విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు

వ్యాసకర్త: కె.కె.ఎస్. కిరణ్

******

విశ్వనాథ సత్యనారాయణ ” గారు రాసిన ” విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు” అనే పుస్తకాన్ని చదివాను నేను ఈమధ్య.. ఇది చాలా చమత్కారమైన రచన.

ఆధునిక మేధావులని తమని తాము భావించుకునే కొందరు వ్యక్తులు స్వర్గంలో దేవేంద్రునితో ఒకరోజు  “ఇంగ్లీష్ భాషే గొప్పది .. వాటిముందు సంస్కృతము , తెలుగు తదితర భారతీయ భాషలెందుకూ సరితూగవు ” తరహా వాదనలు చేస్తూ ఆ మాటలలో భాగంగా పంచతంత్రం రాసిన విష్ణుశర్మనూ , ఆంధ్ర మహాభారతంలో కొన్ని భాగాలు రాసిన తిక్కన గారిని కూడా నిందిస్తూ దేవేంద్రునితో వాదనలకు దిగుతారు. ఇంద్రుడు వీరి గోల భరించలేక  విష్ణుశర్మనూ , తిక్కన గారినీ భూలోకానికి వెళ్ళి ఈ కథా రచయితైన విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర కొంతకాలం శిష్యరికం చేసి ఆ ఇంగ్లీషేదో నేర్చుకుని తిరిగి ఇక్కడకు వచ్చాక తనకు కూడా ఆ భాష నేర్పమని – అప్పుడు ఈ గోల చేసే వారి నోరు మూయిస్తానని వారిద్దరిని భూలోకానికి పంపిస్తాడు
వారిరువురూ భూలోకానికి చేరి విశ్వనాథ వారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుని తిరిగి స్వర్గలోకానికి చేరుకున్న క్రమంలో వచ్చే సన్నివేశాలు , మధ్యలో ఉండే సంభాషణలూ , అందులోని వివరణలూ చాలా బాగా అనిపిస్తాయి ఈ పుస్తకంలో.

ఇది ఇంగ్లీష్ భాష గొప్పదంటూ సంస్కృతాన్ని , తెలుగునూ చులకనగా చూసేవారికి ఆ ఇంగ్లీష్ భాషలోని లోపాలనూ , ఆ భాష యొక్క నిర్మాణం లోనూ , ఉచ్చారణలోనూ గల లోపాలను ఎత్తి చూపుతూ తెలుగు , సంస్కృతాలు ఎందుకు , ఏ విధంగా గొప్పవో వివరిస్తూ విశ్వనాథ వారు రాసిన సెటైరికల్ రచన. ఈ రచన పూర్తిగా చదివాక  ” అసలు భాష అంటే ఏమిటి ? దాని ప్రయోజనం కేవలం ఒక వ్యక్తితో మరో వ్యక్తి సంభాషించేందుకేనా దాని ఉపయోగం ? ” అని ఆలోచిస్తే భాష యొక్క విస్తృత ప్రయోజనాలు నాకు మరింత తోచాయి.

ఉదాహరణకు ” నీకు పిల్లలెంతమంది ? అని ఓ అవివాహితుడిని మీరు అడిగారనుకోండి. అతను ” నాకింకా పెళ్ళి కాలేదండీ ” అని నవ్వుతూ సమాధానమిస్తాడు. అసలు పెళ్ళికీ పిల్లలకీ సంబంధం లేదు కదా ? కానీ ఆ మాటలో “వివాహానికి పూర్వం శారీరక కలయిక కానీ , సంతానం గురించిన ప్రయత్నాలూ గానీ నిసిద్ధం.. వివాహమనే ఓ ధార్మిక తంతు ద్వారా మాత్రమే స్త్రీ పురుషుడు ఏకమవ్వాలి. అప్పుడే వారికి ఆ ఆ అనుభవాలకి అర్హత లభిస్తుంది ” అనే ఓ భావన ఉంది.. ఇంత లోతైన భావం ఆ మాటకుందని ఆ చెప్పినవాడికీ , విన్నవాడికీ స్పురించకపోవచ్చు కానీ ఆ మాటలో అంత అర్ధముంది. ఆ నీతి భాష ద్వారా అలా ప్రకటితమైంది అంతే.

అలాగే మీరు నడుస్తున్న రోడ్డు పై అకస్మాత్తుగా ఓ వ్యక్తికి యాక్సిడెంట్ అవ్వడం గమనించారు. “అయ్యో పాపం వారికెంత దెబ్బ తగిలిందో ” అనే ఓ సానుభూతి మాట అంటారు అప్రయత్నంగా మీరు ఆ క్షణం. ఈ “అయ్యో పాపం” అన్న మాట ఎందుకొచ్చింది మీ నోటివెంట? “మనిషి జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు అన్నీ ఆ వ్యక్తి యొక్క పాపపుణ్యాల ఫలితాలే. మనిషి జీవితంలో జరిగే ఘటనలన్నీ ఆ ఆ పాపపుణ్యాలను అనుసరించి ఇలానే జరుగుతాయి” అనే ఓ నమ్మిక మీకుండడం చేత.

అలాగే మీరు మన పెద్దవాళ్ళూ , గ్రామీణ రైతుల సాధారణంగా అనే సామెతలు గమనించండి
“మృగశిర కురిస్తే ముంగిళ్ళు చల్లబడతాయి, ఆరుద్ర కురిస్తే దారిద్రం ఉండదు, పునర్వసు – పుష్యమి కురిస్తే పూరెడు పిట్ట అడుగైనా తడవదు. మఖలో మానెడు విత్తనాలు చల్లడం కన్నా ఆశ్లేషలో అడ్డెడు విత్తనాలు జల్లడం మేలు. పుబ్బలో చల్లడం అంటే దిబ్బపై చల్లినట్లే. ఉత్తర చూసి ఎత్తర గంప, ఊరి ముందర చేను, ఊళ్ళో వియ్యం అందిరావు. ” ఈ తరహా సామెతలన్నీ వ్యవసాయం , ప్రకృతికి సంబంధించిన గమనింపు , అలాగే తమ తమ జీవితానుభవాల ద్వారా తాము నేర్చుకున్న అనుభవ జ్ఞానం తాలూకు మాటలను సూచించట్లేదూ?

భాషలో ఇలానే ఆ ఆ జాతి , ఆ దేశం యొక్క ప్రజల జీవితానుభవాలు , అందులోని కష్టనష్టాలూ,  పరిశీలన ద్వారా వారు నేర్చుకున్న జ్ఞానం , రూపొందించుకున్న మతం , సాంఘిక నియమాలూ, నీతీ , కళలూ , సంస్కృతీ , సాంప్రదాయాలు, సంస్కారం, జీవితాన్ని వారు చూసే కోణం, తత్వం ఇవన్నీ ఇమిడి ఉంటాయి. అవన్నీ ఇలానే సామెతల ద్వారా , జాతీయాల ద్వారా , మాటల ద్వారా వ్యక్తీకరించబడతాయి.

భాష కనుమరుగైతే ఆ నాగరికతా , ఆ జాతి జీవనం , ఆ ప్రజల అస్థిత్వం కూడా కనుమరుగైనట్లే
ఏ భాషైనా ఎక్కువ వ్యాప్తిలో ఉందంటే అందుకు సైనిక శక్తి కారణం అని అభిప్రాయపడతాను నేను. బ్రిటీష్ వారు అనేక దేశాలను ఆక్రమించి చాలా ఏళ్ళు వాటిని పాలించారు కాబట్టి వారి భాష ప్రపంచమంతా ఇంత విరివిగా , ఇంత వాడుకలో ఉంది కానీ ఇంగ్లీష్ కన్నా సొగసైనవి , తేలికైన భాషలెన్నో ఉన్నాయి ప్రపంచంలో. అయితే ఉపాధీ , ఆధునిక విజ్ఞానం అంతా ఇప్పుడు కేవలం ఇంగ్లీష్ భాష ద్వారా మాత్రమే ఇప్పుడు ఎక్కువగా లభిస్తోంది కాబట్టి మనమూ, ప్రపంచమంతా దానినే అనుకరిస్తున్నాం మన మన మాతృ భాషలను వదిలేస్తూ. దానిని తప్పు అని అనను కానీ ఆ కారణంగా మన అస్థిత్వాలనూ , మనదైన అలవాట్లూ , అభిరుచులూ , విజ్ఞానాన్నీ ఎలా కోల్పోతున్నామని సున్నితంగా హెచ్చరిస్తుంది ఈ రచన. అవకాశం ఉంటే కనుక తప్పకుండా చదవండి ఈ పుస్తకాన్ని.

You Might Also Like

One Comment

  1. D. Satya Narayana Reddy

    Am interested in this site.

Leave a Reply