“ఆ ఒక్కటి”, మరికొన్ని కథలు
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
*********
ఆ ఒక్కటి, మరికొన్ని కథలు రచయిత్రి విజయ కర్రా గారి కథా సంపుటి. కథలు అప్పుడప్పుడు వివిధ పత్రికలలో చదువుతూ ఉన్నవే. వీటినన్నింటినీ పుస్తక రూపంలో తీసుకురావటం వలన రచయిత్రి కథల్లోని వైవిధ్యం, ప్రత్యేకత స్పష్టంగా చూసే అవకాశం దొరికింది. దాదాపు ఒక పుష్కరకాలంలో రాసిన పదహారు కథలు ఇవి. మూడు కథలు మినహా మిగిలినవన్నీ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడినవి. 2023 సంవత్సరంలో రాసినవే అయిన ఆ మూడు కథలు కథా సంపుటి తీసుకొచ్చే సమయానికి సిద్ధంగా ఉండటంతో ఇందులో చేర్చి ఉండవచ్చు.
రచయిత్రి కె. ఎన్. మల్లీశ్వరి ఈ సంపుటి లోని దాదాపు అన్ని కథల గురించి ముందుమాటలో విపులంగా ప్రస్తావించారు. ఈ కథలని ‘అంతర్ముఖి చేసిన కథాగానం’ గా వర్ణించారు. వివిధ కథా వస్తువులని ఒకేరకమైన సున్నితత్త్వంతో, నిజాయితీతో స్పృశించిన బుజ్జి బుజ్జి కథలివి.
(అ)పరిచితుడుః కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య ఏర్పడిన పట్టుదలలు, శతృత్వాలు ముందు తరాలకీ అలవోకగా ఎలా కొనసాగుతాయో చెప్పే ఈ కథ అతి సహజమైన మానవ నైజాన్ని చెపుతుంది. పట్టింపులకి పోయిన వ్యక్తులు దాటిపోయిన తరువాత కూడా వాటి మూలాలు, కారణాలు కచ్చితంగా తెలియక పోయినా వారి పిల్లలు అదే బాటని నడవటం చూస్తూనే ఉంటాం. సమస్య ఏమిటో, ఎందుకు, ఎలా మొదలైందో ఎప్పటికీ తెలిసే అవకాశం ఉండదు. కర్ణాకర్ణిగా తెలిసిన విషయాలే కానీ వాస్తవాలు తెలియవు. రెండు వైపులా ఎవరికి వారికి బలమైన కారణాలే ఉండి ఉండవచ్చు, లేకపోనూ వచ్చు. అయినా ఒక సమస్యో, పట్టుదలో, తగాదానో చిక్కని రక్త సంబంధాలని కాదని ఇద్దరు వ్యక్తుల్ని దూరం పెడుతుంది. ఈ కథ నడిచిన తీరు, ముగిసిన తీరు కూడా సున్నితంగా, సూటిగా ఉంది. ఇంత చిన్న కథలో ఎంతో విషయాన్ని చెప్పిన ప్రతిభ రచయిత్రిది.
నల్లమందుః కథ మొదలు పెట్టినప్పటినుంచీ కథా నాయకుడితో పాటు చదువరినీ ఒక మార్మిక లోకంలోకి తీసుకెళ్తున్నట్టుంటుంది. తర్వాత ఏమి జరగబోతోందన్న కుతూహలం చివరివరకూ మనల్ని నిలవనివ్వదు. కథలోని వాతావరణం మనముందు పరుచుకుంటుంది. పొరుగూరి నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన కథా నాయకుడికి ఆ మారుమూల పల్లెలో అరుగు మీద ఎదురైన పెద్దాయన మనసులో ఏముందో మొదటి పరిచయంలోనే తెలిసిపోతుంది. ఆ రహస్యాన్ని చెప్పి ఇంట్లో ఉన్న పెద్దావిణ్ణి హెచ్చరించాలనుకుంటాడు. అంతలోనే అతని సందిగ్ధం అర్థం చేసుకున్న ఆవిడ ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నట్టున్నావు, సంగతేంటంటుంది. అతనికి ఒక్కసారి పొలమారుతుంది. తీరా కూడబలుక్కుని చెప్పేసాక, ఆవిడ అన్న మాటలు విని తెల్లబోతాడు. భలే ఆసక్తిగా చదివించే కథ.
దిల్ ధడక్ నేదోః అవి కోవిడ్ రోజులు! ఎవరికి వాళ్లు ఇళ్లకి పరిమితమై ఇంటి పనులతో, ఆఫీసు పనులతో సతమతమయ్యే రోజుల్లో … ముఖ్యంగా ఇంట్లోని ఆడవాళ్ల పనులకి (అవును అచ్చంగా అవన్నీ ఆడవాళ్ల పనులే) ఇంకో చెయ్యి ఏదీ సాయం అందించే అవకాశం లేదు. అక్కడికీ ఆమె భర్త నిజాయితీగానే సాయం చేస్తానంటాడు. కానీ అతను చేసే ప్రతి పనిలోనూ ఆమె కెందుకో లోటు కనిపిస్తూనే ఉంటుంది. ఇంట్లో అవసరంగా పరిష్కరించవలసిన సమస్యలను గురించి అతను ఎదురుగా ఉన్నప్పుడల్లా ఆమె పదేపదే చెపుతూనే ఉంటుంది. అతనికి అదంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. ఒక సాయంకాలపు పిల్లగాలి వారిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చినట్టే ఉంది. అందమైన కథ!
ఇంటికి రా! కథానాయకుడు మధ్యతరగతి తండ్రి. చినుకులు పడుతున్న ఒక శ్రావణ మంగళవారం అతని భార్య పేరంటానికెళ్లింది. అప్రయత్నంగానే అతని మనసులో కూతురి పెళ్లి విషయం మెదిలి, ఎలాగైనా వచ్చే శ్రావణమాసానికి చేసెయ్యాలనుకుంటాడు. వర్షం తగ్గాక పేరంటం నుంచి వస్తానంటూ భార్య ఫోన్! ఆ ల్యాండ్ లైన్ లో ఆమె మాట్లాడినంతసేపూ గరగరలే. ఆఫీసునుంచి వచ్చే కూతురి కోసం ఆత్రంగా చూస్తున్నాడతను. ఇంతలో ‘తప్పైపోయింది నాన్నా, క్షమించ’మంటూ ఫోన్ కాల్. అతను అయోమయంలో ఉండగానే ఆ గరగరమంటూన్న కాల్ లో ‘నువ్వు ఇంటికి రమ్మంటే వచ్చేస్తా నాన్నా’ అంటుంది ఫోన్ లో అమ్మాయి. వర్షంలో తడిసి ఇంట్లోకి వస్తున్న కూతుర్ని గేట్లోంచి చూసి అతను విస్తుబోతాడు. అయినా, ఫోన్ లో అమ్మాయితో ఇంటికి వచ్చెయ్యమని చెప్పేస్తాడు. ఎంత చక్కని కథ! ఆ తండ్రి మనసు లోని ఆర్ద్రత, అవగాహన కన్నీళ్లు తెప్పిస్తాయి. ప్రపంచం నిస్సందేహంగా మంచిది, ప్రేమించదగ్గది!
సాక్షిః నెలకోసారి పార్టీలో కలుసుకునే నలుగురు స్నేహితులు స్వంత ఊరి గురించి, తమ చిన్ననాటి రోజుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. దానితో పాటు వెనక వదిలి వచ్చిన స్నేహితుడి గురించిన ఆలోచనొకటి మొదలై అందరూ నిశ్శబ్దమైపోతుంటారు. అకస్మాత్తుగా ఆ స్నేహితుడిక లేడన్న కబురుతో ఊరికి బయల్దేరిన ఆ నలుగురికి లేడనుకున్న స్నేహితుడు ఎదురై ఆ వార్తలో ఇమిడి ఉన్న వాస్తవాన్ని చెప్తాడు. ఇంటికి తీసుకెళ్తాడు. వారి చిన్ననాటి స్నేహితురాలే అతని భార్య. ఆ జంట నలుగురు స్నేహితుల్ని సాదరంగా ఆహ్వానించి మంచి ఆతిథ్యాన్నిస్తారు. మాటల మధ్య ఆమె వారిలో ఒకరెవరో చక్కని బొమ్మలు వెయ్యగల ప్రతిభావంతుడన్నది ప్రస్తావిస్తుంది. ఆ జంటకు ఎదురు పడేందుకు కాదుకదా కనీసం తలుచుకుందుకు భయపడే ఆ నలుగురూ ఆ మాటలకు ఉక్కిరిబిక్కిరవుతారు. తాము ఆ జంట పట్ల చేసిన అవమానకరమైన ఆకతాయి పని వారికి తెలుసన్నది అర్థమై అక్కణ్ణుంచి అకస్మాత్తుగా మాయమైపోతే బావుండునని అనుకుంటారు. చక్కని బిగింపుతో చెప్పిన కథ.
ద డే బిఫోర్ కథానాయకుడు అమెరికాలో పెరుగుతున్న భారతీయ యువకుడు. పదమూడేళ్ల వయసులో తను చదివిన ఒక వ్యాసంతో ప్రభావితుడై, తండ్రి కోరుకున్నట్టు డాక్టరో, ఇంజనీరో కాకుండా మరోదారిని ఎంచుకుంటాడు. తల్లిదండ్రులు నచ్చజెప్పి కాలేజీలో చేర్చినా తన ఆశయాలకు అనుగుణంగానే అడుగులు వేస్తుంటాడు. కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకోనన్న కొడుకు పట్ల తండ్రి అలుగుతాడు. బంధువుల పిల్లలు, స్నేహితుల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని, కొడుక్కి నచ్చజెప్పమని భార్యతో ఘర్షణ పడతాడు. తండ్రి కోపాన్ని మౌనంగానే ఎదుర్కొంటాడు కొడుకు. తండ్రీ కొడుకుల మధ్య నలిగిపోతున్న ఆ తల్లి మౌనాన్ని ఆశ్రయిస్తుంది. తన మౌనంలో అంగీకారం లేదని ఆమెకు మాత్రమే తెలుసు. పదిహేనేళ్ల బంధువులమ్మాయి ‘మా యువతరం మీద మీ ఆంక్షలేమిటని’ నిలదీస్తుంది. తరాల మధ్య వైరుధ్యాలు తప్పనిసరి. కానీ చుట్టూ ఉన్న సమాజపు వ్యామోహాల పట్ల కాక ఒక మానవీయమైన దారిని ఎంచుకున్న కొడుకు పట్ల సానుకూలంగా స్పందించకపోవటం తల్లిదండ్రులకు సరైనది కాదేమో! సమాజ శ్రేయస్సుకు దారులు వేసే ఇలాటి యువతరం భవిష్యత్తు తరాలకు ఆలంబన, ఆదర్శం. ఈ కథానాయకుడిని ప్రేమించకుండా ఉండలేము.
ఉగాది వచ్చి వెళ్లింది ఈ కథ చదువుతుంటే నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన ‘అంతులేని కథ’ సినిమా అప్రయత్నంగా జ్ఞాపకమొచ్చింది. కథా పరంగా ఇంటి పెద్ద స్వామీజీ అయిపోవటం, చాలాకాలం తర్వాత ఇంటికి రావటం వరకే పోలిక. ఈ స్వామీజీ ఇంటి సభ్యులకు మంచి మాటలు చెపుతూ వాళ్ల వాళ్ల బలహీనతలను వదులుకుని సన్మార్గంలో నడవమంటాడు. ఇంట్లోని వారంతా గట్టిగా శపథాలు చేసేస్తారు. ఆపైన బోలెడు విషయాలు జరిగిపోతాయి. హాయిగా చదివి ఆస్వాదించవలసిన కథ. చదువుతున్నంతసేపూ చదువరి ముఖం మీద చిరునవ్వు అలాగే ఉంటుంది.
విండో షాపింగ్ కథ లో కథానాయకుడు అమెరికాలో పెరుగుతున్న భారతీయ యువకుడు. హైస్కూల్లో పరిచయమైన స్థానికుడి స్నేహం ఆకర్షణగా మారుతుంది. సరదాగా థ్రిల్ కోసమే అని చెప్పిన ఆ స్నేహితుడితో కలిసి ఒక వ్యసనానికి అలవాటు పడతాడు కథానాయకుడు. ఆ దారి ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తూనే ఉన్నా వెనక్కి రావాలన్న ఆలోచన అతనికి కొంతకాలం వరకూ రానేరాదు. ఎదురవుతూ వచ్చిన చిక్కు పరిస్థితుల నుంచి తప్పించుకోగలుగుతూనే ఉంటాడు. ఒక చిన్న ప్రమాదం నుంచి బయటపడి ఇల్లు చేరిన సందర్భంలో అంతర్ముఖుడవుతాడు. తన ప్రవర్తనలో తేడా గమనించిన తండ్రిని ఎలా పోగొట్టుకున్నాడో జ్ఞాపకమొచ్చి వణికిపోతాడు. తల్లిని పోగొట్టుకుందుకు తాను సిద్ధం కాదని గట్టిగా అనుకుంటాడు. ఇలాటి ముగింపు కన్నీళ్లు పెట్టిస్తుంది. పిల్లలు పెరుగుతున్న దశలో ఎన్నెన్నని ఛాలెంజీల్ని, ఆకర్షణల్నీ ఎదుర్కోవాలో తలుచుకుంటే వారి పట్ల మనసు ఆర్ద్రమవకమానదు. ప్రపంచానికి చైతన్యాన్నిచ్చే పిల్లల్ని కాపాడుకోవాలి.
గోదావరి తీరంలో! ఈ కథ ఎంత మామూలుగా మొదలయ్యిందో, ఎంత అద్భుతంగా పూర్తయ్యిందో చెప్పలేను. చదివి అనుభూతించవలసిన కథ. ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఓనర్ తన కొడుకు కాలేజీ చదువుకి కట్టవలసిన డబ్బులు ఎలా అందుతాయా అని ఆలోచిస్తుంటాడు. ఎవరైనా పెళ్లి పార్టీ వచ్చి హాలు కుదుర్చుకోవాలని, తద్వారా తనకు అవసరమైన డబ్బు సమకూరుతుందని ఎదురుచూస్తుంటాడు. ఇంతలో ఏకంగా ఓ పెళ్లికూతురే హాలు కావాలంటూ వస్తుంది. వచ్చిన పిల్ల అద్దె వివరాలు కనుక్కుని, ఫంక్షన్ హాలు కి అయ్యే ఖర్చు తమ బడ్జెట్ కి మించిపోతుందని, పెద్దవాళ్లతో మాట్లాడమంటుంది. అంతలో ఆమెకు కాబోయే మామగారి నుంచి ఫోనొస్తుంది. ఆ అమ్మాయికి ఆమె మామగారికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ హాలు ఓనర్ చెవుల పడుతుంది. దానితో అమ్మాయి హాల్ బుక్ చేసుకుంటోందా లేదా అన్నది పట్టించుకోనంతగా హాల్ ఓనర్ మనసు ఆనందానుభవాన్ని పొందుతుంది.
రీచవుట్ కథ మన చుట్టూ ఉన్న సమాజాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మనందరి మధ్య ఉన్న, ఉండవలసిన సంబంధాలు, వాటి కోసం మనం అంది పుచ్చుకోవలసిన బాధ్యత అన్నీ సున్నితంగా చెప్పారు. మన చుట్టూ నిత్యం కనిపించే ఎన్నో సమస్యలకు ఆచరణ సాధ్యమైన పరిష్కారాన్ని చెప్పారు. దీనికోసం ఒక చక్కని ఆలోచన చేసి, పాఠకుల్ని ఆవైపుగా అడుగులు వేసేలా మార్గదర్శకత్వం చేసారు రచయిత్రి. ఇప్పటి సమాజాలకి, అది ప్రపంచంలో ఎక్కడైనా కూడా అవసరమైన కథ.
అల్లరి తమ్ముడు కథలో తమ్ముడు మనకి బాగా తెలిసున్నవాడే కదూ. అసలు తమ్ముడి వరకూ ఎందుకు? పొరుగూరికి ప్రయాణమై వెళ్తుంటేనో, ఇంటికి చుట్టాలొస్తుంటేనో ముందుగానే అమ్మ మనం ప్రవర్తించవలసిన తీరు చెపుతుంది. కానీ ఎందుకో ఆ సమయానికి అవేమీ జ్ఞాపకమే రావు. ఆనక అమ్మ చేత చివాట్లు తప్పవు. ప్రపంచం తాలూకు ప్రభావాలు అంటని వయసుకి గడుసుదనం తెలియదు. నటనలు తెలియవు. తెల్లని పాలు లాగా అన్నీ అంతే స్వచ్ఛంగా ఉంటాయని నమ్మే అపురూపమైన వయసు. ఈ అల్లరి తమ్ముడు కూడా తన సహజ ధోరణిలోనే ప్రవర్తించాడు, తప్పేం చెయ్యలేదు. పిల్లల్ల్ని సహజత్వాన్ని వదులుకొమ్మని చెప్పే పెద్దలు నిజంగా దోషులే. అయినా వారి సమస్యలు వారివి. లోకంతీరు వంట బట్టించుకున్న పెద్దలకి తమ ఆధిక్యత గుర్తించబడాలి. ప్రశంసలు కావాలి. పిల్లలంటే తమ స్వంత ఆస్తి, తమ కనుసన్నలలో పెరగాలనుకుంటారు. దానికోసం వారి స్వేచ్ఛా, స్వాతంత్రాల్ని లాక్కోవలసిందే. వాళ్లకి స్వంత ఆలోచన, ప్రవర్తన ఉంటాయంటే ఒప్పుకోరు. ఏ పూచీకత్తులు లేని, ఏ మాయా పూసుకోని నిబ్బరమైన బాల్యపు మధురిమను ఈ కథలో హాయిగా చదువుకుంటాం.
చిన్నారి ఇలాటి కథా వస్తువు కొత్తది కాకపోయినా కథ నడిపించిన తీరు చాలా చాలా విభిన్నంగా ఉంది. కొత్త ఆలోచనతో చెప్పిన కథ. చిన్నారి వాళ్ల అమ్మని తనకి, తల్లికి శత్రువుగా భావించే కథానాయకుడు వాస్తవ పరిస్థితుల్ని చూసి ఉలిక్కిపడతాడు. పెద్దల తప్పులకు చిన్నవారిని శిక్షించే అలవాటు, ఒకరి ప్రవర్తనకు వేరొకరిని నిందించే సంప్రదాయం చాలా చోట్ల ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంటుంది. తనకి సంబంధం లేదనుకున్న వారి పట్ల కలిగిన సహానుభూతి, అవగాహన ఈ కథలోని కథానాయకుడిని మనసున్న మనిషిని చేసింది. గొప్ప కథ. చిన్నారి పాత్రను మరచిపోలేము. బాంధవ్యాల కోసం పడిన తపన, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండీ, డబ్బు గురించి ఎలాటి లాలసకీ లోనుకాకపోవటం చిన్నారిని అరుదైన వ్యక్తిని చేసాయి.
నన్ను మరచిన వేళ చుట్టూ ప్రపంచం పట్టని మత్తులో మునిగిన మనిషిని మేలుకోమంటూ వేడుకుంటున్న కథ. పాఠకుడి మనసు కరగకుండా ఉంటుందా? కథ చదవక ముందు మాత్రం?మనిషి ప్రకృతి మీద సాధిస్తున్న విజయాలకు హద్దెక్కడిది? క్షణక్షణం మారే సాంకేతికత మనిషి మీద పట్టుని బిగించి తనను సృష్టించుకున్నవాడినే కీలుబొమ్మను చేసుకుంది. జీవించే ఉన్నామన్న తెలివిడిని, వర్తమాన స్పృహని మర్చిపోయేలా మత్తుని జల్లుతున్న సాంకేతికత, అభివృద్ధి మనిషి ఊపిరైపోయాయి. ఆ సుఖలాలస లో ప్రకృతి, మానవసంబంధాలు ఏవీలేవు.
మనిషి ఓటమి అంగీకరించని ధీరుడు కదా! తాను ఓటమి దారిలోనే ఉన్నాడన్నది తెలుసుకోలేక పోతున్నాడెందుకో! ఇప్పుడు మనుషులున్నది జనారణ్యం అంటున్నాం కానీ అలా అనటం కూడా సబబు కాదేమో. మనిషికుండే ప్రవర్తనా నియమావళి అరణ్యానికి ఉండదు, నిజమే. ప్రకృతి ఏర్పాటుచేసిన నియమం మాత్రం అరణ్యాన్ని ఆధారం చేసుకు బతుకుతున్న జీవరాశుల మధ్య ఒక సమతుల్యతని కాపాడుతుంటూనే ఉంటుంది.
జనారణ్యంలో ఆ సూత్రం పనిచెయ్యదు. మనుషులందరి మనుగడకు, సంక్షేమానికి ఏర్పాటు చేసుకున్న సమాజం భిన్నభిన్న అనేక సమాజాలుగా తయారైంది. ఇప్పుడిక ఒక్కో మనిషి ఒక స్వతంత్ర సమాజమై పోయినపుడు వారి మధ్య ప్రేమల్ని, ఆప్యాయతల్ని వెతుక్కోవటం అత్యాశ అవుతుంది. తనకు నచ్చింది చెయ్యటం వరకే. దానిలోని మంచి చెడుల పట్ల ఆలోచన, సమాజ ఆమోదం కోసం ఎదురుచూపు ఏవీ లేవు. భయసందేహాలు లేని జీవితాలు. అవి ఎటు నడుస్తాయో ఊహించటం కష్టం కాదు. ఈ కథ చదువుతుంటే ఆవేశం నిలవనివ్వదు. తెలిసి తెలిసీ మనం మనల్ని పోగొట్టుకుంటున్నామన్న దుఃఖం మనల్ని కమ్మేస్తుంది.
ఆ ఒక్కటి ఈ కథ మిగిలిన అన్ని కథల కంటే పూర్తిగా భిన్నమైనది. సాహితీ లోకపు దారుల్ని పరిచి ఆకుపచ్చని ఊపిరుల్ని అందించే కాగితాల బొత్తి! కథలోని కొసమెరుపు మనిషిలోని కొంటెతనపు కోణం.
సంపుటిలోని మోహన వంశీ, చక్కని తండ్రికి చాంగుభళా కథలు చదువుతుంటే పురాణ కథల్లో చదువుకున్న కృష్ణుడు, శివుడు మన మధ్యకి అందంగా నడిచివచ్చినట్టు అనిపిస్తుంది. ఆ కథల్లోని వర్ణనలు అంతే ప్రత్యేకం.
ఈ కథా సంపుటి వెనుక పేజీల్లో ‘ఆప్తవాక్యం’ అందించిన రచయిత చంద్ర కన్నెగంటి ‘అలవాటైన చట్రాలకు లొంగకుండా ఆకట్టుకునేట్టు రాయగల నైపుణ్యం ఈ కథల్లో కనిపిస్తుం’దన్నారు. చివరగా, రచయిత్రి విజయ కథలో వస్తువు, వాక్యం రెండూ ముఖ్యమే తనకన్నారు. ఆ వాక్యం అక్షరసత్యమన్నది పాఠకులకు సులువుగానే అర్థమవుతుంది. ఇంత మంచి కథలను అందించిన రచయిత్రికి అభినందనలు! మంచి కథలు చదివానన్న సంతోషంతో పుస్తక పరిచయాన్ని చాలా సుదీర్ఘంగా ఇచ్చినట్టున్నానని ఈ ఆఖరి వాక్యం రాస్తుంటేనే తెలిసింది.
పుస్తక ప్రచురణః ఛాయ, జూలై 2023
ధరః రూ.200/
Leave a Reply