ఆల్ ద లైట్ వి కెనాట్ సీ
వ్యాసకర్త: రహ్మానుద్దీన్ షేక్
********
ఆంథొనీ డార్ రాసిన “ఆల్ ద లైట్ వి కెనాట్ సీ” 2023లో నేను చివరగా చదువుకున్న పుస్తకం. ఈ పుస్తకాన్ని నా ప్రాణస్నేహితుడు నాకు పుట్టినరోజు బహుమతిగా ఆగస్టులో ఇచ్చాడే కానీ నాకు చదవటానికి నాలుగు నెలల తర్వాత గానీ కుదరలేదు.
ఈ నవల 2014లో వచ్చింది. ఇది రెండవ ప్రపంచయుద్ధకాలపు నవల. ఈ నవలలో ముఖ్య పాత్ర ఫ్రెంచ్ బాలిక మారీలౌరె లీ బ్లాంక్ గురించి. ఈమె తన తండ్రితో పాటు పేరిస్ లోని నాచురల్ హిస్టరీ మ్యూజియంలో వాళ్ళ నాన్నతో కలిసి ఉంటుంది. యుద్ధం వలన పేరిస్ మీద దాడులు ఉధృతమైన సందర్భంలో ఈమె తన తండ్రి డేనియల్‌తో సముద్రతీరంలో ఉన్న సెయింట్ మాలో నగరంలో ఉంటున్న తమ అంకుల్ ఎటియెన్ వాళ్ళింట్లో శరణు తీసుకుంటారు. ఒక కుట్రలో భాగంగా డేనియల్‌ను నాట్సీ జర్మనీ సైనికులు నిర్బంధిస్తారు. ఆ తర్వాత అతని జాడ తెలియదు. ఎటియన్ ఇంట్లో పనిచేసే మేడం మెనాక్‌తో మారీలౌరె స్నేహం పెరుగుతుంది. కానీ మేడం మెనాక్ మరో పక్క ఫ్రెంచ్ వారు జర్మన్‌లకు విరుద్ధంగా చేస్తున్న పౌర పోరాటంలో పాల్గొంటూ, అనారోగ్యం కారణంగా చనిపోతుంది.
నవలలో మరో ప్రముఖ పాత్ర వెర్నర్ ప్ఫెన్నిగ్. ఇతను, ఇతని చెల్లలు ఒక అనాధాశ్రమంలో ఉంటారు వెర్నర్‌కి మరపరికరాల్లో చాలా ఆసక్తి. గణిత, మెకానికల్ ఇంజనీరింగ్ పుస్తకాలను చాలా చిన్న వయస్సులోనే చదివి ఆకళింపు చేసుకుంటాడు. ఆ రోజుల్లో రేడియో ఒక తప్పనిసరి ఖరీదైన వస్తువు. పలు రేడియోలు మూగబోతే, వాటిని బాగుచేసే నైపుణ్యాన్ని వెర్నర్ కలిగి ఉంటాడు. ఆ నైపుణ్యం వలన, తన చురుకుదనం వలన ఆర్మీ కేడెట్ తర్ఫీదు క్యాంపుకు ఎన్నికయి అక్కడి కష్ట నష్టాలను, అమానవీయ కృత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అప్పటి నాట్సీ నేత అడాల్ఫ్ హిట్లర్ ను బలవంతంగా ఆరాధించడమే పరమావధిగా ఉన్న ప్రజలలో వెర్నర్ ఒకడు. తను అనాధాశ్రమ అవస్థల నుంచి బయటపడ్డానన్న ఒక్క కారణం చేత, సమయానికి తిండి, బట్ట దొరుకుతున్నాయన్న కారణం చేత అయిష్టంగానే ఆ పరిస్థితుల్లో మెలుగుతాడు.
ఈ పుస్తకంలో ఒక అధ్యాయంలో మారీలౌరె చుట్టూ జరిగే కథ ఉంటే, తరువాతి అధ్యాయంలో వెర్నర్ కథ వస్తుంది.
ఈ రెండు పాత్రలు ఏ సందర్భంలో కలుసుకుంటారు? యుద్ధం నడుమ వీరి భవిష్యత్తు ఏ మలుపు తీసుకుంటుంది అన్న విషయాలు నవలలో ముఖ్య కథ.
నవల చదువుతున్నపుడు కొన్ని సన్నివేశాలు గుండెను పిండేసేవి వస్తాయి, మనల్ని శోకంలో నింపేసే సన్నివేశాలూ ఉన్నాయి.
యుద్ధం దాని చుట్టూ జరిగే అనవసరపు విషయాలు, విజ్ఞానం అది మానవత్వానికి చేసే మేలు, ఆ మేలుని కీడుగా పరిణమించగల మనిషి మేధస్సు, మానవత్వం, మనిషిలో ఉండే సహజ భావాలు, భావప్రకటన, సానుభూతి, సహానుభూతి ఇవన్నీ ఈ నవలలో నేరుగా లేదా పాత్రల ద్వారా ప్రతీకాత్మకంగా మనకు కనిపిస్తాయి.
ఈ నవల 2014 పులిట్జర్ బహుమతిని పొందింది. 2023లో నెట్‌ఫ్లిక్స్ లో సీరీస్ గా వచ్చింది.
ఒక అనాధాశ్రమంలో పేదరికంలోనూ సంతోషం పొందే పిల్లలు. తల్లిదండ్రుల ప్రేమ లేని స్థితిలో తమలో తాము ప్రేమ, ఆర్ద్రత, పాశాల కోసం వెతుక్కునే మనస్తత్వాలు ఒక పక్క తండ్రి ప్రేమను పూర్తిగా పొందుతూ తన వైకల్యాన్ని అసలు వైకల్యమే లేని విధంగా చేసిచ్చిన తండ్రీ కూతుళ్ళ మధ్య ఉండే పాశం ఒకపక్క.
ఎవరి ఆసరా లేకుండా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన వెర్నర్ ఒక పక్క, తన తండ్రి చేసిచ్చిన తన చుట్టుపక్కల పరిసరాల కలప నమూనాల అధ్యయయనం ద్వారా తన పరిసరాల్లో కళ్ళు లేకపోయినా సహజంగా మెలిగే మారీలౌరె పాత్ర మరో పక్క.
ఇలా పరస్పర విరుద్ధ పరిస్థితుల్లో మెలిగే రెండు వ్యక్తిత్వాల చుట్టూ చాలా చక్కగా అల్లుకుంది ఈ కథ.
కథలో కనిపించే చారిత్రక సంఘటనల వలన కథ కాల్పనికమని అనిపించలేదు. నిజంగా వెర్నర్, మారీలౌరె పాత్రలు మన చరిత్రలో ఉన్నాయనే భావన కల్పించారు రచయిత.
రేడియో టెక్నాలజీ లాంటి విషయాల పై ప్రస్తుత కాలంలో ఒకప్పటి సాంకేతికతల గురించి కాల్పనిక సాహిత్యాల్లో రాసేప్పుడు రచయితలు తరచూ ఇప్పటి అధునాతన సాంకేతికతను అప్పటి సాంకేతిక ఉపకరణాలకు ఆపాదించేస్తారు. ఈ పుస్తకంలో అలాంటి తప్పు జరగకుండా రచయిత చాలా జాగ్రత్త పడ్డారు.
గణితం, కాల్క్యులస్, తాళం-తాళం చెవి సంబంధిత జ్ఞానం, వజ్రాలకు సంబంధించిన జ్ఞానం, రేడియో ట్రాన్‌స్మిటర్‌కు సంబంధించిన అంశాలు ఆయా సాంకేతికాలపై ఆసక్తి లేని మామూలు మనుషులకు కూడా అర్ధమయ్యేలా రచయిత జాగ్రత్త తీసుకున్నారు.
ఒక మంచి పుస్తకం చదివానన్న అనుభూతిని ఈ పుస్తకం నాకిచ్చింది.
Leave a Reply