జక్కీకు

నెమలి ఈకల పోలు నవల సక్కదనమే బామ ..  నవల సక్కదనమే .. 

వ్యాసకర్తలు: ఎ.కె.ప్రభాకర్, పింగళి చైతన్య, తాషి

(దాసరి శిరీష జ్ఞాపిక తొలి ప్రచురణ)

*********

థా రచయితగా ఎండపల్లి భారతి తెలుగు సాహిత్యానికి కొత్త ఇన్స్పిరేషన్. “ఎదారి బతుకులు”, “బతుకీత”, “జాలారి పూలు” కథా సంపుటాల  ద్వారా వైవిధ్య భరితమైన మాదిగ స్త్రీ జీవన తాత్వికతని ముచ్చటించిన  ‘పల్లె కతల’  భారతి యిప్పుడు ‘జక్కీకు’ ద్వారా  నవలా రచయితగా మన ముందుకు వచ్చారు. జక్కీకు  మనకు పరిచితి వున్న మూస నవలా సంప్రదాయాలన్నిటినీ బద్దలుకొట్టే రచన. సాహిత్య పరిశోధకుల్నీ విమర్శకుల్నీ  కొత్త  ఆలోచనలకు పురిగొల్పే ప్రత్యేకతలెన్నో యిందులో వున్నాయి. దాసరి శిరీష జ్ఞాపిక తొలి ప్రచురణగా జక్కీకుని యెంచుకోడానికి ఆ ప్రత్యేకతలే  కారణమయ్యాయి. 

పూర్తిగా గ్రామీణ వ్యావసాయిక సంస్కృతి నేపథ్యంలో రూపొందిన నవల యిది.  ఇందులో వర్ణించిన జీవితం చిత్తూరు జిల్లాలోని వొకానొక  మాదిగ పల్లె  స్థానీయ సామాజిక సాంస్కృతిక జీవితం.  సాధారణ నవల్లోలాగా వొక ప్రధాన పాత్రకి చెందిన  జీవితం కాదు. ఒక కథా నాయకుడు / నాయకి చుట్టూ తిరిగే రచన కానే కాదు. ఇందులో అనేకుల జీవిత కథలున్నాయి. ఒక కథా నాయకుడు కథలకు కాలం చెల్లింది. సమాజం బహుళమైంది. ఆ మేరకు సాహిత్యం కూడా యివ్వాళ బహుళమైంది. అందుకు వుదాహరణ యీ  నవల. సాహిత్యం స్థానీయమైన కొద్దీ దాని ప్రమాణాలు పునర్నిర్వచనాలు కోరుకుంటాయి. భాష శైలి శిల్పం వంటి విషయాలు అర్థాలు మార్చుకుంటాయి. నిశ్చిత నిశ్చయాలు తలకిందులౌతాయి. కావలసిన అవసరం వుంది. 

సాహిత్యం రెండు రకాలు. బడి పలుకుల సాహిత్యం, పలుకుబడుల సాహిత్యం. మనం సాహిత్య పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో నేర్చుకున్న ప్రమాణాల్లోకి రెండో రకం సాహిత్యం యిమడదు. జక్కీకు నవల రెండో కోవకి చెందింది. అందులో భాష జానపద భాష. శైలి  జానపద మౌఖిక కథన శైలి. శిల్పం సహజసిద్ధ శిల్పం. అనుభూతులు ప్రాకృతికమైనవి. ఆలోచనలు  జానపదుల  ఆటా పాటా  మాటలతో  ముప్పేటగా కలిసిపోయి మట్టి పరిమళాన్ని అద్దుకొన్నవి.  ఆధునిక నవలలోకి దేశీయమైన కథా కథన శైలినీ యితివృత్తాన్నీ భాషనీ భావనల్నీ దృక్కోణాన్నీ తీసుకురావడంవల్ల  దీన్ని నిజానికి దేశీ నవల అనాలి. దేశీ సాంస్కృతిక నవల అంటే మరింత అర్థవంతంగా వుంటుందేమో! నిర్దిష్టంగా మాదిగల సామూహిక సాంస్కృతిక జీవితానికి అద్దంపట్టే రచన యిది.

 దేశీయ మౌఖిక కథన రీతుల్ని ఆధునిక నవలకి అన్వయించిన ప్రయోగాలు చాలా తక్కువ. నలభై నలభై అయిదేళ్ల పూర్వం కెన్యా రచయిత గుగీ వా థియాంగో కంటే ముందే తెలంగాణలో  కథల్లో నవలల్లో అల్లం రాజయ్య అటువంటి ప్రయోగం చేశాడు. రాజయ్య పరచిన విప్లవాత్మక మార్గాన్ని  ఆ తర్వాత యే పది పదిహేనేళ్లకో  సీమ నేల నుంచి బండి నారాయణ స్వామి అందుకున్నాడు. నవలా రచనలో రాజయ్య ప్రయోగం ప్రయోజనోద్దిష్టమైంది. ఉత్తర తెలంగాణా రైతాంగ పోరాట నేపథ్యంలో వుద్యమ ఆచరణకు రాజకీయ ఆర్థిక విశ్లేషణని జోడించిన రాజయ్య రచనలు సాహిత్య వ్యవస్థలో అప్పటివరకూ పాతుకు పోయిన వస్తు రూప భాషా శైలీ సంప్రదాయాల మూలాల్ని కదిలించాయి (అంతకు ముందే 40ల్లో కోస్తా నుంచి మాగోఖలే, అరవై డెబ్బైల్లో తెలంగాణ నుంచే  యశోదారెడ్డి, 80ల్లో చిత్తూరు నుంచి నామిని  వంటి వారి  రచనలు వున్నప్పటికీ అవి భాష వరకే పరిమితమైనవి).  అనంతపురం స్వామి నవలలు దేశీ శైలికీ కుల అస్తిత్వాల చుట్టూ అల్లుకొని వున్న సామాజికతకీ  పెద్దపీట వేశాయి.  మళ్ళీ యిప్పుడు మరో పాతికేళ్ల తర్వాత కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ  చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం దిగువ బురుజు మాదిగపల్లె  సాంస్కృతిక జీవితాన్ని చిత్రించిన ఎండపల్లి భారతి ‘జక్కీకు’ సాహిత్య ప్రమాణాలనీ  వాటి చుట్టూ గూడుకట్టుకున్న ప్రమేయాలనీ మరోసారి చర్చకు తెస్తోంది (ఇటీవలే పొన్నాల బాలయ్య ‘లంద’ నవల కూడా మాదిగ జీవన నేపథ్యంలోనే యిదే శిల్పరీతిలో వచ్చింది గానీ యింకా అచ్చు కాలేదు).   

వ్యాస ప్రోక్త భారతంలో వ్యాసుడిలా భారతి కూడా యీ నవలలో వొక పాత్ర. సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. వ్యాఖ్యాత. కథా ప్రయోక్త. రచయిత స్వయంగా  నవల్లో పాత్ర అయినప్పటికీ  నవలంతా ఆమె తన సొంత కంఠస్వరం నుంచే చెప్పినప్పటికీ కథలో ‘నేను’ కి యే మాత్రం  ప్రాథమ్యం గానీ  ప్రాధాన్యం గానీ  లేదు.  ఆమె తాను నడిచిన చోటుకల్లా తనతో పాటు మనని చేయి పట్టుకుని ఆ యా కథా స్థలాల్లోకి తోడ్కొని పోతుంది. ఒక ప్రత్యక్ష సాక్షిగా చుట్టూ వున్న వ్యక్తుల  స్వరూప స్వభావాల దగ్గర్నుంచీ వారి జీవితానికి సంబంధించిన సమస్త పార్శ్వాల్నీ యేకరువు పెట్టింది. వావి వరుసలతో పిలుచుకునే పల్లెవాసుల  మధ్య నెలకొని వున్న మానవీయ  సంబంధాల్నీ వుద్వేగాల్నీ యెటువంటి వడపోతకీ తావివ్వకుండా వ్యాఖ్యానించింది. భారతంలో లాగానే ప్రధాన కథలో సందర్భానుసారంగా వుపాఖ్యానాలు భారతి కథనంలో కూడా చోటు చేసుకుంటాయి. కానీ అవి పనిగట్టుకుని చొప్పించినట్టు వుండవు. కథలోని పాత్రలకు కథ బయటి నుంచి లోపలికి ప్రవేశించే పాఠకులకీ  జీవితాన్ని అర్థం చేసుకుని దిద్దుకొని మెరుగుపరచుకునే  యేదో వొక నీతిని బోధిస్తాయి. 

భారతి నవల్లో అనుసరించిన యీ కథన పద్ధతి యితిహాసంలో లాగా  కేవలం గతానికి చెందినది కాదు. వర్తమానంతో అనుసంధానించి వుంటుంది.  దానికి అనుగుణంగా యెన్నో జీవితాలు, శకలాలుగా వినిపించే  ఘటనలు వున్నాయి. అవి నేర్పే పాఠాలు వున్నాయి.  వాటితో ముడివడివున్న  గ్రామీణ సమాజం వుంది.  ఉత్పత్తి సంబంధాలు, వాటిని శాసించే శక్తులు, కులాలు, కుల ఆధిపత్యాలు, వివక్షలు, వాటిపై ధిక్కారాలు వున్నాయి. మనుషుల మధ్య  ప్రేమలున్నాయి. కుటుంబ సంబంధాలున్నాయి. సామాజిక కట్టుబాట్లు వున్నాయి. వాటిని ఛేదించేవాళ్ళూ ఛేదించలేక రాజీపడే వాళ్ళూ వున్నారు.  కుల – వర్గ –  జెండర్ సంబంధాలకు చెందిన ప్రతి సామాజిక సాంస్కృతిక అంశాన్నీ రచయిత యీ  చిన్ని నవల్లోకి అలవోకగా అప్రయత్నంగా తీసుకువచ్చింది. ఒక విధంగా నవలను  ఆమె పల్లె సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా, సామాజిక పరిణామాలకు ప్రతిబింబంగా, ఆ రెండింటి మేళవింపుగా రూపొందించింది. అందుకు  విష్ణుశర్మ పంచతంత్రంలో లాగా –  కథ మొత్తం మీద వొక నీతిని చెప్తూనే అవాంతర కథల ద్వారా వుపకథల ద్వారా బతుకు నడతకి  ప్రాసంగింకత  చేకూర్చే –  ప్రాచీన కథన పద్ధతిని పాటించింది. పల్లె  పాటల్ని జోడించింది.  ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే హరికథ బుర్రకథ ఒగ్గుకథ వంటి  ప్రదర్శనల్లో పిట్టకథలు చొప్పించే జానపద కళా సంప్రదాయం యిది. సాహిత్యంలో  సందేశం వుండాలన్న ప్రయోజనవాదం కొందరు శుద్ధ కళావాదులు  మొత్తుకున్నట్టు కమ్యూనిస్టులో అభ్యుదయవాదులో తెచ్చిపెట్టిన ‘అకళా సిద్ధాంతం’ కాదు. భారతీయ సాహిత్య పరంపరలోనే  యీ  ప్రత్యేకత వుంది.  జగద్ధితం/విశ్వశ్రేయస్సు కోరిన శిష్ట సాహిత్యం  దగ్గర్నుంచి శ్రమజీవుల పనిపాటలతో, విరామ సమయాలతో సమ్మిళితమైన జానపద సాహిత్య కళారూపాల వరకూ ఫలశ్రుతి రూపంలో దీన్ని గమనించగలం. 

***

జక్కీకు యే ప్రయోజనాన్ని వుద్దేశించి రాస్తుందీ రచయిత నవల్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించింది. మెట్ట భూముల్లో ముంగార్ల వాన (తొలకరి) పడగానే వ్యవసాయపు పనులు మొదలు పెట్టే రోజుల్లో మొలకల పున్నమి పండగ యెంతో వేడుగ్గా జరుపుకుంటారు. జొన్నలు, రాగులు, సద్దలు, పెసులు, అలసందలు, అనుములు, ఉలవలు, అరికెలు  … వంటి గింజల్ని మూకుళ్లలో మొలకెత్తించి బోయకొండ గంగమ్మ మాతమ్మ లాంటి యిష్ట దైవాలకు సమర్పించే  ఆ పండగని వూళ్ళల్లో అన్ని కులాలు వాళ్ళూ చేసుకుంటారు. అయితే ఆ సందర్భంగా జక్కీకు ఆటా పాటతో సందడిగా సంబరం చేసుకోవడం మాత్రం మాల మాదిగ కులాలకే  ప్రత్యేకం. కానీ యిప్పుడు మాల మాదిగలు కూడా సవాలక్ష కారణాలవల్ల ఆటా పాటకు దూరమైపోతున్నారనీ అందరూ బాధలన్నీ మరిచి మనసారా నవ్వుకొని యెన్ని సంవత్సరాలయిందోననీ భారతి బెంగ. 

ఒకబుడు జరుగుతున్నట్టు  ఆట పాటతో పద్దతిగా పండగ జరిగి దెగ్గిరి దెగ్గిర పది సంవత్సరాలైంది. ఏమని మా ఊర్లోకి

ఆ సెల్లులు టీవీలు వచ్చినయో అబుడు నుండి ఆట పాట అనేవే లేకుండా అయిపోయ. నలుగురు ఒగ తావకు జేరి సుద్దులాడుకునేదే కరువైపాయ. ఆ సీరియల్ లో నటించే  వాల్ల కుట్రలన్నీ  మా జీవితాల్లోకి వచ్చేసినాయి.’ 

దీనికి విరుగుడు మళ్ళీ అందర్నీ పోగేసి పండగకి జక్కీకు ఆడి  పాడాలి(ఆట పాట కత  పుట్టిందే  మన దగ్గర. అవే మన ఆస్తులు. అవి బాగా పట్టుకుంటేనే రేపు మనకి ఇలువుండేది). అదే నవల వస్తువు. అందుకు లచ్చుమమ్మ మునెమ్మ రాధమ్మ సావిత్రి అంజమ్మ కిట్టమ్మ నాగన్న రామన్న చంద్రన్న పుల్లయ్య … ఇలా వూళ్ళో పాడేవాళ్ళనీ ఆడేవాళ్ళనీ అందర్నీ కూడగట్టే క్రమంలో మాదిగపల్లె ప్రజల సామాజిక సాంస్కృతిక  జీవితమంతా  నవలలో భాగమైంది. అదే నవలగా మారిపోయింది అన్నా తప్పుగాదు.   

  • తొలి నలుగు నుంచి శోభనం నలుగు, చావు స్నానాల వరకూ మనిషి జీవితంతో అల్లుకొని  వున్న వివిధ సాంస్కృతికాంశాలు – వాటితో  ముడివడి వున్న పదాలు, పాటలు, వూకుడు కతలు 
  • ముక్కులు గిల్లే ఆట,  పులి మేకాట, దొంతులాట, సరసక్క సారుబిండి, సింతపూలాట, పట్లాట వంటి గ్రామీణ క్రీడలు 
  • సాసవల చిన్నమ్మ కత, చెంచులచ్చిమి కత, దేశింగు రాజు కత, ముగ్గురు మరాఠీల కత, మైరాముని చరిత్ర, తిమ్మమ్మ కత, గంగమ్మ కత, ఆది జాంబవుడి కత  లాంటి యెన్నో వీథి నాటకాలు, స్థానిక ఐతిహ్యాలు, కులపురాణాలు  
  • కులుకు భజన, పండరి భజన, కోలాటం జడకోపు వంటి కళారూపాలు – ఆ సందర్భాల్లో పాడే పాటలు 
  • చర్మం శుద్ధి చేసి వాద్యాలు (పలక/ డప్పు)  పరికరాలు (చెప్పులు కపిల/ మోట బాన)  తయారుచేయడంలోని  సాంకేతిక నైపుణ్యాలు
  • దొంతి సారాయి కాసే విధానం 
  • జలుబూ జొరం పోగొట్టే ఎండ్రకాయల చారు, ఒంట్లో నొప్పులు నచ్చు జొరాలు మాన్పించే  కుంటగింజరాకు ఊరుబిండి,  గాదిరాకు వొట్టి చేపలు తునకలు మొ. ఆహారపు అలవాట్లు
  • జానపద వైద్య రహస్యాలు, ప్రసూతి పద్ధతులు, ఆరోగ్య సూత్రాలు  …

యిలా ‘యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి తన్న క్వచిత్’ అన్నట్టు  నవల మొత్తం చిన్నపాటి జానపద విజ్ఞాన సర్వస్వం (mini encyclopedia of folklore) లా తయారైంది. దిగువ బురుజు మాదిగవాడ, దాని పరిసరాల భౌగోళిక స్వరూపం దగ్గర్నుంచి ప్రజల దైనందిన జీవిత విధానం వరకు సూక్ష్మాతి సూక్ష్మ వివరాలతో  సామాజిక చరిత్ర నిర్మితికి, జానపద వైజ్ఞానిక  పరిశోధనకి ఆకరంగా రూపొందింది.  ఆ విధంగా చూసినప్పుడు  తెలుగు నవలా ప్రపంచంలో ‘జక్కీకు’ వాచకం విశిష్టమైనదీ విలక్షణమైనదీ.  

***

ఏ మాత్రం కృత్రిమతకీ కాల్పనికతకీ తావులేని  నిసర్గ వాస్తవికతకు, సహజత్వానికి దగ్గరగా వున్న నవల యిది. దానికి కారణం రచన ప్రతి వాక్యం, పదం మనిషి చుట్టూ ప్రకృతి చెంతా తిరిగింది. మొలకల పున్నమి పండుగే ప్రకృతితో ముడివడివున్న వ్యవసాయ సంస్కృతికి చెందినది. సాహిత్య విలువల దృష్ట్యా ఆలోచించినప్పుడు  ప్రాకృత గాథల్లో వున్న స్వాభావిక కవితాత్మక వ్యక్తీకరణ అనేక సన్నివేశాల్లో కనిపిస్తుంది. చూడండి:  స్త్రీలు పొలాల్లో పనిచేసుకుంటూ యెటువంటి అరమరికలకూ తావు లేకుండా తమ  కష్ట సుఖాలు కలబోసుకునే క్రమంలో  లైంగిక అనుభవాల ముచ్చట్లు కూడా దాపరికం లేకుండా స్వేచ్ఛగా  విప్పిచెప్పుకొన్నప్పుడు గానీ పాడుకునే పాటల్లో మోటు సరసాన్ని అలవోకగా సమ్మతించినప్పుడుగానీ  స్త్రీల దాంపత్య జీవితానికి సంబంధించిన  సున్నితమైన వుద్వేగభరిత  పార్శ్వాల్ని తడిమినప్పుడుగానీ  పొలాల్లో పనిచేసే శ్రామిక స్త్రీలపై జరిగే లైంగిక వేధింపులు గురించి ప్రస్తావించినప్పుడు గానీ భారతిలోని  సహజసిద్ధమైన కథన నైపుణ్యం అబ్బురపరుస్తుంది. ముచ్చట్ల మధ్యే జీవితాధ్యాయాల పుటలు తెరుచుకుంటాయి. నెమలీకతో మనుషుల్నీ మనసు లోపలి పొరల్నీ తాకే సాహిత్య మర్మ విద్య యేదో ఆమె నేర్చింది. ఆమే  అన్నట్టు అది ‘ఎవురూ పెరక్క పోలేని’ విద్య.  కొండ వాగు ప్రవాహాన్ని పోలిన జీవద్భాషలో కయిగట్టి చెప్పే కథన కళ అది. అందులో మునకలు వేస్తూ  వొకటికి నాలుగు సార్లు చదివినప్పుడు మాత్రమే యీ రచనలోని సౌందర్యాన్నీ అది వర్ణించిన జీవితంలోని లోతునీ తద్వారా ఆవిష్కరించిన తాత్వికతనీ అర్థం చేసుకోగలం. ఆస్వాదించగలం. 

చిలికితేనే దొరికే వెన్న యిది. 

సాధారణంగా యిటువంటి రచనలు Cultural nostalgia చిత్రణ దగ్గరే ఆగిపోతాయి. ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ వంటి మానసిక స్థితిలోకో గత చరిత్ర  కీర్తన వ్యామోహంలోకో గత  వైభవ పునరుద్ధరణ భ్రాంతిలోకో గుంజుకు పోతాయి. లేదా యథాతథ స్థితిని వర్ణించడం దగ్గర ఆగిపోతాయి. లేదా దాన్ని గ్లోరిఫై చేస్తాయి. భారతి రచనలు చదివి అటువంటి ఆరోపణలు  చేసేవాళ్ళు వుండొచ్చు.  నవల్లో సజీవంగా రక్తమాంసాలతో తిరుగాడే మనుషులే  వాటికి సమాధానాలిస్తారు. వారి కడుపులో కదలాడే సొదలు  గుండెలో నలిగే వెతలు  తలలో పుట్టిన తలపులు రోజువారీ సమస్యల్ని యీదడానికి పడే ఆరాటాలు వాటిని పరిష్కారించుకునే దిశగా చేసే  బతుకు పోరాటాలు తన చుట్టూ వున్న ప్రపంచంలో జరిగే  ప్రతి సూక్ష్మమైన  కదలికనీ రచయితగా భారతి అనితరంగా పట్టుకుంది.  ఆమె సామాజిక చలనాన్ని గుర్తించడమే కాదు; అది గుణాత్మకంగా పరిణమించాల్సిన భవిష్యత్తులోకి సైతం తొంగి చూస్తుందని యీ నవల్లో కొన్ని సన్నివేశాల ద్వారా సంఘటనల ద్వారా నిరూపిస్తుంది. 

‘నూరు మందికి అన్నం పెట్టె బూమమ్మ పైన నూరెకరాలు నాదే అని పెత్తనం చెలాయిస్తే ఎట్ల? ఈ దుడ్డు ఉండే వాల్లంతా ఎక్కడ మైదానం ఉంటే అదంతా ఆక్రమించుకున్నారే. మాయట్ల బీద బిక్కి బతికేది వద్దా’

ఆవుల మేతకోసం పక్కనున్న నేల అడవికి వెళ్ళినప్పుడు భారతి వేసిన ప్రశ్న గమనించండి. కేవలం ప్రశ్నించడం దగ్గర ఆమె ఆగిపోలేదు. అందరికీ చెందాల్సిన సామాజిక సంపద వొకచోట పోగుపడి కొందరి అధీనంలో వుండటం గురించి మౌలికమైన ఆలోచన అందించింది, ఆ అన్యాయాన్ని సామూహికంగా ధిక్కరించడం తప్పదని తేల్చి చెప్పింది. భారతి  సామాజిక దృక్పథం నుంచి విడదీసి ఆమె సాహిత్యాన్ని అంచనా వేయడానికి వీల్లేదు.  

‘మాదిగ, మాలలు పెద్ద పెద్ద కట్టడాలు కడతారు. ఆ కట్టడాలు కట్టేది వాల్ల రక్తంలోనే ఉంది.’ అంటుంది మరోచోట. వాళ్ళు కట్టిన పై కులాల యిళ్లలోకి వాళ్లకి ప్రవేశం లేదు. ఈ అంటరానితనం యింకా వూళ్లలో వుందనీ దానికి యెదురుతిరిగి ఆ అమానుష ధర్మాన్ని  పాటించేవాళ్లకి పనులు బందు పెట్టి బుద్ధి చెప్పే చైతన్యం మాల మాదిగ పల్లెల్లో వస్తుందనీ నవల్లో నిరూపించింది. దళిత సమాజంలో చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ ఆత్మగౌరవ స్పృహ యినుమడిస్తున్న వైనాన్ని సైతం నమోదు చేసింది.

‘మనది తక్కువ జాతి మిగిలినోల్లంతా ఎక్కువ జాతులు అని మనల్ని సిన్న సూపు చూసేవాల్లు. మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాల్ల  పైన తిరగబడేంత వచ్చింది. అబ్బుట్లో ఎవడో మన ఇండ్లలో నూటికి కోటికి ఒగడు సదివే వాడు. ఇబుడు ఇంట్లో ఎంతమంది పుడితే అంతమంది సదువుతున్నారు.’  

అయితే పల్లెలో వస్తున్న చైతన్యాన్ని సహించనితనం అదే కాలంలో యెక్కువైంది. అది యివ్వాళ పాలక వర్గాల దన్నుతో దేశం అంతటా వ్యవస్థీకృతమైంది. హింసాత్మకంగా తయారైంది. విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ అనివార్యమైంది. ఈ సంఘర్షణకు  దిగువ బురుజు మినహాయింపు కాదు. ఈ పరిణామాన్ని భారతి దగ్గరిగా చూసింది, స్వయంగా అనుభవించింది.

‘ఇల్లు కట్టుకుంటే బాద, బిడ్లు సదువుకుంటే బాద, ఉద్యోగాలు చేస్తే బాద  వాల్ల  ముందర బండ్ల పైన మనం తిరిగితే బాద, మన ఆలు మొగుడు సంతోషంగా ఉంటే బాద, వాల్లకు కూలి పనులకు పోకుండా టౌన్కి ఎల్లి పోతున్నామని పెద్ద బాద. బాగా సంపాదించుకొని మా కంటే బాగున్నారని కుల్లి కుల్లి  కూరాకు ఐపోతావుండారు. మనమందరం కలిసి మెలిసి ఆనందంగా ఉండేది కూడా చూడలేరు.’

దీనికి ప్రత్యామ్నాయంగా తమ ఆనందాన్ని ప్రకటించుకోడానికి దళితులకు జక్కీకు వొక సాంస్కృతిక  ప్రతీకగా అందిరావాలని రచయితగా, గ్రామీణ సామాజిక కార్యకర్తగా భారతి కోరుకుంటుంది అని భావించడం తప్పు కాదు.  అయితే మలిదశ తెలంగాణా వుద్యమంలో పోరాట రూపంగా వుపయోగపడిన బతుకమ్మ ఆటా పాటా ఆ తర్వాత కార్పోటీకరణకూ బ్రాహ్మణీకరణకూ  గురై మౌలికతకు దూరమైనట్టు జక్కీకులాంటి యితరేతర ప్రజా కళారూపాలు ప్రాంతీయ ఆస్తిత్వ  చైతన్యం విడిచి పరాయీకరణ చెందకూడదు.  ఈ స్పృహ రచయితకు వుందని ఆమె మాటల్లో స్పష్టమౌతుంది. 

‘నిజం చెప్పాలంటే మాదిగ మాల పల్లెలోనే ఆట పాట మిగులున్నాయని గొప్పగా చెప్పుకుంటారు. మిగతా కులాల్లో డబ్బులు, బూములు ఉంటే మా దగ్గర ఆకలి ఆనందం రెండు ఉన్నాయని మురిసి పోయేవాల్లం . కానీ ఈ టీవీలు, సెల్లులు, సినిమాలు వచ్చి మా వాల్ల  దగ్గర ఉండే కళంతా అంతరించిపోయేలా ఉంది. ఆట పాట పైన ఇంకా కొద్ది  మందికి  మరులు పోలా. అందుకే జక్కీకి ఆడల్లని  పూనుకున్నాము’

 భారతి సాహిత్యమంతటా అంతర్లీనంగా అల్లుకొని వున్న యీ సామాజిక వాస్తవికతనీ దృక్పథాన్నీ పక్కనపెట్టి కేవలం భాషా శైలీ శిల్ప సంవిధానాల చుట్టూ గిరికీలు కొడ్తూ మురిసిపోవటం గానీ మురిపించడం గానీ నేరం. జక్కీకు ప్రదర్శననే కాదు; దాని సామాజిక అవసరాన్నీ ప్రాసంగికతనీ అక్షరాల్లో బొమ్మ కట్టించిన* భారతికి తెలుగు సమాజం యెంతగానో రుణపడి వుంటుంది.

***

ఈ నవల చదువుతూ మనం పాత్రలతో మమేకమౌతాం.నవ్వుతాం. ఏడుస్తాం. కోపిస్తాం. ఒక్కోసారి యేకకాలంలో భిన్న  భావాలు మదిని ముప్పిరిగొని వుద్విగ్నులమౌతాం. పరవశులవుతాం. మనుషులమౌతాం. నవల చదివే ‘దావ’  పొడవునా  దొరికే బొలుసి కాయలు రేణు గాయలు కొరడ గాయలు ఉలింజ గాయలు  నాగదారి కాయలు కోసుకుని  (ముళ్ళు గుచ్చుకోకుండా నెత్తురు చిప్పిల్లకుండా తప్పించుకోలేం)  తనివి తీరా చప్పరించుకుంటూ పోవాలి. 

‘వీటన్నిటినీ అనుబవిస్తూ పోవాలంటే జంటగా ఒక మనిసి ఉంటేనే బాగుంటుంది’ అంటారు భారతి. ఇదీ జీవితం పట్ల ఆమె ఫిలాసఫీ. ఈ నవలా రచయితగా ఆమె దిగువ బురుజు మాదిగ సాంస్కృతిక సామాజిక జీవన వాస్తవికతను తనతో కలిసి ఆస్వాదించడానికి మనందరినీ  ఆహ్వానిస్తుంది. కాగితం కలం పుల్ల కొంగుకు ముడివేసుకుని మడి గెనుమ్మీద నడిచే ఆమె వెంట కలిసి నడుద్దాం. చెప్పే సుద్దులు విందాం. మనిషికీ ప్రకృతికీ దగ్గరవుదాం. కుళ్ళూ కుసిద్రాలు దుఃఖాలన్నీ  మూటగట్టి అటకెక్కించి సొర పువ్వుల్లా పొడిచే పొద్దుల్లా మరకలేని తెల్ల తామరల్లా పసిపాపల్లా మొలకల పున్నమి వెన్నెల్లా నవ్వుతూ  ‘జక్కీకు’ ఆటా పాటలో పదం కలుపుదాం. పదండి.   

ఎ. కె. ప్రభాకర్

పింగళి చైతన్య – తాషీ 

[టీమ్ దాసరి శిరీష జ్ఞాపిక] 

* స. వెం. రమేశ్ డెట్రాయిట్ తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు నడక పేరుతో డాక్యుమెంట్ చేస్తున్న ‘కనుబరుపు కళ’ల్లో యీ నవల్లో పాత్రలు స్వయంగా ప్రదర్శించిన జక్కీకు  వీడియో లింక్.

You Might Also Like

Leave a Reply