ శతాబ్దపు మొదటి దశకాలలో అమితంగా వినిపించిన స్వరం ప్రేమ్‌చంద్ ది. అప్పట్లో భారతీయ సాహిత్య ప్రపంచాన్ని ఏలిన అగ్ర రచయితలలో ప్రేమ్‌చంద్ ఒకరు. మున్షి ప్రేమ్‌చంద్, ఒక సాహితీవేత్త. ఆయన కథలు తరతరాలుగా పాఠకుల హృదయాలను వశం చేసుకున్నాయి. తెలుగుతో సహా పలు భాషలలో అనేకులు ఆయన కథల అనువాదాలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ నేడు మేము ఈ కథా సమగ్రాన్ని తెలుగు పాఠకులకు ఎందుకు అందించాలనుకుంటున్నాం అనే విషయాన్ని విపులంగా ఈ వ్యాసంలో మీకు వివరిస్తాను.

మున్షీ ప్రేమ్‌చంద్ కథలు మానవ జీవితం పట్ల లోతైన అంతర్ దృష్టిని కలిగి సామాజిక సమస్యలు, మానవ సంబంధాలు, భావోద్వేగాలు మరియు జీవితంలోని సంక్లిష్టతలను అధికంగా చర్చిస్తాయి. ఇన్ని వైవిధ్యాలతో కూడిన అంశాలను ఆయన తన రచనల్లో ప్రతిబింబింపజేసినప్పటికీ ఆయన తన రచనలు చేసిన హిందీ మరియు ఉర్దూ భాషలలో కాకుండా ఇతర భాషలలో ఆయన కథల సమగ్ర  విస్తృతంగా అందుబాటులోకి రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంగ్లీషులో మాత్రం ఆయన కథలు అనువదించబడ్డాయి. కానీ ఏ ఇతర భాషల్లోనూ పూర్తి కథా సమగ్రం అనేది తీసుకురాలేదు. దీని కారణంగా హిందీ లేదా ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం లేని పాఠకులు ప్రేమ్‌చంద్ సాహిత్యం తెలుసుకునే అవకాశాన్ని కోల్పోతారు. తెలుగు పాఠకులకు ఆ లోటును భర్తీ చేయడానికి, భాషా అంతరాన్ని పూరించడానికి మా వంతుగా ఈ అనువాద కథా సమగ్రం లోని ఒక భాగాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం.

ప్రేమ్‌చంద్ కథలను తెలుగులోకి అనువదించి ప్రచురించే ప్రయత్నం ఇంతకుముందు కూడా జరిగింది. కానీ ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాల మూలంగా తెలుగు వారికి అందుబాటులో ఉన్న కథల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. ఉర్దూ హిందీ భాషల మినహా ఇతర భాషల్లో ఆయన సమగ్ర కథా సాహిత్యం లేకపోవడం, మిగిలిన భారతీయ భాషల్లో సైతం కొన్ని కథలు మాత్రమే అక్కడక్కడ ప్రచురింపబడడం, పొందికగా కూర్చబడిన సమగ్రం లేకపోవడం చాలా లోటుగా అనిపించింది. ఇప్పటివరకు తెలుగులో ప్రచురితమైన ప్రేమ్‌చంద్ అనువాద కథలు మొత్తం గా చూసుకున్న 30 నుంచి 40 కి దాటలేదు. 2018లో  విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన ప్రేమ్చంద్ కథలు అనే పుస్తకంలో 15 కథలను అనువదించారు. తర్వాతి కాలంలో మున్షి ప్రేమ్ చంద్ 21 ఎంచుకున్న కథలు పేరిట డైమండ్ పాకెట్ బుక్స్ వారు 21 ప్రేమ్చంద్ అనువాద కథలను ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. గతంలో కొన్ని కథలు మళ్ళీ మళ్ళీ వేరు వేరు అనువాదకుల చేత అనువదించబడ్డాయి. కొన్ని అనువాదాలు  1950 ప్రాంతంలో ఆంధ్రప్రభ మరియు ఆంధ్ర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈ కారణంగా ఈ సమగ్రాన్ని ప్రచురించడం ద్వారా ప్రేమ్‌చంద్ కథనాల యొక్క విస్తృతమైన వైవిధ్యాన్ని, విభిన్నమైన ఇతివృత్తాలను అన్వేషించడానికి, పాఠకులు తమ పఠనానుభవాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

మున్షీ ప్రేమ్‌చంద్ కథలు కేవలం కథలు మాత్రమే కాదు. అవి ఆయన జీవించిన సమాజం మరియు ఆయన తీక్షణంగా గమనించిన మానవ స్వభావాలకు ప్రతిబింబాలు. ఈ కథనాలు చరిత్రకు, సంస్కృతికి మరియు ఆనాటి సమాజంలోని మానవీయ విలువలకు అద్దం పడతాయి. ఈ సమగ్ర తెలుగు అనువాదం హిందీ మరియు ఉర్దూ పాఠకులకే పరిమితం అయిన ప్రేమ్‌చంద్ సాహిత్యాన్ని భావితరాలకు అందించడానికి ఒక సాధనంగా ఉపయోగ పడుతుంది. భాషా అవరోధాలకు అతీతంగా విస్తరించిన ఆయన సాహిత్య సేవ పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది.

సాహిత్యం అనేది సాంస్కృతిక మార్పిడి కి ఒక శక్తివంతమైన సాధనం. ప్రేమ్‌చంద్ కథలను తెలుగులోకి అనువదించడం ద్వారా తెలుగు మాట్లాడే పాఠకులు అతని కాలంలోని ఉత్తర భారత దేశ సామాజిక సాంస్కృతిక పరిస్థితుల పైన ఒక అంతర్ దృష్టిని పొందగలుగుతారు. ఈ సమగ్రాన్ని పూర్తిగా చదవడం వల్ల పాఠకులకు ప్రేమ్‌చంద్ కథనాశైలి, పాత్రల అభివృద్ధి, నేపథ్యాల అన్వేషణ గురించి ఒక సంపూర్ణమైన అవగాహన లభిస్తుంది. అతని అనేక కథలు ఇతివృత్త పరంగా ఒక దానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఈ సమగ్ర సేకరణ ద్వారా పాఠకులు ఇంతకు ముందు వ్యక్తిగత ప్రచురణలు అందించలేని విధంగా ఆయన కథాకథనంలోని సూక్ష్మమైన బేధాలను గ్రహించడానికి వీలుపడుతుంది.

అనువాదం అనేది ఒక కళ. ఒక విషయాన్ని అనువదించడానికి మూల భాష మరియు లక్ష్య భాషల గురించి లోతైన అవగాహన అవసరం. ప్రేమ్‌చంద్ కథల పూర్తి అనువాదం, అతని కథనాలలోని సూక్ష్మమైన భేదాలు, సాంస్కృతిక రిఫరెన్స్‌లు , పాఠకులు మరియు కథల మధ్య మరింత పటిష్టమైన అర్థవంతమైన కనెక్షన్ ను ఏర్పరుస్తుంది. ఈ కథల సంపుటిని తెలుగులోకి అనువదించడం ద్వారా సాహిత్య వారసత్వాన్ని కాపాడుకొని ముందు తరాలకు అందించడంలో మా తరఫునుంచి ఒక అడుగు వేస్తున్నాం.

మున్షీ ప్రేమ్‌చంద్ కలం నుండి జాలువారిన కథలనుండి మొదటి విడతగా 100 కథలను “ప్రేమ్‌చంద్ కథావళి” పేరిట తీసుకొని వస్తున్నాము. ఈ పుస్తకంలోని వంద కథలను తెలుగులోకి అనువదించినది “ అచ్యుతుని రాజ్యశ్రీ గారు”. ఆమె వృత్తి రీత్యా అధ్యాపకురాలుగా పనిచేసినప్పటికీ ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిలాషులు. వార్త, ఆంధ్రజ్యోతి,ఆంధ్రభూమి వంటి అనేక ప్రముఖ దినపత్రికలలో ఆమె ఆర్టికల్స్ ప్రచురితం అయ్యాయి. హైదరాబాద్ రేడియో పిల్లల కార్యక్రమాలలో,వనిత వాణిలో పాల్గొన్నారు.రామోజీ ఫౌండేషన్ లోని విపులలో ఆమె అనువదించిన 200 పైగా కథలు, చతురలో కొన్ని నవలలు ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టాయి.

700 పైగా పేజీలతో ప్రచురింపబడుతున్న ఈ పుస్తకం  త్వరలోనే మీ ముందుకు తెస్తున్నాము. పుస్తకం అప్డేట్ల కోసం www.facebook.com/kathaaprapancham ను వీక్షించండి. 

యం. బి. ఉషా ప్రత్యూష

You Might Also Like

Leave a Reply