అనుభూతి కథలు – విజయ్ ఉప్పులూరి

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

********

మనిషి జీవితం రకరకాల అనుభవాల సారం అనుకుంటే ఆ అనుభవాలు మనసుకు మిగిల్చేవి అనుభూతులు. బహుశా మనిషి జీవితాంతం రకరకాల అనుభవాల కోసం తపించేది అనుభూతులను మూటకట్టుకుందుకే అనిపిస్తుంది. అనుభూతి మిగల్చని అనుభవాలు నిస్సారంగా మరుపులోకి జారిపోతాయి. ‘అనుభూతి కథలు’ కథా సంపుటిలో చిన్నా, పెద్దా కలిపి ఇరవై ఒక్క కథలున్నాయి. ఇవన్నీ పాఠకులకు వివిధరకాల అనుభూతులను మిగిల్చేవే. ఇందులో చాలా కథలు దాదాపు మూడు నాలుగు దశాబ్దాల క్రితం రాసినవి. సాహిత్యానికున్న ప్రాథమిక లక్షణం ఆయాకాలాల్లోని జీవితాన్ని చూపించటమే కనుక ఇప్పటి తరానికి ఆనాటి సమాజాన్ని, ఆ జీవితాల్ని పరిచయం చేస్తాయీకథలు. 

పుస్తకం ముందు పేజీలో రచయిత ‘స్వగతం’లో చదివించే గుణం ఉన్న కథలన్నీ మంచి కథలేనని నమ్ముతానని చెపుతూ, ‘అనుభూతి కథలు’ చదివిన తరువాత పాఠకులు తనతో ఏకీభవిస్తారంటారు. వీటిని కాలక్షేపం కథలుగా కాక కొన్నైనా ఆలోచనలు రేకెత్తించే కథలుగా గుర్తిస్తే చాలన్నారు. ముందుమాట చెప్పిన కల్పనా రెంటాల గారు ఈ సంపుటిలోని ఎక్కువ కథలు మనసును తాకే మంచి కథలని చెప్పారు. కాలయంత్రంలో వెనక్కి తీసుకెళ్ళే ఈ కథలు ఎలాటి ఉద్యమాల్ని, వాదవివాదాల్ని చెప్పవనీ అదే ఈ కథల గొప్పతనం, విలక్షణత అంటారు. మనుషుల్లోని అతి సహజమైన అనుభవాలను, వాటి తాలూకు అనుభూతులను కథలుగా చెపుతూ, అందరిలో ఉన్న ఏకసూత్రతని మాత్రం పాఠకుడి దృష్టికి తెస్తాయివి.

 జీవితాల్లో వేగం పెరుగుతూ, పక్కనున్న మనిషి పట్ల ఆలోచనను, సహానుభూతిని మరిచిపోతున్న కాలంలో అస్తిత్వవాదానికి సహజంగానే ప్రాధాన్యత పెరిగింది. ఆ ధోరణి అంతే సహజంగా సాహిత్యంలోనూ బలంగా కనిపిస్తోంది. మనుషులంతా భిన్న మతాలుగా, కులాలుగా, వర్గాలుగా, జాతులుగా విడిపోయిన తర్వాత, తమవే అయిన సమస్యలను, బాధలను, ప్రశ్నలను చెప్పుకుంటూ, తమవైన అనుభవాలను ప్రపంచం ముందుకు తీసుకొస్తూన్న ఇప్పటి సాహిత్య లోకంలో ఈ కథలు నిజంగా విలక్షణమైనవే. అంతమాత్రాన ఇప్పుడున్న సమస్యలు అప్పట్లోనూ లేకపోలేదు. 

మనిషిలో కనిపించే మంచి, చెడు లక్షణాలన్నీ విశ్వవ్యాప్తమైనవి. ఈ కథల్లోని వ్యక్తులు ఆయా లక్షణాల కారణంగా పొందిన అనుభూతుల గురించి చెపుతాయి ‘అనుభూతి కథలు’. మనిషిలోని లోపాల్ని, చీకటికోణాల్ని, దుర్మార్గాల్ని చెప్పినప్పుడు కూడా సున్నితమైన హాస్య ధోరణితోనే చెప్పారీ కథల్ని. ఈ సంపుటి పేరే పాఠకుడిలో ఒక సానుకూలమైన భావన కలిగిస్తుంది. జాతి, కులం, మతం, వర్గం అన్న తేడా లేకుండా సాధారణ మనిషిలో కనిపించే బలహీనతల్ని, ఆలోచనల్ని, ప్రవర్తనని ఈ కథలు చెప్తాయి. ఇలాటి సందర్భంలో ఇలాగే ఆలోచిస్తాం, ఇలాగే ప్రవర్తిస్తాం అని మనకి మనం అనుకునే సందర్భాలు ఇందులో కనిపిస్తాయి. ఇవి మన అందరి కథలూ అన్న భావం కలుగుతుంది.

“మనిషిలోని సహజమైన హిపోక్రసీని కర్కశంగా కాక సున్నితంగా ఎత్తి చూపుతూ ఒక స్నేహితుడిలా ఇవన్నీ మనలో ఉన్న బలహీనతలే సుమా అంటూ చెప్పటం రచయిత గొప్పదనం” అంటూ ‘సత్యపీఠం మీద పలుకులు’ చెప్పిన వేణు ఆసూరి గారు ఈ కథల్లో కనిపించే హాస్య ధోరణికి కారణం అదే అంటారు. ఎంత మంచి వ్యాఖ్య! 

పక్క మనిషిలోని లోపాల్ని, బలహీనతల్ని ఏవగించుకుని, వారిని ద్వేషించి దూరం జరగటం కాక అర్థం చేసుకుని, విశాలంగా ఆలోచించినప్పుడు పుట్టేవి ఇలాటి అనుభూతి కథలే.

మొదటి కథ ‘సీత బతుకింతే’ పెద్ద కథ. ఇందులో సీత రామాయణంలో సీత లాగే నింద మోయవలసి వచ్చింది. దానికి కారణం ఎగ్జిబిషన్ లోని కుక్కల సర్కస్. ఇది విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఒక స్త్రీ నింద మోసేందుకు ఎలాటి సంఘటనైనా కారణం కావచ్చన్నది మన సమాజంలో నిత్యం కనిపిస్తున్నదే. సమాజపు తీరు అప్పుడూ, ఇప్పుడూ ఒకే విధంగా ఉందన్నది కాదనలేం. కాలం మారింది కానీ మనిషి ఆలోచనల్లో మార్పు లేదు. అవే బలహీనతలు!

రేపు నీదే” కథలో కథా నాయకుడు నిరుద్యోగి. తన ప్రయత్నాలన్నీ విఫలం కావటంతో చావొక్కటే తనకు మార్గం అనుకున్న క్షణాల్లో తనలాటి మరి ముగ్గురు నిరుద్యోగులు తాముఎంచుకున్న మార్గాన్ని చెప్తారు. స్వయం ఉపాథి ప్రథకం కింద ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్ని చదివించి, రేపటి సమాజానికి బాధ్యత కలిగిన బలమైన పౌరుల్ని చేసే తమ ప్రయత్నంలో అతన్నీ కలుపుకుంటారు. జీవితం పట్ల మమకారాన్ని, ఆశని కలిగిస్తారు. ఈ కథలో ఒకచోట కథానాయకుడు మోకాలిపై గట్టిగా చరుచుకుని, తనను తానే చీదరించుకుంటూ, ‘ఉండాల్సిన చోట ఎలాగూలేవు. ఉన్న చోటులోనైనా కిక్కురుమనకుండా పడి ఉండక సూచలను దంచుతున్నావా?’ అంటాడు. ‘మెదడు మోకాలులో ఉంది’ అనే వాడుకని ఇలా చెప్పటం నవ్వొస్తుంది.

ముసుగు’ కథలో కథానాయకుడు మిట్టమధ్యాహ్నపు ఎండలో అప్పుకోసం వెళ్తూ జేబులో ఉన్న రూపాయిన్నరను కాపాడుకుందుకు నడక మొదలెడతాడు. కొంతదూరం వెళ్లాక నడవలేక ఒక రిక్షా ఎక్కుతాడు. తన దగ్గరున్న రూపాయిన్నర రిక్షాఅబ్బికి ఇవ్వాలన్న బాధ మొదలవుతుంది. ఇంతలో రిక్షా ప్రమాదానికి గురై రిక్షాఅబ్బి తీవ్ర గాయాలపాలవుతాడు. అతనికి సాయం చెయ్యకపోగా నిస్సిగ్గుగా ఆ ప్రమాదానికి రిక్షాఅబ్బిని దోషిని చేసి, అతనికి ఇవ్వవలసిన డబ్బుని కూడా ఇవ్వక వెళ్లిపోతాడతను. మనిషి లోపల్లోపల చీకటిగుహలో ఎంతటి నీచత్వం ఉంటుందో చెపుతుందీ కథ.  

 ‘అనుభూతి’ కథ ఈ కథల సంపుటికి ఇచ్చిన పేరు. అతడు ‘ఆమె’ను ఒక మిత్రుడి పెళ్లికి వెళ్లినపుడు చూస్తాడు. ఆమె కూడా అతన్ని ఆసక్తిగా చూస్తుంది. ఆమెకు ఒక అనుభూతిని మిగల్చాలని అనుకున్న అతను ఆమె తనపై విసిరిన రెండు మల్లెమొగ్గల్ని ఆప్యాయంగా ఆమె చూస్తుండగా జేబులో దాచుకుంటాడు. ఇలా కనిపించిన ఆడపిల్లలపై తన నవ్వును సమ్మోహనాస్త్రంగా ఉపయోగించి వాళ్లకు తానొక అనుభూతిని మిగులుస్తున్నాననుకుంటూ ఉంటాడతను. పరిచయమైన ప్రతి అమ్మాయితోనూ చనువుగా ప్రవర్తించి ప్రేమభావనను కలిగించి నవ్వుకుంటూంటాడు. వాళ్ల జ్ఞాపకంగా వాళ్ల తాలూకు పువ్వుల్నో, గాజుల్నో దాచిపెట్టి అవకాశం వచ్చినప్పుడు వాటిని చూపి తన ప్రేమను ప్రదర్శిస్తుంటాడు. ఇది అతనికి ఇష్టమైన ఆట.

ఒకసారి రైల్వేస్టేషన్ లో ఓ అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న అతనికి రెండేళ్ల క్రితం మిత్రుడి పెళ్లిలో కనిపించిన ‘ఆమె’ కనిపిస్తుంది. వెళ్లి పలకరిస్తాడు. మొదటిచూపులోనే ఇష్టపడి, ఆమెను పెళ్లిచేసుకోవాలన్న తన ఆశ తల్లిదండ్రుల నిరంకుశత్వం వల్ల తీరలేదని, మరొకరిని పెళ్లి చేసుకోవలసి వచ్చిందని బాధగా చెప్తూ, జేబులో ఉన్న ఎండిన మల్లెపువ్వుల్ని రెండింటిని ఆమెకు చూపిస్తాడు. మరొక జన్మలో తప్పక ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానంటాడు. ఆమె అతన్ని నమ్మినట్టే వింటుంది. తనూ అతనికో అనుభూతిని మిగల్చాలనే అనుకుంటుంది. 

అతను వెళ్లిపోయాక పక్కనున్న స్నేహితురాలు కొత్తగా పెళ్లై భర్త దగ్గరకు వెళ్తూ, అలా అబద్ధం చెప్పావేం, అతనెవరంటుంది. తనను ప్రేమించి, జీవితంలో రాజీపడి నిరాశగా బతికేస్తున్న అతనికి ఒక అందమైన అనుభూతి మిగిల్చేందుకే తానూ అతన్ని ఇష్టపడ్డానని, అతన్ని పెళ్లి చేసుకోలేకపోయినందుకు ఒంటరిగా మిగిలిపోయానని చెప్పానని ఆమె జవాబిస్తుంది నవ్వుతూ. ఈ అనుభూతి కథ పైకి సరదాగా కనిపించి, నవ్వు తెప్పించినా, సున్నితమైన ప్రేమానుభూతి విషయంలోనూ కపటంగా ప్రవర్తించటమనే మనుషుల్లోని బలహీనత భయపెడుతుంది.

కుర్చీ’ కథలో గోవిందు టీ అమ్ముతుంటాడు. కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగులకు వాడుకగా టీ అందిస్తుంటాడు. తెగిన చెప్పును కుట్టించుకుని అంతలోనే అది తెగిపోవటంతో చెప్పులుకుట్టే వీరయ్యను తిట్టుకుంటాడు. అందరి చెప్పులూ వీలైనంత త్వరగా తెగిపోవాలని వీరయ్యలాటి వాళ్ళు కోరుకుంటారనుకుంటాడు కోపంగా. ఆఫీసులో రోజుకి అరడజను సార్లు టీ తాగే ఉద్యోగి మారి, టీ తాగని వ్యక్తి ఆ కుర్చీలో కూర్చోవటంతో గోవిందు అసహనంతో ఆ వ్యక్తి చచ్చిపోతేనైనా టీ తాగే మరో వ్యక్తి కుర్చీలోకి వస్తాడని కోరుకుంటాడు. అతను కోరుకున్నట్టే టీ తాగని వ్యక్తి ప్రమాదానికి లోనై, చావుబతుకుల మధ్య ఆసుపత్రి పాలవుతాడు. అప్పటికి గోవిందుకి తన ఆలోచనలో ఉన్న లోపం తెలుస్తుంది. చెప్పులు కుట్టే అతను కేవలం చెప్పులు తెగిపోవాలని మాత్రమే కోరుకుంటాడు, తాను మాత్రం టీ తాగనందుకు ఆ ఉద్యోగి చచ్చిపోవాలని కోరుకున్నానని పశ్చాత్తాప పడతాడు. అతని పశ్చాత్తాపం ఆసుపత్రిలోని వ్యక్తిని బతికించనే లేదు.

పనికిమాలిన మనిషి’ కథలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే గుర్నాధం నీతినియమాలకు కట్టుబడినవాడు. అప్పు ఊబిలో మునిగిపోయినవాడు. తన ఆర్థిక ఇబ్బందుల్ని తప్పించుకునే ప్రయత్నంగా లంచం తీసుకుందుకు రాజీ పడబోతాడు. కానీ ఆఖరి నిముషంలో అతని వివేకం అతన్నాపని చెయ్యనివ్వదు. ఈ ప్రపంచంలో తానొక పనికిమాలిన మనిషినని మరోసారి నిశ్చయంగా అనుకుంటాడు. ఇలాటి వ్యక్తులు జీవితంలో ఎంత కష్టాన్నైనా సహిస్తారు కానీ అవినీతికి పాల్పడరు. వారి నిజాయితీ వారికెన్ని సమస్యల్ని తెచ్చిపెట్టినా నమ్మిన విలువల్ని వదులుకోరు. వీరు సమాజం దృష్టిలో బతకనేర్వటం రానివారు.

నిలయ విద్వాంసుడు’ కథలో ఒక ప్రభుత్వోద్యోగి తన ఆఫీసరును మెప్పించేందుకు రాత్రి, పగలు ఆఫీసుకు కట్టుబడిపోయి కుటుంబాన్ని పట్టించుకోడు. అది తనకు న్యాయమనిపిస్తుంది. తనలోని బానిస మనస్తత్వాన్ని భార్య, తోటి ఉద్యోగులు నిరసించినా పట్టించుకోడు. ఒకసారి ఆఫీసరు గారి కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్తూ తన అదృష్టానికి పొంగిపోతాడు. సినిమా చూస్తున్న సమయంలో ఆఫీసరు గారి చంటిపిల్ల ఏడుపు అందుకోవటంతో ఆ పిల్లను ఎత్తుకుని సినిమా హాలు బయట నిలబడవలసి వస్తుంది. పాపం, ఆ చిరుద్యోగికి తన బానిసతనం అప్పటికి అర్థమవుతుంది. 

సింహాసనం’ కథలో ఆఫీసరు చెప్పే డిసిప్లిన్ కి విసుక్కుని అతన్ని ద్వేషించే వ్యక్తి తీరా తాను ఆఫీసరు సీట్లో కూర్చున్నప్పుడు వాస్తవం గ్రహిస్తాడు. ఆ హోదాలోని వ్యక్తికి తన కింది ఉద్యోగుల పట్ల అనుసరించవలసిన క్రమశిక్షణ, నిక్కచ్చితనం ఎంత అవసరమో అర్థమై, ఆ సింహాసనం ఒక ముళ్ల కిరీటమనుకుంటాడు.

‘పప్పులో కాలు’ రచయిత మొదటి కథ. అందులో కథానాయకుడు రచయిత కావాలన్న కోరికతో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. తన చిన్ననాటి స్నేహితుడు రచయితగా పేరు తెచ్చుకుంటుంటే నమ్మలేకపోతాడు. అది స్నేహితుడి ప్రతిభ కాదని, అతని భార్య రాస్తున్న కథల్ని స్వంతమని చెప్పుకుంటూ రచయితగా చలామణి అవుతున్నాడని అపోహ పడతాడు. భార్యని తనకోసం కథలు రాయమని బలవంతం చేయగా, ఆమె తనకు చేతకాదని చెప్పి, విసిగి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆఖరికి, స్నేహితుడు కథల్ని తానే రాసాననీ, తన కథల్ని భార్య ఫెయిర్ చేసి పంపటం వరకు మాత్రమే చేస్తోందన్న వాస్తవాన్ని చెప్పినప్పుడు తన తప్పు గ్రహిస్తాడు కథానాయకుడు. అదే తను రాయబోయే కథకి వస్తువు అవుతుందని సంబరపడతాడు. 

ఈ సంపుటిలో మూడు కథలు ‘కిడ్నాపింగ్’, ‘శిక్ష, ‘యమగండం’ అపరాధ పరిశోధక కథలు. ఆసక్తిగా చదివిస్తాయి. 

భార్యాభర్తల్లో భర్త భార్య కంటే అన్ని విధాలా ఎక్కువ ప్రతిభాసామర్ధ్యాలు కలిగి ఉండాలన్న అపోహ, అలిఖిత నియమం ఒకటి మన సమాజంలో ఒకప్పుడు బాగా కనిపించేది. అందులో రంగు, ఎత్తు లాటి సహజమైన శారీరక లక్షణాలకీ ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడిప్పుడు ఇలాటివి లక్ష్యపెట్టవలసిన అవసరం లేదన్నది అందరూ గుర్తిస్తున్నారు. ‘పొడుగు’ కథలో ఆమె అతని కంటే పొడుగు. అది అతనికి నచ్చని విషయం. ప్రమాదంలో కాలు పోగొట్టుకుని అవిటితనంతో ఆమె అతని కంటే పొట్టి అయిపోతుంది. తన మూర్ఖపు ఆలోచన ఆమెకు ఇంత శిక్షను వేసిందని అతను అర్థం చేసుకుని, బాధపడతాడు.

రచయిత తన స్వగతంలో ఈ కథల్లో చాలా మటుకు ‘పడుచుదనం రైలు బండి’ ఎక్కిన తొలినాళ్లలో రాసినవని, అంచేత తాజాదనం కోల్పోయే ప్రసక్తి లేదని చెపుతారు. అందుకే రాసిన ఇన్నేళ్ల తరువాత వీటిని ‘అనుభూతి కథలు’ గా తీసుకువచ్చి పాఠకుల ముందు పెట్టారు. వారు ఆశించినట్టే ఇవి పాఠకుల ఆదరణ పొందాయని అర్థమవుతోంది. మనిషిలోని అనుమానం, అసూయ, కోపం, దురాశ, లోభిత్వం, అహంకారం ఇంకా అనేక అవలక్షణాలను ఈ కథల్లో చూస్తాం. కానీ వారిని ఆ అవలక్షణాలకు ద్వేషించం. అవి మానవ బలహీనతలనీ, మన అందరిలోనూ ఉన్నాయని రచయిత చాలా కన్విన్సింగా కథలను అల్లి చూపించారు. అది రచయిత ప్రతిభను చూపిస్తుంది. ఇవన్నీ నిజంగా అనుభూతి కథలే. పేరుకు తగిన కథలు. హాయిగా చదువుకునేందుకు, మన లోపలికి చూసుకుందుకు ఉపయోగపడతాయి. 

ఇంకా మనల్ని మనం సంస్కరించుకుందుకూ సహకరిస్తాయి.

రచయితకు అభినందనలు. 

కవర్ పేజీ మీద బాలి బొమ్మ ఆకర్షణీయంగా ఉంది. లోపలి పేజీల్లో కథలకు తగిన బొమ్మలను బాపు, బాలి, చంద్ర, శంకు, గోపి, ఇవిఆర్, రాంపా, విశ్వేశ్వర్, రఘు లు అందించారు. 

ప్రచురణః ఛాయ రిసోర్సెస్ సెంటర్, ముద్రణః సెప్టెంబరు 2022

వెలః రూ. 150/ 

You Might Also Like

Leave a Reply