పండుగలు ముత్యాల హారాలు

వ్యాసకర్త: కందుకూరి భాస్కర్

********

సంస్కృతీ సంప్రదాయాల ప్రతిబింబం – పండుగలు ముత్యాల హారాలు 

ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్యంలో అనేక సాహితీ ప్రక్రియలు పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఎందరో కవులు, సాహితీవేత్తలు అనేక రకాల నూతన కవితా ప్రక్రియలను రూపొందించి తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇలా వచ్చిన  ప్రక్రియల్లో  కొన్ని పాఠకుల ఆదరణను చూరగొంటున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన కవితా ప్రక్రియల్లో నవకవుల, సాహితీ అభిమానుల ఆదరణ పొందిన వాటిలో  “ముత్యాల హారం” ఒకటి. 

  ‘ముత్యాలహారం’ రూపకర్త రాథోడ్ శ్రావణ్. వృత్తిరీత్యా హిందీ అధ్యాపకులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి యందు పనిచేస్తూ, తెలుగు సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు, సమీక్షలు,వ్యాసాలు, చేస్తున్నారు. ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులుగా వివిధ సాహితీ సేవా కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాక నవ కవులకు స్ఫూర్తినిచ్చేలా ముత్యాల హారం అనే నూతన లఘురూప కవితా ప్రక్రియను రూపొందించారు. తెలుగు భాష పట్ల, ఛందస్సు పట్ల కొంత అవగాహన ఉన్న ఈ ప్రక్రియలో సులభంగా రచనలు చేయవచ్చు. అందుకే విద్యార్థులు మొదలుకొని అనేక మంది సాహితీప్రేమికులు ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారు, రచనలు చేస్తున్నారు. అందులో కొన్ని పుస్తకాలరూపంలో వెలువడుతున్నాయి.

ముత్యాలహారం నియమాలు..
1. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. 

2. ప్రతి పాదంలో 10 నుండి 12 వరకు మాత్రలు  ఉండాలి. 

3. అన్ని పాదాలకు అంత్యానుప్రాస ఉండాలి.

4. నాలుగు పాదాలు కలిపి చదివినప్పుడు భావాత్మకంగా ఉండాలి.

ముత్యాల హారం  ప్రక్రియలో రూపకర్త రాథోడ్ శ్రావణ్ కలం నుండి వెలువడిన అద్భుతమైన ఆణిముత్యమే ‘పండుగలు ముత్యాల హారాలు’.  ఈ పుస్తకంలో రచయిత వివిధ పండుగల ప్రాశస్త్యాన్ని చాల చక్కగా చెప్పారు. ఇవన్నీ కూడా అంత్యప్రాసను కలిగి ఉండటం వల్ల గాన యోగ్యంగా కూడా ఉన్నాయి. భారతీయులు జరుపుకునే పండుగలతో పాటు మహానీయుల జయంతులను మరియు కొన్ని ముఖ్యమైన దినోత్సవాల ప్రాధాన్యతను ఇందులో తెలిపిన తీరు మిక్కిలి ప్రశంసనీయం.

తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ మొదలుకొని హోలీ పండుగ వరకు ఉన్న వివిధ పండుగల గురించి, గాంధీ, అంబేడ్కర్, శివాజీ, సంత్ సేవాలాల్ మొదలగు మహానీయుల జయంతుల గురించి నేటి తరానికి తెలియజేశారు. అంతేకాక  జెండా పండుగ, బాలల పండుగ, ఉపాధ్యాయ దినోత్సవాల గురించి కూడా ఇందులో పొందుపరిచారు రచయిత. ఇవన్నీ కూడా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. మచ్చుకు కొన్నిటిని చూద్దాం.

“ఉగాది మన పర్వదినం 

పచ్చడి రుచి కమ్మదనం

 తేట తెలుగు తీయదనం 

అందరికీ పండగ దినం” 
   

తెలుగువారి తొలి పండుగ ఉగాదితో ఈ కవితా పుస్తకాన్ని ప్రారంభించారు రచయిత రాథోడ్ శ్రావణ్. కాలంలో మార్పును సూచించేది ఉగాది పండుగ. ఆరోజు చేసే పచ్చడి రుచిని మనకు చూపారు. ఉగాది పచ్చడిలాగే మన జీవితంలో కూడా కష్టసుఖాలు ఉంటాయని అంతర్లీనంగా తెలిపారు. తెలుగువారి ఔన్నత్యాన్ని తెలిపేలా ఇందులో మరికొన్ని ముత్యాల హారాలు పేర్చారు.

  “గణపతి ఆదిదేవుడు

పూజలో ప్రథమ పూజ్యుడు

పరిపూర్ణ స్వరూపుడు

వినాయక విశ్వరూపుడు”

హిందువులకు ఆదిదేవుడైన గణపతిని ప్రథమ పూజ్యుడు, పరిపూర్ణ స్వరూపుడు అంటూ వినాయక చవితి శీర్షికన రాసిన ముత్యాలహారాలలో మట్టి గణపతిని పూజించమని కాలుష్యాన్ని నివాలరించాలని రచయిత తనకున్న సామాజిక బాధ్యతను చాటుకున్నాడు.

“దళితుల బంధావుడు

కలియుగాన దేవుడు

ఉద్యమాల సూర్యుడు

భీంరావు అందరివాడు” 

రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ను ఏ ఒక్క కులానికో, మతానికో పరిమితం చేయవద్దని అతడు అందరి వాడని అందరి శ్రేయస్సు కోసం అహర్నిశలు ఉద్యమించాడని అంటారు.

“ఒత్తిడి తగ్గించువాడు

స్ఫూర్తినిచ్చేవాడు

అభినందించువాడు

వాస్తవాన్ని చెప్పువాడు”

మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవాడు, మనల్ని ప్రోత్సహించువాడు, సత్ప్రవర్తన బోధించి, సన్మార్గంలో నడిపేవాడు అంటూ గురువు  గొప్పతనాన్ని గురించి తెలుపుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాసిన ముత్యాలహారాలు బాగున్నాయి.

ఇలా అలతి అలతి పదాలతో  అందరికీ అర్థమయ్యేరీతిలో రాశారు రాథోడ్ శ్రావణ్. అక్కడక్కడ కొన్ని ముత్యాల హారాలు ముక్తక స్వభావం లేకుండా అసంపూర్ణగా ఉన్నట్టు కనిపించినా, మిగతా వాటిలో విషయానుగుణంగా అద్బుతమైనభావాన్ని పలికించారు. ఆదివాసీ, బంజారాల పండుగలైన తీజ్, దండారి,  సీత్ల పండుగ, హిందూ పండుగలైన ఉగాది, శ్రీరామనవమి, గురు పూర్ణిమ, నాగుల పంచమి, రాఖి పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, మహా శివరాత్రి, హోలీ మొదలగు పండగల గురించి, ముస్లింల పండుగ రంజాన్, క్రైస్తవుల పండుగ క్రిస్మస్ ల గురించి తెలియజేస్తూ సమైక్యతను చాటారు. ఇందులో ప్రతి ముత్యాల హారాన్ని ఎంతో శ్రద్ధతో పేర్చి తెలుగు భాషామతల్లి మెడలో అలంకరించారు రచయిత. రాథోడ్ శ్రావణ్ కలం నుండే కాక మరెందరో కవుల నుండి ముత్యాల హారం ప్రక్రియలో సామాజికోపయోగమైన రచనలు వస్తాయని ఆశిస్తూ అభినందనలు.
పండుగలు ముత్యాలహారాలు 

పుస్తకం వెల. 75 రూ.

ప్రతులకు: రాథోడ్ శ్రావణ్, ఇ.నెం 2-2/1, సుభాష్ నగర్ ఐబి, ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా

సెల్. 9491467715.

You Might Also Like

Leave a Reply