బాల చెలిమి

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

బాల చెలిమి – పర్యావరణ కథల పోటీలు – 2023. పెద్దలు రాసిన పిల్లల కథలు

*********

పెద్దలందరూ బాల్యాన్ని దాటి వచ్చినవారే. పసితనంలో తమ మనసులో ఎలాటి ఆశలు, ఊహలు మెదిలేవో పెద్దయిన తరువాత కూడా జ్ఞాపకాల్లో మిగిలే ఉంటాయి. చిన్నతనంలో ఆడిన ఆటలు, చేసిన స్నేహాలు మరుపుకు రావు సరికదా, అవి జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమైంచేందుకు హాయైన లేపనంలా పనిచేస్తాయి. బాల్యం చేసే అందమైన గారడీ అది. బాల్య మిత్రులతో పెనవేసుకున్న స్నేహాల్ని, రహస్యాల్ని పదిలంగా దాచుకుంటాయి పసిమనసులు. అరమరికలు లేని అలాటి స్నేహం మళ్లీ జీవితాల్లో అరుదుగానైనా దొరుకుతుందని చెప్పలేం. బాల్య మిత్రుల్ని చివరివరకూ మిగుల్చుకోవటం ఒక అద్భుతమైన వరం.

ఎలాటి స్వార్థాలు, సంకోచాలు తెలియని అమాయకపు అర్థంలేని అల్లరి రోజులు ఎవరికైనా అపురూపమే. ఆ ఆనందకరమైన క్షణాలు బాల్యానికి రంగునద్ది ఇంద్రధనుస్సుల్ని పూయిస్తాయి. వాటి రంగు, రుచులే పెరిగే వయసులో అభిరుచుల్ని ఏర్పరుస్తాయి. బాల్యాన్ని వీడేందుకు వయసు పడిన యాతనని పెద్దలెవరూ మర్చిపోరు. అమ్మచేతి గోరుముద్దలు దాటి, నాన్న వీపు మీద గుర్రం ఆటలాడే రోజులూ దాటి, పుస్తకాల బరువుతో బాధ్యత ఎత్తుకుని బడికి చేసే ప్రయాణం అంత సులువైనదేం కాదు. పిల్లల సమక్షంలో చిన్నపిల్లలై పోని పెద్దల్ని ప్రపంచంలో ఎక్కడా చూడం.

పిల్లల్ని ప్రేమించకుండా ఉండగలగటం ఎవరికైనా సాధ్యమైన పనేనా? పిల్లల ప్రపంచంలోకి ప్రయాణించేందుకు పెద్దలకుండే అర్హత ఆ ప్రేమే! ఇప్పుడు చెప్పుకుంటున్న పుస్తకం పేరు “బాల చెలిమి” వారి “పర్యావరణ కథల పోటీలు – 2023”. ఇవి పిల్లల కోసం పెద్దలు రాసి బహుమతి పొందిన కథలు.

పర్యావరణం గురించిన స్పృహ పిల్లల మనసులో నాటేందుకు ఈ కథలు ఎంతగానో తోడ్పడతాయి. పిల్లలు ఊహ తెలిసిన దగ్గర్నుంచి చుట్టూ ఉన్న చెట్టు, పిట్ట, ఆకాశం, మట్టినేల, నీళ్లు లాటి కంటి ముందు ప్రపంచాన్ని గమనిస్తూ పెరుగుతారు. అవన్నీ వాళ్ల ఊహలకి, ఆటలకి రకరాకల రూపునిచ్చి విశాలమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.

అసలు ఈ పర్యావరణం ఏమిటి? దానిపట్ల పిల్లలకి పిల్లలుగా ఉన్నప్పుడే ఎందుకు స్పృహ కలిగించాలి అంటే, అది వారి శారీరక, మానసిక పెరుగుదలకు ముఖ్యమైన ఆధారం కాబట్టి. అంతేకాదు, పర్యావరణంలో మనిషీ భాగస్వామే. మిగిలిన అన్ని జీవరాశుల మీదా ఆధిపత్యాన్ని చూపుతూ, కొత్తకొత్త శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతో మెరుగైన జీవన విధానాల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాడు.

ఆ క్రమంలో ప్రకృతి ఉదారంగా ఇచ్చిన సంపదకు నష్టం కలిగిస్తూ పర్యావరణంలో ఉన్న సమతుల్యతను హరిస్తున్నాడు. ఈ వాస్తవం ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు దారితీస్తూ, ఈ తరం వారికే కాక రాబోయే తరాలకి మరింత ముప్పును తెచ్చేదిగా తయారైంది.

పిల్లల పెరుగుదలకి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. దానికి పర్యావరణాన్ని, పంటల్ని, పశువుల్ని, పక్షుల్ని అన్నింటినీ సురక్షితంగా ఉంచుకోవాలి. పిల్లలుగా ఉన్నప్పుడే ఇలాటి ప్రాధాన్యతను అర్థం చేసుకుంటే వారు పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకుందుకు తమవంతుగా కృషి చేస్తారు. వారి జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణ అనేదాన్ని భాగం చేసుకుంటారు.

ఆరోగ్యం మహాభాగ్యం అనే సూక్తి మనందరికీ తెలిసున్నదే. ఇది పిల్లలకీ అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది. పిల్లలకి ఇష్టమైనవి ఆటలు, పాటలు, కథలు. అందుకే ఇలాటి గంభీరమైన విషయాన్ని కూడా కథల రూపంలో అందించటం వలన వాళ్లు కథల్ని ఆస్వాదించటమే కాకుండా, సులువుగా అవగాహన చేసుకుంటారు. అనాలోచితంగా తమ పెద్దలు చేసిన తప్పుల్ని వారు చెయ్యకూడదని గ్రహించుకుంటారు.

పిల్లల భౌతిక, మానసిక వికాసాల కోసం పెద్దలు అందించ వలసిన గొప్ప బహుమతి ఆనందమైన, ఆరోగ్యమైన వాతావరణమే. ఈ విషయాన్ని “బాల చెలిమి” వారు గ్రహించారు కనుకే ఈ అంశం మీద కథల పోటీని నిర్వహించారు. విలువైన కథలను అందమైన పుస్తకంగా మన ముందుకు తీసుకొచ్చారు. పిల్లల పట్ల ప్రేమ, వారి క్షేమం, భవిష్యత్తు పట్ల నిజాయితీతో కూడిన శ్రద్ధ ఈ పుస్తకాన్ని చూస్తే అర్థమవుతుంది. పుస్తకంలోని మొత్తం 47 కథలలో న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన దాదాపు 15 బహుమతి కథలు కూడా ఉన్నాయి.

అంశం పర్యావరణమే అయినా దానికి సంబంధించిన విభిన్న కోణాలను, అంశాలను ఈ కథలకి ఇతివృత్తాలుగా తీసుకోవటం జరిగింది. ఈ కథల్లో ముఖ్యమైన పాత్రలు పిల్లలే. వారి ఊహలకు హద్దులు లేవన్నది అక్షరాలా నిజం.

మనిషి స్వార్థంతో తన సుఖాల కోసం చేసే ప్రయత్నాల్లో భూమి తాపాన్ని పెంచి పర్యావరణం పట్ల నిర్లక్ష్యం వహించటాన్ని అర్థం చేసుకున్న ‘సూర్య’ అనే అబ్బాయి తల్లిదండ్రులకు కనువిప్పు కలిగేలా తన ఆలోచనలను, తను అనుసరించబోయే జీవన శైలి ని గురించి చెపుతాడు. చుట్టూ ఉన్న జీవరాశులన్నీ వాతావరణ కాలుష్యంతో ఏ విధంగా బాధలు పడుతున్నాయో వివరించి నీరు, భూమి వంటి ప్రకృతి వనరుల్ని తగుమాత్రంగా వాడుకుంటూ వాటిని కాలుష్యం నుంచి కాపాడేందుకు తాను భూమి డాక్టర్ అవుతానని చెపుతాడు ‘భూమి డాక్టర్’ కథలోని సూర్య.

తీర్థ యాత్రలకు వెళ్లే ప్రజలు ఆయా ప్రాంతాల్ని చూసి, ఆనందించి, తమవంతుగా మాత్రం ఆయా ప్రాంతాల్ని ఏవిధంగా కాలుష్యమయం చేస్తున్నారో గమనించిన పిల్లలు అలాటి సమస్యకు పరిష్కారాన్ని తామే కనిపెడతారు “అసలైన దైవ కార్యం” కథలో. ప్లాస్టిక్ వ్యర్థాలను వేసేందుకు చెత్త బుట్టలను పెట్టి, యాత్రీకులను అలాటివాటిని బుట్టల్లో వేసేందుకు ప్రోత్సహిస్తారు.

నీటిని వృథా చెయ్యకుండా వాడిన నీటిని మొక్కలకు పొయ్యటం, కుండలో ఆరుబయట పోసి పెట్టి పక్షులకు అందుబాటులో ఉంచటం చెయ్యటం ద్వారా నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీటిని పొదుపుగా వాడి, సద్వినియోగం చెయ్యవచ్చని పిల్లలకి నేర్పుతుంది “రామన్న తాత” కథ.

పంచభూతాలను దైవంగా కొలుస్తూ ప్రకృతిని ప్రేమించటం ద్వారా ప్రకృతి నుండి మనకు కావలసిన రక్షణ దొరుకుతుందని చెప్పే కథ “నన్ను ప్రేమిస్తే నిన్ను రక్షిస్తా”. పంచభూతాలైన నేల, ఆకాశం, నీరు, నిప్పు, గాలి కాలుష్య రహితంగా ఉంచటం ద్వారా మానవాళి శ్రేయస్సును పొందుతుందన్న వివరం ఈ కథ చెపుతుంది.

చెట్లు నరికి వేయటం, లక్ష్యం లేకుండా ప్లాస్టిక్ వాడటం వంటి సమస్యలకు పిల్లలు తమ తల్లిదండ్రులో, టీచర్లో, పెద్దలో చెప్పిన పర్యావరణ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దానిని కాపాడేందుకు తమంతట తామే పరిష్కారం వెతికి అమలు చెయ్యటం దాదాపు అన్ని కథల్లోనూ చూడవచ్చు.

అభివృద్ధి పేరుతో చెట్లను నిర్దాక్షిణ్యంగా కొట్టివెయ్యటం, అడవులను కాపాడి ప్రకృతి సంపదను సంరక్షించకపోగా వాటిని మానవాళి ప్రయోజనాల కోసం ఆక్రమించటం వంటి చర్యలు పర్యావరణంలో సమతుల్యతను ఏవిధంగా దెబ్బ తీస్తున్నాయో తెలియజేసే కథలున్నాయి. అడవుల్లో ఉండవలసిన కౄరమృగాలు ఊళ్లల్లోకి వచ్చి మనుషులపైన దాడి చెయ్యటానికి కారణం అవి నివసించే అడవులను మనిషి దురాశతో ఆక్రమించటమే.

ఫట్టణాలలో ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే వ్యర్ధాలను చుట్టుపక్కలున్న చెరువుల్లోకి, కాలువల్లోకి వదిలెయ్యటం వల్ల ఆ నీరు విషపదార్థాలతో నిండిపోతోంది. అవి తాగిన పశువులు వ్యాథుల బారిన పడుతున్నాయి. అటువంటి నీటిని ఉపయోగించటం వల్ల పొలాల్లో పంటలు విషమయం అవుతున్నాయి. అంతేకాక ఆయా ఫ్యాక్టరీలు వదిలే విషవాయువులు మనం పీల్చే గాలిలో నిండిపోయి శ్వాసకోశ వ్యాధులవంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.

పండుగలు, పెళ్ళిళ్ల వంటి స్థలాలలో పెద్ద శబ్దంతో పాటలు, సంగీతం వంటివి పెట్టటం వల్ల శబ్ద కాలుష్యం మనుషుల్ని శారీరకంగానే కాక మానసికంగా అనారోగ్యం పాలు చేస్తోంది. అలాగే ఇప్పటి అతి పెద్ద జాడ్యంగా తయారైన స్మార్ట్ ఫోన్ల వాడకం గురించి, దాని దుష్ప్రభావల గురించి కూడా కొన్ని కథలున్నాయి.

పురుగుమందులు వాడకుండా ఆరోగ్యకరమైన పంటలు పండించే గ్రామాలు, ప్లాస్టిక్ వాడని గ్రామాలు, శుభ్రత ని ఒక వ్యసనంలా ఆచరించే ప్రాంతాలు అరుదుగానైనా మనమధ్య లేకపోలేదు. వాటిని ఆదర్శంగా తీసుకుంటే అన్ని ప్రాంతాలు కాలుష్యరహితం అవుతాయి. ఆరోగ్యాన్నిచ్చే పర్యావరణం అందమైన ప్రపంచంగా మారుతుంది.

‘స్టీల్ బ్యాంక్’ కథలో పూర్వం తాను పనిచేసిన బడిని, అక్కడకి వచ్చిన తన శిష్యులను చూసేందుకు గ్రామానికి వచ్చిన ఒక టీచర్ సభ ముగిసాక, భోజనాల సందడి ముగిసాక అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లను, గ్లాసులను చూసి ఒక మంచి ఆలోచన చేస్తుంది. స్టీల్ కంచాలు, గ్లాసులను గ్రామంలో జరిగే వేడుకల సమయంలో వాడటం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని మంచి సూచన చేస్తూ తన వంతుగా అప్పటికప్పుడే కొంత డబ్బుని కూడా విరాళంగా అందిస్తుంది. ఆ ఆలోచనని ఆదర్శంగా తీసుకున్న గ్రామ ప్రజలు కూడా ఆనందంతో ముందుకొస్తారు. నిత్యం ఊరూరా జరిగే వేడుకలలో భోజన సమయాల్లో ఇలాటి ఏర్పాటు చేసుకుంటే వాతావరణాన్ని కాపాడుకోగలుగుతాం.

అలాగే మట్టిపాత్రలు వాడకం కూడా పర్యావరణ సంరక్షణకి అవసరమని ‘ధరణీ రక్షతి రక్షిత’ కథ చెపుతుంది. పరిసరాల్లో నీటి జాడ లేక వలస వచ్చే పక్షుల గురించిన కథలున్నాయి.

ఆడపిల్ల పుట్టిందంటే ఉపద్రవం వచ్చినట్టు ఏడ్చే ఒక గ్రామంలో తనకు ఆడపిల్ల పుట్టినప్పుడు ఒక తండ్రి పెరట్లో పండ్ల మొక్కలు నాటుతాడు. ఆ పాప ప్రతి పుట్టినరోజున మరికొన్ని మొక్కలు నాటుతాడు. అవన్నీ కొన్నేళ్లకి వృక్షాలై అనేక పక్షులకు ఆవాసమవుతాయి. పర్యావరణ సమతుల్యతను గ్రామం సాధిస్తుంది. అంతేకాక ఆ చెట్లిచ్చిన పండ్లతో అక్కడి వారు ఆర్థికంగా బాగుపడతారు. ‘ఆడపిల్లల చెట్లు’ కథ ఇది.

‘వనజీవి’ శ్రీ దరిపల్లి రామయ్య గారు కోటి మొక్కలు నాటి రెడ్డిపల్లి గ్రామం చుట్టుపక్కల పర్యావరణాన్ని కాపాడిన విధం, వారి సేవలను మెచ్చిన కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డునివ్వటం ‘పచ్చని బతుకు’ కథ చెపుతుంది. ఇలాటివారి జీవితాలు తప్పక పిల్లలను ప్రభావితం చేస్తాయి.

సాధారణంగా పిల్లల పరీక్షల సమయంలో చాలా ప్రాంతాల్లో మనమంతా ఒక విషయాన్ని గమనిస్తున్నాం. స్కూళ్ల, కాలేజీల పిల్లలు పరీక్ష ముగించి ఇంటికి వెళ్లే దారిలోనే చేతిలోని పుస్తకాల్ని చింపి రోడ్ల మీద పొయ్యటం జరుగుతోంది. అవన్నీ రోడ్లని కప్పేసేంతగా ఉంటూ, గాలికి పక్కనున్న మురికి కాలువల్లోకి చేరి, మురుగు నీటిని రోడ్లపైకి ప్రవహించేలా చేస్తున్నాయి. ఆ కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. దీనిని తేలికగా తీసుకోవటం క్షమార్హం కాదు. సరైన నిబద్ధతతో ఈ జాడ్యాన్ని వదిలించవలసిన అవసరం ఎంతో ఉంది. ‘మహేష్ ప్రతిజ్ఞ’ కథ ఈ అంశం గురించి చెపుతుంది.

కేవలం కొన్ని కథలనే ఉదహరించి, మిగిలినవి చదువరులకు వదిలిపెట్టటం జరిగింది. అన్నీ ఆలోచింపజేసే కథలు. ఈ సంకలనం పిల్లలకి విలువైన బహుమతి. కథలన్నీ ఆనందింప జెయ్యటమే కాక వారిలో కొత్త ఆలోచనల్ని, పర్యావరణం పట్ల స్పృహని కలిగిస్తాయి. పుస్తకం నాణ్యమైన ముద్రణతో ఉంది. అచ్చుతప్పులు లేవు. ప్రచురణకర్తలకు అభినందనలు.

గతంలో అనేక పిల్లల పుస్తకాలను ప్రచురించిన ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’, హైదరాబాదు వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

సంపాదకులుః మణికొండ వేదకుమార్

జూలై 2023 ప్రచురణ.

వెలః 100 రూపాయలు.

You Might Also Like

Leave a Reply