ఎన్నెలమ్మ కతలు

వ్యాసకర్త: సత్య

*********

ప్రతీ ఇరవై ముప్పై ఏళ్లకీ పానుగంటి వారి జంఘాల శాస్త్రి లా కథలో కథల్లాంటి వ్యాసాలో రాకపోతే దేశకాల పరిస్థితులు, సాంఘిక మార్పులు రికార్డు కావు. 

హాస్యరచనా బ్రహ్మలు పూనుకొని పుస్తకాలు వేయాల్సిందే.. అటువంటిదే ఎన్నెలమ్మ కతలు. ప్రవాస భారతీయ పౌరసత్వాన్నీ, నోస్టాల్జియాన్నీ సమతూకంలో పడుగుపేకల్లా అల్లుకున్న రచనలివి. జాగ్రత్తగా బాలెన్స్ చేస్తూ.. విషాదాన్ని హాస్యాన్ని జోడుగుర్రాల్లా పరుగెత్తించారు. 

“మీ చదువులు తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర ఉన్న గోదారి లోనో, గంగలోనో , నర్మదలోనో అంతగా టికెట్ ఎందుకు వేస్టు అనుకుంటే అన్ని జలపాతములకెల్ల గొప్ప జలపాతము నయాగరా జలపాతము లోనో కలిపెయ్యండీ.. అవేవీ ఇక్కడ నాలుగ్గీసుకోడానిక్కూడా పనికిరావు…. ” అనే పరిస్థితి లో పెద్ద గా మార్పు లేకపోవడమే విషాదం.

విశ్వజనీనమయిన వర్ణవివక్ష విషజ్వాలలు, ఫలితాలు చదువరుల మనసులలో రేఖామాత్రం స్పర్శించకమానవు.

యాస పదాలు, ఇతర భాషా పదాలు, కొండకచో పద్యాలు వగైరా వగైరా అన్నింటిలో రచయిత్రి సాధికారతను అడుగడుగునా మనకు పరిచయం చేస్తూ నల్లేరుమీద బండిలా నడుస్తాయి  ఇందులో కథలన్నీ. 

భారతదేశ సందర్శనకు వచ్చీ కొంతవరకే ప్లస్సులు సాధించడం, మైనస్సులే ఎక్కువయ్యాయని నిరాశపడుతూ తిరుగుముఖం పట్టడం, చదువుకూ, ఉద్యోగానికీ మధ్య కుదురుగా కుటుంబంతో గడపలేని సమయాభావంతో రాజీపడటాలు,  ప్రవాసీయులకు బాధాకరమైనా తప్పని అనుభవాలు.

చాదస్తాల పెద్దవారిని సముదాయించుకుంటూ రావడం, ఇరుగుపొరుగు, స్నేహితులు, కెనడా రోజువారీ జీవనంలో ముఖ్యసమస్యగా ఎదుర్కునే మంచు వాతావరణం.. ప్రతీ సమస్యనూ  పాజిటివ్ గా చూసుకుంటూ వెళ్లారు. 

సమస్తమూ అతిలేని చక్కని చట్రంలో ఇమిడి అందుతాయి చదువరులకు. సంగీత కృతులూ అలవోకగా పలకరిస్తాయి బోనస్ గా. 

అనుభవాలలోంచి సారం జీవితంలో నింపుకుంటూ ఉంటే మరింత రసవంతంగా బ్రతకవచ్చు అనేదే సానుకూలసిద్ధాంతంగా  మారుతుంది చివరికి.

ఎక్కువగా బ్లాగులో వ్రాయడం వల్లనో, పబ్లిసిటీ కి దూరంగా ఉండడం వల్లనో హాస్యరచనలకు రావలసినంత గుర్తింపు రాకపోవడం  నాణ్యతకు లోపం అనలేము. కథలో, వ్యాసాలో, అంతరంగకథనాలో ఏవైతేనేం ఇదే ప్రక్రియ లో పేరొందిన రచనలు పూర్వకాలంలో చాలా ఉన్నాయి.. ఇల్లాలి ముచ్చట్లు ప్రసిద్ధం. 

చుట్టూ ఉన్న వాటి మీద పరిశీలనాశక్తి, పరిస్ఠితుల పట్ల అవగాహన, సానుభూతి ఉంటేనే ఇలా సర్వజనీనకమైన సాహిత్యం పుడుతుంది. 

కలం ఝళిపింపుకు దాసులైనవే అన్ని కథావస్తువులూ. . 

ప్రవాస భారతీయ జీవితమనే సముద్రంలో ధైర్యానికీ, చేయూతకూ వెదికితే దొరికే ఆసరా ఇటువంటి రచనలే.

మనిషి నిత్యవిద్యార్థి అనే మాట సార్ధకం చేస్తూ అంతులేని చదువులు చదివించే సంస్థలకు  విదేశంలో కరువులేదు. ఆ వెనుక తప్పిపోతున్న జీవితం వెంట పడి పట్టుకోవడంలోనే ఉంటారు  అందరు. చిన్నదో, పెద్దదో దొరికిన నివాసంతో సర్దుకుపోవలసిన పరిస్థితులు కూడా సాధారణం.

ఉన్న ఊరు, స్వంత దేశం వదిలి వెళ్లే వారికి ఎన్నో సందేహాలు, బెరుకు సహజంగా ఉండేవే.  వారికి అండగా ధైర్యానికి అక్కడి సాధకబాధకాలు, కష్టనష్టాలు తెలిపే రచనలు అవసరం. అక్కడి భారతీయులే పూనుకొని వ్రాయవలసిన పరిస్థితిలో .. ఇటువంటి కథలింకా రావాలి.. ప్రభావం చూపగల శక్తివంతమైన  ఈ కలం నుండి.

You Might Also Like

Leave a Reply