‘ఫ్రమ్ ఎ డాక్టర్స్ డైరీ’-పుస్తక పరిచయం
వ్యాసకర్త: లక్ష్మీదేవి
*******
వైద్యంలో సాధారణ చికిత్సలు, శస్త్రచికిత్సలు, పరీక్షల ఆధారంగా రోగనిర్ధారణలు, వైద్యశాలలో చేరడాలు, బయటపడడాలు వంటి విషయాలలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కత్తిమీద సాము వంటివే వైద్యులకు, వైద్యశాలకూ కూడా. ఎందుకంటే ఇవన్నీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి తీసుకోవలసిన నిర్ణయాలు. ఒక వంక ప్రాణం కాపాడే/ఆరోగ్యం మెఱుగుపరిచే గొప్పపని. ఇంకో వంక ఏమాత్రం తేడా వచ్చినా రోగితో పాటు వైద్యునికి ఎదురయ్యే సమస్యలు. వైద్యో నారాయణో హరిః అనకుంటే మానె, అసలు విషయం పూర్తిగా అర్థం కాకుండానే వైద్యుల మీదికి దండెత్తే సామాన్యులకు కొంత వరకూ అవగాహన కలిగించే ఈ పుస్తకం పేరు ‘ఫ్రమ్ ఎ డాక్టర్స్ డైరీ’ రచయిత ఎస్ జి కబ్రా.
మానవశరీరం దానంతటదే ఒక ప్రపంచం. అందులో ఎంత పరస్పర సంపర్కము కలిగిన యంత్రాంగము ఉంటుందో కొద్దిగానైనా వైద్యపరమైన విషయాలు తెలుసుకున్న వారికి ఖచ్చితంగా తెలుసు. అలాగే వైద్యరంగంలో ఉన్న అన్ని శాఖలను నిర్వహించే మానవ యంత్రాంగం కూడా లోపల, బయట అనేక చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటూ, మానవ జీవన ప్రమాణాలను మెఱుగు పరిచేందుకు నిరంతరం సంసిద్ధంగా ఉంటూ ఉంటుంది.
వైద్యము, చట్టము, పత్రికారంగము మొదలైన శాస్త్రాలలో ఉన్నత విద్యను అభ్యసించిన ఈ రచయిత చికిత్సలకు, రోగనిర్ధారణకు సంబంధించిన విషయాలను, రుగ్మతలకు సంబంధించిన కొన్ని ఘటనల ఆధారంగా, సంభాషణల రూపంలో ప్రథమపురుష వ్యాఖ్యానంతో చట్టపరమైన కోణంలో సవివరంగా చర్చించారు. ఇది ఎంతవరకూ ప్రామాణికంగా ఉందన్నది వైద్యులు సాధికారకంగా చెప్పగలరు. కాకపోతే చికిత్స సమయంలో వైద్యులకు, రోగులకు ఉండే బాధ్యత, ప్రమాదం, నిర్ణయాలు తీసుకోవాల్సిన క్లిష్టమైన పరిస్థితి మొదలైనవి సామాన్యులకు ఎఱుకపరచడంలో ఈ పుస్తకం సఫలమైంది అని నా అభిప్రాయం.
అలా అని పూర్తిగా వైద్యుల పరంగా వ్రాసినదని అనుకోవలసిన పని లేదు. వైద్యుల పొరబాట్లు, మానవ శరీరయంత్రాంగనిర్మాణం తన నిర్వహణలో చూపే చమత్కారాలు, భావోద్వేగం కలిగించే కొన్ని ఘటనలు కూడా నూటొక్క పేజీల ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.
ఎంతో క్లిష్టమైన విషయాలను సందిగ్ధత లేకుండా వీలైనంత వివరంగానూ, అదే సమయంలో తగినంత క్లుప్తత పాటించి వ్రాసిన విధానం మెచ్చుకోదగినది. ప్రచురణలో లోపాలు లేకుండా, సరళమైన భాషలో ఉన్న ఈ పుస్తకం ఆసక్తి గల చదువరులను ఏమాత్రమూ నిరాశ పరచదు. ఇది 2013లో ముద్రించబడి, 2014, 2018 లలో పునర్ముద్రణ పొందింది.
Leave a Reply