దేవుడమ్మ – ఝాన్సీపాపు దేశి

వ్యాసకర్త: వై. శ్రీనాథ్ రెడ్డి

**********

అప్పుడు ఆ ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టి కథనరంగంలో దూకి వీరోచితంగా పోరాడి యుద్దాలను గెలిచింది. ఇప్పుడు ఈ ఝాన్సీ పాపు దేశి కలంపట్టి కథల రంగంలో దిగి అనుచితంగా పోరాడి మా మనసులను గెలుచుకుంది. డ్రెస్సు, అడ్రస్సు మార్చినా ఊరి మీద తన అభిమానం మార్చల. modern మట్టి మనిషి. ఆ పరిమళం కథల్లో వేస్తూ ఉంది. మాండలికానికి మర్యాదలు చేసి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఝాన్సీ గారి కలం నుండి జాలువారిన ఆ కథలన్నింటి గురించి సంగటి చేశాను.ఆ సంగటిలో మీరేం కలుపుకొని తింటారో మీ ఇష్టం. సంగటి చల్లారే లోపు దాని సంగతేందో చూద్దాం పదండి. 

చిన్న కష్టం వస్తేనే ఉరితాడుకి వేలాడే చాలామందిని చూసిన దేవుడమ్మ తన ఇంట్లో అత్త పోరు పడలేక ‘దేవుడమ్మ’ అనే వేషం వేసి ఏదో ఒక విధంగా బతుకు బండిని నెట్టుకొస్తుంది. అలాంటి దేవుడుమ్మకి, కళ్ళల్లో నీరు పెట్టుకుని, చేతి సంచి పట్టుకొని, ఊరికి బయలుదేరిన “నీరు గట్టోడు” కనిపించాడు.  “ఊరందరి పొలాలకు నీళ్లు పెట్టిన పాపమనుకుంటా…నా కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. చెరువు ఎండిపోయింది. మరి నా మనసులో ఉన్న తేమ ఎప్పుడు ఎండిపోతుందో” అని తన దిగులునంతా ఆ దేవుడమ్మతో చెప్పినాడు. దేవుడమ్మ నీరు గట్టోడి కళ్ళల్లో నీళ్లు తన పైట చెంగుతో తుడిచి, నిర్మానుష్యమైన విజయనగరానికి చేరింది. అక్కడ పంపానది ఒడ్డున తన ప్రియుడి కోసం ఎదురుచూస్తున్న “ఏకపర్ణిక”కి ధైర్యం చెప్పింది. మాధవడు వస్తాడని, వచ్చి తనను రెక్కల గుర్రం ఎక్కించుకుని వెళ్తాడని.  అనుకున్నట్టుగానే మాధవుడు రెక్కల గుర్రం వేసుకొని వచ్చాడు. మాధవుడు తన రెక్కల గుర్రాన్ని దేవుడమ్మకి ఇచ్చి (స్వేచ్ఛగా ఎగరమని) ఏకపర్ణిక తోటి ఏకాంత వాసం కోసం వన విహారానికి వెళ్ళాడు. 

 దేవుడమ్మ రెక్కల గుర్రం వేసుకొని భూటాన్ బయలుదేరింది. అక్కడ హిమ, యంగ్ కలిసిమెలిసి ఆనందంగా తిరుగుతుంటే…వాళ్ళని ఆశీర్వదించి, ముచ్చటపడి తన రెక్కల గుర్రాన్ని బహుమతిగా ఇచ్చింది స్వేచ్ఛగా ప్రపంచమంతా పర్యటన చేసి రమ్మని. 
 అకస్మాత్తుగా దేవుడమ్మకు ఏదో గుర్తొచ్చి హడావుడిగా పూనే బయలుదేరింది. అక్కడ మీటింగ్ కి అటెండ్ అయ్యి మాతమ్మగా మారిన దీప తన కథ చెప్తుంటే మనసు కళ్ళు చేసుకొని వింటుంది. 

“నా కథ చెప్పమని నన్ను ఈడకి తీసుకు వచ్చినారు. నా కథ ఎవరింటారని? మీకందరికీ సీతమ్మ తల్లి కథ కావాలి. ద్రౌపదమ్మ కథ కావాలి. సీతను ఎత్తుకుపోతే మీకంతా కోపం వచ్చి ఉండాది. వాడి సావు చూసేదాకా ఊరుకోలేదు. వాడి నెత్తురు తాగితె గాని నిద్ర పట్ల. వాళ్లకి కష్టం వస్తే లోకం మొత్తం ఏడ్చింది మరి మా కోసం ఎవరు ఏడుస్తారు ఇప్పుడు.  మా పేదోళ్ల మానం, మా కడజాతోల్ల మానం, మా గతి లేనోళ్ళ మానం, ఏమైతే మీకేం మనాది. మమ్మల్ని దుడ్లిచ్చి, పెత్తనం చూపించి లొంగ తీసుకుంటారు. అదీ లేదంటే దేవుణ్ణి అడ్డం పెట్టి లొంగ తీసుకుంటారు.  దోవన బొయ్యే వాళ్ళంతా కసుపు తొక్కినట్టు మమ్మల్ని తొక్కుకుంటూ పోతా ఉంటే మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? “

అని దీప చెప్తా ఉంటే దేవుడమ్మకి కోపం వచ్చింది. ఈ వ్యవస్థ మీదా, మాతమ్మ, జోగినిలను తయారు చేసిన ఈ సమాజం మీద. ఒక పోలేరమ్మలా పోరాడాలనిపించింది. అపరకాళిలా శూలంతో పొడిచేయాలనిపించింది. 

 ఆ కోపంతో ,ఆవేశంతో బయలుదేరిన దేవుడమ్మకి దారిలో “మగాడు కనిపిస్తే చాలు దొరికిండే రాయి ఎత్తుకొని పిచ్చిదానిలా తరుముకుంటూ ఉన్న మల్లిక” కనిపించింది. ఆ స్థితిలో మల్లికను చూసిన దేవుడమ్మ కి గుండె బరువెక్కింది. చిన్న వయసులోనే పెండ్లి చేసుకొని, పడరాని కష్టాలు పడుతున్న మల్లికను దగ్గరకు తీసుకొని హత్తుకుని ఏడ్చింది. మల్లికకి తన రోగాన్ని అంటించిన రాజు గాడిని నరికి చంపేయాలనుంది. అట్టా చంపేస్తే మల్లిక మొండమోస్తుందని ఆగింది. అప్పుడు ఊరే మల్లిక మీద రాళ్లు ఏత్తారని ఊరుకొనింది. మల్లిక ముత్తయిదువుగానే పోవాలని ఆశీర్వదించింది. 

 అలా అక్కడ దిగాలుగా కూర్చున్న దేవుడమ్మకి, అక్కడే చప్పట్లు కొడుతూ షాపుల ముందు అడుక్కుంటున్న తార కనిపించింది. ఒక రోజంతా తార వెనకాలే తిరిగింది దేవుడమ్మ. పగలు చప్పట్లు. రాత్రికి దుప్పట్లు. పగలు ఏ షాపుల ముందైతే చేయి చాపి నిలుచుందో రాత్రి అదే షాపుల వెనుక చాపపరిచి పడుకుంటుంది. తారని చూసి దేవుడమ్మకి అసహ్యం వేసింది. కానీ తరువాత తార కథ మొత్తం విన్నాక దేవుడమ్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ “మనుషులందరిలో కెల్లా నీవే అసలైన తారవు ,అందరిని మనసారా దీవించే అరుణ తారవు” అని ధైర్యం చెప్పి, స్మిత మీద కోపంగా ఉన్న సమీర్ దగ్గరికి వచ్చింది. సమీర్ దగ్గరకు వచ్చి స్మిత రాసిన ఉత్తరం అందించింది. ఆ ఉత్తరం చదివిన సమీర్ మనస్పూర్తిగా కుమిలిపోయాడు.  అనవసరంగా స్మితను అపార్థం చేసుకున్నానని సమీర్ దేవుడమ్మ దగ్గర బాధపడుతుంటే…దేవుడమ్మ సమీర్ తల నిమిరి.. “life is a paradox. Every truth has its counter part which contradicts it. Love is one”  అని చెప్పి సమీర్ దగ్గర సెలవు తీసుకొని కామాక్షి దగ్గరకు వచ్చింది.

కామాక్షి తన బాల్య స్నేహితురాలి కథ చెప్పేసరికి దేవుడమ్మ పూనకంతో ఊగిపోయింది. “ఆ తండాలో ఆడబిడ్డ పుడితే సంబరంచేసుకుంటారు.కూతురిని తండ్రి, పెళ్ళాన్ని మొగుడు యాపారాలకి పంపిస్తారు. ఒళ్ళు అమ్ముకునే యాపారం. ప్రతిరోజు ఒళ్ళు గుల్ల చేసుకుని యాపారం చేస్తే తండాలో ఇంట్లో ఉండే వాళ్ళ కడుపులు నిండుతాయి. అలా ఆ తండా నుండి పూణే వెళ్లిన ఒక ఆడపిల్ల జీవితం గురించి కామాక్షి చెప్తా ఉంటే దేవుడమ్మ ఉండబట్టలేక “ఆడదాని శరీరంలో పుట్టి ఒక ఆడదాని శరీరం మీద బతికే మగ నా బట్టలను కిరసనాలు పోసి తగలబెట్టాలి” అని తిట్టింది.  ఒళ్ళు ఉడికిపోయి, రోగాలు జేరి శరీరం పుండు అయింది. వైద్యానికి డబ్బులు కూడా లేవు. ఆ తండా పిల్లకి కామాక్షి అన్నం పెడుతుంది. 
చిన్ననాటి స్నేహితురాలు అయినందుకు ఆ పిల్లని కామాక్షి చేరదీసి సాకుతుంటే కామాక్షికి దేవుడమ్మ దండం పెట్టింది.  దేవుడమ్మకి ఆ పిల్ల అన్న ఒక్క మాట మాత్రం ఇంకా చెవుల్లో తిరుగుతానే ఉండాది. “ఆడదానిగా పుట్టి బతుకంతా సచ్చిన నాకు సావంటే భయం ఎందుకు”?. 

ఆ మాట చెవుల్లో వినపడుతుండగానే దేవుడమ్మ చెవుల్లో మరో శబ్దం మారు మోగ సాగింది. అది చెంగయ్య, పరదేశి కొడుతున్న పలకల శబ్దం. ఆ డప్పుల శబ్దం ఆ రాత్రంతా మౌనంగా విన్నది దేవుడమ్మ. కానీ ఊరు వెళ్లి చూస్తే అది పలకల శబ్దం కాదు. చెంగయ్య, పరదేశి డబ్బు కొట్టడం లేదు. ఎవరో పట్నం నుండి వచ్చిన కళాకారులు వాయిస్తున్న మంగళ వాయిద్యాల మోత అది. మరిది చేతిలో నిన్నటి రాత్రి దూళానికి వేలాడిన సరస శవం మోసుకుంటూ ఊరేగింపు వెళుతుంది. సరసకు దండం పెట్టి ,నాలుగు పువ్వులు జల్లి, రెండు రూపాయలు విసిరేసింది దేవుడమ్మ. చెంగయ్య, పరదేశి చేతిలోని పలకలు తాను తీసుకొని వాయించడం మొదలుపెట్టిన దేవుడమ్మ అలా డప్పులు కొడుతూ “move on” అయింది.

దేవుడమ్మ ఊరూరా తిరుగుతా డప్పు కొడుతూ దురాచారాలను మూఢనమ్మకాలను ఖండిస్తుంది. సమాజంలో అణిచి వేయబడ్డ స్త్రీల గాధలను కథలుగా చెప్తుంది. స్త్రీకి స్వేచ్ఛ ,స్వాతంత్ర్యం ఉండాలని డప్పు కొట్టి మరి చెబుతుంది. రోజురోజుకు మృగ్యమవుతున్న మానవ సంబంధాలపై చర్చలు లేవదీసింది. ఎక్కడికి వెళ్ళినా దేవుడమ్మ తన మట్టిని మరవలేదు. 
 ఇప్పుడు దేవుడమ్మ చేస్తున్న పలకల శబ్దం ప్రపంచమంతా వింటుంది. 

ఇలా ప్రపంచాన్ని పట్టి, తట్టి లేపిన దేవుడమ్మను ఝాన్సీ పాపుదేశి చూసింది. దేవుడమ్మను అక్కున చేర్చుకుంది. దేవుడమ్మ కూడా అందుకు కృతజ్ఞతగా ఝాన్సీ కి అన్నీ ఇచ్చింది. 
ప్రశంసలు, అభిమానులు పురస్కారాలు, సన్మానాలు, అవార్డులు, రివార్డులు శాలువాలు, జ్ఞాపికలు, జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు, మిత్రులు. ఇలా ఎన్నెన్నో ఇంకా ఎన్నో ఇవ్వాలని మనసారా కోరుకుంటూ….                               

ఇట్లు  ఎలాంటి అనుమానం లేని అభిమానం ఉన్న పాఠకుడు.

You Might Also Like

Leave a Reply