“జ్ఞానేశ్వరా .. ” సమీక్ష

వ్యాసకర్త: రాథోడ్ శ్రావణ్

********

సాహితీ ప్రియుడు జ్ఞానేశ్వరుడు..

ఎంతో  ఘన చరిత్ర కలిగిన తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. అందులో శతకం ఒకటి. వంద పద్యాల సమాహారమునే శతకం అని అంటారు. తెలుగు భాషా సాహిత్య జ్ఞాన ప్రపంచంలో శతకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శతక పద్యాలు  విద్యార్థుల్లో కంఠస్థ, ఉచ్ఛారణ  పటిమను, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆలోచనను, వివేచనను, విచక్షణను, పెంపొందిస్తుంది. కనుక భాషాభోధనలో శతక పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది.

తెలుగు భాషా మాధుర్యం లోని  నవరసాలను ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందే గొప్పకవి ముంజం జ్ఞానేశ్వర్. ఉట్నూర్ సాహితీ వేదికకు ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా సేవలను అందిస్తున్న శ్రీ ముంజం ఆశన్న స్మారక సాహితీ పురస్కార గ్రహీత శ్రీ ముంజం జ్ఞానేశ్వర్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్న పేట గ్రామంలో శ్రీమతి/శ్రీ ముంజం లస్మయ్య, భూమ దంపతులకు 27ఆగష్టు1986లో  జన్మించారు. ఎం.ఏ. తెలుగు సాహిత్యంలో పట్టభద్రులై బి.ఎడ్ పూర్తి చేసినారు. వృత్తి రిత్యా తెలుగు భాషా ఉపన్యాసకులుగా శ్రీ పూలాజీ బాబా జూనియర్ కళాశాల ఉట్నూర్ యందు విధులు నిర్వహిస్తూ హిందూ ఉత్సవ సమితి వారు నిర్వహించే   పలు సామాజిక, సాంస్కృతిక  కార్యక్రమాల్లో  గొప్ప వ్యాఖ్యాతగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 

తను బోధిస్తున్న తెలుగు భాషకు ఒక గౌరవ జ్ఞాపకాన్నివ్వాలని గట్టి సంకల్పంతో సమాజ హితాన్ని కోరుకుంటూ  శతకపద్యంలో విద్య యొక్క ప్రాముఖ్యత, తెలుగుభాష యొక్క మనుగడ, రక్షించుమని శివున్ని కోరుకోవడం, తల్లిదండ్రుల ప్రేమను, గురువు యొక్క స్థానం, స్నేహానికి ఉన్న ప్రాముఖ్యాన్ని, దయాగుణం, నాగోబా, శిరిడీ సాయి, ప్రకృతిమాత, స్త్రీ ప్రాధాన్యత, ముఖ్యంగా కులమతభేదాలు వద్దని దైవం ఒక్కటేనని మొదలగు  అన్ని అంశాల పైన ఛందో బద్ధమైన “జ్ఞానేశ్వరా” శతకంను ఉత్సాహంతో ఇష్టంతో రచించారు. ఇది జ్ఞానేశ్వరుని తొలి రచన.

శతకకర్త పద్యం పట్ల మక్కువను పెంచుకొని, విద్యార్థులకు, పాఠకులకు, తెలుగు భాషాభిమానులకు, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో శార్దూలం, మత్తేభం వంటి కఠినతరమైన వృత్త పద్యాలను తీసుకుని నేటి తరానికి  ఈ కావ్యం ద్వారా సమాజంలో  పతనమౌతున్న భక్తి,నీతి, ప్రేమ విలువలను పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజలందరూ చైతన్యవంతులు కావాలనే తపనతో తన యొక్క రచన నైపుణ్యంవలన  ప్రయత్నాలు చేస్తున్నారు.

నేటి వర్తమాన  శతకకవులు తేటగీతి, ఆటవెలది, సీసం, కందం వంటి పద్య ఛందస్సులో రచనలు సాగిస్తున్న ఈ తరుణంలో మిత్రుడు జ్ఞానేశ్వర్ మాత్రం శార్దూలం, మత్తేభం వంటి అతి కష్టతరమైన‌ వృత్త పద్యాలను ఎంచుకొని రచనలు చేయడం గొప్ప విషయం. శార్దూల మత్తేభం,వంటి  పద్య ఛందస్సులో 108 పద్యాలు రచించన జ్ఞానేశ్వర్ వ్యాకరణ గురువు గౌ శ్రీ పాటబళ్ళ నాగరాజరావు గురూజీ వద్ద వ్యాకరణమునే ప్రత్యేకంగా నేర్చుకొని స్ఫూర్తి పొందారు.

*కొన్ని శతక పద్యాలు పరిశీలిద్ధాం.*
1). శా: శ్రీ చైతన్యము దివ్వెలాగ ప్రసరించే మా కళాశాలలోన్,
పూచెంగా విరులన్ వలెన్, మనసులో బూరింపె‌ విద్యాధనం
బెచ్చోటైన దిరుంగు లేదు,ఘనమే!ఇందీవరంబైనఈ
సచ్ఛాత్రత్ఫలదాత పూజ ఫలితం ప్రాప్తింపు జ్ఞానేశ్వరా!

భావము :- జ్ఞానమునే ఐశ్వర్య ముగా కలిగిన ఓ జ్ఞానేశ్వరా! సిరి సంపదలనే జ్ఞాన చైతన్యము వెలుగులాగా ప్రసరించే మా కళాశాలయందు విద్యార్థులు పుష్పాల వలే వికసించారు.విద్య అనెడి ధనమును వారి మనసులో నిలుపుకున్నారు. ఈ విధంగా పద్మముల వంటి  చక్కని శిష్యులను వరముగా అందించిన దైవమా, వీరి పూజకు ఫలితము ప్రాప్తింపజేయుము అని భావము.

2). మ: శివుడే సర్వము ఈ జగంబు, శివుడే దేవుండు లోకంబునన్,
శివుడే ప్రాణము, సృష్టియందు లయతాజేసేను జీవానికిన్, 
శివుడే మై,శివునాజ్ఞ లేనిదె యిలన్ చీమైనకుట్టేన,ఈ
శివుడే సద్గుణ సాగరుండని తలంచేప్రాణి జ్ఞానేశ్వరా!

భావము:- ఈ ప్రపంచము యందు అంతయూ శివుడే ఈ లోకంలో శివుడే దేవుడు, శివుడే ప్రాణము, సృష్టిలోని ప్రతి జీవికి లయకారుడు శివుడే అయినాడు.శివుడే శరీరమై,అసలు ఈ భూమ్మీద శివుడు యొక్క ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు కదా!ఈ పరమ శివుడే అనంత సద్గుణ ము కలిగినవాడని సృష్టి యందలి ప్రతి ప్రాణికీ తెలుసును అని భావము.

3). శా: సంతోషం పరమావధియ్యనుచు సాక్షాత్కారమింకేటికిన్,
చింతా భ్రాంతిని వీడి నే కలమునుంజేబట్టి యత్యంతమౌ,
సంతానంబున గౌరవంబున కృతిన్ శైలొప్ప సా కల్పమౌ 
త్వం తెల్గున్ బ్రతికించుకొందు నరదౌ శక్తిమ్ము జ్ఞానేశ్వరా!

భావము:- నాకు నీ సాక్షాత్కారం ఇంకెందుకయ్యా! నువ్వే నాలోని పరమావధి అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటున్నాను.బాధలు అనే భ్రాంతిని వదిలిపెట్టి.నేను కాలమును చేతబట్టి‌ మిక్కిలి ఉత్సాహముతో మరియు గౌరవముతో కావ్యమును రచించారని నిశ్చయించుకున్నాను.నా రచనతో ఈ దేశములో దైవమైనటువంటి నా తెలుగు భాషను బ్రతికించుకుంటాను.జ్ఞాన సంపద కలిగిన ఓ జ్ఞానేశ్వరా! అందుకే వసరమగు రచనాశక్తి అనే పదమును నాకు ప్రసాదించుము అని భావము.

4). మ: మధురబైన త్రిలింగ భాషయగు ఇంపైనీ తెలుంగున్ హరా
రుధిరంబైన ప్రవాహమందు వరదైపోగా, సురా యో వరా 
చదరంగంబును యాడుచుండ్రి నరులుజ్జైయ్యంటు జైకొట్టగా
ఎదురై వేడితి రక్షకా తెలుగు కున్, విశ్వేశ జ్ఞానేశ్వరా!

భావము:-ఓ శివా! త్రిలింగ దేశముల యందు (శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం) పుట్టిన మధురమైనటువంటి , వినసొంపైనటువంటి తెలుగు భాష ప్రస్తుతం రక్తపు ధారల ప్రవాహము యందు వరదలాగా కొట్టుకుపోతుంటే,నువ్వేమో నీ ఇష్టమొచ్చినట్లు చదరంగం ఆట ఆడుతున్నావు.దానికి మర్య్తలమైన మేము నిన్ను వరాలిచ్చే దేవుడిని జై అంటూ జై కొడుతుంటే ఓ విశ్వేశా! నేను మాత్రం నీకు ఎదురుపడి వేడుకుంటున్నాను అని భావము.

ఉట్నూర్ సాహితీ వేదిక ద్వారా ప్రాథమిక సభ్యునిగా పరిచయమైన జ్ఞానేశ్వర్  ప్రచార కార్యదర్శి హోదాను స్వీకరించి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. కవి ముంజం జ్ఞానేశ్వర్ గారు  శతకం ను ఉత్సాహంతో  ఇష్టపడి రాసానన్నారు. వారి పదపొందిక, రచనా నైపుణ్యం బాగుంది. ఎన్నో విషయాలను సృజించిన యువకవి కలము నుంచి మరింత కావ్యాలు జాలువారాలని వారి కీర్తి దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.

వెల:₹=80/-

ప్రతులకు: ముంజం జ్ఞానేశ్వర్, ఇ.నెం 3-47,  గంగన్నపేట, ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా-504311.

సమీక్షకులు:- రాథోడ్ శ్రావణ్, రచయిత, ఉపన్యాసకులు, ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు. ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా. చ.సం. 9491467715.

You Might Also Like

Leave a Reply