విరాట్ – కొన్ని ఆలోచనలు

వ్యాసకర్త: దీప్తి పెండ్యాల

*******

రాతలకి, మాటలకి ఉండే శక్తిని ఒక్కోసారి ఏ మాత్రం అంచనా వేయలేము. అన్ని పార్శ్వాలు చూసే రాస్తున్నామని, మాట్లాడుతున్నామని అనుకుంటాము. కానీ, ఏ అంశము ఎవరిని ఊహించని కోణంలో కదిలిస్తుందో, ఎవరికి మన ఊహకైనా అందని ఆయుధమవుతుందో చెప్పలేము. రోజూవారీ జీవితంలో అప్రమేయంగానూ ఎందరిపైనో మాటలతోనో, రాతలతోనో, చేతలతోనో ప్రభావం చూపుతామని మనం ఊహించనైనాలేము. ఏ మాత్రం సంబంధం లేని వారి వల్లా మనమూ ఒక్కోసారి ప్రభావితులమవుతాము, బాధించబడుతాము, సంతోషానికి లోనవుతాము. బటర్ ఫ్లై ఎఫెక్ట్ లా మనం కొన్ని మార్పులకి కారణభూతులమవుతాము. మనతో చేయబడే ఏ కర్మ అయినా ఏదో ఒక పరిణామానికి దారితీస్తున్నపుడు మంచయితే మంచిదే. చేటు చేయగలదనీ తెలిస్తే? అసలు ఏ ప్రభావమూ లేని కర్మంటూ ఉంటుందా? మంచి మాత్రమే జరగాలన్న తపన ఉన్నపుడు, వీలయినంత సంతోషం మాత్రమే పంచాలన్న తాపత్రయం ఉన్నపుడు మనలాంటి మామూలు మనుషులు ఏ చింతతో కూడిన చింతనలూ లేకుండా జీవించటం సాధ్యమేనా? 

ఆ మధ్య ఒక నవల చదివాను. చదివి నెలలు గడిచాయి. ఇంకా వెంటాడుతూనే ఉంది. వదలట్లేదు. నేను చదివినది దశాబ్దాల నాటి కథ. ఒక మేధావి కథ. అదృష్టం కొద్దీ మనమంత మేధావులం కాదు. మామూలు మనుషుల స్థాయిలోనే మనందరిలోనూ స్వతహాగా ఉండే మంచితనాల నుంచీ పుట్టుకొచ్చే చిత్రమైన మీమాంసలు, నొప్పిచూడలేనితనాలతో వచ్చే ఆరాటాలు, గుంజాటనల మధ్య చిక్కుకుపోతూనే, తాత్వికతలాంటిదేదో కూడా ఎంతో కొంత మనసునంటుతున్న సమయంలో ఈ నవల చదివాను. ఒక ఉత్తముని కథ. మహాత్ముని కథ. పాపభీతి విపరీతంగా ఉండి, ఎపుడూ సత్యశోధనలో ఆసక్తుడై, సత్యాన్ని అన్వేషిస్తూ సత్యదర్శనానికై తపించేవాడి జీవితాన్ని అక్షరబద్ధం చేసిన నవల. భలేగా పట్టేసింది మనసుని.

భారతదేశం పట్ల, మూలాల పట్ల విపరీతమైన ఆసక్తి, అనురక్తి ఉన్న పాశ్చాత్య రచయిత “విరాట్” అనే ఒక హిందూమహాపురుషుని జీవితాన్ని జర్మన్ భాషలో రచిస్తే, అది 40 భాషలలో అనువదించబడింది. ఏముందీ ఇందులో? సరే. ‘ఏమి లేదూ?’ అని అడగండి. అంతుంది. ఆ నవల మూలం స్టెఫన్ చ్వెయిగ్ (Stefan Zweig) రచించిన “Die Augen des Ewigen Bruders (The eyes of my brother, forever.)” అనే జర్మన్ నవల. ఆంగ్లంలో ఆండ్రియస్ రుథెన్ బర్గ్ అనువాదంలో “The eyes of the Eternal Brother” గానూ, తెలుగులో పొనుగోటి కృష్ణారెడ్డి అనువాదంలో “విరాట్” గానూ చదవవచ్చు. 

ఇతని కథ స్థూలంగా చెప్పుకుందాం. బుద్ధుడి కన్నా ముందెపుడో పుట్టిన ఒక మహానుభావుడు “విరాట్”. విరాట్ అతి బుద్ధిశాలి. బలశాలి. గొప్ప వీరుడు. ఒక పెనుప్రమాదం నుంచి రాజ్యాన్ని రక్షించవలిసిందిగా మహారాజు చేసిన అభ్యర్థనతో అతనికి తెలియకుండానే విద్రోహుల గుడారంలోనున్న తన సోదరుడిని హతమారుస్తాడు. తన బాధ్యత నిర్వర్తించాడంతే. కానీ, ఆ బాధ్యత సోదరుడి మరణానికి దారితీసింది. ఆ నిర్జీవమైన సోదరుని కళ్ళు నిలేస్తున్నట్టుగా కనబడి, ఆ దృశ్యం కలిచివేస్తుంటే, ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోతాడు. విజయోత్సవాలు మిన్నంటుంతున్న సంబరాలలో మహారాజు సర్వ సైన్యాధ్యక్షుడి హోదాని అందించబోతాడు. సున్నితంగా నిరాకరిస్తూ, తన న్యాయ విచారాన్ని వివరించి, సైన్యంలో ఉంటే ప్రాణహరణం తప్పదు కనుక తాను ఆ పదవి చేపట్టలేనంటాడు. న్యాయాన్యాయ విచక్షణ తెలిసినవాడు, ధర్మశాస్రాలు, న్యాయశాస్త్రాలు ఔపోసన పట్టి అత్యుత్తమ మేధావిగా పేరుగాంచినవాడు, ఇలాంటి సత్యసంధుడు న్యాయవిచారణ చేస్తే రాజ్యంలో ధర్మపాలన సాధ్యమవుతుందని భావించి మహారాజు, తన ఆస్థానంలో ప్రధాన న్యాయాధికారి పదవి నిర్వహించాల్సిందని కోరతాడు. ఆరేళ్ళలో రాజు ఊహించిన విధంగానే అత్యుత్తమ న్యాయాధికారిగా పేరొందుతాడు.

రాజ్యమంతా ఆ విజ్ఞుడిని గౌరవిస్తుంది. న్యాయం అమలుచేయటంలోనూ ఏర్పడ్డ సంశయాలతో అసలు న్యాయమంటే ఏంటని వితర్కించుకుంటాడు. మరింత జ్ఞానం ఆర్జిస్తాడు. అయినప్పటికీ, తాను సబబని భావించి వేస్తున్న శిక్షని ప్రశ్నించిన ఒక దోషి కళ్ళలో తన సోదరుని నిర్జీవమైన కళ్ళు కనబడతాయి. అదే శిక్షని అజ్ఞాతంగా కొంతకాలం దోషికి బదులుగా అనుభవించదలిచి ఎవరికీ చెప్పకుండా, దోషి స్థానంలో తాను ఆ కారాగార గృహంలోని వెళతాడు. మొదట్లో ఆ కారాగార సొరంగంలో ఏకాంతంలో ఆనందాన్ని కనుగొంటాడు, జ్ఞానవిచారణకి సమయం పుష్కళంగా దొరికిందని సంతసిస్తాడు. కాలం గడిచినకొద్దీ ఆ ఏకాంతం ఒంటరితనంగా మారుతుంది. ఆ ఒంటరితనాన్ని, కన్నుపొడుచుకున్నా కానరాని చీకటిని భరించలేక పిచ్చివాడవుతున్న తరుణంలో దోషులనయినా ఇంతటి శిక్షకి గురిచేయటం ఎంత పాపభూయిష్టమో గుర్తిస్తాడు.ఈ శిక్షించగల అధికారం తనకి భగవంతుడిచ్చినది కాదని, దీనివల్ల పాపపంకిలమవుతున్నానని భావించి, మహారాజుకి అదే విషయం విన్నవించి, తానిక న్యాయాధికారిగా ఉండలేనని చెప్పి ఇంటికే పరిమితమవుతాడు. అతని మీమాంస తెలిసిన మహారాజు కూడా తన రాజ్యంలో ఇంతటి ధర్మవంతుడు ఉన్నాడన్న భావనే సంతోషాన్నిస్తుందని చెప్పి, గౌరవంగా అపుడపుడూ వెళ్ళి దర్శిస్తుంటాడు.

మరిన్ని జ్ఞానసంబంధమైన గ్రంధాలు, ధర్మగ్రంధాలు చదువుతూ కోరికలని జయించి, సౌమ్యుడిగా మాట్లాడుతూ ప్రశాంతంగా గడుపుతాడు. ఇన్ని అవకాశాలున్న ఈ లోకంలో ఇన్ని పోటీలు ఎందుకనీ, అసూయాద్వేషాలు ఎందుకు పుడుతున్నాయోనని ఆశ్చర్యపోతాడు. చుట్టుపక్కలవారందరికీ చక్కని సలహాదారుడిగా మంచి సలహాలు అందిస్తూ కొన్నేళ్ళు గడుపుతాడు.

ఇంట్లోనూ తన పుత్రులు దాసీజనం పట్ల చూపుతున్న అధికారాన్ని, వాళ్ళని బాధించటాన్ని గమనించి ఖిన్నుడై, దాస్యులందరినీ పంపించివేసి, పిల్లలంతా ఎవరి పని వారు చేసుకోవాలని, ఎవరినీ శాసించకూడదని నిర్ణయిస్తాడు. తండ్రి తీరుతో విసుగు చెందిన పుత్రులు, లోకరీతికి భిన్నంగా జీవించమని పిల్లలని శాసించే అధికారం మాత్రం ఆయనకెక్కడిదని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలో మరోసారి తనని ఒకప్పుడు వెంటాడిన సోదరుని కళ్ళు కనబడుతాయి అతనికి. పిల్లలని ఎలా బాధించగలుగుతున్నాను, ఎలా శాసిస్తున్నాను అని పరిశీలించుకుంటాడు. తనవద్దనున్న సంపదే తనకి పిల్లలని శాసించే అధికారం ఇస్తున్నదని గుర్తించి, ఆ సంపదని భార్యాపిల్లలకి వదిలి అరణ్యాలలోకి వెళతాడు. అప్పటికి తాను స్వతంత్రుడయినట్టుగానూ, పాపకర్మలకి పూర్తిగా దూరం జరిగినట్టుగానూ భావిస్తాడు. పశుపక్ష్యాదులు సైతం అతనికి సత్యసంధత వల్ల ప్రాప్తించిన తేజస్సుకి ఆకర్షింపబడి ఆయన చెప్పినట్టే నడుచుకునేవి. ఆ అరణ్యంలో ఈయన చుట్టూ సఖ్యంగా, సౌమ్యంగా ఉన్న మృగాలని చూసిన జనులు ఈ అద్భుతాన్ని గురించి మరికొంతమందికి చెప్పటం, దేవాలయాల్లో పూజారుల నుంచి మహారాజు వరకూ, అందరూ మహాజ్ఞాని అయిన ఇతని జీవితాన్ని ఆదర్శవంతంగా చూపటమూ జరుగుతూండేది. ప్రజలు ఇతనిని Star of Solitude అని పిలుచుకునేవారు. పాపాలకి పశ్చాత్తాపపడేవారు, జీవితంలో అలిసినవారూ ఇతని జీవనవిధానానికి ఆకర్షితులవటం, ప్రశాంతవంతమైన సాధుజీవితాన్ని గడిపేందుకని అడవికి వచ్చి ఈయన వలెనే అడవిలో కుటీరాలు వేసుకుని పండ్లు కాయలు తింటూ గడపటం ఆరంభమైంది.

ఇలా కొన్నేళ్ళు గడిచాక, ఒక సాధువు అంతిమ క్రియల నిమిత్తం దగ్గర్లోని గ్రామానికి వెళ్ళవలిసి వచ్చినపుడు ఒక స్త్రీ కళ్ళలో తనపట్ల ద్వేషాన్ని గమనిస్తాడు. అరణ్యాలలో ఉండే తానేమి అపకారం చేసాడని తనపైన అంతటి క్రోధమనేది అతని ఆలోచనకి అందదు. అతను తనని వెంటాడిన నిర్జీవమైన సోదరుని కళ్ళని దాదాపుగా మరిచిన తరుణంలో ఎదురయ్యాయి అతనికి ఈ కళ్ళు. నిలేస్తూ. నిలదీస్తూ. ఆ స్త్రీని గమనించి, ద్వేషం తనపైనేనని నిర్ధారించుకుని కారణం చెప్పమని ప్రాధేయపడుతాడు. అప్పుడు చెబుతుంది ఆ స్త్రీ. అతని నిష్కర్మ జీవనం ఎన్నో కుటుంబాలలో ఎలా చిచ్చు రేపిందో. చేతికి అందొచ్చిన పిల్లలు అరణ్యాల బాట పడితే తల్లిదండ్రులకెంత శోకం కదిలిందో, గొప్పనేతగాడయి, గృహస్థుధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూండేవాడయిన తన భర్త విరాట్ జీవనమార్గానికి ఆకర్షితుడై అరణ్యాలకేగటం వల్ల పచ్చని కుటుంబం ఎలా ఛిద్రమయిందో, అలా ఎన్నో కుటుంబాల పతనానికి విరాట్ ఎలా కారణభూతుడయ్యాడో అతి క్రోధమైన మాటలతో చెబుతుంది. అతను చూడలేకపోయిన ఈ సత్యం విని అతను కంపించిపోతాడు. ఈ సంఘటన అతనిని కదిలించివేస్తుంది. బాధిస్తుంది. తన నిష్కర్మ కూడా ఏదోరకంగా ఎవరినో బాధిస్తూనే ఉందని గ్రహిస్తాడు. ఆ తప్పు దిద్దుకునేందుకు మళ్ళీ మహారాజు దగ్గరకు వెళతాడు.

నిష్కర్మ సరికాదని, భగవంతునికి దూరంగా జరిగానని, ప్రాకృతిక నియమాలకి బద్ధుడినై ఉండటమే సరయినదనీ, అన్ని కర్మలలోకెల్లా సేవే భగవంతుడి దృష్టిలో అత్యున్నతమైనదని, సేవచేసేవాడే స్వతంత్రుడనీ, సేవచేసే అవకాశాన్ని ఇవ్వమని అడుగుతాడు.

ఆ సంభాషణలో ఓ చోట మహారాజుకి అతని అహం దెబ్బతీసే తర్కం వినబడుతుంది. మహారాజు రెట్టించి అడుగుతాడు. “అంటే నీ దృష్టిలో మహరాజు చేసే సేవ, సేవకుడు చేసే సేవ భగవంతుని దృష్టిలో సమానమేనా అని?” విరాట్ అవునననటంతో- అప్పటివరకూ జ్ఞానిగా భావించిన ఆ వృద్ధుడి పట్ల చీకాకు కలుగుతుంది. అన్ని సేవలూ ఒకటే అయిన పక్షంలో కుక్కల సంరక్షణ పనులు సమ్మతమేనా అని అడుగుతాడు మహారాజు. సంతోషంగా స్వీకరిస్తాడు విరాట్. చీకాకుపడ్డ మహారాజు అదే పనిని అప్పగిస్తాడు. ఆ పనిని దైవకార్యం చేస్తున్నంత శ్రద్ధగా చేస్తాడు విరాట్. తోటి నౌకర్లతో పాటే జీవిస్తూంటాడు. తండ్రి చేస్తున్న పని తెలిసిన అతని పిల్లలు నిశ్చేష్టులవుతారు. అతని పిల్లలంతా నామోషీతో అటువైపు రాకుండా, అతనికి ఎదురుపడకుండా వేరే వీధుల వెంట వెళతారు. ప్రజలు అంతటి బలశాలి, జ్ఞాని, మేధావి తన స్థాయికి చిన్నదయిన ఇలాంటి పనిచేయటమేమని ఆశ్చర్యపోతారు. వీధులలో అతను కుక్కలకి కాపలాగా, వాటిని తాళ్ళతో లాగుతూ వెళుతూంటే తొలుత చూడలేకపోతారు. ఆ పై నెమ్మదిగా అలవాటుపడతారు. ఆ పిమ్మట అతని విషయం మరిచిపోతారు. ఈ మహారాజు గతించి, కొత్త రాజు రావటం, అతనికి ఇతనెంతటి జ్ఞాని అన్న విషయం తెలీక ఓనాడు చిన్న పొరపాటుకి దండించటం, ఆ తరువాత ఆ పనిలోనే అతను అనామకంగా మరణించటం జరుగుతుంది. అలా ముగుస్తుంది అతని అన్వేషణ.

ఇతని అంత్యదశ మాత్రం మామూలు మనుషులకి ఊహకందనిది. అహాన్ని వీడాడు. సేవే స్వతంత్రత అని గ్రహించాడు. భగవంతుని దృష్టిలో ఉత్కృష్టమైనది అహం లేని సేవగా గ్రహించి కుక్కల సేవకుడుగా తనువు చాలించాడు. ఏ గ్రంధాలలోనూ స్మరించబడలేదు. చరిత్రలో గుర్తించబడలేదు. 

అతనికి మటుకూ ఆ జీవితం తృప్తినిచ్చింది. ఆ కుక్కల అభిమానాన్ని, ప్రేమని మనుషుల ప్రేమతో సమానంగా అనుభూతిస్తూ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎవరికీ హాని చేసే సందర్భాలు ఎదురవక, అధికారంతో ఎవరినైనా బాధించే ప్రమాదాన్ని పూర్తిగా నివారించుకుని, అతన్ని కలతపెట్టి కలవరపరిచిన సోదరుని కళ్ళనుంచి తప్పించుకున్నాడు. సేవలో ఆనందంగా జీవించాడు. సాధారణ జనుల దృష్టిలో ఎలా మిగిలినా, అతని మటుకూ అతను ఉత్కృష్ట మానవుడయ్యాడు. ఏ అధికార లౌల్యాలకి లోను కాని స్వతంత్రజీవితంలో పాపరహితంగా జీవించిన ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించాడు. 

మనలాంటి మామూలు మనుషుల జీవితాలలో తానొచ్చినా, తానొవ్వకున్నా అప్రమేయంగానూ నొప్పివ్వక తిరగటం మటుకూ ఎంత కష్టం?! 

P.S. : నాకు జర్మన్ భాష రాదు. నేను చదివినది అనువాదాలు మాత్రమే. మూలంపై ఉన్న గౌరవం కొద్దీ ఈ మూలకథ ముఖచిత్రాన్ని ఎన్నుకున్నాను.

You Might Also Like

Leave a Reply