పైనాపిల్ జామ్ – విజయ్ కోగంటి

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

**********

ఈ కథా సంపుటిలో ముఫ్ఫైమూడు చిన్నచిన్న కథలున్నాయి. మనిషి మనస్తత్వం లోని భిన్న కోణాలను వివిధ సందర్భాలలో చూపించిన కథలివి. 

దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సన్నివేశాలు, సందర్భాలు మనల్ని ఆలోచనలో పడేస్తుంటాయి. కొన్ని కొన్ని విషయాలు క్షణకాలం కాక మనల్ని మరికొంత సేపు అంటిపెట్టుకుని ఉంటాయి. వాటి గురించి స్నేహితులతోనో, ఇంట్లోవాళ్లతోనో చెపుతుంటాం. లేదా డైరీలోకి ఎక్కించేస్తాం. అలాటి కథలు కూడా ఉన్నాయి. కానీ అన్నీ కూడా ఆలోచించమని చెప్పేవే.

యాంత్రికమైపోతున్న జీవితాల్లో వివిధ రకాల అస్తిత్వ పోరాటాలను చేస్తున్న మనం ఆ అస్తిత్వాన్నే అప్రయత్నంగా కోల్పోతున్నాం. అది మన గమనింపులోకి కూడా రానంత నాజూకుగా మన జీవితాల్ని కమ్మేస్తున్నదేమిటి? 

మనం మనం కాకుండాపోతూ, మనదన్నదేమీ మిగుల్చుకోలేకపోతున్న పరిస్థితి ఎందుకొస్తోందో గమనిస్తే ఆశ్చర్యం వెయ్యక మానదు. అభివృద్ధి ఫలాలుగా అందుతున్న అనేక సౌకర్యాలు, పరికరాలు మనిషిని ఒట్ఠి డొల్ల మనిషిగా చేస్తున్నాయన్నది వాస్తవం. తెలవారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు మన చుట్టూ సోషల్ మీడియా నడుస్తుంటుంది. ప్రపంచంలో జరిగే మంచీ, చెడూ అన్నింటినీ మన కుతూహలానికి తగినట్టు అందిస్తూంటుంది. అంతవరకూ సరే.

తెలవారి లేస్తే వాట్సప్ లేదా యూ ట్యూబ్ ఛానళ్లలో అందే అనేకానేక అంశాలు మనకి ఏది మంచిదో, ఏది కాదో అనుక్షణం హెచ్చరిస్తూ స్వంత ఛాయిస్ ని లేకుండా చేసేస్తున్నాయి. మన వివేకం కూడా ఎటో వెళ్లిపోతుంది అలాటప్పుడు. మనం తినే తిండి విషయంలోనూ జోక్యం చేసుకుని మనల్ని ప్రభావితం చేస్తోందన్నది కూడా నిజమే. సోషల్ మీడియా లో వ్యూహాత్మకమైన ప్రచారాన్ని, ప్రకటనల్ని చేస్తూ, కొందరి హోటల్ వ్యాపారాన్ని నష్టాల ఊబిలోంచి బయటకు తీసి లాభాలదారి పట్టిస్తుంది మొదటి కథ ‘లడ్డూ కావాలా’. ఈ కథ చదివాక ఒక్కసారి ఉలిక్కిపడతాం. మన జీవనశైలిని మనం కాక మరెవరో నిర్ణయిస్తున్నారన్న స్పృహ కలుగుతుంది. 

భార్యాభర్తలు ఉద్యోగాల పేరుతో తలోచోట పనిచెయ్య వలసిన పరిస్థితులు చూస్తూనే ఉంటాం. కానీ ఆ ఇద్దరిలో ఒకరు నిజాయితీని కోల్పోయినప్పుడు ఎలాటి పరిస్థితులు ఎదురవుతాయన్నది ‘ట్రాన్స్ఫర్’ కథలో చూస్తాం. అతను ఢిల్లీలో. ఆమె, కూతురు మరొకచోట. తండ్రి ప్రేమకు కూతురు దూరమైంది. భర్త ప్రేమకు భార్య దూరమైంది. దూరదూరంగా పనిచేసి తీరవలసిన ఆర్థిక పరిస్థితులది తప్పు కాదు. కుటుంబం పట్ల, తనవాళ్ల పట్ల నిజాయితీని, ప్రేమను వదిలేసిన భర్త ఢిల్లీలో మరొక కుటుంబాన్ని ఏర్పరచుకోవటం సహించరానిది.

నాన్నొస్తే’ కథ లో మద్యపాన వ్యసనానికి కుటుంబాన్నీ, జీవితాన్ని పణంగా పెట్టిన తండ్రిని చూస్తాం. ఆ తండ్రి మారాలని, తనని ప్రేమగా చూసుకోవాలని ఆశ పడే చిన్నారి కల్పనని చూస్తాం. ఇలాటి కల్పనలు ఎందరో ఈ దేశంలో!

దొరతనం చేసే దౌష్ట్యం తరతరాలుగా సాగుతూనే ఉంది. దొరల్ని ఎదుర్కొనే ధైర్యం లేక అణిగిమణిగి బతికే అసహాయులూ అలాగే ఉన్నారు. తనను అవమానించబోయిన దొరను హత్య చేస్తుంది దుర్గ. దుర్గ భర్త శివుడు నవరాత్రులకి అలవాటుగా దుర్గమ్మ విగ్రహాన్ని తయారుచేస్తాడు. ఆ విగ్రహం చేతిలో ఉన్న కత్తి శివుడి భార్య తనను రక్షించుకునే సందర్భంలో దొరను హత్య చేసేందుకు ఉపయోగించినదే. ఆ విషయం గుర్తొచ్చి పదేపదే భర్తను అడుగుతుంది, “అమ్మోరికి కోపం వస్తదా మామా?” అంటూ. విషయం తెల్సుకున్న శివుడు దేవుళ్లు, దెయ్యాలు వేరెక్కడో కాదు, మనలోనే ఉన్నారని చెప్పి, భార్య చేసిన పని సరైనదే అని నమ్మకంగా చెప్తాడు. ఇది ‘తల్లీ బయలెల్లినాదే!’ కథ.

కొత్త తరం’ కథ చెడు వ్యసనాలకు అలవాటు పడిన కొడుకు తండ్రి పట్ల ప్రవర్తించిన తీరును చెపుతుంది. కొడుకును సరిదిద్దబోయిన తండ్రి ఆసుపత్రి పాలవుతాడు. తండ్రి ఈ రోజు కాకపోతే మరో వారానికి రికవర్ అవుతాడంటాడు మానవత్వం లేని ఆ కొడుకు నిర్లక్ష్యంగా. నిత్యం వార్తాపత్రికల్లో, టి. వి. ఛానెళ్లలో చూస్తున్న యదార్థ సంఘటనలే ఇవి. కొత్త తరం ఇలా ఉంటే రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో! 

బదిలీ’ కథలో మరోసారి బదిలీ మీద మరో కొత్త ఊరికి ప్రయాణమవుతాడు ఒక లెక్చరర్. ఎప్పటిలాగే తను వదిలి వెళ్లవలసిన కాలేజీలో మనసుకు దగ్గరైన విద్యార్థులను వదలలేక వదలలేక కన్నీటిపర్యంతం అవుతాడు. ఆ శిష్యులదీ అదే పరిస్థితి. ఇది అధ్యాపక వృత్తిలో ఉన్న అందరికీ అనుభవం లోకి వచ్చే తియ్యని బాధ. కొత్త ఊళ్లో కొత్త స్టూడెంట్స్ తో మొదట ఎన్ని తలనొప్పులు వచ్చినా ఆ పిల్లలే క్రమేపీ మాలిమి అయిపోవటం సాధారణం. ఒక్కోసారి ఎక్కువ సమస్యాత్మకంగా ఉన్న పిల్లలు మరింత దగ్గరవటం కొసమెరుపవుతుంది. ఇది టీచర్లందరికీ అనుభవైకవేద్యమే. 

ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే హరిత మాల్ లో కస్టమర్ల పట్ల ఓర్పుగా ఉంటూ ఐదేళ్ల ఉద్యోగ జీవితంలో మంచి స్థాయికి చేరింది. తనకి అదే మాల్ లో ఉద్యోగం చూపించిన హరితన్నా, ఆమె నవ్వన్నా అతనికి ఇష్టం. తన ఇష్టాన్ని చెప్పాలనుకుంటాడు. ఒకరోజు చెప్పేస్తాడు. ఆమె నవ్వింది మళ్లీ. ఇలాగే ఇష్టం అంటూ వెంటపడి, పెళ్లి చేసుకున్న భర్త అనుమానంతో వదిలి వెళ్లిపోయాడని, కష్టపడి కూతుర్ని పెంచుకుంటున్నానని చెపుతుంది. కనీసం మనిషిలా బతికేందుకు ప్రయత్నిస్తూ చిరునవ్వుకు దూరం కాకుండా గడిపేస్తున్నానని చెపుతుంది హరిత. ఇది ‘అర్థం కాని నవ్వు’ కథ.

ఎర్ర చారల కలం’ కథలో కాలేజీలో పనిచేసే మాస్టారికి కరుణ అనే విద్యార్థిని కలాన్ని బహుమతిగా ఇస్తుంది. ఇస్తూ, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనకి మాస్టారంటే ఇష్టమని సూటిగానే చెపుతుంది. కలాన్ని తీసుకుంటూ తనంటే ఆమెకున్న అభిమానానికి ఆ మాస్టారు అమాయకంగా థాంక్స్ చెప్పేస్తాడు. ఆనక ఆ కలాన్ని పోగొట్టుకుంటాడు. ఎప్పుడో రెండు దశాబ్దాల తరవాత అనుకోకుండా ఓ కొరియర్ ఆఫీసులో అలాటి కలం తో రాస్తున్న ఒకామెను చూస్తాడు. అవసరమై కలాన్ని అడిగి తీసుకుని, అలాటిదే పూర్వం తనకెవరో బహుమతిగా ఇచ్చారని చెపుతాడు. “మీరు మంచి టీచరే కానీ మీకు కొన్ని అర్థం కావులెండి” అనేసి ఆ కలాన్ని ఉంచుకోమని చెప్పి వెళ్లిపోతుందామె. అప్పటికి మాస్టారికి కాస్త సందేహం కలుగుతుంది ఆమె ఎవరన్నది.

కొండమీది బంగ్లా’ ఈకథ డిటెక్టివ్ కథలా ఉంది. దయ్యాలున్నాయా అనిపించేస్తుంది చదువుతుంటే. ఊరి చివర కొండమీది ఒంటరి బంగ్లా, రాత్రి సమయం, నల్ల పిల్లి, గజ్జెల చప్పుడు, రగ్గు కప్పుకున్న బంట్రోతు…సరదాగా చదవండి మరి!

మీటింగ్’ కథలో ఆ కాలేజీకి కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ ఉత్సాహంగా జాయినైన రోజే మీటింగ్ పెడతాడు. పిల్లలకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పి, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తన ఆశయాలను చెపుతుండగా కలెక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రాబోయే వారంలో పది రోజుల పాటు అధ్యాపకులు, విద్యార్థులు అందరూ వచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్ని నిర్వహించాలంటాడాయన. పూర్తి కావలసిన సిలబస్ గురించి, పరీక్షల గురించి చెప్పబోయిన ప్రిన్సిపాల్ ని మధ్యలోనే ఆపి, పైనుంచి వచ్చిన ప్రభుత్వ ఆర్డర్ ని అమలు చెయ్యమని కలెక్టర్ ఫోన్ పెట్టేస్తాడు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకుల బోధనావకాశాన్ని హరించే ప్రభుత్వ బాధ్యతల గురించి వ్యంగంగా చెప్పిన వాస్తవం! 

ఏదీ మావూరు’ కథలో చిన్ననాటి స్నేహితుణ్ణి, తన బాల్యాన్ని చూసుకుందుకు పల్లె బయలుదేరిన అతను దారిపొడవునా పాత జ్ఞాపకాల్ని తోడు తెచ్చుకుంటాడు. మంచి మార్కులొస్తే వీపు తట్టి పిప్పరమెంటిచ్చే చిల్లర కొట్టు బాలస్వామి, పండగలకి తండ్రి అప్పుచేసి కొత్త బట్టలు కొనే సాంబయ్య గుడ్డల అంగడి, దర్జీ లాలు, సినిమా వాల్పోస్టర్లు, తడికల హాల్లో మూడు నెలలకోసారి చూసే రాత్రి ఆట సినిమాలు, సినిమాలో కత్తి యుద్ధాలు, తుపాకీ మోతలు, డీరి డిరిడిరి పాటలు, ఊరి మధ్య అంకమ్మ చెట్టు…ఒకటేమిటి గడిచిన పల్లె జీవితాన్ని మొత్తం కళ్లముందుకు తెచ్చుకున్న అతను తీరా ఊళ్లోకెళ్లి బాల్య మిత్రుడీ లోకంలోనే లేడని తెలుసుకుని దిగులుపడతాడు. తన ఊరు చచ్చిపోయిందనుకుంటాడు. 

షేర్ ఆటో ల్లో లెక్కకు మించి జనాన్ని చేరవేస్తూ ఇంటి అవసరాల గురించిన ఆలోచనల్లో ఉన్న కుమార్ ఆఖరికి యాక్సిడెంట్ కి గురవటం బాధ కలిగిస్తుంది. బాధ్యతలు, ఎడతెగని ఖర్చులు జీవితాల్నే పణంగా పెట్టేలా చేస్తుండటం నిత్యం కనిపించే యదార్థం. ఇది ‘రిస్క్’ కథ.

దోషి’ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిమిత్తం తవ్వి వదిలేసిన గోతిలో పడి ప్రాణాలు కోల్పోయిన మునిస్వామి కథ. అతని ఫోన్ యాక్సిడెంట్ లో పాడైపోయి స్నేహితుడికి విషయం అందదు. వెతుక్కుంటూ వచ్చిన స్నేహితుడికి తెలిసిన వార్త ఇది. ఇలాటి సన్నివేశాల్ని తరచూ చూస్తూనే ఉన్నా, దోషులెవరో చెప్పలేకపోతున్నాం.

సమోసా’ కథలో బామ్మ రోజూ సమోసా తినాలన్న కోరికని వ్యక్తం చేస్తుంది. మనవడు వాయిదా వేస్తుంటాడు. ఒక రోజు మనవడు ఊరెళ్లి వచ్చేసరికి బామ్మ చనిపోయింది. బిగుసుకున్న ఆమె చేతిలో సమోసా ఈగలు ముసురుతూ కనిపిస్తుంది. సమోసా ఎవరు తెచ్చిచ్చారని అడిగినప్పుడు అతని కూతురు తనే తెచ్చానంటుంది. బామ్మని మరికొంతకాలం బతికించుకోవాలని ఆమె ఆఖరి కోరికను వాయిదా వేస్తున్న సంగతి అప్పుడు బయటకి చెపుతాడు మనవడు కన్నీరు పెట్టుకుంటూ.  

పుస్తకం శీర్షిక ‘పైనాపిల్ జామ్’ కథలో డెబ్భై ఏళ్లకు పైబడిన ఒక జంట మధ్య ఉన్న ప్రేమ, అవగాహన కనిపిస్తాయి. ఇలాటి సున్నితత్త్వం మిగుల్చుకోవటంలోనే కదా భార్యాభర్తల జీవితాల్లో అందం, ఆదర్శం. 

దాదాపు వంద పేజీలున్న ఈ పుస్తకంలోని రచనలన్నీ మనందరి జీవితాల్లో నిత్యం తటస్థపడే అతి సహజమైన సందర్భాలు. 

అద్దేపల్లి ప్రభు పుస్తకం ముందుమాటలో “మన సంస్కారాన్ని చెడగొట్టకుండా హాయిగా చదువుకోవడానికి బాగుండే కథలివి.” అన్నారు. కా. రా. కథకి పరిష్కారం వేరు, ముగింపు వేరు అన్నారని జ్ఞాపకం చేస్తూ, కథకి ముగింపు ఉంటుంది కానీ పరిష్కారం ఉండదన్నారు.

డా. విజయ్ కోగంటి ఇప్పటివరకు పాఠకులకి కవిగా మాత్రమే పరిచయం. ఈ కథా సంపుటి వారిని కథా రచయితగా పరిచయం చేస్తుంది.

పుస్తక ప్రచురణః ఛాయ, మే 2023

ముఖచిత్రంః గిరిధర్ అరసవల్లి

వెలః రూ.150/

You Might Also Like

Leave a Reply