తిరిగి పాతరోజుల్లోకి

(అనుభూతి కథలు – 2)

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

**********

2022లో ప్రచురితమైన “అనుభూతి కథలు” కథా సంపుటి రచయిత విజయ్ ఉప్పులూరి నుండి వెలువడిన రెండవ కథా సంపుటి “తిరిగి పాతరోజుల్లోకి.” ఈ కథా సంపుటి పేరు కూడా చదువరిని ఇట్టే ఆకర్షిస్తుంది. 

గతించిన రోజుల పట్ల మనిషికుండే ఒక క్రేవింగ్ ని క్షణంలో కళ్లముందుకు తెస్తుంది. సున్నితమైన మనసు తలుపుల్ని తట్టి పలకరిస్తుంది. గడిచిపోయిన రోజులన్నీ అపురూపమైనవే అనుకుంటాం. అవి తిరిగిరావన్న చేదునిజం వాటి తీపికి కారణమని మనకు తెలుసు, అయినా కోరుకోవటం మాత్రం మానలేము. ఒక అసాధ్యమైన విషయం పట్ల తెలియని మమకారం. ఎంతటి విజ్ఞత కలిగినా ఈ విషయంలో అమాయకమైన పసివాళ్లలా ఆలోచించే బలహీనత మానవనైజం! అసాధ్యమన్న వాటి పట్ల అనాది నుంచీ మనిషికి ఉండే ఆకర్షణ కాబోలు! 

 జరిగిపోయిన రోజుల్ని తలుచుకుని ‘అవి ఎంత అందమైన రోజులో, ఆ రోజులే వేరు, మళ్లీ రమ్మంటే వస్తాయా’ అని దిగులు పడుతుంటాం. రేపటి మీద ఎంత ఆశతో ఎదురుచూసినప్పటికీ కమ్మకమ్మని నిన్నల్ని మాత్రం అద్భుతమైనవని నిక్కచ్చిగా చెప్పుకుంటాం. ఇప్పటి రోజులు రేపటికి, ఆ మరునాటికి ఎంత తియ్యని అనుభవాలుగా మిగులుతాయో భవిష్యత్తులో తెలుస్తుంది. అదీ అనుభవంలోకి వస్తున్నా పాతరోజుల పట్ల మోహపడటం మానలేము.  

గతం రాబోయే రోజుల్లో బతికేందుకు ఒక తియ్యని జ్ఞాపకంగా, మరెప్పటికీ అందని తాయిలంలా ఊరించేది మాత్రమే అని తెల్సున్నా మనిషి ఆ పాత రోజుల్ని, అనుభవాల్ని ఇష్టంగా తలుచుకోక మానడు. ఆ రోజులెప్పటికీ ఒఠ్ఠి నిన్నలేనంటే ఒప్పుకోలేం. మనిషి ప్రకృతి మీద ఎంతటి విజయాల్ని సాధించినా కాలం చేతిలో మాత్రం ఓడిపోక తప్పదు.

ముందుమాట లో బలభద్రపాత్రుని రమణి గారు ‘తిరిగి పాతరోజుల్లోకి’ అంటూ రచయిత ఆ పాత మధురాల్ని తలుచుకునే బృహత్కార్యం తలపెట్టారన్నారు. వీరి కథల్లోని కొసమెరుపు గురించి ప్రస్తావించారు. ఈ కథల్లో కొన్ని నవ్వించేవి, ప్రశ్నల్ని సంధించేవి, చైతన్యం తీసుకొచ్చేవి, ఇంక కొన్ని కన్నీరు పెట్టించేవి ఉన్నాయన్నారు. 

ఇలా రాస్తుంటే ఏం జ్ఞాపకమొస్తోందో చెప్పనా? చిక్కగా మబ్బు పట్టిన సాయంకాలమో, ఒక చిరకాల మిత్రుని పలకరింపో, దూరమైన ఆత్మీయుల గురించిన ఆలోచనో, ఇంకా కొన్ని కొన్ని సమయాలు మనల్ని పాత రోజుల్లోకి లాక్కెళ్తాయి. ఆ క్షణాల్లో అప్రయత్నంగానే పాత డైరీలో పేజీల్నో, పాత ఉత్తరాల్నో చేతుల్లోకి తీసుకుంటాం. ఎప్పటెప్పటివో పాత పాటల్ని వింటూ కూర్చుంటాం. అందులో ఒక ఆనందం, ఒక విషాదం, ఒక ఆర్తి, ప్రకటించలేని ఒక అస్థిమితం మనల్ని అలా గంటలు గంటలు వర్తమానపు ప్రాపంచిక చైతన్యానికి దూరంగా తీసుకెళ్లిపోతాయి.

అలాగే ఒంటరిగా చేసే ప్రయాణాలో, నిశ్శబ్దంగా, నిండుగా ఉన్న ప్రకృతి మధ్య గడిపే సమయమో లోలోపల మనకే తెలియని మనల్ని శోధిస్తూ అచేతనుల్ని చేస్తుంది. మనసులో మాత్రం ఉరకలెత్తే చైతన్యాన్ని కలిగిస్తుంది. అది వయసుకి సంబంధించినది కానేకాదు. కేవలం మనసు మనతో చేసే సంభాషణ. ఇలాటి భావనలు ఏ ఒక్కరి స్వంతమో కాదు. ఇప్పటి జీవితాల్లోని వేగం ఇలాటి అనుభూతుల్ని అందించగలదా అన్న సందేహం వస్తుంటుంది. కానీ అన్ని కాలాల్లోనూ, అన్ని తరాల్లోనూ ఎవరికివారికి వారివైన ప్రత్యేకమైన సందర్భాలుండి తీరతాయి. అంతెందుకు, ఒక చిన్న పాపాయి అల్లరి, ఆటలు చూసినప్పుడు మనసు పాతరోజుల్లోకి వెళ్లకుండా ఉండటం ఎవరికైనా సాధ్యమే?!

పుస్తకం వెనుక పేజీల్లో ‘అనుభూతి కథలు’ చదివిన ప్రముఖులు మాడభూషి శ్రీధర్, గంగిశెట్టి లక్ష్మీనారాయణ, కిరణ్ ప్రభ, కల్పనా రెంటాల, వేణు ఆసూరి ‘తిరిగి పాతరోజుల్లోకి’ కథా సంపుటిని ఆహ్వానిస్తూ, ఆత్మీయంగా వారి మనసులోని మాటల్ని పంచుకున్నారు. శుభాకాంక్షలందించారు. 

ఈ సంపుటిలోని పదిహేడు కథలు అనుభూతి ప్రాధాన్యతను కలిగి, కొసమెరుపుతో పాఠకులను ఆకట్టుకుంటాయి.

పాఠకుడి అనుభూతిని పదిలపరిచేందుకు ఈ కథలను కొద్దికొద్దిగానే పరిచయం చేస్తాను. 

ఇందులో ఏమోమరిస్నేహ పెద్దకథలు. 

స్నేహ కథ రాసిన నేపథ్యం, దాని వివరం పుస్తకం ముందు పేజీల్లో రచయిత చెప్పారు. 

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం యువతరం కోసం ఒక ప్రముఖ వారపత్రికలో మొదలైన ‘కలంస్నేహం’ శీర్షిక సహజంగానే యువతను ఆకర్షించింది. ఎందరినో మంచి మిత్రుల్ని చేసింది. అదే కలంస్నేహాన్ని కొందరు దుర్వినియోగం చెయ్యటమూ జరిగింది. దీని గురించి యువతను అప్రమత్తం చేసేందుకు ఈ కథను అప్పట్లో రాసినట్టు రచయిత చెప్పారు. 

ఇప్పటి సోషల్ మీడియా యువతకే కాదు పెద్దవాళ్లకూ ఎలాటి వ్యసనంగా పరిణమించిందో చూస్తున్నాం. సాంకేతికంగా అభివృద్ధి చెందటమన్నది మనకి ఎంత మంచిని చేస్తోందో కానీ, కంటి ముందే జరుగుతున్న విషయాల్నీ అర్థం చేసుకోలేని విచిత్ర వ్యవస్థలో ఉన్నాం. కంటికి కనిపిస్తూనే ఉన్నా ఏదీ నమ్మలేని ప్రపంచంలో బతుకుతున్నాం. 

తెలిసీ తెలియని వయసులో సోషల్ మీడియా మాయలో చదువుని, భవిష్యత్తుని నిర్లక్ష్యం చేస్తూ సమస్యల్లో చిక్కుకుంటున్న యువతను నిత్యం సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నాం. ఇది ప్రపంచాన్నంతటినీ ఆవరించిన పెద్ద సమస్య. దీనిలోంచి పిల్లల్ని బయటకు వచ్చేలా సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. తద్వారా భావి తరాల్ని, వారి ఆలోచనల్ని ఆరోగ్యంగా మలచటం సమాజానికి శ్రేయస్కరం. 

ఇలాటి పని చేసేందుకు రచయిత నాలుగు దశాబ్దాల క్రితం సాహిత్యాన్ని సాధనంగా తీసుకున్నారు. అభినందించదగ్గది.

ఏమోమరి కథలో కథానాయకుడు తన చిన్నప్పుడు ఇంట్లో పనులు చేసేందుకు తండ్రి తెచ్చిపెట్టిన చిన్న అమ్మాయి పట్ల ఆత్మీయభావం పెంచుకుంటాడు. ఆమె తల్లిదండ్రులు కూతుర్ని వదిలి ఉండలేక ఆమెను వెనక్కి తీసుకెళ్ళిపోతారు. చిన్ననాటి తన నేస్తం ఎలా ఉందో చూడాలన్న ఆశ కథానాయకుడి మనసులో వయసుతో పాటు పెరుగుతుంది. ఉన్న చిన్న ఆధారాలతో ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అతనికి ఆమె కనిపించిందా? కనిపిస్తే ఎలాటి స్థితిలో కనిపించింది? అతన్ని గుర్తుపట్టిందా? ఇది చిన్న సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. 

స్పష్ట సంకేతం కథలో కథానాయకుడు హార్ట్ ఎటాక్ కు గురవుతాడు. డాక్టర్ ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తపడమంటాడు. డ్రింక్స్ మానెయ్యమంటాడు. కోలుకున్నాక స్నేహితుడి ప్రోద్బలం వల్ల డ్రింక్ పార్టీకి బయలుదేరతాడు కథానాయకుడు. కానీ దారిలో చూసిన ఒక సంఘటనతో తన డాక్టర్ చేసిన హెచ్చరిక జ్ఞాపకమొచ్చి తిరిగి ఇంటి దారి పడతాడు. అదేమిటో కథ చదివినప్పుడు పాఠకులు తెలుసుకుంటారు.

సశేషం కథ ఇటీవల రాసిన కథ. వ్యంగ్యం, హాస్యం రెండూ సమపాళ్లలో ఉన్న కథ. 

తాజ్ మహల్ కోసం కథలో కథానాయకి తను ప్రేమించిన వ్యక్తికి తనపై ప్రేమ ఎంత గాఢంగా ఉందో తెలుసుకోవాలనుకుంటుంది. ‘నేను దూరమైతే తాజ్మహల్ కడతావా?’ అని అడుగుతుంది. అతను ఆవేశంగా వెయ్యి తాజ్ మహళ్లను కట్టిస్తానంటాడు. అదివిన్న ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆమె నిర్ణయం ఆ ఇద్దరి జీవితాలను ఎలాటి మలుపులు తిప్పిందన్నది కథ చివరివరకూ చదివిన పాఠకులను విస్మయపరుస్తుంది. ప్రేమ కథలకు ఒక కొత్త మలుపు తీసుకొచ్చారు రచయిత.

మరియు కథలో తెలుగు భాష మృతభాషగా మారబోతోందని ఇద్దరు స్నేహితులు చర్చించుకుంటున్న సమయంలో మరో స్నేహితుడు వారిని కలుస్తాడు. వారి మధ్య సంభాషణ సరదాగా సాగి ‘మరియు’ తో ముగుస్తుంది. ఆ ‘మరియు’ కథేమిటో చదివిన పాఠకులు హాయిగా నవ్వుకోక మానరు. మనిషిలో అంతర్గతంగా ఉన్న హాస్య ధోరణి దైనందిన జీవితంలో ఎంత సునాయాసంగా బయటపడుతుంటుందో ఈ కథ చెపుతుంది.

ఈ దారి అటు కాదు కథలో కథానాయకుడు తన తమ్ముడు ఇంట్లోనే దొంగతనానికి పాల్పడుతుండటం చూసి ఆవేశంతో శిక్షిస్తాడు. వ్యాపార పని మీద హైదరాబాదు వెళ్తూ ఆ విషయాన్ని గురించి ఆలోచించి బాధ పడతాడు. తమ్ముడు భవిష్యత్తులో దొంగ అవుతాడేమో అన్న శంక కలుగుతుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలన్నది అతనికి అర్థం కాదు. అంతలో అక్కడ అనుకోకుండా చిన్ననాటి స్నేహితుడు కలుస్తాడు. అతనితో కలిసి సరదాగా డబుల్ డెక్కర్ బస్సెక్కుతాడు. బస్సెక్కే సమయంలోనూ, బస్సులోనూ ఎదురైన రెండు సంఘటనలు కథానాయకుడికి కొత్త సంగతులని, కొత్త పాఠాల్ని నేర్పుతాయి. 

తిరిగి పాతరోజుల్లోకి కథ పేరే ఈ కథల సంపుటి పేరు. గడచి పోయిన రోజులు వెనక్కి తిరిగి రావాలని, అప్పుడు జరిగిన పొరబాటు సరిదిద్దుకునే అవకాశం ఒక్కసారి దొరికితే బావుండునని మనిషి అనుకునే సందర్భం ఒక్కోసారి రాకమానదు. అలాటి సందర్భాన్ని గురించిన కథ ఇది. కథానాయకుడు మంచివాడే. కానీ, ఆఫీసు పనిలో తన కింద సాయంగా చేరిన బషీర్ పట్ల అర్థంకాని కక్ష పెంచుకుంటాడు. అతని మంచితనం కథానాయకుడిని మరింత కవ్విస్తుంటుంది. ఎన్ని ఇక్కట్ల పాలు చేసినా బషీర్ తన స్వభావాన్ని పదిలంగా కాపాడుకుంటూనే ఉంటాడు. కథానాయకుడికి తనలోని లోపం తెలిసి, పశ్చాత్తాపం కలిగే సందర్భం ఒకటి రానే వస్తుంది కథ ముగిసేలోగా. 

కింకర్తవ్యం కథ బాధ్యతతో పాటు ఆలోచించే మంచి మనసు కలిగిన డాక్టర్ దంపతుల కథ. వైద్య పరీక్షలకు తమ దగ్గరకు వచ్చిన ఒక జంటకు తెలిసితెలిసి అబద్ధం చెపుతారు. జీవితం మొదటి మెట్టు మీద ఉన్న ఆ జంటకు తాము చెప్పిన అబద్ధం మంచే చేస్తుందని నమ్ముతారు.  ఆ జంట పాతికేళ్ల తరువాత వచ్చి చెప్పిన విషయం విని తమ నమ్మకం వమ్ము కాలేదని తెలిసి ఆనందపడతారు. ఇలాటి అద్భుతాలు కూడా జరుగుతూనే ఉంటాయి.

మలుపు కథ ఒక తండ్రి కథ. అతను తను జీవితంలో తెలిసీతెలియని వయసులో జారుడుమెట్ల మీద తన భవిష్యత్తును కోల్పోయాడు. అదే పరిస్థితి కొడుకూ ఎదుర్కోబోతున్నాడన్న ఆలోచన, అనుమానం అతన్ని వణికింపజేస్తాయి. నిజానిజాలు నిక్కచ్చిగా తేల్చుకుని కొడుకుని సరిదిద్దాలని బయలుదేరతాడు. కానీ తన అనుమానం ఒట్ఠి అనుమానమే అని తెలిసి తేలిక పడిన మనసుతో వెనుతిరుగుతాడు.

అబద్ధం కథలో ఒక్కోసారి అబద్ధం ఒక మనిషి జీవితంలో మంచి మార్పుని తీసుకురావటానికి దోహదం చేస్తుందన్నది తెలుస్తుంది. 

ఆఖరి కథ కసి అపరాధ పరిశోధక కథ. చివరికంటా ఆసక్తిగా చదివిస్తుంది.

సంపుటిలోని అనుభూతి కథ మొదటి సంకలనంలోనిదే. తిరిగి పాతరోజుల్లోకి సంపుటిలోని కథలు కూడా వివిధ అనుభూతుల సమ్మేళనం కావటంతో ఈ సంపుటికి ‘అనుభూతి కథలు -2’ అన్న ఉప శీర్షికగా పెట్టారు. అందుకే ఈ కథను కూడా ఇందులో చేర్చారని రచయిత మాటల్లో తెలుస్తుంది. ఈ కథలన్నీ చాలావరకు జీవితంలోంచి పుట్టినవే. 

రెండు మూడు కథలు మినహా ఈ సంపుటిలోని కథలన్నీ వివిధ పత్రికలలో అచ్చైనవే. రచయిత ఆశించినట్లే ఈ సంపుటి లోని కథలు కూడా పాఠకులకు మంచి అనుభూతిని అందిస్తాయి. రచయితకు అభినందనలు.

ముఖచిత్రం: రాంపా. కథలకు బొమ్మలు వేసినవారుః బాలి, శంకు, త్రిగుణ్, హేమంత్, చిదంబరం. ప్రచురణః ఛాయ, ఏప్రిల్ 2023. వెలః రూ.150/

You Might Also Like

Leave a Reply