గీతశంకరము

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

*******

మహాదేవుడు, జయదేవుడు అని సాధారణంగా శంకరుడు, గణపతి నామాల్లో వినబడుతుంటుంది. ఇవి విశేషణములై ఏ దేవునికైనా ఒప్పినవై ఉన్నప్పటికీ శివసంబంధంగా వాడుకలో ఉన్నాయి. అలాంటి జయదేవుని పేరున్న శ్రీ జయదేవుడు గీతగోవిందం అనే పేరుతో రాధాకృష్ణుల గురించి పాడిన, వ్రాసిన కావ్యం సువిఖ్యాతమే. 

అనంత నారాయణుడని విష్ణుమూర్తి పేరు గల ఒక కవి పదిహేడో శతాబ్దపు సమీపకాలములో గీతగోవిందాన్ని అనుసరిస్తూ గీతశంకరం అని ఈశ్వరుని గురించి ఒక కావ్యమును వ్రాశారు. ఈ కవుల పేర్లు అలా కుదరడం కాకతాళీయమే కావచ్చు గానీ ఇలా గమనించడం గమ్మత్తుగా అనిపించింది.

గీత గోవిందంలో పన్నెండు సర్గలు, ఆకర్షణీయమైన సర్గనామాలు, అనేక విధములైన వృత్తాలు, శ్లోకాలు ఉన్నాయి. ధవళము, భ్రమరము, మంగళము అనే గేయవైవిధ్యాలు కూడా అష్టపది పేరుతోనే పిలువబడుతున్నాయి. గీత శంకరంలో ఇరవై రెండు శ్లోకాలు, ఇరవై నాలుగు అష్టపదులూ ఉన్నాయి. ఇది సర్గరహితమైనది. ఇందులో వస్తువు కొంత వరకు గీతగోవిందాన్ని అనుసరించినా ఎక్కువ స్తుతి, వర్ణనలు. ఈశ్వరుని సర్వత్వము, స్వామిత్వము కనిపిస్తాయి. అక్కడక్కడా పద పునరుక్తి ఉన్నప్పటికీ గీతగోవిందంలోని అష్టపదులతో ఇంచుమించు సమానంగా ఉన్నాయి. వైవిధ్యమైన అష్టపదులు చదవాలని,పాడాలని, వినాలని ఆసక్తి గల వారికి తప్పక నచ్చుతాయి.

గీతగోవిందము, గీత శంకరము రెండింటిని కలిపి ఒక పుస్తకంగా ప్రచురించారు. రెండు కావ్యాలలోని అష్టపదులకు, శ్లోకాలకు రాగాలు, స్వరస్థానాలు సూచిస్తూ ప్రచురించడం వలన సంగీతాభ్యాసకులకు ఉపయోగకరంగా ఉండవచ్చు. గీతగోవిందంలోని అష్టపదులను గానీ ఇతర వాగ్గేయకారుల కీర్తనలను గానీ సంగీతజ్ఞులు వివిధ రాగాలలో పాడుతుండడం విదితమైన విషయమే.

వృత్తముల రకముల విషయానికి వస్తే గీతగోవిందంలో ఉన్నంత బహుళసంఖ్యలో కాక కొద్ది రకముల వృత్తములలో పద్యాలు, శ్లోకాలు ఉన్నాయి. అనంతనారాయణునికి పంచరత్నకవి అనే బిరుదు ఉండి ఉండవచ్చును. గీతగోవిందంలోని అష్టపదులలో జయదేవుని పేరు వచ్చినట్టే ఇందులో పంచరత్నకవి అనే పేరు వస్తూ ఉంటుంది.

గీతగోవిందము ఎంతో ప్రసిద్ధి పొందడంతో ఎన్నో అనువాదాలు, ఆ ఛాయలో అనేక కృష్ణసంబంధమైన రచనలు వచ్చాయి. శివసంబంధంగా గీతగౌరీశము, గీతశంకరము మాత్రము తెలిసినవి. గీతశంకరము తంజావూరు లోని సరస్వతీమహలు గ్రంథాలయములో లభ్యము కాగా, గీతగోవిందముతో కలిపి స్వరసహితంగా ప్రచురింపబడినది. ఇది ప్రస్తుతం అచ్చులో లభిస్తున్నట్టు లేదు. అంతర్జాలంలో దొరుకుతున్నది.

You Might Also Like

Leave a Reply