డీకోడింగ్ ద లీడర్

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

*****

శీర్షిక ఇంగ్లీషులో ఉన్నా ఇది తెలుగు పుస్తకం. తెలుగు రాష్ట్రంలోని ఒక ప్రముఖ వర్తమాన రాజకీయ నాయకుడు గురించి చెప్పిన పుస్తకం. విభజనకు పూర్వం ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి, కొత్తగా విడివడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి పుస్తక కథానాయకుడు. ఆరు సంవత్సరాలు పాటు ఆ నాయకుడితో సన్నిహితంగా పనిచేసిన డా. పెద్ది రామారావుగారు పుస్తక రచయిత.

ఒక రాజకీయ నాయకుడి కథే అయినా రాజకీయాలకు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కాక భిన్న సన్నివేశాల్లో నాయకుడి వ్యక్తిత్వాన్ని పొరలుపొరలుగా చూపుతుందీ పుస్తకం. అందుకే ఈ శీర్షికను ఎంచుకుని ఉంటారు.  

ప్రపంచ సాహిత్యంలో ఎన్ని గొప్ప కథలు ఉన్నా వాస్తవ జీవితాలను మించిన ఆకర్షణేదీ వాటిలో ఉండదు. కారణం, కథలు కేవలం రచయిత ఊహల్లోంచి పుట్టినవి. జీవితకథల గొప్పదనమంతా అవి రక్తమాంసాలతో ఉన్న ఒక వ్యక్తి అనుభవించి, జీవించిన వాస్తవం కావటమే. ఏ వ్యక్తీ కూడా జీవితంలో ఎదురవబోయే సందర్భాల్ని, సన్నివేశాల్ని ముందుగా ఊహించి, సిద్ధపడటం సాధ్యం కాదు. ఎంత ప్రణాళికాబద్ధమైన జీవితమైనా సాకారం చేసుకునే క్రమంలో అనుకోని ఫలితాలను చూడవచ్చు. వ్యక్తి యొక్క మానసిక పరిపక్వత, లోకం పట్ల అవగాహన, దృష్టికోణం బట్టి ఫలితాలను ఎలా స్వీకరించాడన్నది తెలుస్తుంది. ఇవన్నీ ఎదుటివారికి మంచి పాఠాల్ని చెపుతాయి. 

ప్రతి వ్యక్తికీ ఒక కథ ఉంటుంది, అది విభిన్నంగానే ఉంటుంది! అనుభవాలు వ్యక్తిగతాలు. అవే జీవితాన్ని రాస్తాయి. ఆయా అనుభవాలకు వ్యక్తులు స్పందించిన తీరు అమితమైన ఆసక్తిని కలిగిస్తుంది. అందుకనే వ్యక్తుల జీవితచరిత్రలకి – స్వయంగా రాసుకున్నదైనా, మరెవరో రాసినదైనా ఎంతో విలువ ఉంటుంది. 

పుస్తక రచయిత డా. పెద్ది రామారావు గారు రచయిత, కవి, కళాకారుడు. కళల పట్ల ప్రేమ వారసత్వంగా అబ్బిన వ్యక్తి. జీవితం పదిమందికి ప్రయోజనకరంగా ఉండాలన్న స్పృహతో పెరిగినవారు. జర్నలిస్ట్ గా పనిచేసారు. ప్రొఫెసర్ గా పనిచేస్తూన్న సమయంలో చంద్రబాబు గారితో పనిచేసే అవకాశం రావటంతో, అరుదైన ఆ అనుభవం ఈ పుస్తకానికి ప్రేరణ అయిందంటారు. పుస్తకాన్ని కొన్ని భాగాలుగా విభజించారు.

గోదావరి మీద వాకింగ్ స్ట్రీట్     

గోదావరి నది మీద ఎప్పుడో బ్రిటీష్ వాళ్లు కట్టిన హావ్ లాక్ బ్రిడ్జ్ పాత ఇనుప సామాను కింద వేలం వేసి అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఒక వార్త! రాజమండ్రిని కొవ్వూరును కలిపే వందేళ్ల నాటి ఈ మూడు కిలోమీటర్ల బ్రిడ్జ్ ని పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు కేంద్రమంత్రిగా చిరంజీవిగారు ప్రయత్నించారన్న విషయమూ ఆ వార్తతో పాటు తెలుసుకున్నారు రచయిత. దానిని వాకింగ్ స్ట్రీట్ గా మార్చి గొప్ప పర్యాటక ప్రదేశంగా చెయ్యాలన్న ఆలోచనని రచయిత లోకేష్ గారితో పంచుకోవటంతో ఈ కల మొదలైంది. లోకేష్ గారు వెంటనే తమ ఊహను డిజైన్ చేయించి, చంద్రబాబు గారి దగ్గరకు వెళ్లారట. క్షణాల్లో విషయం ఆకళింపు చేసుకున్న చంద్రబాబు గారు తనదైన విజన్ తో ఎన్నో సూచనలు చేసారట. వాటివల్ల ఎదురవుతాయనుకునే సవాళ్లకూ నాయకుడే సమాధానం చెప్పారట.

అనేక కారణాలతో కాలయాపన జరిగి అంత పెద్ద ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైపోయింది. తర్వాత రాష్ట్ర నాయకుడే మారిపోయారు.

బాబుగారు ఐకానిక్, యూనివర్సల్, హైటెక్, ఇంటర్నేషనల్ లాటి పదాల మీద వ్యామోహంతో అన్నీ అత్యద్భుతంగా చెయ్యాలంటారు. దాని వల్ల మంచి ఎంత జరిగిందో చెడు కూడా అంతే జరిగిందంటారు నిష్కర్షగా రచయిత. నాయకుడి నిర్ణయాల్ని సమర్థించలేదు. 

2014 హుద్ హుద్ తుఫాను రాబోతున్న ప్రమాదాన్ని గమనించి ముందుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న రాష్ట్రప్రభుత్వం తీరా అందరి అంచనాలను మించిన విధ్వంసం ఎదురైనపుడు ఎంత వేగంగా స్పందించి ప్రభుత్వ యంత్రాంగాన్నంతా సమాయత్తం చేసిందో చదువుతుంటే అలాటి నాయకులు మనమధ్య ఉన్నందుకు గర్వంగా అనిపిస్తుంది. విపత్తును ఎదుర్కొందుకు రోజుల తరబడి బాధితుల మధ్య తిరుగుతూ కనీసావసరాలన్నీ క్షణాల్లో ఎలా అందుబాటులోకి తెచ్చిందీ తెలుస్తుంది. ఆదుకుందుకు నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం ఉందన్న నమ్మకం ప్రజల్లో కలిగించ గలిగినవారు నిజమైన నాయకులు!  

నాయకుడికి అండగా రాత్రిపగలు శ్రమించిన ప్రభుత్వ యంత్రాంగం పాత్ర ఘనమైనదే. ఎంత పెద్ద పనినైనా Men, Machinery, Material, Media… అనే నాలుగు విషయాలను అనుసంధానించుకునే బాబుగారి తీరును ఈ వ్యాసంలో చెప్పారు. విపత్తు వచ్చినప్పుడు ఎలా నిలబడాలో, ఆలోచించాలో, స్పందించాలో సమర్ధుడైన నాయకుడికి మాత్రమే తెలుస్తుందంటారు. హుద్ హుద్ వెనుకే వచ్చిన దీపావళికి టపాసులు కాల్చవద్దని, కూలిన చెట్లు అగ్ని ప్రమాదానికి గురవుతాయన్న ప్రభుత్వ హెచ్చరికను మనసావాచా అమలు చేసిన ప్రజలు నాయకునికి దీటైనవారే. ఇదంతా సమీప గతంలోనిదే.

సొమ్మొకడిది బొమ్మల కొట్లోకి చిన్నపిల్లవాడిని తీసుకుపోతే ఎంతలా ఆనందపడిపోతాడో, టెక్నాలజీ అన్న మాట ఏడు పదులు దాటిన బాబుగార్ని అంతే ఆనందపరుస్తుందంటారు. ఇక్కడ ఊబర్ టాక్సీ గురించిన ఆసక్తికరమైన కథ చెపుతారు రచయిత. చంద్రబాబు గారి హయాంలో వృద్ధాప్య పెన్షన్లను క్రమబద్ధీకరించటాన్నీ, రేషన్ కార్డుల పని పద్ధతిని, భూ సర్వే, రికార్డులని డిజిటలైజ్ చేయటాన్ని, మారుమూల గిరిజన తండాలకూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించటాన్ని వివరిస్తూ బాబుగారి టెక్నాలజీ పిచ్చి ఆయన తరవాత వచ్చిన ప్రభుత్వానికే ఎక్కువ మేలు చేస్తోందంటారు రామారావుగారు. 

కాఫీ కథ బాబుగారికి కాఫీ పట్ల ఉన్న ఇష్టం ఆయన్ని అరకు కాఫీని ఇంటర్నేషనల్ బ్రాండ్ చేసేందుకు ఎలా ప్రోత్సహించిందో చెపుతారిక్కడ.

ద రాబిన్ హుడ్ తన పాలన కింద పాతిక వేల కిలోమీటర్ల రోడ్లను వేయించిన ఘనత బాబుగారిదంటూ, ఆ పనులకి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న NREGS (Nationala Rural Employment Guarantee Scheme) ద్వారా ఆ స్కీం లో చిన్న క్లాజ్ ను ఉపయోగించుకుని ఎలా నిధులు సంపాదించగలిగారో చదువుతుంటే నాయకుడికున్న సూక్ష్మ పరిశీలన అర్థమవుతుంది. రాష్ట్రానికి ఎలాటి ఆదాయం లేని సమయంలో ఇవన్నీ సాధించారంటే నాయకుడి నిబద్ధత, ప్రగాఢ విశ్వాసం, పట్టుదల తెలుస్తుందంటూ, రచయిత వాటిని తానూ నేర్చుకున్నానంటారు.

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రతివారికీ మనసులో మాట చెప్పుకుందుకో, సంతోషాన్నో, దుఃఖాన్నో పంచుకుందుకో స్నేహితులుంటారు. బాబుగారికి వ్యక్తిగత స్నేహితులంటూ లేరు. జీవితమంతా జనంతో నిండిపోవాలన్న బాబుగారి కల ఇలాటి జీవితాన్ని ఎంచుకుంది. యూనివర్సిటీ రోజుల్నుంచి ఆయనవి ఇలాటి స్నేహాలేనట. నాయకుడైనా మనిషే కనుక భావోద్వేగాలు పంచుకోవాలన్నప్పుడు ఆయా సందర్భాల్లో చుట్టూ ఉన్నవారితోనే తనను తాను వ్యక్తపరుచుకుంటారట. ఆంతరంగిక స్నేహితులు లేరన్న విషయం కదిపినప్పుడు చంద్రబాబు గారిచ్చిన సమాధానం ఆలోచించదగ్గది! “ప్రజాస్వామ్యంలో ఆంతరంగికులు ఉండరు, ఫ్యాక్షనిజంలోనే ఉంటారు!”

వృత్తి, వ్యక్తిగతం అంటూ రెండు పార్శ్వాలు లేని వ్యక్తికి వృత్తి జీవితంలోనే కావలసిన స్నేహితులు ఉంటారట! ఈ ఆలోచన మరింత విశాలంగా ఉందనిపిస్తుంది. ఎదుటి వ్యక్తి ఆలోచనలోని కొత్తదనం, వాస్తవం, హేతుబద్ధత బాబుగారికి ఇష్టమట.

ప్లేట్ మీల్స్ బాబుగారి భోజనం అత్యంత మితంగా, సాధారణంగా ఉంటుందట. ఆరోగ్యకరమైన జీవిత సూత్రం!

క్యా కియా హీరో దక్షిణభారతంలో హీరో హోండా కంపెనీవాళ్లు వాహనాల తయారీ పరిశ్రమ పెట్టబోతున్నారన్న వార్తను రచయిత పంచుకోగా, అది బాబుగారి పేషీకి చేరటం, గంటలో ఆ కంపెనీ పెద్దాయనతో బాబుగారు మాట్లాడటం జరిగిపోయాయట. నిర్ణయాల్ని క్షణాల్లో తీసుకునే లక్షణం నాయకుడిది. అయినా కంపెనీ పెద్దాయన్ను కలవటానికి, చిత్తూరులో హీరో హోండా ఫ్యాక్టరీ రావటానికీ మూడేళ్ల వ్యవధి పట్టిందట. బాబు గారి perseverance skills చెప్పుకోవాలంటారు. తర్వాత రాష్ట్రంలో వేలకోట్ల పెట్టుబడితో కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చింది. వివరాలన్నీ ఆసక్తిగా చదివిస్తాయి.

2029 – నెంబర్ వన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ పాతికేళ్ల క్రితమే బాబుగారు ‘విజన్ – 2020’ అంటూ కార్పొరేట్ రంగానికి చెందిన ‘విజన్’ అన్న కాన్సెప్ట్ ను మనదేశ రాజకీయాలలో ప్రవేశపెట్టినపుడు అందరూ ఆశ్చర్యపోయారట. 2004 లో బాబు గారి ఓటమికి ఈ విజనే కారణమని విమర్శ ఉన్నా, “విజన్ ఉండటం వల్ల ఓడిపోలేదు, దానిని మెజారిటీ ప్రజలకు అర్థం అయ్యేలా, ఆమోదించేలా చెయ్యటంలో నేను ఫెయిల్ అయ్యాను.” అన్నది బాబుగారి ఆత్మవిమర్శ.

సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆస్ట్రేలియన్ రచయిత్రి రాసిన “సీక్రెట్” పుస్తకం యాభై భాషల్లో అనువదించబడి, ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. పదేపదే ఆలోచించే ఒక విషయం ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రకారం వాస్తవంలో జరుగుతుందన్నది ఈ పుస్తకం సారాంశం.

రామారావుగారికి ఆ పుస్తకం చదివినప్పుడు గొప్పగా అనిపించలేదట. ఈ పుస్తకం గురించి బాబు గారు పదేపదే తన సమావేశాలలో సహచరులతోనూ, అధికారులతోనూ చెపుతూ ప్రోత్సహించటం విన్నాక మాత్రమే కలల్ని సాకారం చేసుకుందుకు సీక్రెట్ పుస్తకం చెప్పిన సూత్రం పనిచేస్తుందని, బాబుగారి మంత్రం అదేననీ అర్థమైందట. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అత్యద్భుతమైన రాజధానిని కలగన్న బాబుగారు చేతిలో పైసా లేకపోయినా కొన్ని వేల ఎకరాలను సమీకరించగలిగారు. పూర్తిచెయ్యలేకపోటానికి కారణం ఆయన నమ్మే మంత్రంలో లోపం కాదని, కాలానికి కొంత సమయం ఇవ్వాలంటారు. 

నాయకత్వ పాఠశాల ఎలాటి డిగ్రీలు, ట్రైనింగులూ అక్కర్లేని రెండు అద్భుతమైన వృత్తులు రాజకీయాలు, సినిమాలు అని, వాటిలోనే ఎక్కువ సంపాదన, గుర్తింపు ఉన్నాయంటారు రచయిత.

దేశంలో మంచి రాజకీయ నాయకుల్ని తయారు చేసేందుకు ఎన్జీ రంగాగారు స్వాతంత్ర్యం రాకముందే రైతు శిక్షణ శిబిరాలు నడుపుతూ, రాజకీయ పరిణామాలు, స్వాతంత్రోద్యమం వంటి అంశాల మీదా తరగతులు నడిపారు. రాజకీయ నాయకత్వ తయారీని కమ్యూనిస్ట్ పార్టీలూ చేసాయి. 1980 నాటికి ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించి, రాజకీయ శిక్షణ శిబిరాలను గండిపేటలో నిర్వహించినపుడు, ఆ బాధ్యతను బాబుగారు చూసుకునేవారు. రాజకీయనేపథ్యం లేని కొత్తతరం వారిని తెలుగుదేశంపార్టీ మంచి నాయకులుగా తయారు చేసిందని తెలుస్తుంది. 2014 తర్వాత బాబుగారి నాయకత్వంలో శిక్షణా తరగతుల నిర్వహణ డా. పెద్ది రామారావుగారికి అందింది. పార్టీ నాయకుల మొదలు సామాన్య కార్యకర్తల వరకు ఆ సమావేశాలను శాంతియుత వాతావరణంలో జరిపించిన అనుభవం రచయితది. ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి, వర్ట్యువల్ తరగతులను కూడా నిర్వహించమనే నాయకుడి మాటలే అసలైన విజన్ అంటారు.

మాయాజాలం పబ్లిక్ మీటింగుల్లో అనేక విషయాలను కలిపేసి సుదీర్ఘంగా మాట్లాడే బాబుగారి కమ్యూనికేషన్ సామర్థ్యం తక్కువ స్థాయిలో కనిపిస్తుందనీ, వ్యక్తిగతమైన మీటింగుల్లో మాత్రం అద్భుతమైన సామర్థ్యాన్ని చూడగలమంటారు. వచ్చినవారు చెప్పే విషయాన్ని అత్యంత శ్రద్ధగా వినటం, మాట్లాడినంతసేపూ ఎదుటివ్యక్తి కళ్లలోకి చూస్తూ మాట్లాడటం, రాష్ట్రంలోని వర్తమాన సమస్యలను నిస్సంకోచంగా ఎదుటివారితో పంచుకుంటూ, తన విజన్ లో వారిని భాగస్వాముల్ని చెయ్యటం బాబుగారి మాయాజాలమట. ఎదుటివారు సమ్మోహితులైపోతారట. 

ముదుర్లు ఒకసారి సహచర మిత్రునితో సంభాషణలో రాజకీయ నాయకులలో అవినీతి ప్రస్తావనకొచ్చినప్పుడు రాజకీయ నాయకుల కంటే వ్యవస్థలోని అధికారుల అవినీతి మరింత ఎక్కువన్న విషయం చర్చకొచ్చిందట. నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసే అధికార్లతో పాటు అవినీతిలో రాజకీయ నాయకులతో పోటీపడే అధికారులూ ఉంటారంటారు. రాజకీయ నాయకులకుండే అధికారం గెలిచినన్నాళ్లే, పైగా సంపాదించిన ధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతూనే ఉండాల్సిన పరిస్థితి వాళ్ళది. అధికారులకు అలాటి ఖర్చుండదు. పైగా పదవీ సుదీర్ఘమైనది. అక్రమ సంపాదనకి ఎక్కువ అవకాశాలుంటాయి. అంచేత వ్యవస్థకి అసలైన యజమానులు అధికారులే! వారు నీతిమంతులైతే నాయకులు నీతిమంతు లవుతారన్నది సారాంశం. 

కూర్చొని లేచే ఖర్మ రచయిత్రి వినోదిని రాసిన “రైలు కట్ట” అన్న సామాజిక స్పృహ కల్గిన కథని ఉదహరిస్తూ, బహిరంగ విసర్జన చెయ్యవలసిన పరిస్థితులు ఎంత అమానుషమైనవో చెపుతారు.  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ మిషన్ పథకాన్ని ఉపయోగించుకొని బహిరంగ విసర్జన లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపేందుకు ఐదేళ్లలో నలభై రెండు లక్షల మరుగుదొడ్లు పూర్తి చెయ్యగలగడంలో ఎదురైన సమస్యలు, అధిగమించేందుకు బాబుగారి కృషి చెపుతుందీ వ్యాసం. బహిర్భూమి నుంచి బాత్రూం దాకా సాగిన తెలుగుజాతి పురోభివృద్ధిని అర్థం చేసుకుందుకు యూనివర్సిటీల్లో ఇలాటి అంశాల మీద పరిశోధనలు చేయిస్తే బావుంటుందని రచయిత అభిప్రాయం.

నిచ్చెన మెట్లని అడ్డం తిప్పుదాం రండి మన సమాజం కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలుగా విభజించబడి, ఎందరినో వేదనకు గురిచేస్తోంది. ప్రజల్లో, ముఖ్యంగా బడిరోజుల నుంచే వీటి పట్ల అవగాహన కలిగించాలి. పార్టీ శిక్షణా శిబిరాల్లో అన్ని రకాల వివక్షలను గురించి వివరంగా బోధించటం జరుగుతుంటుంది. బాబుగారు ఈ విషయంలో సూచించిన ఒక కొత్త ఆలోచనను అనుసరించి సభలను ఏర్పాటు చేసారు రచయిత. మైనారిటీ వర్గాలలో రాజకీయ చైతన్యం తెచ్చి, నాయకుల్ని తయారు చెయ్యటం చూస్తాం. అనేక కొత్త విషయాలను ఈ పుస్తకం చెపుతుంది. వృద్ధులు, వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు, హిజ్రాలకు కూడా పెన్షన్ లను అమలు పరిచారు బాబుగారు. 

                                                   బాబుగారు చిన్న విషయాలు పట్టించుకుంటూ సమయం వృధాచేస్తున్నారని, అది ఆయన బలహీనత అని రచయిత ముందుగా అనుకున్నా, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆయనలా చేస్తున్నారని అర్థమైందంటారు. చెప్పింది సరిగా అర్థం చేసుకుని అమలు చేసేవాళ్లున్నప్పుడు బాబుగారు ఆ విషయాల జోలికే పోరట.

మాస్టర్ ఆఫ్ ఎకనమిక్స్ ఖర్చు పెట్టాలంటే ఎవరికైనా చేతిలో డబ్బులుండాలి. కానీ బాబుగారు పనిలో దిగిన తర్వాత మాత్రమే ఆర్థిక వనరుల్ని సమీకరించుకునే ఆలోచన చేస్తారంటారు. తన ఆలోచనల్లో స్పష్టత, న్యాయబద్ధత కావలసిన ధనాన్ని అలవోకగా అమిరేలా చేస్తాయన్నది నాయకుడి నమ్మకం.

బీ పాజిటివ్ బాబుగారు జీవితంలో ఎన్నో కీర్తి శిఖరాల్ని ఎక్కారు, అంతకు మించిన అవమాన భారాల్ని మోసారు. వారిలో ఉన్న సానుకూల దృక్పథమే వారి బలం అన్నది ఈ వ్యాస తాత్పర్యం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పని చెయ్యగల నాయకుడు బాబుగారంటారు.

చెత్త ఆలోచన ఊళ్లల్లో రోజువారీ పోగవుతున్న చెత్తను ఒక చోట చేర్చి, దానిని ఎరువు కింద తయారు చెయ్యాలన్న ఆలోచన చేసిన బాబుగారు దానికి ఊబరైజేషన్ అని పేరు పెట్టారు. రచయితతో సహా విన్నవారంతా అదో చెత్త ఆలోచనగానే భావించారట. కానీ దానిని అమలుచేసినపుడు ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు పంచాయితీల ఆదాయమూ పెరిగింది. ఇలాటి కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళేవాడే నాయకుడంటారు. 

పార్టీనా? ప్రభుత్వమా? పార్టి ఒక వైపూ, ప్రభుత్వం ఒకవైపూ ఉంచినట్టైతే బాబుగారు ప్రభుత్వానికే సమయాన్ని కేటాయించేవారు. పార్టీ కూడా ముఖ్యమైనదన్నది ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితం నేర్పనేలేదా? ప్రభుత్వం బాగా పనిచేస్తే ప్రజలు తప్పక గెలిపిస్తారన్న ఆలోచనే కానీ పార్టీ యంత్రాంగం విశ్వాసాన్ని పోగొట్టుకుంటామన్నది బాబుగారు అర్థం చేసుకోలేకపోయారంటారు రచయిత. ఇది నాయకుడు చేసిన పొరపాటేనంటారు.

నిత్యకృత్యం బాబుగారి రోజువారీ జీవితాన్ని, ఆ వివరాల్ని చదివితేనే మనలాటి సామాన్యులు అలిసిపోతామని రచయిత వ్యాఖ్య. ప్రతిరోజూ నాలుగున్నరకల్లా లేచి, శారీరక వ్యాయామంతోనూ, ధ్యానంతోనూ దినచర్య ఆరంభించే బాబుగారు లేజీగా గడిపే సమయం ఒకటుందట. అదేమిటో చదవాల్సిందే.

ఒక్క ఐడియా చాలు ఇక్కడ ఆసక్తికరమైన కథొకటి ఉంది. నవ్వు కూడా పుట్టిస్తుంది. కొత్త ఐడియాల పట్ల, వాటి అమలు పట్ల నాయకుడి ఉత్సాహం తెలుసుకుంటాం.

వినటం ఒక కళ వినటమనే కళ గురించి నిజమైన నాయకులు మాత్రమే అర్థం చేసుకోగలరంటారు. సాధారణంగా మనలో ఇరవై నిముషాలకు మించి ఒక విషయం పట్ల శ్రద్ధ, ఆసక్తి ఉండవు. బాబుగారికి మాత్రం గంటల తరబడి ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే వినగలిగే శక్తి ఉందంటూ, బహుశా అదే ఆయన్ని గొప్ప నాయకుడిని చేసిందంటారు.

దండగమారి వ్యవసాయం మన రైతులు ఎప్పటికప్పుడు ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపడుతూనే ఉన్నారు. వృత్తిగా కాక తరతరాలుగా కుటుంబ సంప్రదాయంగానో, వారసత్వంగానో చేస్తూనే ఉన్నారు. వారంతా భూమిని నమ్ముకున్నవారు. భూమిని కన్నతల్లిలా ప్రేమిస్తున్నవారు.  

వ్యవసాయం దండగ మారిది కాదని, రైతు బతికేందుకు, ప్రజలు ఆరోగ్యకరమైన తిండి తినేందుకు, పర్యావరణం పచ్చగా ఉండేందుకు ఆదర్శవంతమైన వ్యవసాయ విధానాన్ని బాబు గారు కలగన్నారు. ప్రయోజనకరమైన, ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవసాయం గురించి ఆలోచనలు చేసి, పాలేకర్ ని మహారాష్ట్ర నుంచి పిలిపించారు. ఆ పాలేకర్ ఎవరో, ఎందుకు పిలిపించబడ్డారో చెప్పే వివరాలు చదువుతుంటే ఒక కొత్త ఆదర్శ లోకం కళ్ల ముందుకొస్తుంది. 

కొన్ని బూతులు – మరి కొన్ని విమర్శలు బాబుగారిలో కక్షపూరిత ధోరణి, ఎవర్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే గుణం లేవని చెపుతూ అవి పార్టీకి నష్టాన్నే చేసాయంటారు రచయిత. రాజకీయ ప్రస్థానం తొలిరోజుల్లో బాబుగారిలో ఉన్న కోపం, మొండితనం, కరకుతనం క్రమేపీ తగ్గుతూ వచ్చాయంటూ, వ్యక్తిగా ఆయనలోని పరిణితి, పెరుగుతున్న మానవీయ కోణం తెచ్చిన మార్పంటారు. జీవితానుభవాలతో పాటు చదివిన పుస్తకాలు, మనుషులు ఆ మార్పుకు కారణంమంటారు. ఆయన మనోనిబ్బరం, రాగద్వేషాలకు అతీతంగా ఉండే లక్షణాలు, శత్రు పక్షాల మీద చూపిన ఉదాసీనత ఆయన పరాజయం వెనుక కారణాలంటారు.

మనకూ లిబర్టీ కావాలి న్యూయార్క్ లో లిబర్టీ స్టాట్యూ చూసి, హైదరాబాదులో అలాటి అందమైన విగ్రహమొకటి తీసుకురావాలని అనేక కష్టనష్టాలకు ఓర్చి ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని తయారుచేయించి హుస్సేన్ సాగర్ మధ్య ప్రతిష్టించేందుకు ఎన్టీఆర్ కారకులయ్యారు. కళాకారుడుగా ఎన్టీఆర్ కళలు, భాషా సంస్కృతులను పరిరక్షించే పనులు చేస్తే, బాబుగారు కళలూ, భాష కంటే తిండి, ఉపాధి ముఖ్యమని నమ్మి పని చేసారంటారు. పదేళ్ల ప్రతిపక్ష పాత్రలో మనిషికి అంతిమంగా కావలసింది ఆనందమనీ, దానికి కళలు అవసరమని అర్థం చేసుకున్న బాబుగారు రద్దు చేయబడిన సాహిత్య, సంగీత, నృత్య, నాటక అకాడమీలన్నీ తిరిగి ప్రారంభించారు. ప్రజల్ని పాలించే ప్రభుత్వాల లక్ష్యం ఆనందమంటూ, ప్రజల ఆనందాన్ని కొలమానంగా తీసుకునే పద్ధతిని బాబుగారు తన పాలనలో నేర్పేరంటారు రచయిత. సుదూర లక్ష్యాలు తన ఓటమికి కారణమంటూ నవ్వుతూనే ఒప్పుకుంటారట బాబుగారు.

దశాబ్దాలుగా ప్రజల మధ్య కనిపిస్తున్న ఒక నాయకుడి జీవితం గురించి ఈ పుస్తకం ఎన్నో విషయాలు చెపుతుంది. నిష్పాక్షికంగా నాయకుడిని పరిచయం చేసినపుడు ఊహలు, అపోహలు పోయి వ్యక్తిని వ్యక్తిగా తెలుసుకోగలుగుతాం. 

రచయిత పెద్ది రామారావుగారికి అభినందనలు.

ప్రచురణ: ఎమెస్కో బుక్స్ ప్రై.లి.

First edition: October 2023

Second Edition: December 2023

ధర: 150/-

You Might Also Like

Leave a Reply