“యాలై పూడ్సింది” పుస్తక సమీక్ష

వ్యాసకర్త: హరికృష్ణ (చేగువేరా_హరి, అనంతపురం)

**********

*యాలై పూడ్సింది – సామాన్యుడి యుద్ధ శిఖరమై వికసించింది*

నాలుగు పాదాలు, కొన్ని అక్షరాలు, రెండు వాక్యాలు రాసి కవిత అని చెప్పుకునేవి కాదు ఈ పుస్తకంలో ఉన్నవి. పల్లెల బతుకులను వాటికోసం పేదలు నలిగిన జీవనాన్ని, వారు చూసిన ఆహ్లాదకరమైన ప్రకృతిని, కాపాడుకున్న అడవిని, ప్రస్తుతం ఎవడో లాభాల కోసం కుల్చేస్తున్న అడవితల్లి కన్నీటి ఆవేదనను పది కాలాలపాటు పది మంది చర్చించుకునే కథానాత్మక కవితలు ఇవి.

నేటి తరం హీరో కవి పల్లిపట్టు నాగరాజు అన్న గారు అని చెప్పొచ్చు నాగరికత తెలిసిన మనిషి, ఆత్మగౌరవం కోసం పోరాడిన మనిషి, అవినీతి సజీవ ఆత్మలను ఎదిరించిన విప్లవాత్మక మనిషి, పల్లె సుగంధాలను ప్రపంచానికి వ్యాపింపజేసే రాయలసీమ యాస మనిషి, రాళ్లు రాతి గుండెలు సైతం తన కవితలు వింటే ధిక్కరించేలా చేసే గట్టి సంకల్ప బలం ఉన్న మనిషి, కలం పట్టుకుంటే కాలాన్ని కుదిపేసే అసలైన పల్లెపట్టు మనిషి, ప్రతి పల్లెకి పట్టుకొమ్మలా చిగురించి చరిత్రలో నిలిచిపోయే కవి పల్లెపట్టు నాగరాజు గారు. రాయలసీమ కరువు సీమనే కానీ దేశ తలరాతను మార్చే కవుల సీమ సత్తా ఉందని పల్లెపట్టు నాగరాజు గారు రాసిన “యాలై_పూడ్సింది” కవితా సంపుటి చదివాక ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈ అక్షరాలు కవితల ప్రవాహంలా కొనసాగడానికి నిత్యం స్వేదపు జలమై శ్రమించిన వారి తల్లిదండ్రులకు నా ప్రత్యేక పాదాభివందనాలు కవి పల్లెపట్టు నాగరాజు అన్న గారికి నా హృదయ పూర్వక అభినందనలు!

ఏ కవిత చదువుతున్న మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న లోతైన కథ కళ్లముందు కదులుతున్నట్లు ఉంటుంది. కవి పల్లిపట్టు నాగరాజు గారు రాసిన ఈ కథనాత్మక కవితలన్నీ… నిద్రపోతున్న మాలాంటి యువతను మేల్కొలపడానికి, ఎవరేమైతే మనకెందుకు అనుకునే నాగరిక సమాజ దొంగలను తరిమికొట్టడానికి, పల్లీలా పేదలను వేపుకు తింటూన్న రాజకీయ కీచకులు పంచెలు తడిసిపోయేలా , పంగనామాల పథకాలు పెట్టే ప్రభుత్వాలను తట్టిలేపడానికి, అనవసరంగా నిరుపేదలు ఇల్లు కూల్చే అనాగరిక వ్యవస్థతో కుడి అంధులైన అధికారుల బాగోతం బయటపెట్టడానికి, పేదోడి కడుపులో పేగులు ఆకలి నినాదమై ఆరుస్తుంటే దాని ఆవేదన తట్టుకోలేక…నాలుగు బియ్యపు గింజల్ని తీసుకున్నాడని ఆకలి బిడ్డను, అడవికన్న బిడ్డను, ఆదివాసే కదా అని చిన్నచూపు భావజాలంతో మనల్ని అడిగే వాసి ఎవడులేడని నడి రోడ్డులో చెట్టుకట్టేసి కొట్టి చంపేసినా ఈ దుర్మార్గులు ఎందుకు వేల కోట్లు ఎగరకొట్టినా వాళ్ళని వదిలేసి ఇలాంటి పేద బ్రతుకుల మీద ప్రతాపం చూపడం ఎంతవరకు న్యాయమని కవి ఈ నాగరికత నగ్న సమాజాన్ని నిట్టనిలువునా దింగబరిగా నిలబెట్టి వేడివేడి అక్షరాలు తూటాల్లా పేల్చి మనుషుల యొక్క నీచ బుద్దిని చెంచలమైన మనస్తాత్వాన్ని కాల్చేశాడు.!

కవితలు చదువుతుంటే పాఠకుణ్ణి ఎంత ప్రభావం చేస్తాయో అంటే కవి హృదయం ఎంత మగ్గిపోయింటుందో మనం యాలై పూడ్సింది కవిత సంపుటిలో చూడొచ్చు… ఈ నాగరిక సమాజంలో కూడా ఇంకా ఇంకా కులాల కుంపట్లోనే కొందరు మూలుగుతున్నారు…అగ్రవర్ణాల పేరు తగిలించుకొని ఎంతోమంది నీరు పేదలను నేటికీ చిన్న చూపుతో చూస్తున్నారు. కవి సమాజం సిగ్గుతో తల దించుకునేలా అడిగిన ప్రశ్న ఇది.

/నేను పీల్చే గాలే/అందరూ పీల్చేది/ నేనున్న నేలే/అందరూ ఉండేది/నా ఇల్లెందుకు ఊరవతల?/ అన్నాడు”… దీనికి సమాధానం ఏమిటో ఏ రాజకీయనాయకుడు ఏ కులం పెద్ద , ఏ సుప్రీం కోర్టు జడ్జి దీనికి ఎపుడూ తీర్పు చెప్తాడో మరీ ఏమిటో?

ఆకాశంలో కాసే వెన్నల, సూర్యుడి వెలుగు, చిక్కుల్లో పడేసే చీకటి నిరుపేదపైన వాలుతుంది , డబ్బులున్న కుల గజ్జీ గాళ్ల మీద పడుతుంది. మరెందుకు ఈ వత్యాసం మనుషుల్లో ? యుగాలు గడిచాయి కాలాలు మారాయి గాల్లో ఎగిరే రోజులు వచ్చాయి. అందరం ఒకే గాలిని పిలుస్తాం కానీ మనుషులంతా ఒక్కటి కాదనే భావన మాత్రం ఎందుకు ఇంకా అలాగే మిగిలింది?మనిషి ఎపుడైనా అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి ప్రయాణం చేయాలి కానీ ఇంకా అజ్ఞానాన్ని అహంకారాన్ని కుల మతాల అంటురోగాల్ని రోగిస్టిలా తనని తాను నిర్మించుకుంటే అలాంటి వారు బ్రతుకుతున్న నిర్జీవులతో సమానమే సమాజానికి కూడా హానికరం వీళ్ళు.!

ఈ పుస్తకం ముందు వేసుకుని కూర్చున్నాక కవిత చదువుతుంటే తెలియని కోపం నామీద నాకే, ఈ అసమానతల సమాజంపై విరుచుకు పడాలని ఉంది! సామాన్యుడిని కూడా అసాధ్యుడుగా మార్చి ప్రజ్వల జ్యోతిగా రగిలించే అక్షరాల ప్రవాహ ప్రభావం అని చెప్పొచ్చు. ఈ పుస్తకంలో ఏ కవిత చదివిన మీరు కచ్చితంగా కొత్త అనుభూతి చెందుతారు.ప్రస్తుత సమాజంలో జరుగుతున్న దాడులు అవినీతిపరుల అధికారులు, రాజకీయ పరిస్థితులు, చేతగానితనంతో చేతులు ముడుచు కూర్చున్న జనాలును అందర్నీ రెచ్చగొడుతూ హెచ్చరికలు చేస్తూ. కవి తన కథనాత్మక కవితలతో నిర్లక్ష్య ధోరణిని అక్రమ కట్టడాలను అనవసర కూల్చివేతలను ఇందులో ప్రశ్నిస్తాడు…గ్రామీణ వాతావరణాన్ని, అడవుల అనుభవించే బాధలను, వర్తమానం నుంచి గతంలోకి, గతం నుంచి భవిష్యత్తుకి జ్ఞాపకాల ప్రయాణం చేసేలా ప్రతి పాఠకుణ్ణి చేస్తాడు…కళ్ళముందు మన ఊర్లో కనిపించే ఎందరో రుక్కమ్మత్తల కథలాంటి కవితలతో మనల్ని కదిలిస్తాడు కవి.

ఇలాంటి ఘటనగానే చిన్నప్పుడు మా గ్రామాలలో గంపలో పూలు పెట్టుకొని అలివెలమ్మ అత్త పల్లెలు చుట్టూ తిరుగుతూ ప్రతి పల్లె నుంచి పూలు నింపిన గంపను ప్రేమతో నింపుకొచ్చేది. ఎనలేని ప్రేమ ఆప్యాయతలతో ఆత్మీయతలను మా వాకిట్లో ఓడబోసి ఒక ముద్దు తింటూ తన గాథ మొదలెట్టి ఎన్నో కథలు చెప్పేది. అచ్చం అలానే కవి పళ్లిపట్టు నాగరాజు గారు గతాన్ని తవ్వి రుక్కమ్మత్తలను వారి గాథలను గుర్తు చేస్తూ ఒక మాట రాశాడు. 

“/రుక్కత్త గురించి చెప్పడమంటే/ మురికిలేని మనసుగురించి చెప్పటమే/రుక్కత్తగురించి రాయడమంటే ఇంటిని భుజాలపై మోసీ మోసీ/ ఒంటరిగా మిగిలిపోయిన దుక్కకావ్యాన్ని సదవడమే/” అన్నాడు.

 తన వృత్తి ధర్మంలో విద్యార్థులకు పాఠం బోధిస్తూ కవి ఇలా అన్నాడు…
/కనురెప్పలుతాకిన ప్రతిచోటా/ కవిత్వంమొలకెత్తినట్టూ/ జీవితంలో ఏ మూల తడిమిన పాఠమైపోతోంది/ఇప్పుడు నేను పచ్చని చెట్లు గా మొలకెత్తుతున్నాను/ పిచ్చుకలు వాలే పచ్చని కిటికీనై మొలుస్తాను/ అంటూ

పిట్టను పిట్ట స్వరంలో మారిన పాటను ఎప్పుడూ మీ మనుషులు స్వార్ధాలు దుఃఖాలు గురించేనా ఎత్తు పైఎత్తులు గురించేనా అంటూ పాఠకుణ్ణి సమాజాన్ని ఒకే గాడికి కట్టేసి”* 
/మనదైన లోకానికి ఊపిర్లుదే/ ఒక పచ్చని చెట్టు గురించో/ పచ్చని కొమ్ముపై మా రెక్కల సప్పుడు గురించో../పాఠంమెప్పుడవుతారన్నట్టూ/ప్రశ్నలు వర్షిస్తూ ఎగిరి వెళ్ళిపోయింది పిచ్చుక/గాలి మిత్రుని భుజాలపై చేతులు వేసుకొని/ 

గాలిని పక్షి మిత్రుడితో పోల్చడం నిజంగా ఒక కొత్తదనం ఇది ప్రతి పాఠకునికి నచ్చుతుందని భావిస్తున్న. ఈ కవి హృదయం తన మనస్తత్వం ఎలాంటిదో మనం చూడొచ్చు. ప్రపంచానికి ప్రసాదంలా అన్నం ముద్దలు పెట్టిన అన్నదాతలు. అన్నం వెనుకున్న అసలైన దాతలు అన్నం కోసం పంట పొలాలు వదిలి గల్లీలు వదిలి ఢిల్లీ బాట పట్టి గలమై గర్జిస్తున్న భూ విశ్వాసుల గురించి ఈ పల్లెపట్టు కవి పల్లె హృదయంతో ఇలా చెప్తున్నాడు.

/తమ దేహాల భూమిలో విత్తుకున్న/ తడియారని నమ్మకాన్ని ఊత పొడుచుకుంటూ/
/బోదె బోదెకు కన్నీళ్ల పారగట్టిన/ చేతుల్ని ఆకాశానికి జెండాలుగా ఎగరేస్తూ/ వాగు వాగు కలిసి మహా ప్రవాహమై పొంగుతున్నట్టూ/ వాళ్లు ప్రవహిస్తున్నారు/.

/కాలం నుదిటిపైన నెత్తుటి పాదముద్రలేసి/ 
/ఊళ్ళ నుంచి, బిళ్లనుంచి నగరాల మీదుగా/ నినాదాల ముళ్ళుగర్రలతో నడిపించుకుంటూ/ గెనిమనుంచి గెనిమకు సాలుపట్టి కొండ్రేసినట్టూ/
/నాగేలి పాదాలతో దారుల్ని దున్నుకుంటూ/ కొడవళ్ల చేతులతో దుఃఖాన్ని కోసుకుంటూ/ ఎండిన దేహాలకు ఎన్ని ఎండలైనా లెక్కేమనీ/ ఎడతెగని ప్రవాహమై/ చితికి బొబ్బకట్టిన పాదాల దేశమై/ పగిలి నెత్తురు కారుతున్న రాజ్య ముఖచిత్రమై/వాళ్లుప్రవహిస్తున్నారు/

అంటూ కవి రైతుల అడుగులను వారి అర్ధనాద ఘోషలను, తడియారిన గొంతులను ప్రభుత్వానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతన్నల కోసం వారి హక్కులు సాధించడం కోసం పాటుపడుతున్న నేలమాలుల కోసం.. నేల గొంతుకై కవితలతో మాట్లాడుతూ మనల్ని ప్రవహించేలా చేస్తాడు కవి.ఈ కవితలో చివరి లైన్ ఒక అద్భుతమైన పోలికని చెప్పొచ్చు.
/వేలవేల సూర్యులు వాళ్ళ పాదాల కింద మొలుస్తున్నప్పుడు/ కవి ఈ మాట రాయడానికి తీవ్రమైన సంఘర్షణను ఆటుపోట్ల జీవితాలను ఎదుర్కొని, అణిచివేయబడ్డ వర్గాలలో మగ్గిన అగ్గి మెరికలో మెరుపులా దూకిన వాడని మనకర్థామవుతుంది!

చుట్టూ రోజు మనం చాలా ప్రదేశాలలో చూస్తూ ఉంటాం ప్రభుత్వాలు మారడం మారిన వెంటనే ఇళ్లను కూల్చేయడం, వాళ్ల పార్టీలో గొప్పతనంగా భావిస్తారు. కవి ఇళ్లను ఖాళీ చేపించడంపై రాసిన కవిత మనల్ని చాలా చాలా ద్రిగ్బాంతికి గురిచేస్తుంది. ఇల్లు లేని వాడికి తెలుస్తుంది ఇంటి విలువ అంటూ ఎందరో పేదల గొంతుకై తన అక్షర పలుకుల్లో ఆయుధమై పేదవాడికి అండగా నిలిచే ఒక విప్లవ కెరటమై రాజకీయ ముసుగులను తెగ నరికాడు.

/ఏ వీధి కుక్క మొరిగిందని/ ఏ గుడ్లగూబ ఉరిమిందని/ ఉన్నఫలంగా/ మా చేతులరా బతుకుల్ని కూల్చుకొని/ దిక్కులేని పక్షులై ఎగిరిపోయేటంత/ చేతగాని గొర్రెలమేమికామూ../
/పొయ్యలనిండా మండుతున్న/ మా దేహాల కట్టెలున్నాయి/ పొయ్యిమీద కూటికుండలో/ కుతుకుతా వుడుకుతున్న మా కన్నీళ్లున్నాయి/మా ఇంటిని వొదిలి పోవడమంటే మేము చావడమేగదా/

/మా ఇళ్లని ఖాళీచేయాలని కూసేముందు/ ఎవరిళ్లను వాళ్ళు తగలబెట్టి రండి/ మీకిళ్లు లేనప్పుడు తెలుస్తుంది/ ఇల్లు లేని మా బతుకులెలా వుంటాయో!/
అంటూ ఒక బాధతో హృదయ విధారకమైన సంఘటనను ఇల్లు కాలి చేసే వారి సంఘర్షణను మనకు కళ్ళ ముందు కదిలేలా చేస్తాడు పల్లెపై పట్టున్న పల్లె కవి.

ఎవరైనా రేపటి తరానికి ఏదో ఒకటి అందించాలని అది చరిత్రలో నిలిచిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే తరాలు తరలిపోకుండా అడవి తలరాతలు బాగు చేయకున్నా పర్లేదు కానీ అడవిని కాపాడుతూ అడవి గొంతుకై, అడవి పాటై, అడవి అలుపెరుగని చేసే బాటై, స్వచ్ఛమైన అడవి లాంటి మనసున్న మనిషై, అడవి ఆపద్బాంధవుడై అండగా నిలుస్తూ ఉన్మాదుల్ని ఊచకోత కోస్తూ ఒక మృగగీతమై గీతలుగా రాలిపడి కవి హృదయకలంలోంచి పుట్టి చరిత్ర గుహలను కూల్చేసి నాగరికత చరిత్ర సృష్టించే అడవి తల్లి ఆవేదనను కవితగా మలిచిన ఓ గొప్ప అరణ్య ప్రేమికుడి కథానాత్మక కవిత ఇది.

/మృగానికి సత్యమంటే భయం/ సత్య సముద్రాలు ఉరిమినప్పుడల్లా/ తోక తొక్కిన తాచులానో/ కల్లు తాగిన కోతిలానో/ తన మృగత్వాన్ని మూఢత్వాన్ని మేళవించి/ అనాగరిక పాటను అనాధగీతమంటుంది/
/అడవులు నోరు విప్పినప్పుడల్లా/ భగభగ మండే మంటలకోరలు సాస్తుంది//రేపటి అడవులు స్వేచ్ఛగా నవ్వాలంటే/గొంతువిప్పుతున్న అడవులు/ కొంత తగలబడినా పర్వాలేదు గానీ/మృగం మాత్రం బూడిదవ్వాల్సిందే/

మన రాయలసీమలో రత్నాలు రాసులుగా పోసి వ్యాపారం చేశారు అయితే ఎందుకు ఇంత వెనుకబాటుతనం వచ్చింది.. *?*ఎందుకు మన రాయలసీమ కరువు పై దేశం కోడై కూస్తుంది..*?*గూగుల్ లోనే కాదు ఎక్కడ వెతికిన మన సీమనే కరువు సీమ అంటూ కన్నీటి సీమగా మిగిల్చిందెవరు..*?*వానకు సైతం ఇదే అంటరాని నేలనా..*?*ఇక్కడ వర్షపు సుక్కలు కంటే రైతు కన్నీటి సుక్కలతో పుడమిని తడుపుతున్నారు.. కవి పల్లిపట్టు నాగరాజు గారు కవితలో కరువు ఋతువు మనది అంటూ…

/ఇది వానకు అంటరాని నేల/ చుట్టూ నదులు పారుతున్నా/ ఇక్కడ కరువు ప్రవహిస్తుంది/ ఇక్కడ ఎప్పుడూ మబ్బులచే/ మాయమాటలు రాజకీయాలుచే /మోసం కురుస్తూనే ఉంటుంది/
/మా కన్నీటి తడికి రాళ్లు మొలుస్తున్నాయే గానీ/ ఒక్క నమ్మకపు చినుకు కురవలేదు/ ఒక్క ఆశైనా చిగురించలేదు/ ఇది నిత్యం కడుపు మంటలు నేల/

/ఎక్కడైనా ఋతువులు మారుతుంటాయి/ ఇక్కడ కాలం పొడవుతా ఒకటే రుతువు/ కరువు కొడవళ్లతో నమ్మకపు గొంతులు కోస్తూ…/
నిత్యం కడుపుమంటల నేల ఇది నిజంగా 100% సత్యం అని నమ్ముతాను నేను కూడా సీమవాసిగా కరువు మంటల్లో కాలిపోతూన్న వాడిగా సీమను ఇలా తయారుచేసుకున్నందుకు తలదించి సిగ్గుపడుతున్నాను.!

కవి పల్లెపట్టు నాగరాజు ప్రతి ఒక్కరిని మేల్కొల్పే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరణ చేయాల్సిన బాధ్యత ఉంది. నేటి మనిషి రోజుకు ఎంతటి సోమరితనంతో జీవనం సాగిస్తున్నాడు అనేది మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం. తన జీవితం మొత్తం సోమరితనంతో ఈదుతూ భవిష్యత్ తరాలకు అదే నూరిపోస్తున్నాడు. కనీసం మన ఇంటిని మనం శుభ్రం చేసుకోలేం నగరాన్ని ఎలాగూ శుభ్రం చేయం. కనీసం మన నుంచి పరిశుభ్రతకు హాని కలగకుండా ఉంటే మాత్రం అది మేలు చేసినట్టే మనం. ప్రతిరోజు ఎంతోమంది ఉదయాన్నే సిటీలో చెత్త బండిని తోసుకుంటూ అన్నిటినీ శుభ్రపరుస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న వారిని చూసి అసహ్యించుకుంటాం. ఎందుకంటే మనం నాగరికతలో బ్రతుకుతున్న అనాగరికులం కాబట్టి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే వీధులను శుభ్రం చేసే ఆ చేతులు లేకపోతే మీ ఇంటి పక్క మీ వీధి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అంటూ మనందరికీ కనువిప్పుగా మనల్ని కదిలించి మేల్కొల్పే దిశగా కవి ఈ కవితను ఎంత గొప్పగా రాశాడో చూద్దాం.

/సోంబేరి ముఖాలు ఇంకా మొకమన్నా/ కడుక్కోకముందే/ వాళ్ళు నగరం ముఖం కడుగుతుంటారు//ఎందరో తల్లుల బిడ్డలకి మూతిగడిగి ముక్కుచీది, /లాలపోసి, పొగడ్రాపూసి, దిష్టిసుక్క పెట్టి దీవించినట్టూ/నగరంలో రోడ్లన్నిటిని బిడ్డలుగా లాలిస్తూ/ దుమ్ము ధూళి తుడిచి/ అందంగా దిద్దుతుంటారు/ మాయమ్మ మాచెల్లికి పాపిటదీసి జడేసినట్టూ/యీ సపాయమ్మలు పట్నంపిల్లకి చిక్కుదీసి కొప్పుబెడుతుంటారు/

/కాలాన్ని టీవీ సీరియళ్ల ముందు కారుస్తూ/ సాయంత్రాల్ని డీమార్ట్ల వెలుగుల్లోనూ/ స్టార్ హోటళ్ల విందులోనూ/ వెలకట్టి అమ్ముకునే కార్పొరేట్ తల్లులు/ ఖరీదైనకోకలు ముడతపడకుండా/ కంపుకబుర్లతో వాకింగ్లూ చేస్తూ/ వాళ్లను చూసి మురికి వాసనంటూ/ముక్కుమూసుకునే మురికిగుండెకాయలకోసరం/

/ఈ నల్ల తల్లులు/ ఎన్ని దుమ్ము పట్టిన దేహాలతో తుమ్ములవుతారు/ ఎన్ని తూర్లు దగ్గీ దగ్గీ మగ్గిపోతున్న పేగులవుతారు/ దినమంతా చీపురు కట్టలై కదిలే/ ఆ చేతులకు ఎన్ని సలాములు చేయాలి?/ ఎండంతా నెత్తిమీద కొంగై తిరిగే వాళ్లకు/ చెత్తబుట్టలు మోసే ఆ వీపులకు చేతులెత్తి/ ఎన్ని దండాలు పెట్టాలి?/

/నగరాలనిండా పరిశుద్ధ పొద్దులవుతున్న/ ఆ పాకీతల్లుల పాదాలు తాకి/ ప్రాణం పోసుకునే ఏ నేలైనా/ వాళ్ళ నట్టింట బతుకుదీపాలారిపోకుండా/ అంత నూనెపోయడమే/ ఇకపై నేను పాడే దేశభక్తి గేయం!/ఎవరైనా పాడాల్సిన జాతీయగీతం!/

నిజంగా ఒక అద్భుతమైన వర్ణన ఇది. అసలు ఇది చదివాక నాకు *మన సీమ సుక్కల గొంతుక అని పిలిచే ఒక గొప్ప వ్యక్తీ సింగమనేని నారాయణ సార్ గారు గుర్తొచ్చారు..!*

కవి ఒక విప్లవాన్ని కోరుకుంటూ ఎన్నో ఏళ్లు మగ్గిన బ్రతుకులను బాగు చేయడానికి ఒక నడిచే దారిని, నడిపించే దారిని బ్రతుకులను బాగు చేయడానికి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు.

/భీమ్ రాగంలో పూలే పాట పాడుకుంటూ/ దారిని నీలి జెండాజేసీ ఆకాశం నిండా ఎగరేస్తూ-/ ఉండే ఒక స్థితప్రజ్ఞుడు కావాలని చాలా ఆశగా ఎదురుచూస్తున్నాడు కవి.!

*కవి పల్లెపట్టు నాగరాజు గారు రాసిన ప్రతి కవిత విప్లవంగా కొన్ని, పల్లె బ్రతుకుల హృదయానికి దగ్గరగా ఉంటాయి.* అయితే పాఠకునికి ఇది ఒక ఆశయంగా ఉంటుంది. ఒక కొత్త ఆశాకిరణంగా ఆకాశంలో మెరిసే చుక్కల వలె చూడ్డానికి చిన్నగా కనిపించిన దగ్గరికి వెళ్లే కొద్ది సూర్యుని కంటే పెద్దగా కనిపించినట్టు ఈ యాలై పూడ్సింది కవితా సంపుటి” చదివితే అలాగే ఉంటుంది. పుస్తకంలో ఉన్న ప్రతి కవిత ఒక కథలాగ సాగుతుంది. అందుకే ఎలాంటి పాఠకుడినైనా ఇది ఆకట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత గొప్ప పుస్తకానికి కేంద్ర సాహిత్యం అవార్డు రావడం మరో గొప్ప విశేషం. అయితే పుస్తకంలో ఉన్న నిగూడర్థాల కవితలకు ఏ అవార్డులు సాటిరావని నా అభిప్రాయం. పుస్తకం చదివితే ఇది నిజమో కాదో మీకే అర్థమవుతుంది అందులోని కవితలు యుగాల శబ్దాలై లోకాలను ప్రభుత్వాలను కదిలించే ప్రశ్నల పరంపర గళమై నూతన విప్లవయుద్ధ శిఖరమై వికసిస్తుంది..!కవి పల్లెపట్టు నాగరాజు అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ పుస్తకం గురించి నాలుగు మాటలు రాసేలా చేసిన ఆత్మీయ సోదరులు కవి, ఉపాధ్యాయులు కొత్తపల్లి సురేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.!

You Might Also Like

Leave a Reply