ఆల్బర్ట్ కామూ ప్రసంగం – “క్రియేట్ డేంజరస్లీ”
వ్యాసకర్త: రహ్మానుద్దీన్ షేక్
*******
ఆల్బర్ట్ కామూ ఫ్రెంచ్-అల్జీరియన్ తాత్త్వికుడు, రచయిత. అస్తిత్వవాదం, అసంబద్ధత అంశాలపై రాసిన అతి కొద్ది రచయితల్లో కామూ ఒకరు. ఇతని రచనలు ఆలోచనలు రేకెత్తించేవిగా ఉంటాయి. ది స్ట్రేంజర్, ది మిథ్ ఆఫ్ సిసిఫస్, ది ప్లేగ్, ది ఫాల్ కామూ రాసిన రచనల్లో పేరొందినవి.
“క్రియేట్ డేంజరస్లీ” అనే ఈ ప్రసంగపాఠాన్ని పెంగ్విన్ మోడర్న్ ప్రచురించింది. ఈ పుస్తకంలో “క్రియేట్ డేంజరస్లీ”తో పాటుగా “డిఫెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్”, “బ్రెడ్ అండ్ ఫ్రీడమ్” అనే కామూ ఇచ్చిన వేరే రెండు ప్రసంగాల పాఠాలు కూడా ఉన్నాయి.
“క్రియేట్ డేంజరస్లీ” ప్రసంగాన్ని కామూ స్వీడన్‌లోని ఉప్సలా విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 1957లో అందించారు. ఈ ప్రసంగం అందించిన కొద్ది రోజుల తర్వాత కామూకి నోబెల్ బహుమతి ప్రకటించారు.
ఇందులో కామూ రచయితలను, బుద్ధిజీవులను ఉద్దేశ్యించి ప్రసంగించారు. అల్లకల్లోలంగా సమాజం మారిన తరుణంలో రచయితల బాధ్యతలు, సమాజంలో వారు పోషించాల్సిన పాత్ర గురించి కామూ చెప్తారు. ప్రసంగంలో కామూ వాడిన పదాలు కళను కేవలం అలంకారప్రాయంగా, వినోదానికి ఒక సాధనంగా మాత్రమే చూడకుండా చేస్తాయి. అంతకు మించి చూడాల్సిన వాస్తవిక పరిస్థితి గురించి చెప్తాడు కామూ. సమాజంలో ముఖ్యమైన వనరుగా, కొండకచో తీవ్రవాద శక్తిగా రచయితలు తయారవ్వాలని కామూ పిలుపునిస్తాడు.
ఈ ప్రసంగంలో ముఖ్యంగా చెప్పిన అంశం ఏంటంటే, సమాజం తరచూ అన్యాయాలతో నిండి, అతలాకుతలంగా ఉంది – నిజమైన రచయితలు అస్తిత్వంలోని ఈ సంక్లిష్టతలను కేవలం గమనించి, గమనించిన సమాజాన్ని పట్టించుకోకుండా తమ రాతలను తమ పద్ధతిలో రాసుకుపోవటమో లేదా ఆ గమనింపును ఒక సాక్షిగా రాసుకుంటూ పోవటమో చేయకూడదని. వారు చురుగ్గా సమాజంలోని అవినీతిని, అన్యాయాన్ని, అల్లకల్లోలాన్ని ఎదురించాలని, అది వారికి ప్రమాదమైనా సరే, అలానే చేయాలనీనూ.
చాలా రచయితలు సమాజాన్ని గమనించాక అది వారి నమ్మకాలకు తగినట్టుగా లేనందున ఒక రకమైన అయోమయంలో పడిపోతారు. వారి చేతుల్లో రచనలు చేసి సమాజాన్ని మార్చగల సత్తువ ఉందో లేదో అన్న సందేహంలో ఉంటారు. అలాంటి రచయితలకు ఈ ప్రసంగం ద్వారా తన తర్కంలోని అంశాలను పెద్దగా తెల్లం చేయకుండానే కామూ ఒక మానిఫెస్టోను అందించారు.
“ప్రమాదకరంగా రచనలు చేయండి!” అని పిలుపునుస్తున్నాడు కామూ.
రచయితలు వారున్న దేశకాలమానపరిస్థితుల్లోని సామాజిక రుగ్మతలను ఎదురించాలి. సమాజంలో నిర్ణయించబడిన నిబంధనలను ప్రశ్నించాలి. సమాజం రచయితలపై కనిపించకుండా వేసిన కంచెను బద్దలకొట్టి, ఆ పరిధులను దాటి స్వేచ్ఛగా రాయాలి. ఇది రచయితలకు కామూ ఇచ్చిన బాధ్యత.
రచయితలు, బుద్ధిజీవులు అన్యాయానికి విరుద్ధంగా మాట్లాడకుండా నిశ్శబ్దం పాటించడం, దోపిడీకి విరుద్ధంగా గొంతెత్తకపోవడం ప్రమాదకరమైన చర్యలని కామూ అంటాడు. బలవంతుడు బలహీనుల పట్ల చేస్తున్న అన్యాయాన్ని, దోపిడీని ఎదురించకపోవడం ఆ బలవంతుడికి సహకారమందిస్తున్నట్టే.
కళ ఒక శక్తిమంతమైన ఆయుధం. కళను ఒక ఆయుధం చేసుకొని దాగివున్న నిజాలను బయలు చేయవచ్చు. స్తబ్దుగా ఉన్న సమాజంలో ఆలోచనలను రేకెత్తించవచ్చు. సరైన సమాజ స్థాపన కోసం జరగాల్సిన చర్యలకు స్ఫూర్తినివ్వవచ్చు.
అంటే రచయితలు సమాజంలో జరుగుతున్న సంఘటనలను వీక్షకుల పాత్ర వహిస్తూ దండకవిలెలు రాస్కుంటూ పోకూడదు. రచయితలు సమాజపు స్థితిగతులను పాఠ్యీకరించేందుకు మాత్రమే లేరు.
రచనలు సమాజానికి అద్దం పట్టడమే కాదు, సమాజప్రగతికి తోడ్పడే ప్రేరణవ్వాలి.
నేడు మనం మతం పేరుతో, కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ముక్కలుచక్కలైన సమాజంలో బ్రతుకుతున్నాం. తప్పుడు సమాచారాన్ని అదేదో నిత్యావసరంలా తీసుకుంటున్నాం. మనకు నచ్చిన వారిపై ఎవరైనా విమర్శ చేస్తే ఆ విమర్శను ఒక దాడిలా మనం భావిస్తున్నాం. అసమ్మతి అనేది ద్రోహానికి సమానార్ధకంగా పరిగణించబడుతోంది. మునుపెన్నడూ లేనంతగా, మన సమాజానికి మనస్సాక్షిగా వ్యవహరించడానికి కళాకారులు, మేధావులు అవసరం.
మరింత స్ఫూర్తి కోసం కామూ ప్రసంగపు పూర్తి పాఠాన్ని చదవగలరు.
Leave a Reply