మా తాత … గీత … మా ప్రయాణం

మా తాత … గీత … మా ప్రయాణం – పి. చంద్రశేఖర అజాద్

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

*********

ఈ నవల పేరు లాగే ఇందులోని కథ కూడా ప్రత్యేకంగా ఉంది. కేవలం నూటముఫ్ఫై పేజీల్లో ఒక కొత్త లోకాన్ని, కొత్త ఆలోచనల్ని పాఠకులకు అందించారు రచయిత. చంద్రశేఖర అజాద్ గారి రచనలు చాలావరకు బహుమతి పొందిన రచనలే. దానికి ఇది కూడా మినహాయింపు కాదు. జాగృతి వార పత్రిక పోటీలో ద్వితీయ బహుమతిని పొందింది.

ముందుమాటలో నవల గురించి చెపుతూ విహారి గారు దీనిని ‘బతుకు చదువు పుస్తకం’ గా వర్ణించారు. తన ప్రతి ఒక్క రచనా ప్రయోజనాత్మకంగానూ, ప్రయోగాత్మకంగానూ ఉండాలని తపన పడే చిత్తశుద్ధి కలిగిన రచయిత అజాద్ గారంటారు. అజాద్ గారి రచనలతో పరిచయమున్నవారంతా ఏకీభవించే మాటలివి.

నవల వెనక కథను గురించి చెపుతూ ఈ నవలలో వివాదం కాదగ్గ అంశం ఒకటుందన్నారు అజాద్ గారు. “ప్రస్తుతం ఆడపిల్లలను పుట్టకుండా చిదిమేస్తున్నారు. తర్వాత కాలంలో మొత్తంగా పిల్లలే అనవసరం అనుకునే రోజులు కొంతకాలమైనా రాజ్యం చేస్తాయని అనిపిస్తోందన్న” రచయిత మాటలు ఇప్పుటి వాస్తవం! అది వారి భవిష్య దర్శనం. ఈ నవల 2016 లో వచ్చింది.

 ఈ నవలలో కథానాయకుడు ఒక తాత. ఆయన అమితంగా ప్రేమించిన ఇద్దరు మనవరాళ్లు కూడా తాతని అంతే ప్రేమిస్తారు. వాళ్లూ కథానాయికలే. ఈ ముగ్గురి జీవితం, వారి ఆలోచనల్లోని సారూప్యత, వారి మధ్య ఉన్న ప్రేమాభిమానాలు నవల పొడవునా కనిపిస్తాయి. 

సున్నిత మనస్కుడు, కళారాధకుడు అయిన తాత తన ఇద్దరు కొడుకులను ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. రాత్రుళ్లు వాళ్లని పక్కనే పడుకోబెట్టుకుని, నిద్రలో వాళ్ళు కాళ్లతో తన్నటాన్ని, తన మీద కాళ్లు వేసి పడుకోవటాన్ని సంతోషంగా భరిస్తూ ఒక నిశ్చింతని పొందుతుంటాడు. కొడుకుల కొడుకుల్నీ తర్వాతి తరంలో తన పక్కన పడుకోబెట్టుకుని, ఆ అనుభూతిని ఆస్వాదించాలని ఆశపడతాడు. మనవడు కావాలనుకున్న ఆ తాత ఆశ వెనుక తగినంత కారణమే ఉంది. అంతే కాకుండా మనవరాళ్లైతే పెద్దయ్యాక పెళ్ళి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతారని, మనవడైతే తనతో పాటు ఆ ఇంట ఉంటాడని కూడా ఆలోచిస్తాడు. ఇద్దరు కొడుకులకి కూతుళ్లు పుడతారు. మనవరాళ్లను ఎంతో అపురూపంగా, సున్నితంగా పెంచుతాడు.  

తాత సినిమాలను, సంగీతాన్ని, సాహిత్యాన్ని, కళలనన్నింటినీ ఆస్వాదిస్తాడు. తను అమితంగా అభిమానించే సినిమాకు చెందిన ప్రముఖ వ్యక్తి సత్యజిత్ రే ని స్మరించుకుంటూ పెద్ద మనవరాలికి అమితా రే అని, సంగీతాన్ని తలుచుకుంటూ చిన్న మనవరాలికి స్వరణి అని పేర్లు నిర్ణయిస్తాడు. సత్యజిత్ రే లాగా అందమైన దృశ్య కావ్యాల్ని తియ్యగలగే అభిరుచిని అమిత ఏర్పరచుకోగలగాలనుకుంటాడు. దానికి తగినట్టే చిన్నప్పట్నుంచీ అమిత బొమ్మలు వెయ్యటం నేర్చుకుంటుంది. తాత దగ్గర పెరుగుతూ ఆయనకు తగినట్టే కళాదృష్టితో ప్రపంచాన్ని చూస్తుంటుంది. 

చిన్న కొడుకు, కోడలు ఉద్యోగరీత్యా ముంబై వెళ్తుంటే కొడుకు, మనవరాలు దూరమైపోతున్నారని దిగులు పడతాడు తాత. ముంబై నుంచి ఏకంగా సముద్రాల కావల అమెరికా వెళ్లిపోతుంది కొడుకు కుటుంబం.  

 జీవితంలో ప్రతి సందర్భాన్ని, ప్రతి ఆలోచనని డైరీలో రాసుకునే అలవాటు తాతది. తన మనవరాళ్లు పుట్టకముందు నుంచీ వాళ్ల గురించిన తన ఆలోచనలను డైరీలో భద్రపరుచుకుంటాడు. వాళ్లు తల్లి కడుపులో ఉన్నప్పుడే వాళ్ల వైపునుంచి వాళ్లు ఎలా ఆలోచిస్తారో ఊహించి రాసి ఉంచుతాడు. వాళ్లు మొదట పలికిన మాటని, రాసిన గీతని ఇలా ప్రతి చిన్న వివరాన్ని రాసుకుంటాడు. వాళ్లు తను కోరుకునేలా కళాకారిణులవ్వాలని ఆశిస్తాడు. మనవరాళ్లు పెద్దయ్యాక వాళ్లకి ఆ డైరీల్ని కానుకగా ఇస్తాడు.

అమెరికా లో పెరిగిన స్వరణి తాత డైరీ అందుకున్నాక ఆయన్ని ఎంత మిస్సయిందో తలుచుకుంటుంది. తన జీవితంలోని లోటు, ఒంటరితనం అర్థమవుతాయి. అప్పుడే జీవితం పట్ల పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటుంది. దానికోసం తల్లిదండ్రులతో ఘర్షణ పడుతుంది. తాతతో గడిపేందుకు ఇండియా వస్తుంది. అక్కడ పెదనాన్న కూతురు అమితక్కతో తన భావాలు పంచుకుంటుంది. వాళ్లిద్దరూ తాత డైరీల్లో వెలిబుచ్చిన భావాలను సంపూర్ణంగా అవగాహన చేసుకుంటారు. మనవడు కావాలని కోరుకోవటం వెనుక ఆయన మనసుని పట్టుకోగలుగుతారు. అప్పుడే అమిత తాను తాతకి ఒక విలువైన బహుమతిని అందించాలనుకుంటుంది.

భార్యను కోల్పోయిన ఒంటరితనంలో తాత ఒక నిస్పృహని అనుభవిస్తున్నారని, జీవితం ముగింపు గురించి ఆలోచిస్తున్నారని మనవరాళ్లు అర్థం చేసుకుంటారు. అలాటి తాత ఒకసారి అమిత పెళ్లి చేసుకుంటే చూడాలనుందనటం అమితకి, స్వరణికి ఆనందం కలిగిస్తుంది. తమ గురించి ఆయన కన్న కలలను నిజం చేసేందుకు స్వంతంగా ప్రయాణం మొదలు పెడతారు అక్కచెల్లెళ్లు. వాళ్లిద్దరి ఆలోచన, ఆశయం తాత ఆనందం! అది ఎంతవరకు, ఎలా సాధించారన్నది ఈ నవల కొత్తగా, అందంగా చెపుతుంది. 

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రేమ, బాధ్యత మించి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మల పాత్ర ఎంత విలువైనదో, ప్రభావవంతంగా ఉంటుందో ఈ నవల మరోసారి చెపుతుంది. తాత, నానమ్మలతో అనుబంధం పిల్లల జీవితాలను ఎంత అర్థవంతంగా తీర్చిదిద్దుతాయో చెపుతుంది. ఏ తరంలోనైనా తమ పిల్లలను పెంచుకునే సమయంలో దొరకని తీరిక మనవలను, మనవరాళ్లను పెంచే సమయంలో పుష్కలంగా దొరుకుతుంది పెద్దలకు. ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన పిల్లలు బలమైన వ్యక్తిత్వాలతో, ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. ఇప్పటి కాలానికి ఉమ్మడి కుటుంబాలను ఆశించలేం. చదువులు, ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలతో కుటుంబాలు విడివిడిగా అతి చిన్నవిగా ఉంటున్నాయి. ఒక్క వ్యక్తి ఉన్న కుటుంబాలు(?) లేకపోలేదు.  

ఒక కుటుంబాలోని సభ్యులంతా ఒకే చోట ఉండే సందర్భం కుదరని పరిస్థితులు ఇప్పటివి. ఆర్థిక అవసరాలు, వ్యక్తులు ఎన్నుకునే జీవనశైలి, కృత్రిమ విలువలు వంటివి ఈ పరిస్థితులకి కొన్ని కారణాలు. అంతిమంగా భౌతిక దూరాల వల్ల మనుషుల మధ్య ఉండవలసిన అనుబంధాలు ఉండటం లేదనుకున్నా, ఒకే ఇంట ఉన్నవారి మధ్యా సరైన అవగాహన, ప్రేమాభిమానాలు కరువవుతున్నాయి. మానవ సంబంధాల కోసం సమయం కేటాయించుకోలేక పోవటం పెద్ద లోటు అవుతోంది. అది కుటుంబ అశాంతికి, తద్వారా సమాజంలో అశాంతికి కారణమవుతోందన్నది నిర్వివాదాంశం. 

పిల్లల కోసం సమయం కేటాయించలేకపోవటం అంటే వారికి ఆరోగ్యకరమైన జీవితాన్నివ్వలేకపోవటమే. అది డబ్బు సంపాదన వల్ల, హోదా వల్ల రాదు. ప్రాధాన్యతల్ని గుర్తించి తగిన జీవనశైలిని అనుసరించటం ఉత్తమ జీవనాన్ని అనుభూతించేందుకు మార్గమన్నది పాఠకుడికి తెలుస్తుంది. ఇంట్లో పెద్దలు, అనుభవజ్ఞులున్నప్పుడు పిల్లలకు సరైన మార్గదర్శకత్వం దొరుకుతుంది. ఈ కథలో తాత అలాటి ఆదర్శవంతుడైన తాత. 

ఈ నవలలో ఆచరణకు సాధ్యపడే విలువైన విషయాలున్నాయి.

తాత పెద్ద మనవరాలు అమితని మొదటిసారి ప్లే స్కూల్లో వేసినపుడు చాలామంది చిన్నారుల్లానే ఏడుస్తుంది. రోజూ రాత్రుళ్లు మనవరాలికి కథలు చెప్పే తాత ఆ రాత్రి దుఃఖం గురించి చెపుతాడు. దుఃఖం గొప్పదని, కనుక దుర్వినియోగం చేయకూడదంటాడు. పెద్దల దుఃఖంలో మౌనం ఉంటుందని, చిన్నపిల్లల దుఃఖంలో రాగం ఉంటుందని చెపుతాడు. ఒక్కోసారి కేవలం రాగం వినిపించి, కంట్లోంచి నీళ్లే రావంటాడు. మనవరాలు నాలుగేళ్ల పిల్ల అయినా, అర్థం కాకపోయినా ఇవన్నీ చెప్పాలని అనుకుంటాడు. మర్నాడు బడికి వెళ్లనన్న మనవరాలితో బడిలో కొత్త స్నేహితులుంటారని, కొత్త కథలు, ఆటలు నేర్పుతారని చెప్పి ఆమెను సుముఖురాల్ని చేస్తాడు. చిన్నపిల్లల పట్ల అనుసరించవలసిన తీరును అలవోకగా చెప్పారు రచయిత.

చిన్నతనంలో స్వరణి టి.వి. కి, చాక్లెట్లు వంటి వాటికి ఎక్కువగా అలవాటు పడిందని కొడుకు, కోడలు ఫిర్యాదు చేసినప్పుడు మనవరాలికి వాటి పట్ల విముఖత కలిగేలా చెప్పిన తాత మాటలు మెచ్చదగ్గవి. 

అమెరికాలో పెరిగిన స్వరణి తాత డైరీ చదివాక తల్లిదండ్రుల కెరీర్ పరుగుల్లో తను కోల్పోయిన బాల్యాన్ని గురించి ఆలోచనలో పడుతుంది. తన సంపదనంతా తీసుకుని ఎవరైనా తనకు తిరిగి బాల్యాన్నిస్తే బావుండునని, ఆర్థిక సమస్యలున్న పిల్లలే కాక తనలాటి వారూ బాల్యానికి దూరమవుతున్నారనుకుంటుంది. ఎంత వాస్తవమో ఈ ఆలోచన!

 జీవితంలో చిన్నచిన్న ఆనందాల్ని ఎలా ఆస్వాదించచ్చో మనవరాళ్లకి చెపుతూ, విజయాల్ని ఎప్పుడూ డబ్బుతో కొలవకూడదంటాడు తాత. 

ఒకచోట మనవరాళ్లతో క్రియేటివ్ స్పేస్ గురించి చెపుతూ ప్రకృతిలో ఎప్పుడూ అసమగ్రత ఉంటూనే ఉంటుందని, వెనుక తరాల వారు వదిలి వెళ్లిన ఖాళీలను మనం పూరించవలసిన అవసరం ఉందని చెపుతాడు. జీవితం తాలూకు ఏ అంశంలోనైనా, అది ఒక సిద్ధాంతమైనా, బంధమైనా, రక్త సంబంధమైనా అన్ని చోట్లా పూరించుకోవలసినవి ఉంటూనే ఉంటాయనటం గొప్పగా ఉంది. ఇలా పూరించవలసి రావటాన్ని మనకు దొరికే ఒక అవకాశం అంటారు రచయిత. నవలలో ఇక్కడ జరిగిన చర్చ ఆసక్తికరంగా ఉంది. 

తన జీవితం పట్ల తగిన నిర్ణయం తీసుకున్నానని చెపుతూ స్వరణి తల్లిదండ్రులతో చర్చించిన తీరు తరాల మధ్య అంతరాన్ని పట్టిస్తుంది. జీవితాన్ని మూస పద్ధతిలో గడిపెయ్యకుండా కొత్త ఆలోచనలు చేస్తూ, తమకు నచ్చిన నిర్ణయాలను తీసుకుని కొత్త మార్గాల్లో అన్వేషణలను చేస్తున్న ఇప్పటి తరానికి స్వరణి ప్రతినిధి. నవల రాసినప్పటి కంటే ప్రస్తుత కాలానికి అంటే దాదాపు ఏడెనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలో మనచుట్టూ స్పష్టంగా కనిపిస్తున్న మార్పు ఇది.

తాత తమకు పెట్టిన పేర్ల వెనుక ఆయన కోర్కె అర్థం చేసుకున్న మనవరాళ్లు ఆ దిశగా అడుగులు వేస్తూ తాతని ఆనందాశ్చర్యాలతో ముంచెత్తుతారు. ఆయన కొడుకులు చేయలేని పనిని మనవరాళ్లు చేసేందుకు సన్నద్ధులవుతారు. ఆయన పొందలేకపోయిన మనవడి బదులు మరింత ప్రియమైన కానుకను అమిత ఆయనకు అందిచటంతో నవల ముగుస్తుంది. ఇంకా ఎన్నో ఎన్నో విషయాలున్నాయి నవలలో. అన్నీ చెప్పేయ్యాలనే ఉంది. కానీ, హాయిగా చదువుకోవలసిన అవకాశాన్ని పోగొట్టలేను. చిన్న అందమైన నవల!

రచయితకు అభినందనలు!

ప్రచురణః జానకి – అజాద్, మార్చి 2016

వెల: రూ. 110/-

You Might Also Like

Leave a Reply