కన్నడ సాహితీక్షేత్రంలో -1: బీchi

కన్నడ సాహితీక్షేత్రంలో నన్ను ప్రభావితం చేసిన రచయితలు

వ్యాసకర్త: నీలారంభం కళ్యాణి

********

ఈ రచయిత గురించి పరిచయం చేసే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. నా చిన్నప్పుడు అమ్మ రోజూ స్నానం చేసి వంట మొదలు పెట్టేవారు, కాని నైవేద్యం లాంటి అలవాట్లు లేవు. నాన్నని టైముకి సరిగ్గా బ్యాంకుకి బయలుదేరేలా చూసుకోవడం ఆమె ధ్యేయం. చాలా పెద్ద మాట, కానీ నిజం. దీనికి మినహాయింపు మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం. అమ్మ వంటా, పూజా, నైవేద్యం అయ్యేవరకూ తాకకూడదు. అమ్మ కొంగు పట్టుకుని తిరిగే అలవాటు లేదు కానీ, తాకకూడదు అనేసరికి బెంగ వచ్చేసేది. మడి ఐపోయింది అనగానే ఒక్కమారు ముట్టుకుని, ఆటలాడుకోవడానికి పారిపోయేదాన్ని. మా ఇంటి వెనకాల మామీ, ఐయ్యంగార్లు, ఇంట్లో ముందర హాలువరకే పరిమితం నా ఆటలు. వాళ్ళు వేడి వేడి కాఫీ వెండి గ్లాసులో పైనుండి పోసుకుని తాగుతూంటే నా నాలుక కాలేది. మేము రాజమండ్రి లో అద్దెకున్న ఇంట్లో బామ్మగారు బావిలో నీళ్లు తోడుకుని, పెద్ద బిందె చంకలో, చిన్న చెంబులో నీళ్ళను ముందర చిలకరించి, దానిపై అడుగులు వేస్తూ వెళ్ళడం వింతగా అనిపించేది.

ఈ విషయాల గురించి తీవ్రంగా ఆలోచింపజేసిన ఒక రచయిత బీchi, రాయసం భీమసేనరావు (1913 -1980) బళ్లారి జిల్లాలోని హరపనహళ్ళిలో పుట్టారు. పుట్టిన వెంటనే తండ్రిని పోగొట్టుకుని కష్టాల్లో పెరిగారు. ఎస్సెసెల్సీ వరకూ చదివి ముందు ఓ ప్రభుత్వ సంస్థలో అటెండర్ గా చేరారు, ఆ తర్వాత CID ఆఫీసులో పనిచేశారు. ఆయనకు కన్నడ భాషంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఆయన భార్య సీతాబాయి కన్నడ ప్రేమి. ఈయన మైసూరు పనిమీద వెళ్తూంటే ఏదైనా కన్నడం పుస్తకం తెచ్చిపెట్టమని అడిగారు. అప్పటికింకా రచయిత కాని భీమసేనరావుగారు పుస్తకాల షాప్ లో “ఏదైనా కన్నడం పుస్తకం ఇవ్వు, అది రైల్వే టైమ్ టేబుల్ ఐనా పర్లేదు కన్నడంలో ఉండాలంతే “అనడిగారట. అదృష్టం కొద్దీ అతడు అ న కృ (ఎ .ఎన్. కృష్ణరావు, చాలా పేరున్న రచయిత ) సంధ్యారాగ అనే నవల ఇచ్చాడు. అది చదివిన తన భార్య స్పందన చూసి ఆ పుస్తకం చదివి కన్నడ ప్రేమి, రచయిత అయ్యారు.

ఆయన రచయితగా, వ్యక్తిగా కూడా విలక్షణమైన మనిషి. తన పేరుని కన్నడం ఇంగ్లీషు సమ్మిళనం చేసి ಬೀchi అని రాసుకునేవారు. 63 నవలలు, 8 నాటకాలు రచించిన బీchi ని బెర్నార్డ్ షా తో పోల్చేవారు. ఆయన రచించిన నవలల సంఖ్య ఒక కారణమైతే ఆయన వ్యంగ్యపూరిత శైలి ఇంకో కారణం. మనం పెరిగిన వాతావరణం మన రచనా ధోరణిలో ప్రతిబింబిస్తుంది. ఆయనకు ఆచారాల పైన పట్టింపుల పట్ల నిరసన ఉండేది. ముఖ్యంగా దేన్నైనా మూర్ఖత్వపు పరమావధికి తీసుకుని వెళ్తే ఎంత విషాదాన్ని సృష్టిస్తుందో చూపడం ఆయన ఉద్దేశ్యం. ఏకాదశి ఉపవాసం ఇంట్లో వారితో బాటు ఇంట్లోని ఆవుకీ దూడకూ కూడా వర్తింపజేసే పాత్రలను చూస్తాం ఆయన నవలల్లో. ఆయన చదువు, సంగీతం పట్ల ప్రేమ ఉన్న చిన్న అమ్మాయిని ఆ గంధమే లేని ఇంట్లో పడేస్తే ఏమవుతుందో చూపించిన సరస్వతీ సంహార చదివి వెక్కి వెక్కి ఏడవడం గుర్తుంది ఇంకా.

ఎల్లరూ సంపన్నరే (అందరూ సంపన్నులే ) నవల ఇలా మొదలవుతుంది:

“నేను బ్రహ్మచారిని , నా నాన్న బ్రహ్మచారి, నా తాత ముత్తాతలందరూ బ్రహ్మచారులే ……. నా వంశమేబ్రహ్మచారుల వంశం,తెలుసా?” ఈ నవలను ( మడివంతికె కాదంబరి ) మడిపూరితమైన నవల అంటారాయన. దీనిలో మూఢాచారపు పరాకాష్టను చూపిస్తారు. ఈ ఒక్క రచయిత అని కాదు, నేను నా చిన్నప్పుడు చదివిన రాహుల్ సాంకృత్యాయన్ రచనలు కూడా మన అలవాట్లనీ, సాంప్రదాయాలను విడమరిచి చూసే కోణాన్ని నాలో పెంచింది.

ప్రతీ సాంప్రదాయం ,ఆచారం వెనుక ఉండే కారణాన్ని విశ్లేషించి, ఈనాటి మన జీవన విధానం లో ఎంత వరకు సమంజసమో అంతవరకే పాటించడం అలవాటు చేసుకున్నా. బీchi రచనలు, ఆయన విలక్షణమైన శైలి, ఆయనను ఓ ప్రత్యేకమైన స్థానంలో నిలబెడతాయి. నాకు తెలిసినంతవరకూ అవి తెలుగులోకి రాలేదు. శర్వాణి రెండు కథలు అనువదించారు ప్రణయపత్రాలు, స్పెషల్ క్లాస్. మొదటి కథ భర్త వదిలేసిన, చదువురాని, పనులు చేసుకుని బ్రతికే ఓ స్త్రీ మనసులోని ఆరాటాన్ని, రెండో కథ “స్పెషల్ క్లాస్” ఆ కాలానికి బహుశా కొంచెం కొత్త కావచ్చు, చదువుకునే పిల్లలు ఈ స్పెషల్ క్లాస్ వంకన ఏం చేస్తారో చూబెడుతుంది.

నా ఉద్దేశ్యం బీchi శైలిని పరిచయం చేయడం గనుక ఆయన నవల “అందరూ సంపన్నులే” లో ఓ చిన్న సంఘటన మీకోసం.

************

అందరూ సంపన్నులే – బీchi; ప్రచురణ : 1961; పేజీలు110 -112

నిన్నో ఇవాళో పట్టుకున్నదా ఈ మడి రోగం? ఇది చర్మానికి మాత్రమే తగులుకున్నది కాదు. తరతరాలుగా అంటుకుంటూ వచ్చి ఆస్తిగా తయారయిన రోగం. దానినుండి విముక్తి ప్రసాదించడానికి సాక్షాత్తు ఆ దేవుడికి మాత్రం సాధ్యమా? పాండురంగాచార్యులవారింట్లో ఏకాదశి వ్రతం ఆచరించడాన్ని చూసితీరాలి. ఆచార్యులవారు, శకుంతలమ్మ మాత్రమే కాదు, శ్రీధరుడూ, కోడలు శాంతకు కూడా ఆరోజు అన్నమూ లేదు నీరూ లేదు. నిజానికి దాన్లో పేద్ద ఆశ్చర్యమూ లేదు. ఆర్నెల్ల చంటిది భీమవ్వకూ ఆరోజున శాంత పాలు తాపించకూడదు. బిడ్డ మరీ ఎక్కువగా ఏడిస్తే , “దానికెందుకు అంత బెంగ పడతావు?ఎండ వేడికి ఏడుస్తోంది, అంతే ఓ రెండు గరిటల మంచి నీళ్ళు పట్టు, సరిపోతుంది” అని కోడలికి చెప్పేవారు.

తుంగ -ఆచార్యులవారింటి ఆవు – దానికీ శాస్త్రోక్తమైన ఉపవాసం ఆరోజు. ఓ చుక్క నీరు కానీ, ఓ గడ్డిపరక గానీ దానికి దొరక్కూడదు. దశమి నాటి రాత్రే దాని కొట్టాం శుభ్రంగా కడిగి ఆవుని కట్టేసేవారు. మళ్ళీ ద్వాదశినాటి పొద్దున్నే దానికి మేతా నీరూ. ఏకాదశి నాడు అది ఏమైనా తింటే ద్వాదశినాడు దాని పాలు దేముడి అభిషేకానికి పనికిరావే! దానికి ఓ నెల వయసు తెల్ల దూడ ఉండేది. దాన్ని వెండి కొండా అని పిలిచేవారు. ఆ పేరు వినగానే మెడ తిప్పి చూసేది. ఆ వెండికొండకూ ఏకాదశి పాట్లు తప్పవు. ఆ పండుగ పూట దానికీఉపోషమే! ఎవరికీ కనబడకుండా ఎక్కడ పాలు తాగేస్తుందోనని ఆ ఒక్క రోజున దూడను వేరే చోట కట్టేసేవారు.

ఇది పాండురంగాచార్యులవారింట, వారి ఇంట్లో జనం మనసుల్లో తరతరాలుగా తిష్ట వేసుక్కూర్చున్న మడిభూతం. ఆవూదూడలతో కలిసి స్వర్గానికి వెళ్ళే గొప్ప వంశం వారిది. ఇలాంటి ఇంటికి కోడలుగా వచ్చిన శాంత మాత్రం ఎలాంటి కుటుంబాన్నుండి వచ్చింది?కుంభకోణపు కుప్పణ్ణాచార్యులవారి కూతురు. ఈ రెండు ఇళ్ళూ ఒకే ఆఫీసు రెండు బ్రాంచ్ లు. ఇంటి బయటి అరుగుమీద ఎప్పుడో కుక్క పడుకుని ఉండడం చూశారు శకుంతలమ్మ.

ఆ కుక్కని తరిమి, కోడలితో చెప్పారు, “శాంతా! అరుగుమీద కుక్క పడుకుంది. అరుగు మైలపడింది చూడు …..”

“నీళ్ళు పోయనా అత్తా ?”

“రెండు బిందెల నీళ్ళు కుమ్మరిస్తే అదెలా శుద్ధి ఔతుంది శాంతా ? ఒకింత ‘ఆవుది గో మూత్రం ఉచ్చ’ కూడా తెచ్చి చిలకరించు అక్కడ.”

కుక్క ముట్టిన అరుగు మైల -ఆవు మూత్రం మటుకు మడి !!

ఈ విషయం మన కుక్కలకూ ఆవులకూ తెలిస్తే ప్రమాదమే . .

————-౦———–

You Might Also Like

Leave a Reply