పార్వేట, యింగరొన్ని కతలు
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
******
“పార్వేట” పేరు కొత్తగా ఉంది!
పుస్తకం చదవటం మొదలు పెట్టినప్పుడు అలవాటైన వ్యావహారికం కాక భాష కూడా కొత్తగా తోచి, ఆసక్తి కలిగించింది. చిత్రంగా పుస్తకం పూర్తయ్యేసరికి నా రోజువారీ పదాలకు ఆ మాండలికపు రంగుని అద్దే ప్రయత్నాన్ని కూడా చేసానని చెప్పటం అవాస్తవం కాదు. ప్రతి ప్రాంతానికి తనదైన భాష, దానికో సహజ పరిమళం ఉంటాయి. ఆయా జీవితాల్ని లోతుగా అర్థం చేసుకుందుకు అది మాత్రమే సహాయ పడుతుంది. ఆ జీవభాష కథల నేపథ్య వాతావరణాన్ని అలవోకగా మనచుట్టూ అల్లుతూ మనల్ని తనలోకి లాక్కుంటుంది.
ఈ పుస్తకానికి చరణ్ పరిమి వేసిన ముఖచిత్రం ఎర్రని రంగులో కొట్టొచ్చినట్టు ఉంది. ఆ చిత్రంలో బలికి అలంకరించబడిన ఒక జీవం (మేక), దానిని వేటాడుతూ వెనుక వస్తున్న జనం కనిపిస్తారు. బలి! ఈ పదం చాలా విషయాల్ని చెపుతుంది. బలి కాబోతున్న జీవం యొక్క అసహాయత, దుఃఖం ఆ వెనుక వేటాడే వారికెవరికీ పట్టదు. బలి తీసుకోవటం ప్రధాన లక్ష్యం! ఒక ప్రాణితో, ప్రాణంతో జరిపే వికృత క్రీడ.
దీనికి మతపరమైన, ప్రాంతీయపరమైన, వ్యక్తిగతమైన నమ్మకాలున్నాయి. స్వంత ప్రయోజనాలకో, పండుగ సంబరాలకో, సంతోషాన్ని, విజయాన్ని ప్రదర్శించుకుందుకో బలి ఇవ్వటమనే సంప్రదాయం బలంగా సమాజమంతా విస్తరించి ఉందన్నది వాస్తవం.
బలి కాబోతున్నది తమలాగే జీవంతో ఉన్నదన్న స్పృహ వేటాడే ఎవరిలోనూ కనిపించదు. ఆ ప్రాణి అనుభవించే జీవన్మరణ వేదన ఎవరికీ పట్టదు. చాలా ప్రాంతాల్లో, జన జీవితాల్లో సాధారణమైన విషయంగా చొచ్చుకుపోయి అదొక సంస్కృతిగా నిలబడి ఉంది. బలి ఇచ్చే వారి అభిప్రాయం, అభీష్టమే కానీ, ఇంక దేనికీ విలువ లేని పరిస్థితులే ఉంటాయక్కడ. నిజానికి మనిషి ఒక్కడూ ఉన్నప్పడు అతనిలోని ఆలోచన శక్తి, విచక్షణ మందిలో ఉన్నప్పుడు మాయమై పోతాయి. అందరితో తాను, అందరిలో తాను. అంతే. ఎవరి నమ్మకాలకు ఎవరు ప్రాణాలను త్యాగం చేస్తున్నారు? ప్రాణాలను తీసే హక్కు ఎవరికైనా ఎక్కడిది? ప్రశ్నలు వేసేవారు వేస్తూనే ఉన్నారు. అయినా…
పుస్తక ముఖచిత్రం బలికి సిధ్ధం చేసిన ఒక జీవాన్ని చూపించటం మాత్రమే లక్ష్యంగా లేదన్నది పాఠకుడికి సూచనామాత్రంగా అర్థమైపోతుంది. పుస్తకంలోని పన్నెండు కథల్లో “పార్వేట” ఒకటి. ఆ పదానికి అర్థం ‘పరుగెత్తి చేసే వేట’ అని రచయిత మాటల్లో తెలుస్తుంది. ఆర్థిక, సాంఘిక అసమానతలతో తోటి మనిషిని అసహాయుణ్ణి చేసి వారి జీవితాలపై పెత్తనం, పీడన, దోపిడీలను చేస్తున్న కథాంశాలు పుస్తకంలో ఉన్నాయి. అసహాయులందరూ వేటాడబడేవారే.
కౌమారాన్ని దాటుతూ యవ్వనంలోకి ప్రవేశించే వయసులో ఉన్న పిల్లలు ఈ కథలన్నింటిలోనూ కనిపిస్తారు. వారే కథా నాయకులు. వారి జీవితాల్లోనూ, చుట్టూ ఉన్న జీవితాల్లోనూ కనిపించే బాధలు, సమస్యలు వారిని స్థిమితం లేకుండా చేస్తాయి. సున్నితత్త్వం వీడని వారి మనసులు పడే ఘర్షణను అంతే సున్నితంగా చెపుతాయీ కథలు.
మొదటి కథ “సూరిగాడు – నల్లకోడి” సాధారణమైన కథాంశం గా కనిపిస్తుంది. కానీ పాఠకుని మనసులో గాఢమైన ముద్ర వేస్తుంది. కథలో పసాద్ తండ్రికి జూన్ లో వచ్చే మృగశిర కార్తె నాడు నల్లకోడి తింటే స్వర్గానికి పోతారన్న నమ్మకం. ఆ ఆశ కిందటి తరంలో తన తండ్రికి కూడా తీరలేదని, తనకు కూడా తీరుతుందన్న ఆశ లేదని తండ్రి అన్న మాటలకి పసాద్ ఆలోచనలో పడతాడు. తండ్రి కోరిక చిన్నదిగా కనిపిస్తున్నా, అది తీరే ఆర్థిక పరిస్థితి ఇంట్లో లేదు.
పసాదు, వాళ్ల నాన్న పెంచుకుంటున్న కుక్క ‘సూరిగాడు’. వాడికి, నల్లకోడికి ఉన్న సంబంధం ఈ కథ చెపుతుంది. ఆకలితో ఉన్న సూరిగాడు పొరుగింట్లో లచ్చమ్మ ఇంట్లో తిండికోసం వెళ్లి ఆమె కంట్లో పడతాడు. ఆమె పసాద్ తల్లితో గొడవ పడుతుంది. పసాద్ తల్లి కోపంతో సూరిగాణ్ణి కొట్టి ఇంట్లోంచి తరిమేస్తుంది. ఆరోజంతా పసాద్, అతని తండ్రి సూరిగాడి కోసం వెతికి, కనపడక దిగులు పడతారు.
తండ్రి కోరుకునే నల్లకోడి ఊళ్లో రెడ్డిగారింట్లో ఉంది. దానికోసం ఆరాత్రి మొదటిసారిగా దొంగతనం చేసే సాహసం చేస్తాడు పసాద్. రెడ్డిగారి దొడ్లో సూరిగాణ్ణి చూసి పసాద్ సంతోషపడతాడు. నల్లకోడిని చేజిక్కించుకుని గోడ దూకేలోపు రెడ్డి లేచి తుపాకీతో వస్తాడు. తిరిగి సూరిగాడి కోసం గోడ దూకి వెనక్కి వెళ్దామనుకునే లోపు తుపాకీ పేలటం, సూరిగాడి ప్రాణం పోవటం జరిగిపోతుంది.
సూరిగాడి విషయం మరిచి నల్లకోడిని చూసి తండ్రి ఆనందిస్తున్న క్షణాల్లో, లోకం తీరు ఒంటబట్టని ఒక పసిమనసు మాత్రం నిజాయితీగా ప్రేమించిన స్నేహితుణ్ణి, రాత్రి, పగలు నీడలా అనుసరించే నేస్తాన్ని పోగొట్టుకున్నందుకు దుఃఖపడుతుంది. ఆకలి, ఆశ, ఆర్థిక సమస్యలు ఒకదానికొకటిగా ఎలా మనిషిని నడిపిస్తాయో ఆర్ద్రంగా చెపుతుందీ కథ.
రెండో కథ “మాయన్నగాడు”. ఇద్దరు అన్నదమ్ముల కథ. ఒక ఇంట పుట్టి, ఆటపాటలతో, అల్లరితో అనుక్షణం కలిసి బతికే బతుకులో చిన్నచిన్న పట్టింపులు, పంతాలు వారి మధ్యనున్న రక్తసంబంధాన్ని, ప్రేమనూ ఎలా పణంగా పెట్టి దూరాల్ని సృష్టిస్తాయో చెపుతుందిది.
బర్రెల్ని తోలుకుపోయే విషయంలోనూ, సాయంకాలం కోళ్లను మూసే విషయంలోనూ వంతులు వేసుకుని తల్లిదండ్రులకి సాయపడ్తుంటారు అన్నదమ్ములు. బాల్ బాడ్మింటన్ మ్యాచ్ కి వెళ్లిన తమ్ముడు ఆటలో ఓడిపోతాడు. మర్నాడు బర్రెల్ని తోలుకెళ్ళేది తమ్ముడి వంతు, అయినా మ్యాచ్ ఆడి తను పోగొట్టుకున్న డబ్బును గెలుచుకోవాలంటాడు అన్నతో. దీనికోసం ఘర్షణ పడి, అన్న తండ్రితో దెబ్బలు తింటాడు. కోపంతో తండ్రి బర్రెల్ని తోలుకెళ్లి వాటితో విసిగిపోతాడు. దూడ కాలు విరుగుతుంది. తన కారణంగా అన్నకి తగిలిన దెబ్బలు, దూడ పరిస్థితి తమ్ముడి మనసుని గాయపరుస్తాయి. తనను తాను నిందించుకుంటాడు. ఆ తర్వాత…
“అన్న బరుగోళ్లకు పోయే పతిసారి నేను వాకిలి దగ్గర నిలబడి సూసేవాన్ని, ఒక్కరోజైనా పిలుచ్చాడేమోనని…!” కథ ఆఖరి వాక్యాలు! హృదయంతో రాసినవి.
మూడో కథ “పార్వేట” కథలో మొదటి వాక్యం…
“మిట్టమద్యానం ఎండ జెజ్జనక్క తొక్కిచ్చాంది.”
ఇందులో మాదిగ కుటుంబంలో పుట్టిన పదిహేనేళ్ల గోపాల్ కథా నాయకుడు. మహేష్ రెడ్డి తో పులిగీతం ఆడుతున్న గోపాల్ ను అరుగు మీద కూర్చున్నందుకు పెద్ద రెడ్డి కొడతాడు. ఎందుకని ప్రశ్నించిన గోపాల్ ను కులం పేరుతో నిందిస్తాడు. ఊళ్లో దండోరా వేసే సుదర్శనం కొడుకు గోపాల్. దేవర గురించిన దండోరా వెయ్యబోతున్న సుదర్శనంతో కూతుర్ని, అల్లుణ్ణి తీసుకొచ్చి బట్టలు పెడదామంటుంది భార్య ఆశగా. కూతుర్ని చాలాకాలం తర్వాత ఇంటికి తీసుకొచ్చేందుకు రెడ్డి దగ్గర అప్పుచేసి, పండుగకి కొత్తబట్టలు కొని, కూతుర్ని తీసుకొస్తాడు. అల్లుడు తనకివ్వవలసినవి ఇచ్చేకే కూతుర్ని పంపమంటాడు. సుదర్శనం భార్యతో ఆ విషయం చెప్పక దుఃఖాన్ని తనే మోస్తుంటాడు.
పార్వేట కోసం తెచ్చిన గొర్రెను తోక కోసి సున్నం పెడ్తారని, అది బాధతో పరుగెత్తుతుంటే దాన్ని పట్టుకుందుకు వెనక జనం పరుత్తి, పట్టుకుంటారని తెలిసి తను కూడా పరుగెత్తాలనుకుంటాడు గోపాల్. అది తమ కులం వాళ్లు చెయ్యకూడదని తిరుప్యాల్ మామ చెప్పినప్పుడు గోపాల్ కి అర్థం కాదు. తాను తప్పక గొర్రెను పట్టుకోవాలనుకుంటాడు. పార్వేట మొదలైనపుడు గొర్రెను పట్టుకుందుకు నిలబడిన వారిలో గోపాల్ ఉండటం చూసి సుదర్శనం భయపడతాడు. కొడుకును వారించే ప్రయత్నం అక్కడ చేరిన జనసందోహంలో విఫలమవుతుంది. కృత నిశ్చయంతో ఉన్న గోపాల్ అందరికంటే ముందుగా ‘అడ్డదావ’లో ముందుకెళ్ళిపోయి గొర్రెను పట్టే ప్రయత్నంలో ఉంటాడు. అది శేఖర్ రెడ్డి గమనించి గోపాల్ కి మోకాలు అడ్డం పెట్టి పడేస్తాడు. గోపాల్ ప్రాణం పోతుంది.
ఊరికో, వ్యక్తికో మంచి జరుగుతుందని ఆచరించే మూఢనమ్మకాలు, కుల వివక్ష ఇప్పటికీ ఇంత బలంగా మన చుట్టూ ఉన్నాయంటే నమ్మాలని లేదు, కానీ వాస్తవం కళ్లెదుటే ఉంది. ఈ సంస్కృతి ఎంతకాలం సాగుతుందన్నది జవాబు లేని ప్రశ్న.
గౌహతి లోని కామాఖ్య గుడిలో చూసిన జంతుబలి దృశ్యం మరచిపోలేనిది.
“కోటర్” కథలో పట్నంలో కాలేజీ చదువుకొచ్చిన కొడుకు సుమన్ తో ఆరోజు తాను పంది వేటకి వెళ్తున్నానని, సాయంకాలం ఒళ్లు నొప్పులు తట్టుకుందుకు క్వార్టర్ బాటిల్ తెమ్మని చెపుతాడు తండ్రి. తన స్నేహితుల ముందు మందు బాటిల్ తేవటం చిన్నతనంగా ఉందని గొడవ చేసినా తండ్రి ఇదే ఆఖరుసారి, తెమ్మంటాడు. తల్లికి చెపుతాడు తాను తేలేనని తండ్రికి చెప్పమని. అప్పుడా తల్లి అన్న మాటలు…
“ఏవన్నా అంటే ఊరికినే కోపాలు వచ్చాయి. అంగట్లో బాకీ లెక్క అడుగుతనారంటే కావాట్ల ఆ మనిషికి, మందుకు వచ్చింది తిప్పలు…” సంసారాల్లో సాధారణంగా కనిపించే దృశ్యం.
బస్సులో ఇంటికొచ్చే సమయంలో ఎవరికంటా పడకూడదని అనుకున్నా స్నేహితులు కనిపెట్టి ఏడిపిస్తారు. సుమన్ ఉక్రోషంతో ఇల్లు చేరతాడు. ఇంటి గుమ్మం దగ్గరే తండ్రి ‘కోటర్’ సీసా అడుగుతాడు. కోపంతో అందిస్తుంటే సీసా జారి పగిలిపోతుంది. కావాలని చెయ్యకపోయినా తండ్రిని నిరాశపరిచి అతని కోపానికి గురవుతాడు. ఎక్కడో అప్పు తెచ్చి, కోటర్ కొనుక్కురమ్మని అడిగినా ఫలితం దక్కలేదా తండ్రికి. పంది వేటలో పరుగెత్తి పరుగెత్తి కాళ్లు వాచిపోయిన తండ్రి తిండి తినకుండా పడుకోవటం చూసి జాలి పడతాడు కొడుకు. కావాలని చెయ్యకపోయినా తండ్రికి బాధను కలిగించినందుకు తనూ బాధపడతాడు.
“దేవమ్మ” కథలో కొడుకు లింగమయ్య పరీక్షలు ముగించి పట్నం నుంచి వస్తున్నాడని దేవమ్మ ఉత్సాహంగా కొడుకు కోసం వంటలు చేస్తూ ఆరోజు పనిలోకి రానని చెపుతుంది స్నేహితురాలు సుగుణతో. పనులు అలవాటు లేని దేవమ్మ భర్త చనిపోయాక, గత్యంతరం లేక, ఇల్లు దాటి పనుల కోసం గడప దాటుతుంది. దేవమ్మను అధికారంతో లొంగదీసుకుంటాడు రెడ్డి. దేవమ్మ పొలం పనికి రాకపోవటానికి కారణం సుగుణ ద్వారా తెల్సుకుంటాడు సామిరెడ్డి. ఆమెను కొట్టం దగ్గరకు రమ్మన్నాడని కబురు తెచ్చిన సుగుణతో రానని చెపుతుంది దేవమ్మ.
ఆ మాటతో రెడ్డి దేవమ్మను రోడ్డు మీద ఎదుర్కొంటాడు. అప్పుడే ఊళ్లోకొస్తాడు లింగమయ్య. తల్లి సామిరెడ్డి ఎదుట నిలబడి, తనకు పని ఇవ్వకపోయినా ఇకపై అతనికి తలవంచేది లేదని చెపుతుంది. రెడ్డిని నిలవరించేందుకు అతనిపై తన కాలికున్న రబ్బరు చెప్పును విసురుతుంది. లింగమయ్య తల్లి ధైర్యానికి సంతోషిస్తాడు. పేదరికంతో పాటు కుల వివక్ష ను ఎదుర్కొంటున్న అసహాయులైన దేవమ్మల పరిస్థితి ఎవరినైనా కలతపరిచే వాస్తవం. దీన్ని వదిలించేందుకు ఎడతెగని పోరాటం జరుగుతూనూ ఉంది.
“కొత్తబట్టలు” కథలో ఏడో తరగతి చదువుతున్న ‘సిన్నోడు’ కథా నాయకుడు. ప్రతి ఏడూ ఉగాది పండక్కి కొత్తబట్టలు అలవాటుగా కొనే తల్లి ఆ ఊసే ఎత్తదు.
సిన్నోడు స్వగతంలో ఇలా అనుకుంటాడు,
“ఇట్ట కాదని నేనే రంగంలోకి దిగినా, మాయన్న నంగి నా కొడుకు, నేను ఎట్టా అడుగుతానని మెల్లగాకుండా ఉంటాడు…”
కొడుకు ఏడుపు ముఖం చూసి డబ్బు ఏర్పాటు చేసుకుని, కొత్తబట్టలు తెచ్చేందుకు పొద్దుటూరు కు బయల్దేరి, మధ్యాహ్నం భోజనం సిద్ధం చేసి, జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది తల్లి. కొత్త బట్టలు గురించి ఊహాగానాలు చేస్తూ, ఊళ్లో స్నేహితులకి ఆ విషయం చెప్పేందుకు వెళ్తాడు సిన్నోడు. తల్లి ఎలాటి బట్టలు కొంటుందో అని పదేపదే తలుచుకుంటూ,
“నాలుగుసార్లన్నా మాయమ్మకి ఎక్కిళ్లు వచ్చింటాయి నా దెబ్బకి.” అనుకుంటాడు.
తీరా మధ్యాహ్నం ఇల్లు చేరేసరికి వాకిటి తలుపు వెయ్యని కారణంగా కుక్క ఇల్లంతా చిందరవందర చేసి, భోజనం కూడా నేలపాలు చేస్తుంది. పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టిన తండ్రి కోపంతో సిన్నోడిని, వాడి అన్నని కూడా బాగా కొడతాడు. అన్న దెబ్బల్ని తప్పించుకుంటాడు. సిన్నోడు దెబ్బలతో మంచం కింద పడుకుని నిద్రపోతాడు. రాత్రి తల్లి వచ్చాక పిల్లవాడికి జ్వరం వచ్చిందని గమనించి మాత్ర వేసి, చారన్నం తినిపిస్తుంది. తెలవారి పండుగ పూట జ్వరంతో మూలుగుతూ పడుకుని కొత్తబట్టలు వేసుకోలేని తన స్థితికి బాధ పడతాడు సిన్నోడు.
టౌన్లో బతుకుతరువు కోసం వెళ్ళిన సిన్నోడు ఒక పండుగ పూట తల్లితో ఫోన్ లో మాట్లాడినప్పుడు ‘కొత్త బట్టలు కొనుక్కున్నావా’ అని అడుగుతుంది. ఆ ప్రశ్న అతని బాల్యాన్ని కళ్లముందుకు తెస్తుంది.
“విజయకుమారి” బడికెళ్లే వయసులో ఒకే తరగతిలో చదువుకున్న విజయ్, కుమారిల ప్రేమ కథ. ఆ ప్రేమకి లౌక్యం తెలియదు. ఇద్దరూ సాంఘికంగా, ఆర్థికంగా వేర్వేరు వర్గాలకు చెందినవారు. చిన్ననాడు నిజాయితీగా మొలకెత్తిన ప్రేమను పది సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడుకుని, జీవితంలో ఒక స్థాయికి చేరి ఆమెను పెళ్లి చేసుకునే అర్హతను సాధించానను కుంటాడు విజయ్. పట్నం చదువు కెళ్లిన కుమారి ఒకనాటి పల్లె పిల్లవాడు విజయ్ ప్రేమని తేలిగ్గా తీసుకుంటుంది. ఇక్కడా సమాజంలోని అసమానతలే కథ. తెలుగు సినిమా పేర్లు, హీరోల పేర్ల ప్రస్తావన కథలో పాత్రల వయసుకి తగ్గట్టు సహజంగా ఉంది.
“సర్పం” ఒక ఊరిపెద్ద ధన బలం, అధికార బలంతో గ్రామంలోని బలహీనుల పట్ల చేసే దోపిడీని చెప్పే కథ. అతని అకృత్యాన్ని చూసిన నేరానికి బుద్ధిమాంద్యం ఉన్న పాతికేళ్ల శీను అన్యాయంగా బలి అయిపోతాడు.
“మాసిన మబ్బులు” కథలో పునరావాస కాలనీల అధ్వాన్న స్థితి, ప్యాకేజీలు అందక, జీవితపు మూలాల్ని, స్వంత ఆస్తుల్ని పోగొట్టుకున్న ప్రజల దుర్భర స్థితి, అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చెయ్యటం చూస్తాం. ఇలా మూలాల్ని పోగొట్టుకున్న జనంలోంచే వారిపై ప్రభుత్వం తరఫున అజమాయిషీ చెయ్యవలసిన పరిస్థితి ఈ కథలో కథానాయకుడికి. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన అతను కేవలం నిస్సహాయుడు!
“నల్లమోడాలు కప్పిన ఆకాశం” కథలో కులాల మధ్య ఉన్న విభజన ప్రేమికుల్ని విడదీయలేదు. కానీ సమాజం చిన్న కులంగా ముద్ర వేసిన కుటుంబంలోని వ్యక్తి తన ప్రమేయం లేకపోయినా అన్యాయంగా బలి అవుతాడు. కులం! భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద జాడ్యం! అడుగడుగునా, అన్నివేళలా మనిషి మానవత్వాన్ని మరిచిపోయేలా చేస్తోంది.
“ఓడిపోయిన వాన” కథలో పదేళ్ల పిల్లవాడు వర్షంలో పాత బట్టల కోసం ఇల్లిల్లూ దీనంగా తిరగటం కనిపిస్తుంది. పేదరికం, జైలు పాలైన తండ్రి, అప్పుడే కాన్పైన తల్లి… ఇదీ పిల్లవాడి నేపథ్యం. ఏ ఇంట్లోనూ అతడి అవసరాన్ని పట్టించుకున్నవారు కనిపించరు. ఒక సన్నకారు రైతు ఇంటి ముందు పిల్లవాడు నిలబడినపుడు వాళ్ల ఆర్థిక బాధల గురించి మాట్లాడుకుంటున్న భార్యాభర్తలు అతన్ని గమనిస్తారు. ఆ పిల్లవాడి పరిస్థితి పట్ల ఆ రైతు మనసులో దయ కలిగినా భార్య అతని మాటను ఖాతరు చెయ్యదు. తన సమస్యల గురించి ఆలోచనల్లో మునిగినా రైతు పిల్లవాడికి ఎవరూ సాయం చెయ్యకపోవటం గమనించి, తనవంతుగా బీరువాలోని రెండు పంచెలు పట్టుకుని పిల్లవాడిని వెతుక్కుంటూ బయలుదేరతాడు. అతని వెతుకులాట ఫలించి పిల్లవాడు చేతిలో పెద్ద బట్టల మూటతో ఎదురొస్తాడు. అది చూసి రైతు సంతోషంతో నవ్వుతాడు. తల్లి కోసం పొడి బట్టలు సంపాదించి, అనుకున్న పని సాధించిన పిల్లవాడు ఆగకుండా కురుస్తున్న వర్షాన్ని లెక్కచెయ్యనట్టుగా రైతును చూసి మనసారా నవ్వుతాడు. పిల్లవాడి పట్టుదల ముందు వాన ఓడిపోయిందనుకుంటాడు రైతు. ఆ పిల్లవాడి స్ఫూర్తి రైతుకి పత్తిపొలం గురించిన దిగులును మాయం చేస్తుంది.
ఈ కథలన్నీ వాస్తవ జీవితాల్ని మళ్లీమళ్లీ మన ముందుకు తెస్తాయి. రచయిత నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. మనుషుల్ని ప్రేమించే వారెవరైనా ఈ కథల్ని, కథల్లోని జీవితాల్ని ప్రేమిస్తారు. సాధారణంగా అచ్చైన కథల్ని పుస్తకంగా తీసుకురావటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా ఈ పుస్తకంలోని పన్నెండు కథల్లో మూడు, నాలుగు మాత్రమే అచ్చైనవని రచయిత చెప్పుకున్నారు. ఇది సాహసమే. అయినా “Fortune favours the brave” అన్న సూక్తిని ఈ పుస్తకం నిజం చేస్తుందని నమ్మచ్చు.
రచయితకి సినిమా పట్ల ఉన్న ప్రేమ కొన్ని కథల్లో కనిపిస్తుంది. సినిమాల పేర్లు, హీరోల పేర్లు, కటౌట్లకి పాలాభిషేకాలు…ఇవన్నీ కథల్లో ఉన్నాయి. బాల్యం నుంచి సినిమాను ప్రేమించి, కౌమారంలో సినిమాయే తన లక్ష్యం అని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులేస్తున్న రచయితకి అభినందనలు. పనిని, నిజాయితీగా పని చేసుకుంటూ వెళ్లటాన్ని మాత్రమే నమ్ముతానని చెప్పే రచయిత తన ప్రయాణానికి అవసరమైన ముఖ్యమైన మార్గాన్ని పట్టుకున్నారని అనిపిస్తుంది. అదే విజయం వైపు తీసుకెళ్తుందన్నది నిజం.
పుస్తకానికి ముందు మాట రాసిన వెంకటకృష్ణ గారు కేవలం కథలను పరిచయం చెయ్యటమే కాకుండా రాయలసీమ భౌగోళిక, కథా నేపథ్యాల్ని ఎంతో వివరంగా చెప్పారు. ఇది పుస్తకానికి మంచి చేర్పే కాక చదువరులకు చక్కని అవగాహన కలిగిస్తుంది.
యువ రచయితలను ప్రోత్సహిస్తున్న అన్వీక్షికి ఈ పుస్తకాన్ని ప్రచురించింది. వెంకట్ శిద్ధారెడ్డి, మహి బెజవాడ, కరుణ కుమార్ లు ఈ పుస్తకం గురించి చెప్పిన విలువైన మాటలు పుస్తకం అట్ట వెనుక ఉన్నాయి. ఇవి ఈ పుస్తకం అందుకున్నశుభాకాంక్షలు.
రచయితకు మరోసారి అభినందనలు.
పుస్తక ప్రచురణ: డిసెంబర్ 2022
పుస్తకం ధర: Rs. 175/
Leave a Reply