“తియ్యండ్రా బండ్లు” పుస్తకానికి ముందుమాట

వ్యాసకర్త: వి. రాజారామమోహనరావు

(శ్రీ గుర్రాల లక్ష్మీప్రసాద్ ఫ్యామిలీ ట్రస్టు  తెలుగుతల్లి కెనడా ప్రచురణలు సంయుక్త ప్రచురణ “తియ్యండ్రా బండ్లు” కి వ్రాసిన ముందుమాట.)

**************

మంచి – చెడు

కొన్ని జీవితాలు నిత్యం మన కళ్లముందు కనబడుతూనే ఉంటాయి.  మనం వాళ్లనిచూస్తూ ఉంటాం.  వాళ్లతో మాట్లాడతాం. వ్యవహరిస్తాం.  అంతవరకే.  అంతే తప్ప ఆపైపై పరిచయం దాటి వాళ్ళ జీవితాల లోపలికి, వాళ్ల కష్టసుఖాలలోకి, అభిమాన అవమానాల జోలికి వెళ్లం.  వాళ్లని ఓ సమూహంగానే తప్ప ప్రత్యేకంగా విడి వ్యక్తుల్లా చూడం.  వాళ్ళ వృత్తి వరకే మన దృష్టి. అలాంటివాళ్లు వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. అలాంటి వృత్తి రంగస్థలి ఆటోమొబైల్ రంగం

 (మోటార్ ఫీల్డ్).  బస్సు డ్రైవర్లు, క్లీనర్లు, కండక్టర్లు, మెకానిక్స్, లారీ డ్రైవర్లు, టాక్సీ- ఆటోడ్రైవర్లు, డ్రైవింగ్ వృత్తిగా ఉన్న వాళ్లు ఇలా ఎందరెందరో. వాళ్లు యూనిఫాం వేసుకుంటే దానిద్వారా లేదా వాళ్లు చేసే వృత్తి, వేష భాషల ద్వారా తప్ప వ్యక్తిపరంగా వాళ్లకి గుర్తింపు లేదంటే అతిశయోక్తి కాదు.

అటువంటి ఆటోమొబైల్ రంగం మీద ప్రత్యేకంగా కథా సంకలనం తెస్తున్నాం.  ముందు మాట కావాలని లయన్ విమలా ప్రసాద్ గారు అడిగారు.  సంకలనపు విశిష్ట వైవిధ్యమే కాక నేను ఒప్పుకోవటానికి మరొక వ్యక్తిగత కారణం కూడా ఉంది. 50 ఏళ్ల క్రితం నేను లారీ డ్రైవర్ల జీవితాల మీద ఒక నవల రాయాలని అనుకున్నాను.  కొంత నోట్స్ కూడా రాసుకున్నాను.  కావాలనే బస్సులెక్కకుండా చాలా ఊరి ప్రయాణాలు లారీలలో చేశాను.  అప్పుడు నేను గ్రహించిన అనుభవాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లదంతా మనం ఎరగని మరో ప్రపంచం.  నెలకి ఒక వారం రోజులు వాళ్లు ఇంటిపట్టున పెళ్ళాం పిల్లలతో ఉంటే గొప్ప.  మూడొంతులపైగా జీవితం రోడ్ల మీదే.  తిండి, తిప్పలు, స్నానం, కాలకృత్యాలు అన్నీ రోడ్ల పక్కనే.  చాలామంది శృంగార జీవితం రోడ్లపక్క పాకల్లో, తుప్పల్లో, తడికెల చాటున.  ఆ లారీ డ్రైవర్ల క్లీనర్ల బాధలు అవి ఇవి అని చెప్పలేము.  వేల రకాలు.  ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో వీళ్లకి,  వీళ్లు ఎలా ఉన్నారో ఇంట్లో వాళ్లకి సమాచారం తెలిసే సౌకర్యాలు లేవు.  లారీ యజమానులు, దళారులు, అధికారులు చేసే జులుం, అనారోగ్యాలు, వైద్యం లేకపోవటం, వాతావరణం బాగాలేక వర్షం చలి వేసవిల దెబ్బ, అన్నింటిని మించి తమ వారు దగ్గర లేని ఒంటరి తనం వల్ల ఎక్కువమంది తాగుడు, జూదం, ధూమపానం,  జర్దా, వ్యభిచారం లాంటి  చెడు అలవాట్ల బారిన పడిన వారే. సజావైన జీవితం లేకపోవటం ఇందుకు ప్రధాన కారణం.

ఎన్నాళ్లో తపన పడినా నేను వాళ్ల గురించి నవల రాయనేలేదు.  ఎందుకంటే ఓ చిన్న మెంటల్ బ్లాక్.  చాలా దూరం, అంటే కలకత్తా నుంచి అహ్మదాబాదో, జమ్మూ నుంచి కన్యాకుమారో అంటే పది పదిహేను రోజుల లారీ ప్రయాణం చేసి  ఆ నవల రాయాలని అనుకున్నాను.  ఆ ప్రయాణం కుదరలేదు. నవల రాయలేదు.

కార్లు అమ్మే కంపెనీల షోరూం నుంచి అవి అమ్మే ఏజెంట్ల వరకు, కార్ గ్యారేజ్ వర్క్ షాప్ నుంచి చిన్నసైజు మెకానిక్ వరకు, చిన్న బండి క్లీనర్ దగ్గరనుంచి బెంజ్ కారు నడిపే డ్రైవర్ వరకు అంత వైవిధ్యం, విస్తృతి ఉన్న రంగం తాలూకు ప్రత్యేక కథల సంపుటి తెస్తున్నాం అన్నందుకు, ఎంతో నవ్యమైన ఈ ఆలోచనకి నాకు ఆనందం వేసింది.  ఈ ప్రయత్నం ఎంతో గొప్పది అనటంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. 

కథలన్నీ చదివాను.  కీర్తిశేషులు పురాణం కథ “ఎడమకు తోలుడు“,  భమిడిపాటి రామగోపాలం  కథ “తడిసి మోపెడు”  హితశ్రీ, వంగూరి చిట్టెన్ రాజు లాంటి ప్రసిద్ధుల కథల నుంచి మధ్యతరం రచయితలు ముద్దంశెట్టి హనుమంతరావు, వసుంధర, ద్విభాష్యం రాజేశ్వరరావు ఇంకా కొత్తతరం వాళ్ళ కథలూ ఇందులో ఉన్నాయి. వారంతా ఈ రంగానికి చెందిన పలు వృత్తులు, సమస్యలు స్పృశించటం జరిగింది.  ఇవన్నీ  అత్యుత్తమ తెలుగు కథలని అనలేను.  అలా అని ఈ కథలు చాలా బాగున్నాయి అని గానీ,  అసలు బాగాలేవని కానీ తేల్చేయడం నాకు ఇష్టంలేదు. ఎందుకంటే ఈ కథలు ఎక్కువమంది చదవాలి.  చదివితే అంతవరకూ వారికి తెలియని చాలా మంది వ్యక్తులు, సంఘటనలు, మనోరీతులు తెలుస్తాయి.  దానివల్ల జీవితం మరింత దీప్తి వంతం అవుతుంది.  సంపుటిలోని ప్రతి కథ తాలూకు కథని చెప్పటం ముందుమాటకి సరైన పద్ధతి కాదని నా ఉద్దేశం.  కథల తత్వం, మర్మం తెలిపేలా ముందుమాట ఉండటం మంచిదని అనుకుంటాను.

సంపుటిలోని కథల్లో మచ్చుకి కొన్ని కథల మంచి చెడ్డల గురించి కొన్ని మాటలు మాత్రం చెబుతాను.

నీళ్లు రాని కళ్ళు” కథ ఆర్థిక ఇబ్బందుల వల్ల తన పాత టాక్సీని శవాల రవాణాకి వాడి శవాల బండి అని చెడు పేరు తెచ్చుకున్న డ్రైవర్ వెంకటరమణ కథ.  డ్రైవర్ తాలూకు ఆర్థిక ఇబ్బందులు ఎంత గాఢమో చెబుతూనే బాధ్యత కూడా అంత ముఖ్యమే అని చెబుతుందీ కథ.  డ్రైవర్ల జీవితపు దైన్యాన్ని వివరించిన కథ.

బస్సు డ్రైవర్ ఉద్యోగం ఎంత యాంత్రికమైనా జీవితంలోని ఒడిదుడుకుల ప్రభావం కూడా వారి ఉద్యోగంపైన ఉంటుందని సున్నితంగా చెప్పిన కథ “216“.

పిట్టకథ” లో అతి సున్నిత మనోభావం ఉంది. మంచి ఓదార్పు ఉన్న కథ. 

ఒక టాక్సీ డ్రైవర్ కేవలం తన వ్యాపారమే కాకుండా, చేయూతనిచ్చి సాయం చేసిన కథ “మనీషి“. 

కొద్దిగా స్పందించ గలిగితే, సహానుభూతి తెలిపితే మానవత్వం మెరుగుపడుతుందని తెలిపిన కథ “రూ.16/ ప్రతి కి.మీ

సుబ్బిగాడి పెళ్లి”  మంచి సరదా కథ.

జీవితానికి దగ్గరగా గాఢంగా కథ ఉండాలి.  అలా కాక హాస్యం పేరుమీద అపహాస్యం, సెంటిమెంటు, డ్రామా, నీతి బోధలు, కల్పిత త్యాగాలు ఉన్న కథలూ ఈ సంపుటిలో ఉన్నాయి.  లోపంలేని ప్రయత్నాలు  ఫలితాలు అంత తేలిక కాదు.

అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ సంపుటి తాలూకు నవ్యత.  వృత్తిపరమైన ఇంకా అనేక కథాసంపుటాలకు ఈ తొలి అడుగు కొత్త దారి వేయాలని, వేస్తుందని ఆశిస్తున్నాను.  ఈ సంపుటిలో భాగస్వామ్యులు అందరికీ అభినందనలు.  ఇలాంటి వృత్తిపరమైన కథాసంపుటాలు ఎన్ని ఎక్కువ వస్తే మంచి – చెడు అంత బాగా అవగాహనకు వస్తాయి. 

వి. రాజారామమోహనరావు

హైదరాబాదు

22-01-2022

You Might Also Like

Leave a Reply