అష్క్

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

*********

భారతదేశ నైసర్గిక రూపం వైవిధ్యభరితంగా, ఆకర్షణీయంగా ఉన్నట్టే భారతీయ సమాజం కూడా వేరు వేరు భాష, వర్గ, మత, ప్రాంత, సాంస్కృతిక ప్రత్యేకతలతో తనకంటూ ఒక విశిష్టతను కలిగి ఉంది. 

ఎక్కడైనా సాహిత్యం ప్రజల స్థితిగతుల్ని, జీవితాల్ని, అభిరుచుల్ని, ఆలోచనల్ని, అవసరాల్ని, మొత్తంగా దేశకాల పరిస్థితుల్ని తెలియజేస్తుంది. భిన్నత్వంలో సమైక్య జీవనరాగాన్నాలపించే భారతీయ సాహిత్యం ఇక్కడి ప్రజల గుండె చప్పుళ్లను చెప్తుంది.  

భారతీయ జీవనంలో ఒక పాయగా ఉన్న ముస్లిం ప్రజల జీవితాలకు సాహిత్య రూపాన్నిచ్చిన ప్రసిద్ధ ముస్లిం కథా రచయితలెందరో ఉన్నారు. తమదైన స్వంత జీవనశైలి, సంస్కృతీ సంప్రదాయాల ప్రత్యేకతల్ని చెప్పటమే కాకుండా, మిగిలిన సమాజంతో తమకున్న అనుబంధాన్ని, వారితో తమ జీవితాలు చిక్కగా పెనవేసుకుపోయిన తీరును ప్రతిఫలించే రచనలను అందించారు. ముఖ్యంగా కడప జిల్లా నుంచి మనకు అనేక మంది గొప్ప ముస్లిం కథా రచయితలున్నారు. 

ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్న పుస్తకం “అష్క్” రచయుత షేక్ షబ్బీర్ హుస్సేన్ కూడా కడప జిల్లాకు చెందిన వారు. వృత్తి రీత్యా జర్నలిస్ట్ అయిన ఈ రచయిత తానున్న సమాజంలోంచి అనేక పార్శ్వాలను కథలుగా మలచి, సున్నితంగా చెప్పారు. ఎక్కువ కథల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని దైన్యం, తప్పించుకునే వీలులేని ఒక దుఃఖం, అసహాయత కనిపిస్తాయి. వాటి వెనుక ఉన్న కొందరి నిరంకుశత్వాన్ని, స్వార్థాన్ని నిజాయితీగా చెప్తూ, రచయిత వాటిని ఖండించారు.                            

“అష్క్” కథా సంపుటి లో పదమూడు కథలున్నాయి. ఇవన్నీ తెలుగు నేలపై జీవిస్తున్నవారివే. సంపుటికి ఇచ్చిన పేరు, మరికొన్ని కథల పేర్లు ఉర్దూ భాషకు చెందినవి. ఆయా పేర్లు కొన్ని ముస్లింల జీవితంతో ముడిపడి ఉన్నవి. ఈ కథల్లో ముఖ్యంగా కనిపించేవి ముస్లిం జీవితాలే అయినా ముస్లింలు కాని వారి ప్రమేయాలూ ఉన్నాయి. ఏ ఒక్కరి జీవితం వారిది మాత్రంగానే చూడలేము. సమాజమున్నది సమూహ, సామరస్య జీవనం కోసమే అన్నది వాస్తవం. 

నిరంతరం జీవన పోరాటంలో నిమగ్నమైపోయే సామాన్యుడి కారణంగానే సమాజపు సహజీవన సంప్రదాయం భద్రంగా కాపాడబడుతుంది. అలాటి శాంతియుతమైన వాతావరణంలో ప్రజల జీవితానికి అభద్రత ఏర్పడిందంటే అది ఏ స్వార్థపరులో తమ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక లబ్ది కారణంగా సృష్టించినవే. 

మొదటి కథ “ఎందాకో ఈ పయనం.” ఇందులో కరువుకు, వర్గ కక్షలకు పేరొందిన రాయలసీమ ప్రాంతంలోని రెండు పాత్రల్ని చూస్తాం. స్వంత ఊళ్లో ఆర్థిక అవసరాలు తీరక కువైట్ వెళ్లి సంపాదించుకుందుకు ప్రయాణం అవుతూ, కుటుంబాన్ని వదిలి వెళ్లేందుకు బాధ పడుతుంటాడు అమీర్. ఊళ్లోని రెండు వర్గాల మధ్య పోరాటంలో ఒక వర్గాన్ని నమ్ముకుని జీవిస్తూ, ఆ వర్గాలు ఏకమైన్నాడు తన జీవికకు, జీవితానికి భద్రత పోయిందని అర్థమై, బ్రతుకు భయంతో కుటుంబాన్ని వదిలి తెలియని గమ్యం వైపు బయలు దేరతాడు మద్దిలేటి. ఊరికి, అయినవారికి దూరంగా జీవితం, ఆర్థిక పరిస్థితులు తరిమికొడుతుంటే గమ్యం తెలియని దారుల వెంట బయలుదేరిన వీరి పట్ల చదువరికి ఆవేదన కలుగుతుంది.

“బూచి” కథ కరోనా సందర్భాన్ని చెపుతుంది. కరోనా విజృంభించిన వేళ దేశంలో ముస్లిం వర్గ ప్రజలు ఎదుర్కొన్న అమానుషమైన పరిస్థితిని కళ్లముందుకు తెస్తుందీ కథ. బుడెన్ సాబ్ గ్రామంలో తమలపాకులు అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. కరోనాకి కారణం అతని వర్గీయులే అన్న ప్రచారంతో గ్రామస్థులంతా అతన్ని వెలి వేసినట్టు చూస్తారు. ఏళ్ల తరబడి ఆదరించిన వారే అతన్ని శత్రువుగా చూస్తున్న సమయంలో ఒక మానవత్వమున్న మనిషి చూపిన చొరవతో ఆ గ్రామ ప్రజలు తప్పు తెలుసుకుంటారు. ఇంత సులువుగా సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు కానీ ఒక ఆశావహ దృక్పథం కథలో కనిపిస్తుంది. మనిషికి బలాన్నిచ్చే సమూహమే మనిషికి శత్రువుగానూ మారుతుంటుంది. ఇది సమూహపు బలహీనత కాబోలు.

 “జైనబ్” పేద ఒంటరి స్త్రీ. కొత్తగా పెళ్లిచేసి పంపిన తన కూతుర్ని, అల్లుడిని పండుగ పూట ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెట్టాలన్న ఆలోచన చేస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితి సహకరించదు. రంజాన్ పండుగ పూట పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారన్న విషయం విని ఎంతో ఆశగా అక్కడకి వెళ్తుంది జైనబ్. కానీ ఆ పంపిణీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించాల్సిన నాయకుడు ఆలస్యంగా రావటంతో జరిగిన తోపులాటలో క్రిందపడి మరణిస్తుంది. పండుగ వేళ పేదలకు దానమియ్యాలని, అందుకోసం ఏడాదిలో సంపాదించిన ప్రతి వందలో రెండున్నర రూపాయలను దానం కొరకు వినియోగించాలని, ఆ దానం కూడా నిజాయితీగా చెయ్యాలన్నది మతం చెప్పింది. మనుషుల మనసుల్లో కరుణ, దానగుణాల్ని పెంచేందుకు చెప్పిన విషయాన్ని కేవలం ఒక ప్రచార కార్యక్రమంలా చేస్తుండటాన్ని రచయిత నిరశిస్తారు.

“ఆడపిల్ల” పుట్టిందంటే సమాజంలోని అన్ని వర్గాల్లోనూ కనిపించే కలవరపాటు, అశాంతి ఈ కథలో చూస్తాం. ఎన్ని చట్టాలొచ్చినా, ఎన్ని తరాలు మారినా ఆడపిల్ల ఉనికికి భద్రత లేకుండాపోయింది. దీన్ని స్త్రీల ధైర్యం, చొరవ మాత్రమే ఎదుర్కోవలసి ఉంది. అలాటి సామాజిక స్థైర్యానికి తగిన వాతావరణాన్ని మనమే కూడదీసుకోవాలి.

 “కఫన్” కథలో అత్తవారింటికి వెళ్లేందుకు తన అయిష్టాన్ని భర్తతో స్పష్టంగా చెప్పే ప్రయాణమవుతుంది షబానా. అక్కడ నాయనమ్మ, తాతయ్యల ప్రేమలో తడిసిన పిల్లల్ని చూసి కూడా ఆమె ధోరణి మారదు. మనవలు కథ చెప్పమన్నప్పుడు తన భర్త చెడు అలవాట్లకు, కాఠిన్యానికి తను బిడ్డను కోల్పోయిన విషయాన్ని కథగా చెపుతుంది షబానా అత్తగారు. అత్తగారి గతకాలపు గాయం షబానాను పశ్చాత్తాప పడేలా చేస్తుంది. 

“పల్లెముచ్చట” కథలో కుల, మతాలంటూ వర్గీకరించుకుని తమలో తామే ద్వేషాన్ని పెంచుకుంటూ ఒకరి పట్ల ఒకరు నమ్మకాన్ని కోల్పోతున్న నగరంలోని నాగరీక బతుకుల్ని చూసి కలత చెందుతాడు అర్షద్. అక్కడ కరువైన మానవత్వం, విలువలు తాను పుట్టిపెరిగిన పల్లెలోని మనుషుల మధ్య చిక్కగా ఉండటాన్ని చూసి మురిసిపోతాడు. మతాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా, వ్యక్తులుగా విభేదించుకోకుండా సమాజంలోని అందరూ శాంతియుత జీవితాన్ని గడపాలని కాంక్షించే రచయిత మనసు ఈ కథలో అర్థమవుతుంది. 

 “ఖబర్” కథ కరోనా సమయంలో సమాజ పరిస్థితిని చెపుతుంది. ప్రాణం పట్ల తీపితో, కరోనా భయంతో అయినవాళ్ల మరణానికి కూడా స్పందించని కుటుంబ సభ్యులను చూస్తాం. ప్రాణాలు పోగొట్టుకున్న వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేవారు లేరు. ఆసుపత్రుల నుంచి వరుసగా వచ్చి పోగు పడుతున్న శవాలను ఆదుకుందుకు మానవత్వంతో ముందుకొచ్చిన పెద్ద మనసులు ఈ కథలో కనిపిస్తాయి.

“కాలం” కథలో స్వార్థపరుడైన కొడుకు చేతిలో ఒక తండ్రి అనేక బాధలు పడుతుంటాడు. కోర్టు మెట్లు ఎక్కుతాడు. తీర్పు వాయిదా పడుతూనే ఉంటుంది. ఆ సమయంలో ఆ తండ్రి ఆలోచనలు గతం వైపు తిరుగుతాయి. తన జీవితంలో తల్లి, సోదరుని పట్ల తాను నిర్దయగా ప్రవర్తించిన తీరు, వారికి చేసిన అవమానాలు జ్ఞాపకం చేసుకుంటాడు. పశ్చాత్తాపంతో తల్లి క్షమాపణ కోరేందుకు పల్లె దారి పడతాడు.

“ఛోటు” కథ నిత్యం మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాం. భవన నిర్మాణాలు, డైనేజీ పనుల నిమిత్తం తీసిన గోతుల్ని బాధ్యతారహితంగా వదిలి వెయ్యటం వల్ల జరుగుతున్న దారుణాలు చిన్న పిల్లల పాలిట ఎలా మృత్యువు కారణమవుతున్నాయో చూస్తున్నాం. వాటినలా వదిలెయ్యద్దని, బాధ్యతగా వ్యవహరించమని ఎన్నిసార్లు కోరినా లెక్కచెయ్యని కసాయి మనుషుల ఉదాశీనత ఆగ్రహం తెప్పిస్తుంది. పిల్లల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం క్షమార్హం కాదని చెప్పి, శిక్షించే కఠిన వ్యవస్థ లేని సమాజం ఎవరికోసం పనిచేస్తోంది? ఎవరిని కాపాడుతోంది అర్థం కాదు.

“లాలాల్ సాయిబు” ఈ సంపుటికంతటికీ తలమానికమైన కథ. ఎద్దుల గిట్టలకు నాడాలను కొట్టే వృత్తిలో డెబ్భై సంవత్సరాలు గడిచిపోయాయి పీరూసాహెబ్ జీవితంలో. కుటుంబ బాధ్యతలు తీరాయి కానీ కొడుకు విడిగా వెళ్లిపోయాడు. పనుల్లేక భార్యతో కలిసి కష్టంగా రోజులు దొర్లిస్తున్నాడు పీరూ సాబ్.

కరోనా లాక్ డౌన్ సమయంలో ఏటిలోని ఇసుకను ఉచితంగా తీసుకెళ్లచ్చన్న ప్రభుత్వం ఏటిలోకి ట్రాక్టర్లను కాక కేవలం ఎడ్లబండ్లను అనుమతించింది. దానితో ఎడ్ల బళ్లకు పనిపడింది. ఎడ్లకు నాడాలు కొట్టే పనితో పీరూకి ఊపిరిసలపని పని అందుకుంది. చేతినిండా డబ్బు. మనవడు పనిలేకుండా ఉన్నాడన్న విషయం కూతురి ద్వారా విని తనతో పాటు నాడాల పనికి తీసుకెళ్తాడు. మనవడు తాతని మించిపోయేలా పని నేర్చుకుంటాడు. కానీ వృత్తిలో పాటించాల్సిన నైతికతను అర్థం చేసుకోడు. మనవణ్ణి చూసి తను వయసులో ఉన్నప్పుడు వృత్తిని ఎంత శ్రద్ధగా నేర్చుకున్నాడో జ్ఞాపకం చేసుకుంటాడు పీరు. మనవడి కాలానికి సంపాదన మీద ఉన్న శ్రద్ధ పని మీద లేదని బాధపడతాడు. వృద్ధుడివంటూ వృత్తి నేర్పిన తననే దూరం పెట్టబోయిన మనవడి ధోరణికి పీరూకు నోట మాట రాదు. కథాంతంలో మనవడు తాతను అర్థం చేసుకుంటాడు. ఈ కథ చుట్టూ “లాలాల్” (నాడా) కొట్టే వృత్తికి సంబంధించిన వివరాలను సంపూర్ణంగా ఆవాహన చేసిన రచయిత కథా రచనలో ఒక మెట్టు ఎక్కాడు. ఈ కథను పాలపిట్ట పత్రికలో చదివిన తర్వాతే ఆసక్తితో కథా సంపుటిని చదవటం జరిగింది.

“కాలే బాదల్” కథలో నిరుపేద మహిళ అయిన సల్మా పెద్దల పండుగకి చెయ్యవలసిన చదివింపులకు తన శక్తి మేరకు ఏర్పాట్లు చేస్తుంది. ఆ వీధిలోని షావుకార్ల ఇళ్లలో చదివింపుల కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చిన ఖాజా నానా చివరగా సల్మా ఇంటికొస్తాడు. చదివింపుల సమయంలో కూర లేకపోవటం గమనించి సల్మా మర్చిపోయిందేమో అని అడుగుతాడు. భర్తకు ఇష్టమైన మటన్ కూర కనీసం ఒక చెంచాడన్నా చెయ్యవలసిందంటాడు. సల్మా నిస్సహాయంగా ఉండిపోతుంది. ఖుర్బానీ పేరుతో పండుగ పూట పేదవాళ్లకు పంచి, వారి కడుపులు నింపే మంచి సంప్రదాయం మతం చెప్పిందని సల్మా తలుచుకుంటుంది. బక్రీద్ రోజున ఖుర్బానీ పేరుతో మటన్ ఖీమాను ఇరుగుపొరుగుల వారు ఇస్తారని ఎదురుచూస్తుంది. మతం చెప్పిన మంచి మాటను మరిచిన ఇరుగుపొరుగువారు తాము తినగా మిగిలిన ఖుర్బానీ మాంసపు హారాలను ఇళ్ల ముందు ఆరబెట్టుకుంటూడటం నిర్లిప్తంగా గమనిస్తుంది సల్మా. 

“మా ఊరి శివుడు” కథలో హిందూముస్లింల మధ్య ఉన్న స్నేహభావాన్ని అందంగా చిత్రించారు. ఈ కథ మనసును ఆర్ద్రతతో నింపేస్తుంది. మతాలు, మనుషులు వేరైనా మనుషులందరిలో ఉండవలసింది సోదరభావం, మానవత్వం అన్నది ఈ కథ చెపుతుంది.

 ఈ పుస్తకానికి ప్రముఖ కథకులు జి. వెంకటకృష్ణ, డా. వేంపల్లె షరీఫ్ ముందుమాట రాసారు. శ్రీ వెంకటకృష్ణ గారు “షబ్బీర్ ఈ కథలను చాలా నిరాలంకారంగా రాసాడు. నిరాడంబర ముస్లిం జీవితాన్ని చిత్రిస్తున్నాననే ఎరుక వల్ల కాబోలు…” అంటూ వీటిని “రాయలసీమలోని సామరస్యానికి సాక్ష్యాలు” అన్నారు. శ్రీ షరీఫ్ ఈ కథల్ని “మానవీయ స్వరాన్ని వినిపించే కథలు” అన్నారు.

 ఈ సంపుటిలోని రెండు కథలు వరుసగా “అరసం యువ కథా పురస్కారం”, (2021, 2022) అందుకున్నాయి. ఒకటి వంగూరి ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి గెలుచుకుంది. మరొకటి పాలపిట్ట కథల పోటీలో, మరొక కథ ప్రతిలిపి కథ మహోత్సవంలో బహుమతి పొందింది. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలను రచయిత నుండి ఆశించవచ్చు. 

ఈ కథలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉండి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. కథల్లో మరికొంత పరిణితి సాధించవలసి ఉంది. కొంత ఎడిటింగ్ అవసరం. అయితే రచయిత మొదటి కథాసంపుటి కనుక రాబోయే కాలంలో మరింత చిక్కని కథలతో మన ముందుకొస్తారని ఎదురుచూద్దాం. షబ్బీర్ హుస్సేన్ గారు ప్రామిసింగ్ రచయిత. వారికి శుభాకాంక్షలు.

ప్రచురణ: జనవరి, 2023

వెల :150 రూపాయలు.

You Might Also Like

Leave a Reply