అర్జున్ s/o సుజాతా రావు

అర్జున్ s/o సుజాతా రావు: సైన్స్ ఫిక్షన్ తో కూడిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్

వ్యాసకర్త: పెద్దింటి అశోక్

********

 నవలంటే జీవితం. ఒక్కరి జీవితమేకాదు. ఒక సమస్యనో సంఘటననో ఆధారంగా చేసుకుని దానితో ముడి పడిన అనేక జీవితాల చిత్రణ. ఈ నవల ఒక కొత్త  కమర్షియల్ పాయింట్ తో సస్పెన్స్ సినిమాకి కావలసిన అన్ని హంగులతో మలుపులతో ఆసక్తికరంగా సాగుతోంది. కొన్ని లాజిక్ విషయాలను పక్కనపడితే మంచి సస్పెన్స్ థ్రిల్లర్  నవల ఇది.ఒక మంచి కమర్షియల్ సినిమా స్క్రిప్ట్ కు సరిపోయేట్టుగా రాసుకున్న నవల ఇది. సోల్ పాయింట్ వినూత్నంగా ఉంది.

 పిల్లలు లేని సుజాత దంపతులు పిల్లల కోసం ఆరాటపడి ఒక  డాక్టర్‌ దగ్గరికి వెళ్తే అప్పటికే కొన్ని ప్రయోగాలు చేస్తున్న అతను వీళ్ళకు సంతాన ఉత్పత్తికి కావాల్సిన మందులు ఇస్తాడు. చివరకు సంతానం కలుగుతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డకు  నొప్పి అంటే తెలియదు. నవలలో ఇదొక కొత్త పాయింట్. ఈ విషయం ఒక రోజు తల్లిదండ్రులకు తెలుస్తుంది. అప్పటినుంచి మొదలవుతుంది అసలు కథ. ఒకరికి చెప్పలేక అలాగని దాచలేక ఆ తల్లిదండ్రులు పడే నరకయాతన అంతా ఇంతాకాదు. దెబ్బ తాకినా గాయం అయినా  తెలియకపోతే ఆ జీవితం ఎలా ఉంటుంది అన్నది అర్జున్ పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది. తన కొడుక్కి నొప్పి ఏంటో తెలియకపోవడం అనేది తల్లిదండ్రులు పిల్లవాడు రెండు మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గుర్తు పట్టి డాక్టర్ సలహాతో దానికి అనుగుణంగా పెంచుతారు. అర్జున్ చదువుకుంటున్న రోజుల్లోనే చాలా చురుకైన విద్యార్థిగా పేరుతెచ్చుకుని ఆటల్లో ప్రథమ స్థానంలో నిలుస్తాడు. అతడికి నొప్పి అంటూ ఏంటో తెలియదు కాబట్టి ఎంత ఆయాసం వచ్చినా ఎన్ని దెబ్బలు తలిగిన ఆ స్పృహ లేకుండా ప్రతి ఆటలో ప్రథమ స్థానంలో నిలుస్తాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ప్రయత్నంలో ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడుతుంది. బంటితో స్నేహం అతడిని అనేకసార్లు ఆపదలోంచి రక్షిస్తుంది. 

 చదువుకుంటున్న సమయంలో అర్జున్ ఆటల్లో మొదటి స్థానంలో నిలిచి అన్ని పథకాలు గెలవడం పూజను ఆకర్షిస్తుంది. ఇంటర్మీడియట్ ఒకే కాలేజీలో చదివిన తర్వాత ఇంజనీరింగ్ కు వేర్వేరు కాలేజీల్లో చేరుతారు. బంటితో స్నేహం.. కరణ్ తో వైరం…ఆటల్లో  పాల్గొనడం… కాలేజి గొడవలు… పూజతో ప్రేమ, బ్రేకప్ ఇవన్నీ ఒకదానితో ఒకటి వెంట వెంట మలుపులతో నవలకు రిడెబిలిటీని పెంచాయి.

కరణ్ నిజస్వరూపం తెలిసి అతని వెంటాడటం, పూజ తమ్ముడు సహాయం చెయ్యటం, ఒక దశలో పూజ దూరమై ఏడుస్తూ కూర్చోవడం ఒక మంచి ఫిక్షన్ గా కొనసాగుతుంది నవల. పూజ తమ్ముడు అంగ వైకల్యంతో ఉన్నా ఆలోచించే మేధావి. 

నవలలో కొన్ని ఆసక్తికర సైన్స్ విషయాలు కూడా ఉన్నాయి. మెదడులోని ఆలోచనలను  అడ్డుకట్ట వేసి హిప్నాటిజం చేసి ఎదుటి వ్యక్తిని తన స్వాధీనంలోకి తీసుకోవడం, రివేంజ్ కి వాడుకోవడం, డాక్టర్ చేసే ప్రయోగాలు, కరణ్ పూర్వ చరిత్ర నవలలో  నాటకీయతను పెంచి సస్పెన్స్ ను అద్భుతంగా పండించింది. చదువుతుంటే ప్రతిక్షణం ఆసక్తిని పెంచుతూ ఊహించని మలుపులతో ఇంకేం జరుగుతుందా అన్న సస్పెన్షను, టెంపోను రచయిత చివరి వరకు తీసుకొచ్చాడు.

 ప్రయోగాలు చేసే ఒక డాక్టర్… హత్యలు చేసి కాలేజీలో చేరిన ఒక విలన్ అమాయకంగా అందరి మాటలను నమ్మే హీరోయిన్ స్నేహమంటే ప్రాణమిచ్చి ఎల్లప్పుడూ అర్జున్ కు తోడు నీడగా ఉండే బంటి తను నిజస్వరూపం తెలియకుండా నటిస్తూ అర్జున్ దెబ్బతీయాలనే కరణ్ వీరందరు నవల సజీవ పాత్రదారులు. 

నవలకు మరో మంచి మలుపు కరోనా వైరస్. కల్పితమే అయినా వాస్తవ సంఘటనతో ముడివేసి అవుననిపించే రీతిలో నవల సాగింది. చైనాలో జరిగిన ప్రయోగాలు ప్రపంచాన్నే తన ఆధీనంలోకి తీసుకోవాలనే మూర్ఖపు ఆలోచనలతో బయో వార్ కోసం జరిపిన ప్రయోగాలు కరోనా వైరస్ తో కథను ముడిపెట్టి మరింత సస్పెన్స్ పెంచాడు రచయిత. ఇందులో ప్రతి పాత్రకి ఓ కథ ఉంటుంది. మామూలు పాత్రలే అనుకున్నా పాత్రలు హఠాత్తుగా ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తూ కొత్త కథను చెప్తాయి. పిల్లల కోసం ఆరాటపడి తన కొడుక్కి ఒక వింత రోగం వచ్చినప్పుడు ఆ దంపతులు పడే ఆవేదన, ఆవేదనలో నుంచి వచ్చిన ఒకానొక మొండి ధైర్యంతో సుజాత కొడుకు వెంట నిలవడం కథకు ఒక కొత్త మెరుపును తెచ్చింది.

 అన్ని సామాన్య పాత్రలే అనిపించినా వాటి వెనుక కథతో అవి ఆసామాన్య పాత్రలుగా మిగిలిపోతాయి. నిజంగా 60, 70 ఏళ్ల వయసున్న వృద్ధులు కుటుంబానికే కాకుండా ప్రభుత్వాలకు కూడా భారమవుతారన్న ఒక కొత్త అంశం.  కరోనా వైరస్ తో ఎక్కువ వయోవృద్ధులే బలైపోయారు అన్నది ఒక చేదు వాస్తవం. ఆ చేదు వాస్తవం వెనుక దాగి ఉన్న కుట్ర కొన్ని యదార్థ సంఘటనలను సమకాలీనతతో నవలకు అటాచ్ చేసి కథను కొనసాగించడం ఆసక్తిగా అనిపించింది. నిజంగా ఈ నవల మొదలుపెట్టినప్పుడు మనం ఒక రకంగా ముగింపును ఊహించుకుంటాం. కొంత చదివాక ఇంకో రకంగా ఊహించుకుంటాం. పూర్తయ్యే ముందు మన అంచనాలకు మించి ఊహించని ట్విస్టులతో కొత్త కొత్త మలుపులతో నవల సాగడం నూతన ఎత్తుగడలతో ఆసక్తిని కలిగించడం కథ బిగిని  రీడబిలిటీ ని పెంచింది. చూడడానికి చిన్న నవల అయినా చాలా అంశాలను కొత్త మలుపులతో పొందుపరిచింది. చివరలో అయితే ఊహించని రీతిలో ఊహించని ప్రయోగాలతో సైన్స్ లో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా… ఇన్ని కుట్రలు దాగి ఉంటాయా అని మనం అనుకునే స్థాయిలో నవల ముగుస్తుంది. అసలు నవల ముగింపు మళ్లీ ఒక కొత్త నవలకు ప్రారంభం పలుకుతుంది. ఏది ఏమైనా సాద్యాసాద్యాలను పక్కనపెడితే చదువుతున్నంతసేపు ఒక కొత్త లోకంలోకి మనల్ని తీసుకుపోతుంది. కొత్త కొత్త సైన్స్ విషయాలను పరిచయం చేస్తుంది. రచయితకు ఇది మొదటి నవల అనుకుంటాను. మొదటి నవలనే ఎక్కడ బిగి  సడలకుండా  రాసినందుకు అభినందనలు.

You Might Also Like

Leave a Reply