విశ్వనాథ-చలం
వ్యాసకర్త: సూరపరాజు పద్మజ
(ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ అభిప్రాయాలని పుస్తకం.నెట్ లో ఉంచడానికి అనుమతించినందుకు రచయిత్రికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*******
‘మైదానం‘ కు ప్రతివాదంగా వచ్చిన నవల, ‘ చెలియలికట్ట‘. సహజంగానే మైదాన ‘పాతక‘ మును ముంచేసి ప్రక్షాళన చేయదలిచే వచ్చింది ధర్మాగ్రహ జలపాతం లాగా ఈ నవల.
ముందు మైదానం చూద్దాం. ‘
‘కట్టలను త్రెంచి పూర్వ మర్యాదలురలి‘‘ ఇంటి గడప దాటిన రాజేశ్వరి, అయిన పెళ్లిని కాదని అనిపిస్తున్న ప్రేమ కోసం వెళ్ళిన ఆడది. రాజేశ్వరికి ‘ప్రేమ‘ నిజం, సహజం, పెళ్ళి అసంబద్ధంగా తోచాయి. అందుకే వివాహాన్ని దాటి వెలుపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇతరులకు క్షుద్రంగానూ, నరకప్రాయంగానూ అనిపించిన కష్టాలేవీ ఆమెకు కష్టాలు గా అనిపించలేదు. తన నిర్ణయం సరైనదేనా అని ఆలోచన రాలేదు. తన ప్రేమ దైవీకమైనది అనుకున్నది. చలం ఎప్పుడూ అనేమాట, ‘‘మంచీ చెడూ, అందం వికారం, సుఖం కష్టం, ఈ ద్వంద్వాలన్నీ మనసు చేసే సృష్టి. ఎలా అనుకుంటే అలా కనిపిస్తుంది”. ఆమె ప్రేమ ఇతరులకు కామం, ఆమె స్వేచ్ఛ వారికి విశృంఖలం.
‘చెలియలికట్ట’లో రత్నావళి కూడా ఇల్లు విడిచి స్వంత మరిదితో పారిపోయింది నిష్ఠాగరిష్టమైన ఇంటిని, భర్తను వదిలేసి. అయితే, ఈమెకు త్వరగానే తన నిర్ణయం లో పొరపాటు ఉందనీ, మరిది ప్రేమ మాటలకు తను ఆకర్షిత అయి ఈ పొరపాటు పని చేశాననీ గ్రహించింది. తనది ఆకర్షణ అనీ, ‘‘స్త్రీకి పెళ్లి అనేది ఆమరణ కైదు‘‘ అని మాటలు చెప్పే ఆదర్శవాదుల చేతలు శూన్యం, మాటల వరకే వారి ఆదర్శం అని తెలుసుకుంటుంది. విద్యను ఆశ్రయిస్తుంది. అది తెచ్చిన ఉద్యోగం ఆమెకు ఆర్థిక స్వావలంబన ఇస్తుంది. తనను మాయమాటలు చెప్పి బయటకు తీసుకువచ్చిన మరిదిని, వాడి స్త్రీ జనోద్ధరణ ఫిలాసఫీని తర్కం తో నిలదీస్తుంది. ఆధ్యాత్మిక, వేదాంత విచారణలు చేస్తూ ఒక నియమబద్ధ జీవితం గడుపుతూ బ్రహ్మచర్యం పాటిస్తుంది. ఎంత చక్కటి పరిణామము! ఇది కచ్చితంగా ఉన్నతి! కానీ, రత్నావళి రుచీపచీ లేని తన సంసారం లోనే ఉండిఉంటే (అట్లా ఉందనేకదా తను వివాహజీవితాన్ని వదిలేసి వచ్చింది! సంసారాన్ని త్యజించి సన్యాసం వంటి పెద్దఆశయాలకై రాలేదు కదా అప్పటికైతే తను!) రత్నావళి ఇంత గొప్పగా ఇన్ని విధాలుగా ఎదగగలిగేదా?
మరి, అదేకదా తేడా రాజేశ్వరి కీ, రత్నావళికీ అంటున్నారు. అవును, తేడా ఉంది. రత్నావళి రచయిత ఒక ideal ను చిత్రించాడు. చలం వాస్తవం చెప్పాడు. సరే! ఒక వివాహితురాలికి ఈ ఉన్నతి అవసరం లేదు అందామా? లేక, ఆ చట్రం లో అందుకు అవకాశం లేదు అందామా? Fortunate, prudential , providential , exceptions ఉంటాయి, వెయ్యి కి ఒకటి!
చలం వాదం:
వివాహం లో స్త్రీకి ఆత్మోన్నతి కాదుకదా, కాస్త స్వంత ఆలోచనకి కూడా స్వతంత్రం లేదు అని. ప్రేమకు ఆస్కారం లేదని. దాంపత్యం లో ఉండవలసిన అనుభూతి ఆమెకు దొరకటం లేదని. కానీ అలా కుటుంబం కాదని బయటకు వెళ్ళిన రాజేశ్వరి ఎన్ని అక్రమాల, అగచాట్ల పాలపడిందో, ఒకటీ వదలకుండా చెప్పింది ఎందుకంటే, బయట ప్రపంచంలో కూడా ఇంకొక నిర్బంధానికి, ఇంకొకరి అధికారానికి బలి అవుతోంది స్త్రీ అని చెప్పడానికే కదా.
‘మైదానం‘ కథ ఏదీ దాచిపెట్టలేదు. ఒకవైపు నుంచే కథను చెప్పలేదు. అమీర్ పైని రాజేశ్వరి ప్రేమ, రాధాకృష్ణుల శుద్ధ సత్వ ప్రేమ కాబట్టీ , మీర్ తోటి సాన్నిహిత్యం తన selfless offering వాడికి కాబట్టి రాజేశ్వరి నేరుగా స్వర్గానికి వెళ్ళినట్లు కథలో మనం చదవలేదు. తను చివరకు పోలీస్ స్టేషన్ లో తేలింది అనే చదివాం. చలం వాస్తవం ఎలా ఉంటుందో దాచి చెప్పలేదు. అసలు చలం ఎప్పుడూ చెప్పేదేమిటి? ‘స్త్రీ‘ , ‘స్త్రీ‘ అని పలవరించే చలం సాహిత్యం లో అంతా, అసలు వస్తువు పురుషుడు. మగవాడు స్త్రీ ని ఏ విధంగా ఒక వస్తువును, మర యంత్రాన్నీ చేసి వాడుకుంటున్నాడు అనేది అతని ఘోష. సృష్టి లో, ఇంటిలో, రెండు సమాన సగ భాగాలైన స్త్రీ పురుషులలో, మగాడు యజమాని, ఆడది బానిస, లేదూ, అతను వినియోగదారుడు , ఆమె వస్తువు గా తరాలు యుగాలు దొర్లిపోయాయి. పెళ్ళి, సంఘం అనే వ్యవస్థ లు ఈ విధమైన నమూనాలను నిమిషానికి వేల సంఖ్యలో అచ్చువేసే పెద్ద యంత్రాలు. తనకు లాభదాయకంగా ఉంటూ వస్తున్న ఈ సిస్టమ్ ను పడగొట్టాలని పురుషుడు ఎన్నటికీ పూనుకోడు కదా. అస్తిగతమైన ఈ తన ధోరణి అసలటువంటి ఆలోచనను కూడా రానీయదు. పైగా చలం వాదన, నమ్మకం ఏంటంటే వస్తుతః ప్రకృతికి లాగే స్త్రీ ప్రవృత్తి విశృంఖలం!
విశ్వనాథదీ అదే మాట! అచ్చపు ఇచ్ఛా, క్రియా శక్తి స్వరూపిణి స్త్రీ, ఇద్దరు రచయితల అభిప్రాయం ఇందులో ఒకటే. అందుకే! ఆమెను కట్టేసి హింసించకండి, అది పాపం ! అంటాడు చలం. అందుకే, అందుకే! ఆమెకు కట్టుబాట్లు అవసరం, లేకపోతే ఆమెతో పాపం చేయబడుతుంది అంటాడు విశ్వనాథ. ఇంతే తేడా!
వివాహం అనే చట్రం ఆమెకు రక్షణను ఇస్తుంది. ఆ కారణంగా కుటుంబం, సంఘం, ధర్మం క్షేమం గా నిలబడతాయి అనేది ఒకరి సిద్ధాంతం. కుటుంబం, సంఘం, సంస్కృతి నిలబెట్తూపోతే స్త్రీకి ఒరిగేది ఏముంది, పలురకాల గృహహింస తప్ప అనేది రెండవ వారి వాదన. చలం, వివాహం లో స్త్రీ పై జరిగే అరాచకాలను చెప్పడం తోపాటు మరో ప్రమాదకరంగా సున్నితమైన విషయం లేవదీస్తాడు, స్త్రీ లక్షణమైన ‘ప్రేమ‘ను. ప్రకృతి సహజ ప్రవృత్తి ప్రేమించడం, ప్రేమించబడటం. పురుషుడిది కామం అనే అంటాడు మొహమాటం లేకుండా.
మొదటి దాంట్లో రెండవదీ ఉంటుంది కానీ రెండో దాంట్లో మొదటిది ఉండదు. ప్రేమ, ఒకరిపైనే ఎల్లకాలమూ ఉంటుందనే వెర్రి బాగుల ఆలోచన చేయొద్దనేదీ అతని మరో ‘‘విపరీత అనాచార ధోరణి‘‘ వాదన. పురుషుడికైనా స్త్రీ కైనా “ఆమిషాస్థుల”తో పాటు మానవదేహం కామంతో నిండి ఉంటుంది. అసలు కామమే కావించిన రూపం మనిషి శరీరం. “అది మాకు లేద”నేవారూ, “మాది అమలిన ప్రేమ” అనేవారూ ఇద్దరూ అబద్ధం అంటాడు చలం. అది ఒక మనిషితో జీవితాంతం ముడివెయ్యడం ఆయన దృష్టిలో రోజుకొకరితో వ్యభిచారం ఎంతో అంత నీచం. అసలు ఆ ఊహ, వాంఛ రాకుండా ఉంటే పరాయి స్త్రీ ని చూసినప్పుడు, అప్పుడు వాడు మనిషి కాదు అంటాడు. బుద్ధికి తోచిందల్లా చేసే పశువుకు మనిషికీ తేడాలేదా అంటాడు విశ్వనాథ.
తేడా ఎందుకు అన్న చలం నానా అవమానాలూ పడ్డాడు బహిష్కరింపబడ్డాడు. ఉండశక్యం కాని చోట్లలో ఉన్నాడు. ఎందుకంటే తనకొచ్చిన ఒక మీమాంస తేల్చుకోవటానికి తన జీవితమే ప్రయోగశాలగా మార్చుకున్నాడు.నీతి, నియమబద్ధత మనసులో లేంది వట్టి దేహంతో ఆచరించటం ఆత్మవంచన అంటాడు. అంతిమ సత్యమేదో తెలుసుకునేదాకా అతను ఇటువంటి చేతలూ వ్రాతలూ చేస్తూపోయాడు .’మనసు’ ను గమనించే విద్యనే అతన్ని రమణాశ్రమం చేర్చిందేమో. చలం పైకి మాట్లాడేది, దేహపు ఆకలి, మానసిక సంతోషాల గురించి. నిజానికి అతని పేచీ మానవ బుద్ధి ని అర్థం చేసుకోవడానికి, చేయించడానికి నిరంతరం తను పడే తాపత్రయం. అతని మ్యాజింగ్స్ , is nothing but fine psycho analysis and profound philosophical ramblings.
ఇక విశ్వనాథ మైదానానికి జవాబుగా వ్రాస్తున్న ఈ ఒక్క నవలలోనే కాదు, ఆయన ఏ కథ వ్రాసినా అది ధర్మారావైనా దశరథరాముడైనా ‘‘ కోన్ వస్మిన్ సాంప్రతం లోకే‘‘ ఎత్తులో మొదలు పెడ్తారు, ఆ ఎత్తుకే తీసుకెళ్తాడు. ధర్మస్వరూపమైన ఒక ideal character కథే చెప్తాడు. అది చాలా గొప్ప, మంచిదే. నీతి వర్తనను బోధిస్తుంది, వినేవాళ్ళకి! చలం పాత్రలు, చుట్టూ రొచ్చులో చీము నెత్తురు కారుతూ నానా పాట్లు పడుతూ, ‘‘ నానా చంకలు నాకుతూ‘‘ బ్రతికే సగటు మనుషులు. నిజానికి ఈ విధంబైన కథలు చదివి కూడా బాగు పడవచ్చు. ఇలా ఉండకూడదు అని తెలిసి వచ్చేట్టు ఉన్నాయి కదా ఆ కథలూ. ఆయన అందరినీ అమీర్ ను ప్రేమించి వాడితో కడుపులో తన్నించుకోండని చెప్పలేదు. ఇంత అచంచలమైన ప్రేమ అమీర్, మీర్ లమీద ఉన్నదైనందువల్ల రాజేశ్వరి చివరకు స్వర్గానికి కొనిపోబడింది అనీ చెప్పలేదు. ‘‘ గంగా కూలంకష వివేకభ్రష్ట సంపాతముల్‘‘ ఎలా ఉంటాయో ఒక్కటీ వదలకుండా చెప్పాడు.
కుటుంబం క్షేమంగా ఉండాలంటే సామాజిక కట్టుబాట్లు, ధర్మాచరణము వివాహజీవితం లో ఎంత ముఖ్యం గా అవలంబనీయమో విశ్వనాథ వారు చెప్పారు. కేవలం క్షేమమే కాదు వ్యక్తిత్వ శ్రేయస్సుకు కూడా ఒక నీతివర్తనం అవసరం. అది వదిలేస్తే ఎంత పాతకంగా జీవితం పర్యవసిస్తుందో చెలియలికట్ట చెప్పింది, మైదానం కూడా చెప్పింది.
చలానికి ముందర వివాహేతర సంబంధాలు పుట్టలూ, కోట్లూ లేవా? చలాన్ని చదివి ఈ పనులకు ఎవరూ పూనుకోనవసరం లేదు. ఉన్నది , జరుగుతున్నది ముసుగులు తీసి చూపించి చెప్పాడు చలం. రత్నావళికి పరివర్తన రప్పించాడు విశ్వనాథుడు. ఆమె సుకృతం. ఆబ్దికాలు పెట్టించుకోవాలనీ తెలిసినంత ధర్మం చదువుకుంది. మరణమే తనకు శిక్ష అనీ అనుకుని వెళ్ళిపోయింది అలలలోకి. విశ్వనాథను చదివి ఎంతమంది తమ నడత మార్చుకున్నారు?
పాత్రల ద్వారా రచయిత తన వాదనలను వినిపిస్తాడు, అంతే! the better the craftsman, the better he shows the conflict in the character. ఆయన ‘ఏకవీర‘ ఆ విషయం గా నిర్ద్వంద్వంగా గొప్ప సాహిత్య సృష్టి. చలం నవలలు ఆయన మ్యూజింగ్స్ కి concrete కొనసాగింపు.
నిజానికి ఇద్దరూ వారి వారి పథాలలో స్వ ఇచ్ఛతో ప్రయాణం సాగించిన సత్యాన్వేషులు. కవిసామ్రాట్ బ్లూ ప్రింట్ చేతిలో పెట్టుకుని తను ధర్మమని నమ్మిన దేదీప్యమైన కాగడాతో నడుస్తున్నాడు. చలం కీకారణ్యంలో తన స్వకాంతితో, అది గుడ్డి లాంతర వంటిదో, స్వచ్ఛ మనస్కుడు కాబట్టి దాని వెలుగు తారాకాంతి సమమో ఆయనకే తెలియాలి, తనే వెతుక్కుంటూ వెళుతున్నాడు.
నవలలు వ్రాయవలసిన అవసరం ఇద్దరికీ లేదు. They would’ve been happily busy with their meditations if not something compelled them to write. అసమానమైన కవులు ప్రధానంగా వీరిద్దరూ. పద్యం గానీ గద్యం కానీ వీరి కవిత్వం ‘తారాకాంతి తిరస్కార’ అన్నట్లే ఉంటుంది. నవలలు వ్రాయకపోయినా చిరస్థాయిగా నిలిచే కవితా సృష్టి చేశారు. పోనీ,తెలుగులో నవలా రచయితలు వీరిద్దరేనా ఉన్నది! వీరినే పోల్చేందుకు ఎల్లకాలమూ. ‘రాస్కల్ నికొవ్’ పాత్ర అంతస్సంఘర్షణ మహాభారత స్థాయిలో ఉంటుంది. అది ఏ తెలుగు నవల పాత్ర అందుకుని ఉండదు. రత్నావళి నిర్ణయం వెనక, రాస్కల్ నికొవ్ నిర్ణయం వెనక కార్యకారణాలు వాటి వివేచన, పాత్రల ఆత్మవిచారణ, inner conflicts మధ్య బహు దూరం ఉంది.ప్రధానంగా విశ్వనాథ, చలం ఇరువురూ మహా కవులు, సత్యార్థులు. ఒకరి పాండిత్యప్రాభవం రెండో వారికి తెలిసిన సహృదయులు.
Leave a Reply