మోతిరాముని రమణీయమైన శతకము

వ్యాసకర్త: రాథోడ్ శ్రావణ్ 

*****

తెలుగు సాహిత్యంలోప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు తెలుగు శతక సాహిత్యంలో  చాలా మంది కవులు, శతకాలు రాస్తూ తెలుగు శతకాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో కూడా ఎవ్వరూ మరచిపోలేని విధంగా పాఠకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న  శతకాలు  దాశరథీ శతకం, భాస్కర శతకం, సుమతి శతకం, వేమన శతకం వంటివి. వర్తమాన కాలంలో ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో జ్ఞానేశ్వర్ శతకం, సద్గుణ శతకం తరువాత వచ్చిన మూడవ శతకం మోతిరాము శతకం.

శతక కర్తలు, సాహితీ వేత్తలు, సమాజ హితం కోసం సమాజంలో పేరుకుపోయిన సమస్యలు-వాటి పరిష్కారాల మార్గాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మానవులలో నైతిక విలువలు, జీవిత విలువలు, జ్ఞాన విలువలు, ఆధ్యాత్మిక విలువలు, ప్రేమ, దేశభక్తి విలువలు, మొదలగు విలువలను పెంపొందించుటకు నేటికి శతక కవులు ఎనలేని కృషి చేస్తున్నారు. అప్పటి నుంచి ఈ నాటి వరకు ఈ శతక రచన ఎన్నెన్నో  కొత్త కొత్త దారులు వెదుకుతూ, కొత్త కొత్త దారులు తొక్కుతూ  తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను సంపాదించుకొన్నది.

ఆ కోవకు చెందిన కవులలో ఒకరు  అదిమ గిరిజన కొలాం కవి  ఆత్రం మోతీరామ్. ఉట్నూర్ సాహితీ వేదికలో ప్రచార కార్యదర్శిగా సేవలను అందిస్తున్న, కవిమిత్ర, కవన కోకిల  బిరుదు అంకితులైన శ్రీ ఆత్రం మోతీరామ్ కుమ్రంభీము జిల్లా వాంకిడి మండలంలోని నగర్ గుట్ట గ్రామానికి చెందిన శ్రీమతి/శ్రీ ఆత్రం రాము, మారుబాయి అనే అదిమ గిరిజన కొలాం తెగకు చెందిన దంపతులకు  6 సెప్టెంబర్ ‌1995లో జన్మించాడు. 

సంస్కృత  భాష నుండిపుట్టిన  ద్రావిడ భాషయైన తెలుగుకు మద్య ద్రావిడ భాషయైన  కొలామి భాషకు చాలా దగ్గర  సంబంధం ఉండటంతో తెలుగు భాషా పై పట్టు సాధించాడు. బాల్యం నుంచే తెలుగు సాహిత్యం మీద ఉన్న ప్రేమతో  వచన కవిత్వంలో కవితలు, పద్యాలు, మరియు వ్యాసాలు రాస్తూ ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటు ఉమ్మడి కవుల సంకలనాల ద్వారా సాహితీ లోకానికి పరిచయమయ్యారు. జల్, జంగిల్, జమీన్ కోసం నిజాం నవాబుతో పోరాడిన కుమ్రం భీంకు  కుడి భుజమైన  “కొలాం వీరుడు కుమ్రం సూరు” జీవిత చరిత్ర పుస్తకంతో మొదలైన తన రచన కైతికాల ప్రక్రియలో “దండారి” పుస్తకం, దంతన్ పల్లి భీమయ్యక్ మహాత్మ్యం పుస్తకాన్ని రచించి, మోతిరాము శతకం   ఆవిష్కరించటంతో పుస్తకాల సంఖ్య నాల్గుకు చేరుకొడం అభినందనీయం.

సమాజంలో నేటి కాలంలో నైతిక మానవ విలువలు అంతరించి పోతున్న తరుణంలో ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు వాటి  పట్ల విద్యార్థులకు,కవివర్యులకు, పాఠకులకు,జాగురూకత  కలిగించడం కోసం మానవీయ నైతిక విలువలకు సంబంధించిన ఆటవెలది ఛందస్సులో  ఛందోబద్ధమైన శతాధిక పద్యాలు  మోతిరాము మాట మోద మొప్పు అను మకుటంతో  మోతిరాము శతకం రాయడం సంతోషం.  ఈ పుస్తకంలో మొత్తం 108 పద్యాలు వాటికి సంబంధించిన భావము రాయడం ఒక్కొక్క పద్యాలు  తెలుగు సాహిత్యంలో  ఆముల్యమైన  రత్నాలని చెప్పవచ్చు.

కొన్ని పద్యాలు పరిశీలిద్దాం:-
1)”ఆపద గల నాడు యాదుకొనుచు నుండు 

ఆపద గల వాని యవసరమున  

నీవు మేలు జేయ నీకును మేలౌను

మోతిరాము మాట మోద మొప్పు..!”

ఓ మోతిరామా ! ఎవరైతే ఆపదలో ఉంటారో  వాని అవసరం అవసరమైన సమయంలో అతని అందుకున్నప్పుడే అతని అవసరం తీరుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే నీవు పరులకు మేలు చేస్తావో అప్పుడే నీకు కూడా మేలు చేకూరుతుందని భావము.

2) “అన్నియున్న వనెడి నహము నుండ వలదు 

నేడు యున్న రేపు నీది గాదు

మత్తు తలకు నెక్క మనిషి పతనమౌను 

మోతిరాము మాట మోద మొప్పు..!”

ఓ మోతిరామా ! మనిషికి అన్ని  ఉన్నాయి అనే గర్వము, అహంకారము ఉండకూడదు.నేడు ఉన్నది, అది రేపు నీది కాకపోవచ్చు కదా ! అన్ని ఉన్నాయని మనిషి  గర్వం వలన తలకు మత్తెక్కిమనిషి పతనమౌతాడు అని భావము.  

3) “అణిచి పెట్టుకొనుము ఆవేశమంతయు 

క్షీర నీరదముల మారుగాను 

అందరికిని నీవు ఆత్మీయమై యుండు 

మోతిరాము మాట మోద మొప్పు..!”

ఓ మోతిరామా ! నీవు నీ ఆవేశమును అణిచి పెట్టుకోవడం వల్లనే నీవు పాలల్లో నీళ్ళువలె  అందరితో కలిసి మెలిసి ఆత్మీయంగా ఉండగలుగుతావు.లేకుంటే కష్టమగును అందుకని కలిసి మెలిసి ఉండాలని  భావము.

4) “మట్టి నుండి మెతుకు మనకిచ్చు రైతన్న

రేయి పగలు శ్రమకు లేదు విలువ 

రైతు లేని జగము రాణింపగలుగునా !

మోతిరాము మాట మోద మొప్పు..!”

ఓ మోతిరామా ! జగతికి వెన్ను ముక్కయైన రైతన్న రాత్రి పగలు శ్రమించి మనకు ఆహార ధాన్యాలు అందించేదరు.కానీ వారి శ్రమకు ఫలితం లభించడం లేదు. ఆదే రైతు లేని ఈ ప్రపంచాన్ని ఊహించగలమా అని భావము.

5) “నోటికొచ్చినట్టు మాటలాడగ బోకు

నీవు పలికె పలుకు నీకు చేటు 

నీదు మాట తీరు నీకు రక్షయగును 

మోతిరాము మాట మోద మొప్పు..!”

కవి మోతిరామా!  మధురమైన  వచనాల  వలన కలిగే ప్రయోజనాలను గుర్చి వివరిస్తూ నోటికి వచ్చినట్లు మాటలు మాట్లాడకుడదు. నీవు మాట్లాడే మాట నీకు చేటును కలుగ జేయును, మాటల తీరు వల్లే నీకు రక్షయగును అని భావము.

ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొలాం కవి ఆత్రం మోతిరామ్  సరళమైన పదజాలంతో చక్కని ప్రాసలతో  “మోతి” అతని పేరు “రాము” వారి నాన్న పేరుతో శతకం రాయటం మనేది ఎంతో ప్రశంసనీయం .

వెల. ₹ 50 రూపాయిలు

ప్రతులకు: అత్రం మోతిరామ్, చెరువుగూడ, దంతన్ పల్లి మండలం; ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా. 504311

చ.సంఖ్య 9398020367.

You Might Also Like

Leave a Reply