ఇచ్ఛామతీ తీరం పొడుగునా

వ్యాసకర్త: వాడ్రేవు వీరలక్ష్మీదేవి

********

కేవలం 56 సంవత్సరాలు మాత్రమే జీవించిన విభూతిభూషణ్ బందోపాధ్యాయ(1894-1950) ప్రకృతి ప్రేమికుడు కాదు, ప్రకృతిని ఉపాసించినవాడు. ఎవరో చెప్పినట్టు అతని నవలలలో ప్రకృతి కథానేపథ్యంలో ఉన్నది కాదు. స్వయంగా కథలో ప్రధానపాత్ర. ఇచ్ఛామతీ తీరాన నవల చదివినప్పుడు ఈ విషయం మళ్లీ మళ్లీ ఋజువవుతుంది.

ఇరవై కథా సంకలనాలు, దాదాపు ముప్పయి నవలలు రాసిన ఇతని చివరి నవల ఇది. ఈయన1950 లో మరణించాడు. 1951 లో దీనికి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రబీంద్ర పురస్కారం ప్రకటించింది. 

ఇచ్ఛామతి  జనావాసాల  కన్న అరణ్యాల మధ్యనుంచి ప్రవహించిన నది. కొన్ని గ్రామాలు ఆ నదీప్రవాహాన్ని ఆనుకుని ఉన్నాయి. అందులో జస్సోర్ జిల్లా లోని ఈ నది ఒడ్డునఉన్న ఒక గ్రామం లో పెరిగేడు ఆయన. ఆ జ్ఞాపకాల తో ఎప్పటికేనా ఒక నవల రాయాలనేది ఆయన వాంఛ.దానికి ఈ నదిపేరు పెట్టాలని తన డైరీ లో రాసుకున్నాడు. అలా  ఈ నవల వచ్చింది.

జస్సోర్ జిల్లా లోని పాంచ్ పోతా గ్రామం లో ప్రజల కథ ఇది. ఐతే ఇది పొరుగున ఉన్న మొల్లాహతీ అనే చోట ఏర్పాటు చేసిన ఇండిగో ప్లాంటేషన్ ఎస్టేట్ తో గట్టిగా ముడిపడి ఉంది. ఆంగ్ల ప్రభుత్వం తాలూకు ఆ వ్యాపారకేంద్రాన్ని ప్రజలు నీలకుటి అని పిలిచేవారు. 1859 – 1862 ల మధ్య జరిగిన ఇండిగో రివోల్ట్ నేపథ్యం లో కథ నడుస్తుంది. కథ నలూపాల్ అనే పేద చిల్లర వర్తకుడితో మొదలవుతుంది. వాడు 20 ఏళ్ళ వయసులో నల్లగా బక్క చిక్కిన దేహంతో ఉంటాడు. వారాంతపు సంతలకు తిరుగుతూ పోకలు, తమలపాకులు అమ్మే వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. ఇటీవలి దాకా చేతిలో సొంతానికి చిల్లిగవ్వైనా లేదు. వాడికి ఆ దారిన వస్తున్న షిప్టన్ అనే పేరున్న బుర్రా సాహెబ్ అనే  దొర కనిపిస్తే  చూసి, భయపడి దాక్కుంటాడు. దొరలంటే ఉన్న భయం అది.

ఇది నవల ఆరంభం. 

నవల చివరకు పేదరైతుల తిరుగుబాటుతో నీలకుటి శిథిలం అవుతుంది. దొరలు వెనక్కి వెళ్ళిపోతారు. కానీ పెద్ద దొర అంటే బుర్రా సాహెబ్ మాత్రం అక్కడే ఉండిపోయి, అక్కడే మరణిస్తాడు. నలుపాల్ పెద్ద వర్తకుడిగా మారి  చాలా ధనాన్ని సంపాదించి ఆ నీలకుటి  ఎస్టేట్ ను సొంతానికి కొనేస్తాడు. ఇది ఇది నవల తాలూకు సామాజిక నేపథ్యానికి వ్యాఖ్యానం.

నీలిపంట వెనక దొరల దౌర్జన్యం, దానికి స్థానిక అధికారుల ప్రోద్బలం గురించి కథ నడుస్తుంది. దాని మీద దేశంలో వచ్చిన ఉద్యమకారుల, మేధావులు వ్యతిరేకత తో బాటు పేద దళిత రైతులఐక్యత, తిరుగు బాటు కూడా కథలో భాగం. ఇందులో షిప్టన్ దొర అనే పెద్ద దొర మరొక డేవిడ్ సాహెబ్ అనే చిన్న దొరల పరిపాలనలో రాజారామ్ అనే దివాన్ ప్రజల మీద దౌర్జన్యం చేస్తూఉంటాడు. వరి పండే చోట, అది మాన్పించి బలవంతంగా నీలి మందు మొక్కలు నాటించడం ప్రధాన కథ. దీని మీద రైతులు చేసిన తిరుగుబాటుతో నవల పూర్తవుతుంది. కానీ ఇది మాత్రమే చెప్తే అది విభూతి భూషణ్ రచన  అవ్వదు. 

ఇందులో రెండు గొప్ప పురుష పాత్రలు, ఐదారు అద్భుతమైన స్త్రీ పాత్రలు ఉంటాయి. విభూతి భూషణ్ ఆ గ్రామాల్లో ఉండే ప్రజల కష్టాలే కాక ఇఛ్ఛామతీ నదీ తీర సౌందర్యమంతటినీ వారిద్వారా ఆస్వాదింప చేస్తూ మనకు అనుభూతం చేస్తాడు. ఇందులో సన్యాసం స్వీకరించాలనుకునే భవాని భరోజి అనే సౌందర్య ఆరాధకుడి పాత్ర ప్రధానమైనది. అతను రాజారాం ముగ్గురు చెల్లెళ్ళను పెళ్లి చేసుకోవలసి వస్తుంది. వాళ్లు వయసు మీరి పోయి పెళ్లి కాకుండా ఉండిపోయిన వాళ్ళు.ఆ రోజుల్లో కులీనస్త్రీలకు తగిన వరులు దొరక్క పెళ్లిళ్లు అయ్యేవి కావు.అందువల్ల ఒకరు పదిమందిని చేసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. వారిని పెళ్లి చేసుకుని వారిని సంతోషపెడుతూ సాధుజీవనం గడిపే భవానీ లో విభూతి భూషణ్ కనిపిస్తాడు. భవానీ లో సౌందర్యారాధకుడైన ఆత్మాన్వేషి అడుగడుగునా కనిపిస్తూ ఉంటాడు అతను స్త్రీల పట్ల అపారమైన భక్తి గౌరవాలు కలిగిన వాడు.  ఒక సందర్భంలో భవాని మొదటి భార్య తిలోత్తమ తన మేనత్త జీవితం ఎంత దుర్భరంగా గడిచిందో భవానికి చెప్తుంది. అప్పుడు రచయిత ఇలా రాస్తాడు –

“భవానీ కూడా చాలా సేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. సన్యాసిగా జీవించాలని ఒకప్పుడు తను కోరుకోవటం అర్థరహితంగా తోచింది. దురదృష్టవంతురాలైన ఆ కులీన మహిళ విషాద స్మృతిని మోసుకుంటూ వాళ్ళిద్దరి ఎదుట ప్రవహిస్తోంది ఇచ్ఛామతి నది. భర్తను ఎడబాసిన ఒక స్త్రీ నిష్ఫలమైన వేదనతో కార్చిన కన్నీళ్ళ ఉప్పదనం ఈ నదీ జలాల్లోనే కలిసిపోయింది. ఈ వెన్నెల రాత్రిలో మెట్ట తామరల సుగందాన్ని అలముకున్న ఆమె స్వర్గం నుంచి దిగివచ్చి’ బాబూ జీవితంలో నేను అందుకో లేకపోయిన సార్థకతను నీ సరసనున్న ఈ యువతికి అందించు. బెంగాల్లో పుట్టి పెరిగిన ఈ స్త్రీలకు ఉత్తముడైన భర్తగా ప్రవర్తించు. నా బ్రతుకులో తీరని కోరికలను వాళ్లు అనుభవించేట్టుగా చూడు. నా ఆశీస్సులు నీకు ఎన్నటికీ లభిస్తాయి’ అని తనతో చెబుతున్నట్టుగా భవానీకి తోచింది”   

దేశదిమ్మరి గా తిరిగిన తన సన్యాసం కంటే పెళ్లి కాకుండా ఉండిపోయిన ఆ కులీన స్త్రీలకు మంచి జీవితం ఇవ్వటమే ఉత్తమ కార్యంగా అతను భావిస్తూ దాని ద్వారా చివరిదాకా ఆత్మ అన్వేషణా మార్గంలో నడుస్తాడు. “భగవంతుడు మన ప్రేమను కోరుకుంటాడనే విషయం నాకు ఇప్పుడిప్పుడే కొద్దిగా అనుభవంలోకి వస్తోంది” అంటాడు. “భగవంతుడు కూడా మన ప్రేమను కోరుకుంటాడని గ్రహించటం మామూలు విషయం కాదు. ఇంకా కేవలం ఆయన ఆలయంలోనూ యాత్ర స్థలంలోనూ ఉంటాడనుకోవటం వెర్రితనం. వృక్షాలలో, మొక్కలలో, జలపాతాలలో, సముద్రాలలో ఆ దివ్యత్వం ఇప్పటికి నాకు కనిపించడం మొదలైంది” అంటూ తన భావాలను ప్రకటిస్తాడు. రెండవ పాత్ర పేదవాడైన భక్తుడు, ఆయుర్వేద వైద్యుడు రామ్ కన్నాయి. నిరుపేద జీవితంలో ఊరి బయట ఒక పూరి గుడిసెలో నివసిస్తూ ఉంటాడు.అతని గురించి ఇలా చెప్తాడు –

 “గోడకు ఉన్న చిన్న గూటిలోని దేవుడి పటాన్ని పూలతో అలంకరించాడు రాము కన్నాయ్. నేలమీద పరిచిన చాప, రెండు పుస్తకాలు, కొన్ని కాయితాలు, మూడో నాలుగో వెదురు బుట్టలు తప్ప గదిలో సామాన్లు ఏమి లేవు, మందులకు ఉపయోగపడే ఆకులు, వేర్లు, పొడులు ఆ బుట్టలోనే నిలువ చేస్తాడు కవిరాజ్. సర్వ సంగపరిత్యాగి వలె జీవిస్తున్న ఈ పేద బ్రాహ్మణునితో గడపడం భవానీకి ఆనందాన్నిస్తుంది. గ్రామంలో ఇతడితో పోల్చదగిన మరొక మనిషి కనపడలేదు అతనికి “

 ప్రభుత్వం పేదరైతుల మీద చేసిన ఒక దౌర్జన్యానికి దొరలు అతన్ని వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమంటారు. అతను అసత్యం చెప్పనని మొండిగా నిలబడితే  రాత్రంతా అతన్ని సున్నం కొట్లో పడేసి ఉంచి, ఆ తర్వాత స్పృహ తప్పేలా కొట్టి హింసిస్తారు.కానీ అదే మాట మీద ఉంటాడు చివరిదాకా. చివరకు పై వాళ్ళ జోక్యంతో అతన్ని వదిలిపెట్టక తప్పలేదు. అతను చివరిదాకా అదే పేదరికంలో ఐచ్ఛికంగా ఉంటూ, వచ్చిన వారికి వైద్యం చేస్తూ, భవాని వంటి సజ్జనుడి సాంగత్యంలో ప్రకృతిని పూజిస్తూ, జీవిస్తూ ఉంటాడు. 

ఇంకా తిలోత్తమ, నిస్తారిణి, గయా మేమ్ వంటి స్త్రీలు ఆ రోజుల్లోనే రచయితకు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. త్రిలోత్తమ భవాని భార్య ఆమె ఇచ్ఛామతి నదిలో చాలా వేగంగా ఈత కొట్టగలదు. ఒక సందర్భంలో భర్తను కూడా నదిలోంచి రక్షిస్తుంది. ఇక నిస్తారిణి తనకు నచ్చినట్టు జీవించే స్వేచ్ఛా పరురాలు. అత్తకి సేవలు ఇంటి పనులు చేస్తూనే తనకి నచ్చని భర్తతో కాపురం చేయదు. ఇచ్చామతి తీరం వెంట తిరుగుతూ ఆ నదిలో ఎంతెంత దూరమో ఈతలు కొడుతూ ఉంటుంది. ఆమె నిర్భీతిని, స్వేచ్ఛను చూసి భవాని ఆమెను ఎంతో గౌరవిస్తాడు. 

ఊరి వారంతా ఆమెను వెలేసినట్టు చూస్తారు.కానీ ఆమె లెక్కచెయ్యదు. భవానీ మాటలు ఆమెకు తనను తాను మరింత స్పష్టంగా తెలుసుకునేలా చేస్తాయి. మాంత్రిక శక్తులు తెలిసిన స్త్రీలు, బల్లెం విసిరే విద్యతో బందిపోట్లను సైతం ఎదుర్కునే స్త్రీలు ఆ కాలంలో ఉన్నట్టు ఈ నవల్లో కనిపిస్తారు. ఇంకా గయా అని కింది జాతి అమ్మాయి పెద్ద దొరకు సేవ చేస్తూ అతని ప్రేమకు పాత్రురాలై అతని ద్వారా ప్రజలకు ఎన్నో మంచి పనులు చేయిస్తుంది. ఆమె కోసమే అతను తిరిగి ఇంగ్లాండు వెళ్లకుండా  ఆగిపోయి  అక్కడే మరణిస్తాడు. అతని సమాధిని కూడా వదలకుండా తనను ప్రేమించిన ప్రసన్న అనే వ్యక్తిని దయగానే దూరంగా ఉంచుతూ ఉంటుంది ఆమె.గయా మేమ్ కథ ఈ నవల్లో మరీ ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి ఆశ్చర్యకరమైన స్త్రీ పాత్రలు, సజ్జనులైన పురుష పాత్రల మధ్య ఇచ్ఛామతి తన వేలవేల సౌందర్యాలతో ప్రవహిస్తూ ముందుకు సాగడాన్ని రచయిత నవల అంతటా చూపిస్తాడు.

బెంగాల్లో మూడేళ్లపాటు జరిగిన నీలిమందు పంట శిథిలావస్థకు రావడం వెనుక ఉన్న కారణాన్ని బడా సాహెబ్ పాత్ర ద్వారా ఇలా చెప్పిస్తాడు. జర్మనీ అనే దేశం నుంచి వచ్చిన నీలిరంగులో ఉన్న  ఒక గోళీని చూపించి ఇది దుకాణాల్లోకి వచ్చాక ఇక పండించే నీలిమందు మూతపడవలసినదే. ఎందుకంటే దానికన్నా ఇది చాలా చౌక కాబట్టి. ఇక మన వ్యాపారం పూర్తిగా మట్టి కొట్టుకు పోయినట్టే అని చెప్తూ మనసులో ఇలా అనుకుంటాడు అని రాస్తాడు రచయిత.

“రామ్ గోపాల్ గోష్ ఉపన్యాసాలు, హరీష్ ముఖర్జీ నడిపే హిందూ పేట్రియాటిక్ వార్తాపత్రిక, పాద్రిలాంగ్ నిరసనలు, నాదియా జస్సోర్ జిల్లాల్లోని రైతుల గురించి సర్ విలియం గ్రే రూపొందించిన నివేదిక ఇవన్నీ కూడా ఈ చిన్ని నీలిమందు గోలీ ఎదుట దిగదుడుపే అని ఆ మధ్యాహ్నం వేళ స్పష్టంగా అర్థమయిపోయింది”.

ఇలా ఆధునిక పరిశోధనల ఫలితాలు సమాజం మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో రచయిత ఈ నవల్లో ఒక మలుపుగా చెప్పాడు.

ఆంగ్ల అధికారుల వైభవాలకు నిలయమైన నేలకుటి ఎస్టేట్ ను కిందిస్తాయి చిల్లర వ్యాపారం నుంచి   పైకి ఎదిగిన  నలూపాల్ కొనుక్కోవడం ఈ నవలలో ఒక చిత్రమైన పారడాక్స్. ఆ సందర్భం లో ఇలా రాస్తాడు “నలుపాల్ ఇప్పుడు లాల్ మోహన్ పాల్ అయ్యాడు. అతని ధాన్యపు గిడ్డంగి ఇప్పుడు గుర్రాల సాహెబ్ గారి భవనం ఎదురుగానే ఏర్పాటు అయింది. గతంలో సాహెబ్లు చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండిన పొడుగాటి వరండాలో ఇప్పుడు పశువుల దాణాలు గుట్టలుగా పేర్చి పెట్టారు. వ్యవసాయ కూలీలు, రైతులు అక్కడ కూర్చుని పొగాకు నవులుతూ, కబుర్లు ఆడుకుంటూ ఉంటారు”.  ఇలా రైతుల తిరుగుబాటు ఫలితాన్ని దాని పరిణామాలను కళ్లముందు చూపెడతాడు రచయిత. 

నవలానువాదం లో కాత్యాయని గారు చాలా చోట్ల బెంగాలీ పదాలను యధాతధంగా వాడారు. సంబోధనలు, కొలతలు, కులనామాలు, మరికొన్ని ఇతర పదాలు అనువాదం చేయలేదు. వాటి అర్థాలు వెనుక పేజీలో ఇచ్చారు. ఇది ఒక విధంగా మంచి విషయమే కానీ చదివేటప్పుడు పాఠకుడు శ్రమ పడక తప్పదు. నేనైతే ఒకటికి రెండు సార్లు చదవాల్సి వచ్చింది. అలాగే ఆ ఊళ్ళ పేర్లు, రకరకాల వృక్షాల పేర్లు, పువ్వుల పేర్లు, లత ల పేర్లు చాలా ఉన్నాయి. అవన్నీ మనకి చాలా వరకు కొత్తవి . ఇందులో విభూతిభూషణ్ ఇంచుమించుగా 50 రకాల వృక్షజాతుల గురించి రాసేడని పరిశోధకులు చెప్పారు. వీటివల్ల నవల ఆగి ఆగి చదవవలసి వస్తుంది. అంతేకాక షిప్టన్ సాహెబ్ ను ఒకసారి బుర్రా సాహెబ్ అనీ, బడా సాహెబ్ అని వ్యవహరించడంలో ముగ్గురూ ఒకరే అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇంకా చోటా సాహెబ్, డేవిడ్ సాహెబ్ ఈ ఇద్దరూ కూడా ఒకరే. వారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చెప్పడం వల్ల అది కూడా మళ్లీ వెనక్కి వెళ్లి చదివే అవసరాన్ని కలిగించింది. 

ఇది ఇలా ఉంచితే ఇచ్చామతి తీరాల వెంబడి రచయిత చేసిన అత్యద్భుతమైన వర్ణన అనువాదంలోకి అంత  హృద్యంగానూ వచ్చింది. మొత్తం మీద అపరాజిత నవల గానీ, చంద్రగిరి శిఖరం గానీ చేసినంత సులువు కాదు ఈ నవలానువాదం అని నాకు అనిపించింది. పై రెండూ ఆమే చేశారు. కాత్యాయని గారు ఈ అనువాదాన్ని ఎక్కువ శ్రమ తీసుకుని, ఎక్కువ శ్రద్ధ పెట్టి చేసి ఉంటారని చదువుతున్నంత సేపు నాకు అనిపించింది. పైగా ఇది ఆంగ్లం నుంచి చేసిన అనువాదం. బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి చేసిన అనువాదంలో ఈ రకరకాల పేర్లన్నీ ఎలా ఎలా ఉండి ఉంటాయో?! వాటి మూలాలు పట్టుకోవడానికి ఆమె శ్రమ పడే ఉంటారు. అందుకు ఆమెకు అభినందనలు. ముఖ్యంగా విభూతిభూషణుడి నవలలు  తెలుగు భాషలో చదువుకునే అవకాశం కల్పించిన హెచ్ బి టి వారికి ధన్యవాదాలు.

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి 

విజయవాడ, 9848016442 

You Might Also Like

Leave a Reply