పుస్తక దినోత్సవం సందర్భం గా …

వ్యాసకర్త: వాడ్రేవు వీరలక్ష్మీదేవి

*********

పుస్తక దినోత్సవం సందర్భంగా నా మనసులో మాటలన్నీ ఇలా వచ్చేయి. నిన్ను ప్రభావితం చేసిన పుస్తకం ఒక్కటి చెప్పు అంటే ఎవరమేనా చెప్పగలమా?? అలా ప్రశ్నించుకుంటే వచ్చిన మాటలు ఇవి.

మిత్రులారా, ప్రభావం అన్న మాటే ఎంతో విలువయిన మాట అనిపిస్తుంది. శక్తివంతమయిన మాట కూడా. జీవితంలో మనని ప్రభావితం చెయ్యగల వ్యక్తులు, అటువంటి శక్తివంతమయిన పుస్తకాలు దొరకడం ఎంతో గొప్ప సంగతి. అది మనకు పట్టిన మహాదృష్టం. నా చిన్నతనంలో నన్ను ఆకర్షించిన మొదటి పుస్తకం నాలుగో తరగతి తెలుగు వాచకం అని గుర్తు. అందులో ‘జీమూతవాహనుడి కథ’ నాకు ఇప్పటికీ అద్భుతమే. అప్పటినుంచీ ప్రతియేటా చదువుకునే తెలుగువాచకాలూ అందులోని గొప్ప గొప్ప కథలూ వెన్నంటి ఉండేవి. పానుగంటి నరసింహారావు గారి సాక్షి వ్యాసాలు ఎంతో ఉత్తేజకరంగా ఉండేవి. ఆ భాష, వ్యంగ్యం, విమర్శ, హాస్యం అన్నీ కలగలిసిన ధార – పాఠ్యభాగాలుగా పెట్టిన ఆ వ్యాసాలు ఇప్పటికీ కంఠస్థమే.

తెలుగు వాచకాలు చదువుకునే రోజుల నుంచి తెలుగే సర్వస్వంగా చదువుకుని, తెలుగే పాఠాలుగా చెప్తూండగా రోజులు గడిచాయి. ఆ విధంగా సంవత్సరాలకి సంవత్సరాలు వెలిగేయి. ఎన్నో ఇబ్బందులలోంచి, వడిదుడుకులలోంచి సాగే జీవితాన్ని సారవంతం చేసాయి ఎన్నో పుస్తకాలు. 

అవే లేకపోయి ఉంటే ఈ జీవనంలోంచి చేదు తప్ప మరే రుచీ ఆస్వాదించడం తెలిసి వుండేది కాదు. మహానుభావులయిన ఎందరో కవులు, రచయితలు ఈ జీవితంలోని శోభాయమానమైన పలు వర్ణాలను చూపిస్తూ వాటి సమ్మేళనం వల్ల కలిగే స్వచ్ఛ శుభ్రమయిన, ధవళ సరస్వతీరూపాన్ని కూడా సాక్షాత్కరింపచేయగలిగారు. ఇంతమందిలో, ఇన్ని పుస్తకాలలో ఏ ఒక్కదాన్ని బయటికి తీసి దీని ప్రభావం నామీద అమితంగా ఉంది అని చెప్పగలను? ఈ ఆలోచనతోనే చాలా రోజులు గడిచాయి.

నిజానికి ఒక చిన్న కవిత, చిన్న కథ కూడా నామీద అమితమైన ప్రభావం చూపినవి ఉన్నాయి. జీవితంలో వెన్నంటి వస్తూ ప్రతి సందర్భంలోనూ దారి చూపిన కథలున్నాయి.

మునిపల్లె రాజుగారి ‘సవతి తమ్ముడు’ కథ అలాంటిది. ఆ కథ నామీద చాలా ప్రభావం చూపింది. ఎంతటి అపకారం చేసిన వాళ్ళని కూడా ద్వేషించకుండా ఉండే ప్రయత్నం చెయ్యవచ్చని ఆ కథ ఎంతో శక్తివంతంగా చెప్తుంది.  పాలగుమ్మి పద్మరాజుగారి ‘హెడ్‌ మాష్టరు’ కథ మరో బలమైన ప్రభావం వేయగల కథ ` గొప్ప వ్యక్తులు మన జీవితంలో తారసపడితే వారు మన మీద తమ ప్రభావం ఎలా చూపగలుగుతారో ` మనం ఎంత జులాయిగా ఉన్నా కొన్ని అవసరమైన సందర్భాల్లో వారి ప్రభావం వల్ల ఎంత పెద్ద తరహాగా పనులు నిర్వహించగలమో ! అద్భుతంగా చెప్తుంది ఆ కథ. 

ఇలా చెప్పుకుంటూ ఉంటే కథల వెంట నవలలు వస్తాయి. ఈ ప్రవాహం అంతు లేకుండా సాగుతుంది. గొప్ప సాహిత్యం జీవితంలో భాగమైతే ఆ మనుషుల ప్రపంచమే వేరుగా ఉంటుంది. అయితే వీటన్నిటి వెనుక మూలసూత్రం లాంటి ఒక్కొక్క పుస్తకం కూడా ఉండి తీరుతుంది. అది ఒక లక్షణ గ్రంథం లాంటిదని చెప్పుకోవచ్చు. అలా నా పదిహేనవ యేట నా అదృష్టవశాత్తూ నా చేతిలోకి వచ్చిన చలంగారి మొదటి పుస్తకం స్త్రీ. తర్వాత ఎన్నో ఏళ్ళకి గాని మైదానం పుస్తకం నాకు దొరకలేదు. స్త్రీ తర్వాత ప్రేమలేఖలు మ్యూజింగ్సూ చదివాను.
 అప్పటికీ ఇప్పటికీ నా ఆలోచనల మీద జీవిత విధానం మీద ఎప్పటికప్పుడు అవసరానికి తగినట్టుగా ప్రభావితం చేస్తూ వచ్చిన పుస్తకం స్త్రీ పుస్తకమే అని అర్థమవుతోంది, ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే. చలం గారి సమస్త కల్పనాత్మక సాహిత్యమూ చదవడానికి ముందు ఈ పుస్తకం చదివి తీరాలి. ఇందులో అనేక విషయాల మీద ఆయన తన అభిప్రాయాలు స్పష్టంగా రాసారు. కల్పనా సాహిత్యంలో ఎప్పుడూ ఆ స్పష్టత ఉండదు. ఉండకపోవడమే కవితాలక్షణం కూడా. వాచ్యార్ధాన్ని మించిన వ్యంగ్యార్ధమే కదా కవితాత్మకతకు ప్రాణం. అయితే ఆయన అన్నింటినీ బద్దలుకొట్టడమే ధ్యేయంగా పెట్టుకుని రాసినది కూడా తక్కువేమీ కాదు కాబట్టి విశృంఖల చక్రవర్తి గానే అర్థమవుతూ వచ్చారు.

చలం స్త్రీ పుస్తకం అనగానే ఇది స్త్రీల విముక్తి – స్వేచ్ఛలకు సంబంధించిన పుస్తకమనే ఎక్కువమంది అభిప్రాయపడతారు. కానీ స్త్రీ పురుషులిద్దరూ తమ జీవితాలను ప్రకాశవంతం చేసుకోవడానికి దారి చూపగల పుస్తకం అని నాకు అర్థమయింది. చుట్టూ ఉన్న సమాజం చేత ఔననిపించుకోవడానికని మనదికాని జీవితం మనం ఎలా జీవిస్తున్నామో ఎందుకు జీవిస్తున్నామో చెప్పడమే ఆయన చేసిన పని. దాన్నే లోక పరత్వం అన్నాడు. అది తప్పా, ఒప్పా? వేరే విషయం. ముందు ఆ విధంగా ఉన్న మనని గుర్తించుకుని పట్టుకోమన్నాడు. 

ఈ పుస్తకం చాలా ముద్రణలు పొందింది. ఇంచుమించు ఆయన ఆంధ్రదేశంలో ఉండగా ప్రతిసారీ దానికి ముందుమాట రాస్తూ వచ్చారు. ఇందులో అయిదు ముందు మాటలున్నాయి. పుస్తకంలోని మిగతా అంశాలన్నీ అలా ఉంచి ఈ అయిదు ముందు మాటల్లోనే చలాన్నీ, మననీ కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం శ్రద్ధగా చదువుకుంటూ ఉంటే.  

మొదటి ముద్రణలో రాసిన ముందుమాట తర్వాత పదిహేనేళ్ళకి రెండో ముద్రణలో ‘‘ఈ పదిహేనేళ్ళలో చాలా దూరం ప్రయాణం చేసాను. (లోపల – బయట కాదు) ఏళ్ళలో కాక మనసుల్లో ఎదిగేవాళ్ళకి ఈ ఆయాస ప్రయాణాలు తప్పవు.’’ ఈ మాట ఒక వయసులో నా మీద చాలా ప్రభావం చూపింది. మనసులో ఎదగడమనే అంశం గురించి ఆలోచింప జేసింది.  ‘‘మతాన్ని గురించి, నీతిని గురించీ నా భావాలు విశాలం చేసుకున్నాను. కానీ మతమూ, నీతీ, వేదాంతమూ మాట్లాడే మనుషుల్ని ఏమాత్రమూ నమ్మవద్దనీ, వాళ్ళ దగ్గర మతమూ, నీతీ ఏమాత్రమూ లేవనీ హెచ్చరిస్తున్నాను.’’ ఈ మాటలు కూడా నన్ను తక్కువ ప్రభావితం చెయ్యలేదు.

 స్త్రీపురుషానుభవం అమూల్యమని నమ్మి ఆ విలువ ద్వారా జీవితాలను వెలిగించుకో గల దీక్ష ఉన్నవారి కోసమే తన మొత్తం కాల్పనిక సాహిత్యం రాసానని, తన స్వేచ్ఛాబోధనని సరిగా అర్థం చేసుకోలేక తప్పు అర్థం చేసుకునేవారికి వివాహ బంధం చాలా అవసరమనీ స్పష్టంగా చెప్పాడు.
 మనం ఏ కోవకి చెందగలమో తెలుసుకుని ఆ విధంగా ఉండగల స్వేచ్ఛ మనకి ఉంది. సంఘ నీతుల్ని చాటుగా, దొంగతనంగా కాక మనసు మీది ప్రేమ వల్ల సంఘం మీది అభిమానం వల్ల ఎదిరించగల ధీరులు అవసరం అన్నాడు. అలా చెయ్యలేకపోతే సంఘ నీతినియమాలకి కట్టుబడి ఉండమనే హెచ్చరిక కూడా నాకు అర్థమయింది.  ‘‘నాగరికత హెచ్చినకొద్దీ పనులూ, ధ్యాసలూ, ఆశలూ ఎక్కువయిన కొద్దీ మనుషుల్ని మనుషులుగా గుర్తించుకోవడం తగ్గిపోతోంది.’’

 1945లో రాసిన ఈ మాట ఇవాళ ఉన్న సమాజానికి ఇంకా బాగా సరిపోతుంది. మనుషుల కోసం పని గానీ, పనుల కోసం మనుషులు కాదని ఈ మాటే అర్థం చెప్పడం వల్ల నా స్నేహాలూ, బాంధవ్యాలూ పదిలంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యగలుగుతున్నాను. ‘‘లోకంలో ఏ ఒక్క సమస్య తీరినా తక్కినవన్నీ తీరినట్టే. ఎందుకంటే సమస్య అనేది బైట గాక మనిషిలో ఉంది గనక.’’

మనస్తత్వ శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇవాళ చదివే మంత్రాలు నాకు ఎప్పుడో స్త్రీ పుస్తకంలో ఇలా దొరికేయి.  లోపలి స్వేచ్ఛ – బయటి స్వేచ్ఛ అని వివరంగా విడదీసి బయటి స్వేచ్ఛకి కావలసిన ముఖ్యమయిన అవసరాల్లో డబ్బు ఒకటి అని ఆనాడే చెప్పాడు. స్త్రీ పురుష వివక్ష అతి స్పష్టంగా చూపించే కుటుంబాలలో పుట్టి పెరిగిన ఆనాటి మాలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకి ధైర్యం చెప్పే మాట ఇది. ఆర్థిక స్వేచ్ఛ అవసరం తెలిసాక అది సంపాదించాక, లోపలి స్వేచ్ఛ గురించి కూడా చలం నన్ను ఆలోచింపజేసాడు.

పురుషాధిపత్య భావజాలాల నుంచి బయటపడ్డాక, డబ్బుకీ, అధికారాలకీ, ఫ్యాషన్‌కీ, మర్యాదకీ, అవినీతికీ, సక్సెస్‌కీ బానిసక కాకుండా ఉండగల మానసిక స్వేచ్ఛ గురించి కూడా చెప్పి ఆలోచింపజేసాడు.

స్వేచ్ఛ వల్ల సుఖమూ, శాంతీ, ఆత్మవైశాల్యమూ కావాలనే మాటను మరీ మరీ మననం చేసుకునేలా చేశాడు. అవి కలిగించలేని స్వేచ్ఛ అనవసరమని చెప్పాడు. చివరిగా నాలుగోసారి రాసిన ముందుమాటలో రాసిన కొన్ని వాక్యాలు ఎప్పుడూ నా మనసులో మెదులుతాయి. నా జీవనాన్ని చైతన్యవంతం చేస్తూ ఉంటాయి. అవి ఇవి.

 ‘‘ఈ ప్రపంచ మహావృక్ష్యంలో మనిషి ఒక ఆకు. ఆకు తాను విడి కాదనీ తన జీవనం, తన అందం, ఎండలో ఆడే సంతోషం అన్నిటికీ మూలం చెట్టు వేరు లోంచి వచ్చి తనను నింపే జీవన రసమని తెలుసుకున్నకొద్దీ ఆ ఆకుకి వర్చస్సు, పుష్టి, సంతుష్టి. తనకీ సృష్టిలో ప్రతిదానికీ… బైట కనపడే సంబంధం కాక అసలు వీటన్నిటి ఉత్పత్తిలో ఉండే సంబంధాన్ని తెలుసుకున్నకొద్దీ జీవితానికి అర్థమూ, అందమూ, సార్థకతా వ్యక్తమవుతాయి. పై పొరల్లోంచి, ఈ తేలిక స్నేహాలలోంచి, ‘ఎంతవరకూ ఉపయోగం’ అనే దృష్టిలోంచి, స్వార్థపరమైన సంబంధాలలోంచి మనసు తప్పుకుని, లోతైన బాంధవ్యానికి దగ్గరైనకొద్దీ…. కళ్ళు కొత్త కాంతికీ, సామరస్యాలకీ తెరుచుకుంటాయి.” 

 ఇంతకన్నా సోషలిజం ఎక్కుడుందనిపించింది ఈ వాక్యాలు చదివిప్పుడు. నేను రాసిన మొదటి కథ వెన్నెల ముగ్గు ఇతివృత్తం మీద చలం భావాల ప్రభావం ఉంది. అలవాటు కావడంలో కొత్తదనం పోతుందని – జీవితాన్ని రొటీన్‌ కాకుండా చేసుకునే నేర్పు సంపాదించుకుంటే భార్యాభర్తల అనుబంధం ఎంతో కొత్తగా ఉంటుందని ఆ కథ చెప్తుంది.

చలం రచనలు చదివిన ప్రభావం నా వాక్య నిర్మాణం మీద, నేనేమిటి? చలాన్ని బాగా చదివిన వారందరి మీదా ఉంటుంది. వారందరూ చదివింపజేసే సరళమైన తెలుగు వాక్యం రాయగలుగుతారు.  భవభూతి నుంచి, నన్నయ నుంచి, గురజాడ నుంచి, చినవీరభద్రుడి దాకా ఎందరో కవులు, రచయితలు నన్ను ప్రభావితం చేస్తూనే ఉన్నారు. పుస్తకాలు సరే. ఈ సమాజంలోని గొప్ప వ్యక్తులు కూడా నా ఆలోచనల మీద, స్పందనల మీద వారి ప్రభావాన్ని చూపగలిగేరు.  

వారిలో మొదటి వ్యక్తి మా నాన్నగారు. ఆయనది చాలా ధృఢమైన వ్యక్తిత్వం, హృదయం నిండా ఎంతో ప్రేమ. జీవితకాలమంతా గిరిజన గ్రామాలలో గ్రామాధికారిగా పనిచేశారు. నిజమైన అర్థంలో గిరిజనులను ప్రేమించారు. ‘‘వాళ్ళు ఋషీశ్వరుల వంటివాళ్ళు’’ అనేవారు. మేం కూడా బాల్యకాలమంతా గిరిజనులతో కలిసిమెలిసి తిరుగుతూ కాలం గడపడం, మా నాన్నగారు చెప్పగా తెలిసిన ఎన్నో విషయాలు కారణంగా ‘కొండఫలం’, ‘బినామీ’, ‘పేరెంట్‌’ లాంటి కథలు రాయగలిగాను. ఇప్పటికీ ఆ ఊళ్ళకి వెళ్తే ఒంట్లో కొత్త నెత్తురు ప్రవహిస్తుంది.

కాస్త భావుకత, మరికాస్త సాహిత్య జ్ఞానమూ కలగలిసిన వయస్సులో నాకూ, మా తమ్ముడికీ కూడా దొరికిన అపురూప వరం మా గురువుగారు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు. సాహితీ జగత్తులో ఆయన ఒక అద్భుతం. ‘ఎప్రీసియేషన్‌’ అన్న విద్యను మాకు ఆయన అనుగ్రహించారు. రుచి చూసి, అభిరుచి అనే గీటురాయి మీదకు తెచ్చి పరీక్షలో నిగ్గు తేల్చి చూడగల చూపును ఆయన మాకు నేర్పారు. ఇస్మాయిల్‌ రాసినట్టు ‘‘మా కళ్ళ మీది కటకటాల్ని తన కుంచెతో చేరిపేసి’’ మా భావాలకు ఎగరగలగడం నేర్పారు. ఆ విద్యకు ఇంకా ఇంకా పదును పెట్టుకునే పనే ఇక నా జీవితంలో మిగిలిన కాసిని పనుల్లో ఒకటి అనుకుంటూ ఉంటాను.

ఇంత రాశాక, ఆధునిక సాహిత్యాన్ని మా చిన్నవయసులో మాకు పరిచయం చేసిన మరొక వ్యక్తి గురించి చెప్పక తప్పదు. ఆయన ఎన్నో మంచి పుస్తకాలను, మంచి వ్యక్తులకు మాకు చూపించి మా సాహిత్యాభిరుచి పెరగడానికి దోహదం చేశారు. వారి పేరు భమిడిపాటి జగన్నాధరావు.  తేనెటీగ ప్రతి పూవు నుంచి మకరందాన్ని సంపాదించి తెచ్చి తన పట్టులో దాచుకుంటుంది. నేను కూడా ప్రతి మంచి పుస్తకం నుంచి ప్రభావితం అవుతూ వచ్చాను. తేనెటీగలా కాకుండా ఈ దాచిన మధుకోశం నుంచి నా అనుభవసారాన్ని మరెంతోమందికి రుచి చూపించి పంచుకోవాలని ఆశపడుతూ ఉంటాను. దానికి కారణం కూడా నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు, ఈ మహానుభావులే. ప్రభావితం కావడం అన్నది కూడా ఎంతో విలువయిన మాటే.

You Might Also Like

Leave a Reply